Home జాతీయ national telgu భారత్ ఒప్పందం ప్రకారం అమెరికాకు సుంకాలు చెల్లించాల్సిందేనా? కోర్టు తీర్పు మేరకు రద్దవుతాయా?

భారత్ ఒప్పందం ప్రకారం అమెరికాకు సుంకాలు చెల్లించాల్సిందేనా? కోర్టు తీర్పు మేరకు రద్దవుతాయా?

4
0

SOURCE :- BBC NEWS

భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

డోనల్డ్ ట్రంప్ సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించడంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఏమవుతుందనే ప్రశ్న తలెత్తింది.

భారత్‌తో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. భారత్‌పై సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు.

ఈ 50 శాతం సుంకాల్లో 25 శాతం పరస్పర సుంకం కాగా, మిగిలిన 25 శాతం రష్యా నుంచి చమురు కొంటున్నందుకు తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా విధించింది.

ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలను శుక్రవారం(ఫిబ్రవరి 20) 6-3 ఓట్ల తేడాతో అమెరికా సుప్రీం కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించిన తర్వాత, ట్రంప్ మరో చట్టాన్ని (1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 122) ఉపయోగించి కొత్త అంతర్జాతీయ సుంకాన్ని విధించారు. మొదట 10 శాతం విధించిన ట్రంప్, తర్వాత శనివారం 15 శాతానికి పెంచారు.

కొత్త అంతర్జాతీయ సుంకాలు ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు వర్తిస్తాయి.

శుక్రవారం సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత, వైట్ హౌస్‌లో సుదీర్ఘ విలేఖరుల సమావేశం నిర్వహించిన ట్రంప్ భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ నిర్ణయంతో, భారత్‌తో ఒప్పందానికి సంబంధించి ‘ఏమీ మారదు’ అని, భారత్ చెల్లింపులు చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు.

సుంకాలు చట్టవిరుద్ధమని ప్రకటించిన తర్వాత, భారత్‌పై విధించిన పాత సుంకాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని చాలామంది నిపుణులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

భారత్ – అమెరికా డీల్ తొందరపాటు చర్యా?

భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం ఎందుకు వేచి ఉండలేదని ప్రశ్నించింది.

భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని, దాని నిబంధనలను పునఃపరిశీలించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఈ ఒప్పందం ‘నిరాశ’తో, తొందరపాటుతో జరిగిందని, ఇప్పుడది ఆచరణసాధ్యం కాని డీల్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపించింది.

“2026 ఫిబ్రవరి 2 రాత్రి అధ్యక్షుడు ట్రంప్ భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చిన విషయమేంటి? ?” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన బలహీన ప్రతిష్ఠను కాపాడుకోవడానికి అంత ఆత్రుతపడకపోయి ఉంటే, మరో 18 రోజులు వేచివుంటే, భారత రైతులు ఈ బాధ, సంక్షోభం నుంచి తప్పించుకోగలిగేవారు. భారత సార్వభౌమత్వం సురక్షితంగా ఉండేది”

”ప్రధాని ఆందోళన, లొంగుబాటు వల్ల భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం వాస్తవానికి దేశం ఎదుర్కోవాల్సిన కష్టతరమైన పరీక్షగా మారింది’ అని ఆయన ఆరోపించారు.

ఈ వాణిజ్య ఒప్పందాన్ని ప్రజలకు ‘ద్రోహం’గా కాంగ్రెస్ అభివర్ణించింది. కానీ, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ‘ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి పరిశ్రమకు మినహాయింపు ఉంది’ అని చెప్పారు.

యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరం తన ఫిబ్రవరి 15 నాటి కథనాన్ని ఉటంకిస్తూ, ఫిబ్రవరి 20న ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌ చేశారు. “అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను సుప్రీం కోర్టు కొట్టివేస్తే.. భారత్, అమెరికా 2025 ఏప్రిల్ 2 నాటి పరిస్థితికి తిరిగి వస్తాయని నేను రాశాను” అని పేర్కొన్నారు.

” అమెరికా ఎలాంటి హామీలివ్వకుండా, భారత్ నుంచి అనేక రాయితీలను పొందింది. ఇప్పుడు ఆ రాయితీల సంగతేంటి?” అని ఆ పోస్టులో ప్రశ్నించారు.

“అమెరికా నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే అనేక ఉత్పత్తులకు జీరో సుంకం వర్తిస్తుందని ఉమ్మడి ప్రకటనలో ఉంది. అమెరికా నుంచి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకోవాలని భావిస్తోందని కూడా పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడం, అమెరికా ఉత్పత్తులపై నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఈ హామీలు ఏమవుతాయి?” అని ప్రశ్నించారు.

