Home జాతీయ national telgu భారత్‌ అదుపులో ఆరుగురు యుక్రెయిన్ పౌరులు – మియన్మార్ మీదుగా వారు ఇండియాలోకి ఎందుకు అక్రమంగా...

భారత్‌ అదుపులో ఆరుగురు యుక్రెయిన్ పౌరులు – మియన్మార్ మీదుగా వారు ఇండియాలోకి ఎందుకు అక్రమంగా ప్రవేశించారు?

10
0

SOURCE :- BBC NEWS

యుక్రెయిన్, భారత్, రష్యా, మిజోరం

ఫొటో సోర్స్, ANI

ఒక గంట క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

భారత్‌లో తమ దేశానికి చెందిన ఆరుగురు పౌరులను అదుపులోకి తీసుకోవడంపై యుక్రెయిన్ నిరసన వ్యక్తంచేసింది.

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. వారు అనుమతి లేకుండా మిజోరం రాష్ట్రంలోకి ప్రవేశించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

యుక్రెయిన్ రాయబార కార్యాలయం దీనిపై ‘ఎక్స్’లో ఒక ప్రకటన విడుదలచేసింది.

రష్యా అందించిన సమాచారం ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది.

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం(మార్చి 19) దీనిపై వ్యాఖ్యానించారు.

“ఆ ప్రాంతాలను సందర్శించడానికి అనుమతులు అవసరం. వారికి (యుక్రెయిన్ పౌరులకు) ఈ ప్రత్యేక అనుమతి ఉందో లేదో ఇప్పుడు కోర్టు నిర్ణయిస్తుంది. ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు మాత్రమే నిజం బయటకు వస్తుంది” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
యుక్రెయిన్, భారత్, రష్యా, మిజోరం

ఫొటో సోర్స్, Embassy of Ukraine

యుక్రెయిన్ ఏం చెప్పింది?

“ఈ విషయంలో ఎన్ఐఏ ప్రకటన జారీచేస్తుంది. నేనింకా సాంకేతిక వివరాల్లోకి వెళ్లలేదు. కానీ నాకు తెలిసిన దాని ప్రకారం ఆ ప్రాంతానికి వెళ్లడానికి అవసరమైన పత్రాలు వాళ్ల దగ్గరలేవు” అని రణధీర్ జైస్వాల్ చెప్పారు.

కాగా ఉగ్రవాద కార్యకలాపాలను యుక్రెయిన్ వ్యతిరేకిస్తుందని ఆ దేశ రాయబార కార్యాలయం తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

”రష్యా ‘ఉగ్రవాదం’ పరిణామాలను యుక్రెయిన్ ప్రతిరోజూ ఎదుర్కొంటోంది. అందుకే ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల ‘ఉగ్రవాదాన్ని’ ఎదుర్కోవడానికి యుక్రెయిన్ ప్రాథమికంగా కట్టుబడి ఉంది” అని యుక్రెయిన్ తెలిపింది.

యుక్రెయిన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్’లో ఒక ప్రకటనను జారీ చేసింది. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవడానికి భారత్, యుక్రెయిన్ కట్టుబడి ఉన్నాయని రాయబార కార్యాలయం తెలిపింది.

ఆరుగురు యుక్రెయిన్ పౌరులను భారత్‌లో అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన సమాచారం, మీడియా రిపోర్ట్స్ గమనిస్తే రష్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోందని రాయబార కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ సంఘటన రాజకీయ ప్రేరేపితమని, పథకం ప్రకారం జరిగినట్టు అనిపిస్తోందని, భారత్‌లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయం దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది.

అదుపులో ఉన్న యుక్రెయిన్ పౌరులను కలిసేందుకు అనుమతించాలని, వారిని తక్షణమే విడుదల చేయాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. యుక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్‌చుక్ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలోని కార్యదర్శి (పశ్చిమ) సీబీ జార్జ్‌ను కలిశారని యుక్రెయిన్ వార్తాసంస్థ యూకేఆర్‌ఇన్‌ఫామ్ తెలిపింది.

యుక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

యుక్రెయిన్ పౌరులతో పాటు, ఒక అమెరికన్‌నుకూడా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై భారత్ అదుపులోకి తీసుకుందని యూకేఆర్ఇన్‌ఫామ్ తెలిపింది.

దీనిపై పీటీఐ దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని సంప్రదించగా ఆయన “మాకు ఈ విషయం తెలుసు. కానీ గోప్యత కారణాల వల్ల అమెరికా పౌరులకు సంబంధించిన విషయాలపై మేం మాట్లాడలేం” అని బదులిచ్చారు.

యుక్రెయిన్, భారత్, రష్యా, మిజోరం

ఫొటో సోర్స్, ANI

భారత్, రష్యా మీడియాపై ఆరోపణలు

అయితే.. వారు మిజోరంలో ఎందుకు ఉన్నారనేది స్పష్టంగా తెలియలేదు.

మిజోరంలో వారు అనుమతిలేకుండా ఉన్నారని యుక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత్-మియన్మార్ సరిహద్దును అక్రమంగా దాటారన్న ఆరోపణలున్నాయని యుక్రెయిన్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ పౌరులను అదుపులోకి తీసుకోవడం గురించి భారత్‌లోని యుక్రెయిన్ రాయబార కార్యాలయానికి భారత అధికారులు అధికారికంగా తెలియజేయలేదని యుక్రెయిన్ వార్తా సంస్థ యూకేఆర్‌ఇన్‌ఫామ్ తెలిపింది. తమ పౌరులను కలవడానికి తక్షణమే కాన్సులర్‌కు అవకాశం కల్పించాలని కోరింది.

సీబీ జార్జ్‌తో తన సమావేశం సందర్భంగా యుక్రెయిన్ రాయబారి పోలిష్‌చుక్ తమ పౌరులను తక్షణమే విడుదల చేయాలని, వారిని కలుసుకోవడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక అధికారిక నిరసన లేఖను కూడా సమర్పించారని పీటీఐ తెలిపింది.

యుక్రెయిన్ పౌరులు భారత్‌లోగానీ, మియన్మార్‌లో గానీ చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నారని నిరూపించడానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పినట్టు యూకేఆర్ ఇన్‌ఫార్మ్ పేర్కొంది. ఈ విషయంలో కొన్ని భారత్, రష్యన్ మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని యుక్రెయిన్ ఆరోపించింది.

ఈ ఆరుగురు పౌరులకు న్యాయ సహాయం, న్యాయవాదులను ఏర్పాటుచేశారని యుక్రెయిన్ తెలిపింది.

”ఈ కేసు విచారణ మార్చి 16న జరిగింది. దీనికి యుక్రెయిన్ రాయబార కార్యాలయ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. కానీ అదుపులో ఉన్నవారిని నేరుగా కలవడానికి వారికి అనుమతి ఇవ్వలేదు” అని పీటీఐ తెలిపింది.

విచారణ అనంతరం కోర్టు వారిని మార్చి 27 వరకు కస్టడీకి పంపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)