SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
3 గంటలు క్రితం
భారత్ – పాకిస్తాన్ ఘర్షణ తర్వాత, ఎవరిది పైచేయి? ఎవరేం సాధించారు? అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటనలకు అర్థం ఏమిటి? అనే అంశాలపై పెద్దయెత్తున చర్చ నడుస్తోంది.
కాల్పుల విరమణను భారత్, పాకిస్తాన్ ప్రకటించడానికంటే ముందే, ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకారానికి వచ్చాయని, త్వరలోనే చర్చలు జరుగుతాయని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
తాము జోక్యం చేసుకుని, ఇరుదేశాలనూ కాల్పుల విరమణపై ఒక అంగీకారానికి తీసుకొచ్చినట్లు చాలా సందర్భాల్లో ట్రంప్, ఆయన యంత్రాంగం చెబుతూ వచ్చింది. దీనికి పాకిస్తాన్ బహిరంగంగానే అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.
కానీ, భారత్ ప్రతిసారీ ఇది భారత్ – పాకిస్తాన్ మధ్య సమస్యని పదేపదే చెబుతోంది. ఈ కాల్పుల విరమణ శాశ్వత ముగింపుకు సంకేతం కాదని అంటోంది.
అంతకుముందు, భారత్ – పాకిస్తాన్ ఘర్షణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు.
తమ జోక్యం ఉండదని చెప్పిన అమెరికా, ఆ తర్వాత రెండు రోజుల్లోనే తమ మధ్యవర్తిత్వంతో ఈ ఉద్రిక్తతలకు తెరపడిందని చెప్పుకునేలా ఏం జరిగింది?


మెరికా ప్రకటలను భారత్ బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? మున్ముందు ఈ విషయంలో మధ్యవర్తిత్వ పాత్రను పోషించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఎంతకాలం ఈ కాల్పుల విరమణ ఉంటుంది? సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వీసా ఆంక్షల వల్ల ప్రభావం ఎంత?
కశ్మీర్ అంతర్జాతీయ అంశంగా మారుతోందా? ట్రంప్ చెప్పేదంతా తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో భాగమా? వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం, ముకేష్ శర్మ ఈ విషయాలపై బీబీసీ హిందీ వీక్లీ ప్రోగ్రామ్ ‘ది లెన్స్’లో చర్చించారు.
మాజీ దౌత్యవేత్త వీణా సిక్రి, అబ్జర్వర్ రీసర్చ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్, కింగ్స్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ హర్ష్ పంత్, అంతర్గత భద్రత – టెర్రరిజం వంటి అంశాలపై పనిచేసే ఫోర్స్ మేగజీన్ ఎడిటర్ గజాలా వహాబ్ ఈ చర్చలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, ANI
కాల్పుల విరమణ ఎంతకాలం ఉంటుంది?
పహల్గాం దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మే 10తో ముగింపుకు వచ్చినప్పటికీ, ఒక్క ప్రశ్న మాత్రం ఎదురవుతోంది. అదేంటంటే.. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది?
ఫోర్స్ మేగజీన్ ఎడిటర్ గజాలా వహాబ్ ఇలా అన్నారు, ”ఇందులో మూడు ప్రధాన అంశాలున్నాయి. వాటిని బట్టి ఇది కొనసాగవచ్చు, లేదా కొనసాగకపోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్‌కు అమెరికా జోక్యం అవసరం, అది జరిగింది. ప్రతి అంశంపైనా భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా జోక్యం పాకిస్తాన్‌కు ప్రయోజనకరం.”
ప్రస్తుతమున్న పరిస్థితిని దిగజార్చేలా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చర్యలూ ఉండవని, అలా జరిగితే పాకిస్తాన్ హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందన్న ఆరోపణలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.
”రెండోది, భారత్ తానేం చేయాలనుకున్నానో అందులో విజయం సాధించినట్లు చెప్పింది కాబట్టి, ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపుతుంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే వరకూ భారత్ ఘర్షణకు దిగదు” అన్నారు.
”ఇక మూడోది, ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నదే పాకిస్తాన్ విషయంలో చైనా అభిప్రాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో సహకారం, సైనిక మద్దతు, వనరుల సరఫరా కొనసాగిస్తుంది.”

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఎందుకు యూ-టర్న్ తీసుకుంది?
భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా వైఖరి కేవలం 50 గంటల్లోనే మారిపోయింది. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకునేంతగా ఏం జరిగింది?
”ట్రంప్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల విషయంలో మొదట్నుంచి తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించింది. తాము అధికారంలోకి వస్తే మిడిల్ ఈస్ట్, యుక్రెయిన్ యుద్ధాలకు త్వరలోనే ముగింపు దొరుకుతుందని చెప్పే ప్రయత్నం చేసింది” అని కింగ్స్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అన్నారు.
”ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడానికంటే ముందు తమ సొంత సమస్యలను పరిష్కరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ వ్యవహారాల నుంచి వెనక్కి తగ్గి, తన దృష్టి మొత్తం ఇండియన్, పసిఫిక్ రీజియన్‌పై కేంద్రీకరించాలనుకుంటోంది” అన్నారాయన.
భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో అమెరికా మొదట సంప్రదాయ విధానాన్ని అనుసరించిందని, ఎప్పుడైతే పాకిస్తాన్ ఎయిర్‌బేస్ లక్ష్యంగా మారిందో.. అప్పుడు వ్యూహం మారిపోయిందని పంత్ చెప్పారు.
”పాకిస్తాన్ వైపు నిలవాలని పాకిస్తాన్ – అమెరికా మధ్య తెరవెనక నిర్ణయమైంది. డీజీఎంవోకి ఫోన్ చేసేంత వరకూ భారత్ వైపు కాల్పుల విరమణ ప్రస్తావన లేదు. అలా సాగిన ప్రక్రియలో, ఘర్షణకు తెరపడింది” అని ప్రొఫెసర్ పంత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమస్యగా మారుతోందా?
కశ్మీర్ అంశంపై డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. కశ్మీర్ అంశం మరోమారు చర్చకు రావాలని పాకిస్తాన్ కూడా కోరుకుంది. కాబట్టి, కశ్మీర్ అంశం మరోసారి తెరమీదికొచ్చిందా?
మాజీ దౌత్యవేత్త వీణా సిక్రి మాట్లాడుతూ, ”అస్సలు కాదు, పహల్గాంలో జరిగిన ఈ దాడి ఉగ్రదాడి అనే విషయం ప్రపంచం ముందుంచాలి. ఆ దాడి ఒక యుద్ధ చర్య. ఈ ఘర్షణ అక్కడి నుంచే మొదలైంది. మే 7న భారత్ చేసింది దానికి ప్రతిస్పందన మాత్రమే” అని అన్నారు.
”2019 అక్టోబర్ 5న ఆర్టికల్ 370 తొలగించినప్పుడే, జమ్మూకశ్మీర్ అంశం ముగిసిపోయింది. ప్రస్తుతం సమస్యంతా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ ఎలా తిరిగొస్తుందనే దానిపైనే. దీనిపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం” అని వీణా సిక్రి తెలిపారు.
”అంతర్జాతీయ అంశంగా మారిందనే చర్చ ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. భారత్‌లో ఇతర రాష్ట్రాల మాదిరిగానే జమ్మూకశ్మీర్ కూడా ఒక రాష్ట్రం. దీని గురించి మాట్లాడడానికి ఏమీలేదు” అన్నారు వీణా సిక్రి.
” జమ్మూకశ్మీర్ విషయంలో భారత వైఖరి ఏంటో ట్రంప్‌కు బాగా తెలుసు. దీనిపై ఎలాంటి చర్చ ఉండదని నేను అనుకుంటున్నా” అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా విధానంలో మార్పు వచ్చిందా?
ఏదైనా ఘర్షణ తలెత్తితే, దానికి దూరం జరిగే అమెరికా.. ఈసారి మాత్రం బహిరంగంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా విధానంలో మార్పు వచ్చిందా?
దీనికి హర్ష్ పంత్ స్పందిస్తూ, ”తన మొదటి పదవీ కాలంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ పక్కన కూర్చుని కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు నేను సిద్ధమన్నారు. ఆయన అలా చెప్పడం అదే తొలిసారి కాదు” అన్నారు.
”గత దశాబ్ద కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు ఏంటంటే, చైనాతో తన సంబంధాలు ఎలా ఉండాలి? ప్రచ్ఛన్న యుద్ధం దిశగా వెళ్తున్న సంబంధాలను ఎలా మేనేజ్ చేయాలి?”
”భారత్ బలహీనమైన దేశంగా ఉన్నప్పుడు కూడా కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు భారత్‌కు అన్ని శక్తిసామర్థ్యాలున్నాయి. అమెరికా విదేశాంగ విధానం, ట్రంప్ తమ దారిలో ముందుకెళ్తున్నారు. భారత్ తన పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తుంది” అని పంత్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)