ఒప్పంద విధివిధానాలను ఖరారు చేసేందుకు భారతీయ బృందం ప్రస్తుతం అమెరికాలో ఉందని, ఈ బృందం ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు.

భారత్, అమెరికా ఒప్పందంపై అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాలని ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.

భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

వాణిజ్య ఒప్పందంపై ప్రశ్నలు

అమెరికా సుప్రీం కోర్టు సుంకాల చట్టబద్ధతపై తీర్పు ఇవ్వబోతోందని తెలిసి కూడా వాణిజ్య ఒప్పందానికి భారత్ ఎందుకు అంగీకరించిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లానీ ఇటీవల ప్రశ్నించారు.

“సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడినప్పటికీ ట్రంప్ రెండో పదవీకాలం అజెండాలో సుంకాలే ప్రధానమైనవి. అయితే, కోర్టు తీర్పు ఆయన నిర్ణయాన్ని బలహీనపరిచింది” అని ఆయన ‘ఎక్స్’లో రాశారు.

“అంతర్జాతీయ చర్చలలో అంతగా ఆకట్టుకోలేని రికార్డ్ భారత ప్రభుత్వాలకుంది. చర్చల్లో లాభాలకు దూరంగా ఉంటోంది. మోదీ ప్రభుత్వం ఈ బలహీనమైన ధోరణిని కొనసాగించింది. లద్దాఖ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా ప్రధాన చొరబాటు తర్వాత బీజింగ్‌తో కుదిరిన ఒప్పందాలు, ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేసిన కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికాతో ఇటీవలి వాణిజ్య ఒప్పందంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది”.

“సుంకాల చెల్లుబాటుపై అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిసీ ఈ నెల ప్రారంభంలో వాషింగ్టన్‌తో ఒక ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై దిల్లీ సంతకం చేసింది. ఈ మొదటి దశలో భారత్ బాధ్యతలు చాలా స్పష్టంగా పర్యవేక్షణకు లోబడి ఉంటాయి. అయితే, అమెరికా చేస్తానని చెప్పిన అంశాలు దశలవారీగా షరతులతో కూడినవి, అవి సందర్భాన్ని బట్టి మార్చుకోగలిగేలా ఉంటాయి” అని ఆయన రాశారు.

“ఒప్పందంలో వాణిజ్యానికి మించిన అంశాలు ఉన్నాయి. వీటిలో రష్యా చమురు దిగుమతులను దశలవారీగా తగ్గించడం, భారత ప్రత్యేక ఆర్థిక మండలి(మారిటైమ్ జోన్) పాశ్చాత్య ఆంక్షలకు లోబడి నౌకల మధ్య చమురు బదిలీలపై నిషేధం ఉన్నాయి. ఈ విషయంలో భారత్ చర్యలు తీసుకుంది.”

అమెరికా ఆంక్షల అమలులో భాగంగా, తన ప్రాదేశిక జలాల్లో ఇరాన్‌తో సంబంధం ఉన్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ స్వాధీనం చేసుకున్నట్టు ఫిబ్రవరి 16న రాయిటర్స్ తెలిపింది. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)తో అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ట్యాంకర్లకు ఇరాన్‌తో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇప్పుడు, భారత్‌పై పడే సుంకాలు ఎంత?

బీబీసీ ప్రతినిధి గ్రేస్ ఎలిజా గుడ్విన్ రిపోర్టు ప్రకారం.. భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో సహా అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న దేశాలకు కూడా సెక్షన్ 122 ప్రకారం విధించిన 10 శాతం సుంకాలు (ట్రంప్ దానిని 15 శాతానికి పెంచారు) వర్తిస్తాయని వైట్ హౌస్ అధికారి బీబీసీకి తెలిపారు.

ఆయా దేశాలు తమ వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఇచ్చిన రాయితీలను గౌరవించాలని ట్రంప్ ప్రభుత్వం ఆశిస్తున్నట్టు ఆ అధికారి తెలిపారు.

అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయం భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా ప్రభావం చూపుతుందని, దిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్‌కు చెందిన అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారని, ఇది త్వరలో జరగాల్సి ఉందని, కానీ అంతకు ముందే సుప్రీం కోర్టు నిర్ణయం సుంకాలు చట్టవిరుద్ధమని తేల్చింది” అని అజయ్ శ్రీవాస్తవ బీబీసీకి తెలిపారు.

“అయితే, అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా 15 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది తాత్కాలికమైనది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది.”

“స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఉంటే కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఎలాంటి రాయితీ లేకుండా 15 శాతం సుంకం అమలవుతుంది” అని అజయ్ శ్రీవాత్సవ చెప్పారు.

భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఎలా ఉంటాయో కూడా అజయ్ శ్రీవాత్సవ వివరించారు.

