Home LATEST NEWS telugu తాజా వార్తలు బ్లూ ఆరిజిన్: ఆరుగురు మహిళలు 10 నిమిషాలలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చేశారు

బ్లూ ఆరిజిన్: ఆరుగురు మహిళలు 10 నిమిషాలలో అంతరిక్షంలోకి వెళ్లొచ్చేశారు

6
0

SOURCE :- BBC NEWS

capsule

ఫొటో సోర్స్, Blue Origin.

మ్యూజిక్, మూవీస్, జర్నలిజం, రీసెర్చ్…ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళా బృందం ఏప్రిల్ 14న అంతరిక్షంలోకి ప్రయాణించింది.

జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్‌లో ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపించింది.

1963లో సోవియట్‌కు చెందిన మహిళా కాస్మోనాట్ వాలెంటినా తెరిష్కోవా సింగిల్‌గా ప్రయాణించిన తర్వాత జరుగుతున్న పూర్తి మహిళా అంతరిక్ష ప్రయాణం ఇదే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
న్యూస్‌షెపర్డ్-31 బృందం

ఫొటో సోర్స్, TWITTER/BLUE ORIGIN

ఈ బృందంలో పాప్ సింగర్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, పౌర హక్కుల న్యాయవాది అమండా ఇంన్గుయెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లిన్ ఉన్నారు. వారితో పాటు ఆరో మహిళ లారెన్ సాంచెజ్ కూడా ఉన్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించిన ఆమె జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ కూడా.

వీళ్లందరూ భూమికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటి తిరిగి భూమిని చేరుకున్నారు. ఇది భూ వాతావరణానికి ఆవల ఉంటుంది.

అంతరిక్షం

ఫొటో సోర్స్, Getty Images

ఒక చిన్న ప్రయాణం

ఈ ఆరుగురు మహిళలు న్యూ షెపర్డ్-31 మిషన్‌లో భాగంగా బ్లూ ఆరిజిన్‌కు చెందిన రాకెట్‌లో ప్రయాణించారు.

దాని లోపల ఉన్న స్పేస్‌క్రాఫ్ట్ పూర్తిగా ఆటోమేటెడ్. అంటే దీనిని ఆపరేట్ చేయడానికి లోపల ఎవరూ ఉండరు.

మిషన్ ప్రయాణం 10 నిమిషాల కంటే మరికొన్ని సెకన్లు పట్టింది. కర్మన్ రేఖ వద్ద ఈ మహిళలంతా కొన్ని నిమిషాలపాటు జీరో గ్రావిటీని అంటే భారరహిత స్థితిని అనుభవించారు. అంతరిక్షం నుంచి కొద్దిసేపు భూ గ్రహాన్ని వీక్షించారు.

పాప్ గాయని కేటీ పెర్రీ మ్యూజిక్ టూర్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుంది. అందుకే, ఏప్రిల్ 14న ఈ మిషన్ పూర్తి చేయాలని బ్లూ ఆరిజిన్ నిర్ణయించింది.

అమెరికాలోని వెస్ట్ టెక్సాస్‌లోని కంపెనీ ప్రయోగ కేంద్రం నుంచి న్యూ షెపర్డ్ రాకెట్‌ను ప్రయోగించారు.

2023లో వోగ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పూర్తిగా మహిళలే అంతరిక్షయానం చేయాలనే తన కల గురించి ప్రస్తావించారు లారెన్ సాంచెజ్.

“ఇది కేవలం అంతరిక్ష యాత్ర కాదు. ప్రజల ఆలోచనలను మార్చడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో జరిగే యాత్ర.” అని బ్లూ ఆరిజిన్ ఒక ప్రకటనలో తెలిపింది.

కర్మన్ రేఖ

ఫొటో సోర్స్, Blue Origin

కర్మన్ రేఖ ఏమిటి?

కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు. దీనిని భూమిపై సముద్ర మట్టానికి 100 కి.మీ ఎత్తులో ఉన్నట్లు నిర్వచించారు. ఈ సరిహద్దును భూ వాతావరణం ముగింపు, అంతరిక్షానికి ఆరంభంగా భావిస్తారు.

