SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, EPA
ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న కొద్దీ, దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని ప్రాంతాలలోనూ కనిపిస్తోంది.
కొన్నిరోజులుగా దేశంలోని పలు నగరాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. అద్దెగదుల్లో ఉంటూ తమ వంట తామే చేసుకునే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక మెస్‌లు మూతపడుతున్నాయి.

ఫొటో సోర్స్, Sivaram Venkitasubramanian/NurPhoto via Getty
గ్యాస్ విషయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలంతా గురువారం పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు.
దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనాలకు ఎలాంటి కొరతా లేదని పెట్రోలియం శాఖమంత్రి హర్దీప్ పురి మార్చ్12న లోక్‌సభలో తెలిపారు. దేశీయ ఇంధన భద్రతను పరిరక్షిస్తామని చెప్పారు.
“డిస్ట్రిబ్యూటర్, రిటైల్ స్థాయిలో గ్యాస్ నిల్వల గురించి ప్రజల్లో ఆందోళన ఉంది. బుకింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఈ పరిస్థితికి గ్యాస్ సరఫరాలో కొరత కారణం కాదని, వినియోగదారుల్లో ఆందోళనే ” అని ఆయన చెప్పారు.
“కొంతమంది గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. సరఫరాలో ఏర్పడుతున్నఅడ్డకుంలను తొలగించడానికి మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం” అని ప్రధాని మోదీ అదేరోజు ఒక సమావేశంలో వ్యాఖ్యానించారు.
భారత్‌లో ఇంధన డిమాండ్‌ను పరిశీలించడానికి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ డేటాను బీబీసీ విశ్లేషించింది. దేశంలో గ్యాస్ వినియోగం గత పదేళ్లలో పెరిగిందని, గ్యాస్ ఉత్పత్తి దాదాపుగా స్తబ్ధుగా ఉందని, ఎల్‌పీజీ నిల్వలు పరిమితంగా ఉన్నాయని ఈ లెక్కలు చూపాయి.
పెరిగిన గ్యాస్ వాడకం
భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద ఎల్పీజీ వినియోగదారు. దేశంలో 2015-16లో 19.6 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 2024-25 నాటికి 31.3 ఎంఎంటీకి గ్యాస్ వినియోగం పెరిగింది. అంటే గత పదేళ్లలో 60శాతం పెరిగింది.
భారత్‌లో 33 కోట్ల మంది గృహావసరాల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. 2015-16లో ఈ సంఖ్య 16.6 కోట్లు మాత్రమే. అంటే గృహావసరాల కోసం గ్యాస్ వినియోగించేవారి సంఖ్య రెట్టింపైందని తాజా డేటా సూచిస్తోంది.
గృహ వినియోగదారులలో పెరుగుదల, స్వచ్ఛఇంధనంగా ఎల్‌పీజీని ప్రోత్సహించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)తో ముడి పడి ఉంది. పీఎంయూవై కనెక్షన్లు 2024-25లో 10.3 కోట్లు ఉన్నాయి.
ఎల్పీజీ ఉత్పత్తిలో స్తబ్దత
భారత్‌లో గ్యాస్ వినియోగానికి తగినట్టుగా ఉత్పత్తి పెరగడం లేదు. భారత్‌లో వినియోగిస్తున్న ఎల్పీజీలో 41 శాతానికి పైగా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది.
గత ఏడెనిమిదేళ్లుగా అంటే 2017-18 నుంచి 2024-25 మధ్య దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి దాదాపు 12 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది.
2015-16లో భారత్‌లో వినియోగించే ఎల్పీజీలో దాదాపు 54 శాతం దేశీయంగానే ఉత్పత్తి అవ్వగా, 2024-25 నాటికి 41 శాతానికి తగ్గిపోయింది.
ఫొటో సోర్స్, Sivaram Venkitasubramanian/NurPhoto via Getty
పెరుగుతున్న దిగుమతులు
దేశీయంగా డిమాండ్ పెరిగి, ఉత్పత్తి తగ్గడంతో భారత్ ఎల్పీజీ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతోంది. దేశీయంగా వినియోగించే ఎల్పీజీలో 60 శాతం దిగుమతిద్వారా లభిస్తున్నదే అని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ డేటా చెబుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ గ్యాస్ దిగుమతుల్లో దాదాపు 85 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే వస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఈ మార్గం వార్తల్లో నిలిచింది.
హార్ముజ్ జలసంధి ఇరుకైన సముద్ర మార్గం. ఇది ఇరాన్‌కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం గుండా నౌకల రాకపోకల్ని ఆ దేశం అడ్డుకుంటోంది. దీంతో లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది.
భారత్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం గ్యాస్, ఇతర గ్యాస్ దిగుమతుల్లో 33 శాతం వాటాతో ఖతార్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 27శాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 8.6శాతంతో అమెరికా ఉన్నాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్‌లో ఎల్ఎన్‌జీ, ఎల్పీజీ, ప్రొఫెన్, బ్యూటెన్ ఉన్నాయి.
భారత్‌కు అవసరమైన పెట్రోలియం 2024-25లో 80 శాతం గల్ఫ్ దేశాలైన ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్ నుంచి దిగుమతైంది.
ఎన్నిరోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి?
గ్రామాల్లో మహిళలకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించేందుకు, స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఎల్పీజీ దిగుమతులు దాదాపు 3 రెట్లు పెరిగాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ “ఇండియన్ ఆయిల్ మార్కెట్ అవుట్‌లుక్ టు 2030” నివేదిక పేర్కొంది.
వినియోగం భారీగా ఉన్నా, భారత్‌లో ఎల్పీజీ నిల్వలు పరిమితంగా ఉన్నాయి.
అక్టోబర్ 2025 నాటికి మొత్తం ఎల్పీజీ నిల్వ సామర్థ్యం 1555.6 వేల మెట్రిక్ టన్నులు. గ్యాస్ సరఫరా ఆగిపోతే ఇది 18 రోజులు మాత్రమే సరిపోతుంది.
నిల్వ సామర్థ్యం కూడా ప్రాంతాలను బట్టి చూస్తే వేర్వేరుగా ఉంది. పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో నిల్వలు 26, 23 రోజులకు సరిపోతాయి.
ఉత్తర ప్రాంతంలో నిల్వ ఉన్న గ్యాస్ 8 రోజులకు మాత్రమే సరిపోతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