“అమెరికాకు భారత్ చేసే 55 శాతం ఎగుమతులపై 25 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీనిస్థానంలో ఇప్పుడు 15 శాతం సుంకాలు అమలవుతాయి” అని ఆయన అన్నారు.

“భారతీయ ఎగుమతుల్లో మిగిలిన 45 శాతంలో దాదాపు సగానికి అమెరికా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది, ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, మందులు, పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు, ఉక్కు, అల్యూమినియం వంటి మిగిలిన ఉత్పత్తులపై, అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై 50 శాతం సుంకాలు విధించింది” అని ఆయన అన్నారు.

అమెరికా సుప్రీం కోర్టు ఈ సుంకాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది.

భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఒప్పందం ఏమవుతుంది?

సుంకాలను చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు ప్రకటించిన తర్వాత ట్రంప్ మాట్లాడుతూ, ‘భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంలో ఏమీ మారదు. భారత్ సుంకాలు చెల్లించాలి. అమెరికా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

కానీ, ట్రంప్ వాదనకు చట్టబద్ధత ఉండదని నిపుణులు అంటున్నారు.

ఫిబ్రవరి 6న విడుదల చేసిన సంయుక్త ప్రకటన గమనిస్తే, భారత్ – అమెరికా మధ్య చర్చలు జరుపుతున్న వాణిజ్య ఒప్పందానికి ఒకే ఒక చట్టపరమైన అవకాశం ఉందని అజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

“రెండు దేశాల్లో ఏదైనా సుంకాలను సవరించినట్టయితే, మరొక దేశం చర్య తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని ఉమ్మడి ప్రకటనలో చాలా స్పష్టమైన షరతు ఉంది. ఇప్పుడు అమెరికాలో సుంకాలు సవరించారు. మనం దానిని పున:పరిశీలించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా, మనకు ఎలాంటి ప్రయోజనం లేదని, దీనిని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని మనం చెప్పగలం.”

అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కొత్త 15 శాతం సుంకాలను కూడా సవాల్ చేయవచ్చని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

నిజానికి ట్రంప్ కొత్త గ్లోబల్ టారిఫ్‌లను ప్రకటించిన సెక్షన్ 122, గరిష్టంగా 15 శాతం టారిఫ్‌ను 150 రోజుల వ్యవధికి మాత్రమే అనుమతిస్తుంది. కానీ, చెల్లింపుల బ్యాలెన్స్ సమస్య ఉంటేనే దానిని విధించవచ్చని కూడా ఇది నిర్దేశిస్తుంది. ఇంకా, ఈ చట్టం స్థిర మారకపు రేట్లు ఉన్న పరిస్థితులను సూచిస్తుంది.

“ప్రస్తుతం అమెరికాకు చెల్లింపుల సమతుల్యత సమస్య లేదు. అక్కడ స్థిర మారకపు రేటు సమస్య కూడా లేదు. అందుకే దీనిని సవాల్ చేస్తారని అతి త్వరలో అమెరికా దానిని కూడా ఉపసంహరించుకోవలసి వస్తుందని చెబుతున్నారు” అని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

భారత్, అమెరికా, ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ఏం చేయాలి?

సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి పెరిగింది కాబట్టి.. భారత్ తన వాణిజ్య ఒప్పందం నిబంధనలను పునఃపరిశీలించాలని అజయ్ శ్రీవాస్తవ అన్నారు.

“మనం ఇంతకుముందు చేసుకున్న వాణిజ్య ఒప్పందంలోని ప్రతీదీ మారిపోయింది, ఇప్పుడు మనం దాని నుంచి బయటపడటం లేదా కొత్త నిబంధనలపై తిరిగి చర్చలు జరపడం గురించి ఆలోచించాలి” అని ఆయన అంటున్నారు.

“పాత ఒప్పందం పూర్తిగా అప్రస్తుతంగా మారింది. అమెరికాలో సుంకాల విషయంలో చాలా అస్థిరత ఉంది. భారత్ దాని నుంచి బయటపడి అమెరికాలో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ప్రశాంతంగా గమనించాలి. వాణిజ్య ఒప్పందం గురించిన చర్చను కొంతకాలం మర్చిపోవాలి” అని ఆయన అన్నారు.

‘అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ పునఃపరిశీలించాలి’ అని అజయ్ శ్రీవాత్సవ సూచించారు.

“సుంకాలపై అమెరికా సుప్రీం కోర్టు నిర్ణయాన్ని మేం చూశాం. అధ్యక్షుడు ట్రంప్ కూడా విలేఖరుల సమావేశం నిర్వహించారు. అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి మేం ఈ పరిణామాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాం” అని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)