భూ వాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనలీ (ఎఫ్ఏఐ) అనే సంస్థ ఈ కర్మన్ రేఖను నిర్ణయించింది.

ఈ ఎత్తుకు చేరుకోవడాన్ని అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తారు.

“అంతర్జాతీయంగా ఆమోదించిన నియమాల ప్రకారం, కర్మన్ రేఖ అనేది అంతరిక్షానికి ప్రారంభ స్థానం” అని మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్‌లో ప్రొఫెసర్, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు.

వెంకటేశ్వరన్ చెప్పినదాని ప్రకారం, భూ వాతావరణం 99.9 శాతం ముగిసే ప్రాంతమే కర్మన్ రేఖ. అది దాదాపు 100 కి.మీ ఎత్తు ఉంటుంది. అందువల్ల, దాని పైన ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షంగా నిర్ణయించారు.

ఈ సరిహద్దు రేఖను దాటిన వారిని ‘అంతరిక్ష యాత్రికులు’గా పరిగణిస్తారు. అందుకే బ్లూ ఆరిజిన్‌కు చెందిన రాకెట్లు ఈ రేఖను దాటి వెళ్లి, దానిలోని ప్రయాణించిన వారికి నిజమైన అంతరిక్ష అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

రాకెట్

ఫొటో సోర్స్, Getty Images

‘అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించడం’

అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని వెంకటేశ్వరన్ అంటున్నారు.

“ఈ కంపెనీ చాలాసార్లు అంతరిక్ష పర్యటకాన్ని నిర్వహించింది. కానీ, ఈ యాత్ర సునీతా విలియమ్స్ వెళ్లినట్లుగానే ఉంటుందని అనుకోకూడదు” అని ఆయన అన్నారు.

సునీతా విలియమ్స్ దాదాపు 400 కి.మీ. ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కానీ, ఇది అలాంటి ప్రయాణం కాదని వెంకటేశ్వరన్ అన్నారు.

“ఈ ప్రయాణం 11 నిమిషాలు ఉంటుంది. వారు రాకెట్‌లో 7 నిమిషాలు ప్రయాణిస్తారు. దాదాపు 48 కి.మీ. దానిలో ప్రయాణించిన తర్వాత, రాకెట్ నుంచి స్పేస్ క్రాఫ్ట్‌ విడిపోయి అంతరిక్షంలోకి వెళుతుంది. స్పేస్‌క్రాఫ్ట్‌ కర్మన్ రేఖకు కొంచెం పైన ప్రయాణించి, తర్వాత భూమికి తిరిగి వస్తుంది” అని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టు మహిళల పురోగతికి, భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని వెంకటేశ్వరన్ అభిప్రాయపడ్డారు.

ఎవరీ మహిళలు?

ఈ ప్రయాణంలో అంతరిక్ష సరిహద్దు అయిన కర్మన్ రేఖ వద్దకు ప్రయాణించిన ఆరుగురు మహిళలు ఎవరు? వారి నేపథ్యాల గురించి తెలుసుకుందాం.

లారెన్ సాంచెజ్

ఫొటో సోర్స్, Lauren Sánchez/IG

లారెన్ సాంచెజ్

లారెన్ సాంచెజ్ ఎమ్మీ అవార్డు గెలుచుకున్న జర్నలిస్ట్. న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత్రి, పైలట్, బెజోస్ స్థాపించిన ఎర్త్ ఫండ్ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ కూడా.

సాంచెజ్ ముగ్గురు పిల్లల తల్లి. లైసెన్స్ పొందిన హెలికాప్టర్ పైలట్. 2016లో ఆమె ‘బ్లాక్ ఆప్స్ ఏవియేషన్‌’ సంస్థను స్థాపించారు. దీనిని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు.

హెలికాప్టర్ పైలట్‌గా ఆమె నైపుణ్యం, విమానయానంలో వ్యాపారవేత్తగా చేసిన కృషికి 2024లో ఎల్లింగ్ హాల్వోర్సన్ వర్టికల్ ఫ్లైట్ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం అందుకున్నారు సాంచెజ్.

ఐషా బోవే

ఫొటో సోర్స్, Aisha Bowe/IG

ఐషా బోవే

ఐషా బోవే బహమాస్‌కు చెందినవారు. నాసాలో మాజీ రాకెట్ సైంటిస్ట్, ఆంట్రప్రెన్యూర్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమాటిక్స్ (ఎస్‌టీఈఎం) శాస్త్రాల ప్రమోటర్ కూడా.

ఆమె స్టెమ్‌బోర్డ్ అనే ఇంజనీరింగ్ కంపెనీకి సీఈవో. ఇది అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీల జాబితాలో రెండుసార్లు స్థానం దక్కించుకుంది.

దాదాపు పది లక్షల మంది విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను నేర్పించే లక్ష్యంతో లింగో అనే కంపెనీని కూడా ఐషా ప్రారంభించారు.

అమండా

ఫొటో సోర్స్, Amanda Nguyen/IG

అమండా

అమండా ఒక బయోస్పేస్ రీసర్చ్ సైంటిస్ట్. హార్వర్డ్ పట్టభద్రురాలు. హార్వర్డ్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్, ఎంఐటీ, నాసా, ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్‌లో పరిశోధనలు నిర్వహించారు.

1981 నుంచి 2011 వరకు నాసాలో రీయూజబుల్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రోగ్రామ్‌లో అమండా పని చేశారు. కెప్లర్ ఎక్సోప్లానెట్ మిషన్‌లో కూడా ఆమె భాగం పంచుకున్నారు.

లైంగిక హింస నుంచి బయటపడిన వారి కోసం అందించిన సహాయ కార్యక్రమాలకు ఆమెను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కూడా చేశారు.

2022లో టైమ్ మ్యాగజైన్ ‘ఉమన్ ఆఫ్ ది ఇయర్‌’గా కూడా అమండాను ఎంపిక చేసింది.

గేల్ కింగ్

ఫొటో సోర్స్, Gayle King/IG

గేల్ కింగ్

గేల్ కింగ్ ఒక జర్నలిస్ట్, అవార్డు విన్నర్.

ఆమె ‘సీబీఎస్ మార్నింగ్స్‌’ కు కో-హోస్ట్, ఓప్రా డైలీకి ఎడిటర్-ఎట్-లార్జ్.

ఆమె సిరియస్ఎక్స్‌ఎమ్‌ రేడియోలో ‘గేల్ కింగ్ ఇన్ ది హౌస్’ అనే షోను కూడా నిర్వహిస్తున్నారు.

జర్నలిజంలో ఆమెకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది.

కేటి పెర్రీ

ఫొటో సోర్స్, Getty Images

కేటి పెర్రీ

కేటీ పెర్రీ పాప్ గాయని. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ సింగర్. ఆమె ఆల్బమ్‌లు కాపిటల్ రికార్డ్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడయ్యాయి.

కేటీ పాటల వీడియోలకు వందల కోట్ల వ్యూస్ ఉన్నాయి.

మానవతా కార్యక్రమాల్లో కూడా ఆమె చురుకుగా పాల్గొంటుంటారు.

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా పిల్లల హక్కుల కోసం ఉద్యమిస్తుంటారు కేటీ.

కెరియాన్ ఫ్లిన్

ఫొటో సోర్స్, Kerianne Flynn/IG

కెరియాన్ ఫ్లిన్

ఫ్యాషన్, మానవ వనరుల రంగాలలో పనిచేశారు కెరియాన్ ఫ్లిన్.

గత దశాబ్ద కాలంగా ది అలెన్-స్టీవెన్సన్ స్కూల్, ది హై లైన్, హడ్సన్ రివర్ పార్క్ వంటి స్వచ్ఛంద సంస్థలలో వలంటీర్‌గా చేశారు.

హాలీవుడ్‌లోని మహిళల చరిత్రను అన్వేషించే దిస్ చేంజ్స్ ఎవ్రీథింగ్ (2018), లిల్లీ (2024) వంటి ఆలోచింపజేసే సినిమాలను నిర్మించారు కెరియాన్ .

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS