Home జాతీయ national telgu బ్రెస్ట్ మిల్క్: పెద్దలు కూడా తల్లిపాలు తాగొచ్చా?

బ్రెస్ట్ మిల్క్: పెద్దలు కూడా తల్లిపాలు తాగొచ్చా?

4
0

SOURCE :- BBC NEWS

బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

పసిపిల్లల ఎదుగుదలకు తల్లిపాలు చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.

తల్లిపాలలో పిల్లలకు కావాల్సిన పోషకాలు, యాంటీబాడీస్ ఉంటాయని చెబుతారు.

కానీ, కొందరు పెద్దవాళ్లు(అడల్ట్స్) కూడా ఈ ‘సూపర్ ఫుడ్’ సామర్థ్యాలపై ఆధారపడుతున్నారు.

ముగ్గురు పిల్లల తండ్రి అయిన 39 ఏళ్ల జేమీసన్ రిటెనార్, తన భాగస్వామి బాలింతగా ఉన్నప్పుడు తల్లి పాల రుచి చూశానని చెప్పారు.

”ఆ పాలను నేను షేక్స్‌లో కలుపుకొన్నా. నేనలా చేయడాన్ని నా భాగస్వామి వింతగా చూసింది. ఆ సమయంలో ఆమెకు పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి” అని బీబీసీతో ఆయన చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

యూట్యూబ్ వీడియోలో ఒక బాడీ బిల్డర్ మనిషి పాలను తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడటం చూసిన తర్వాత తనకు కూడా ఆసక్తి కలిగిందని జేమీసన్‌ చెప్పారు.

తర్వాత తల్లిపాలు తాగడం ఆయనకు దినచర్యగా మారింది. ఆయన రోజుకు 450 మిల్లీ లీటర్ల తల్లి పాలు తీసుకుంటారు.

”బహుశా నేను నా జీవితంలోనే అత్యుత్తమ ఆకృతి(షేప్)లో ఉన్నాను. కండరాల నిర్మాణంలో ఈ పాలు సహాయపడుతున్నాయని కచ్చితంగా నేను చెప్పగలను. ఎనిమిది వారాల్లో బరువు తగ్గడంతో పాటు కండరాల సాంద్రతను 5 శాతం పెంచుకున్నాను” అని జేమీసన్ వివరించారు.

తల్లిపాలు తన ఆహారంలో భాగమయ్యాక అనారోగ్యానికి గురైనట్లు కానీ, జలుబు చేసినట్లు కానీ తనకు గుర్తులేదని ఆయన చెప్పారు.

”నేను పసిపిల్లల తరహాలో ఎదగాలనుకుంటున్నా, వాళ్లలా నిద్రపోవాలని అనుకుంటున్నా. అందుకే పిల్లల ఆహారాన్నే తీసుకోవాలని నిర్ణయించుకున్నా. నాకు ఇది నచ్చింది. నేను ఇప్పుడు చాలా బాగున్నాను” అని ఆయన వివరించారు.

ఆన్‌లైన్‌లో బ్రెస్ట్ మిల్స్ అమ్మకాలు

ఫొటో సోర్స్, Jameson Ritenour

ఆన్‌లైన్‌లో కొంటే ముప్పే…

తల్లిపాలు తాగడం వల్ల పెద్దల్లో కలిగే ప్రయోజనాలను సూచించే ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

కానీ, కొందరి అనుభవాల ప్రకారం చూస్తే వీటి వల్ల ప్రయోజనం ఉండొచ్చునని మరికొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు.

”తల్లి పాలు తాగే పసిపిల్లల కండరాలు వేగంగా ఎదుగుతాయి. బాడీ బిల్డర్లకు కూడా కావాల్సింది ఇదే” అని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన హ్యూమన్ మిల్క్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపక డైరెక్టర్, డాక్టర్ లార్స్ బోడె చెప్పారు.

అయితే తల్లిపాలను ఫేస్‌బుక్, క్రెగ్స్‌లిస్ట్, రెడిట్‌లలోని సందేహాస్పద అన్‌లైన్ సోర్సుల ద్వారా కొనుగోలు చేస్తున్నారని, ఇది మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

”ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే మనిషి పాలను పరీక్షించరు. వాటివల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుంది. హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటి వ్యాధులకు కారణం కావొచ్చు” అని లార్స్ చెప్పారు.

‘ఆ పాల నాణ్యత అనేది వాటిని ఉత్పత్తి చేసే మహిళ ఆరోగ్యం, వారు తీసుకునే ఆహారం ప్రకారం ఉంటుంది. ఇవి కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు కారణం కావొచ్చు’ అన్నారు.

బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

మహిళలు సాధారణంగా స్టెరిలైజ్ కాని పరిసరాల్లోనే పాలను పంప్ చేస్తుంటారు. కాబట్టి అవి సులభంగా కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో కొన్న 101 మనిషి పాల శాంపిల్స్ పరీక్షించగా 75 శాతం శాంపిల్స్‌లో హానికర సూక్ష్మజీవులు ఉన్నట్లు, మరో 10 శాతం శాంపిల్స్‌లో పాలపొడి, ఆవు పాలను కలిపినట్లు అమెరికాలోని నేషన్‌వైడ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ 2015లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది.

తన భాగస్వామితో జేమీసన్ విడిపోయిన తర్వాత ఆయన తల్లి పాలు అందుబాటులో లేకుండా పోవడంతో ఆన్‌లైన్‌లో కొనాలని నిర్ణయించుకున్నారు.

కల్తీ పాలతో కలిగే ప్రమాదాల గురించి తనకు అవగాహన లేదని ఆయన అన్నారు.

”నేను ఇంటర్నెట్‌లో ఎవరో ఒక మహిళ నుంచి పాలను కొన్నాను. నేను ఫేస్‌బుక్‌లో దీని గురించి చూశాను” అని జేమీసన్ చెప్పారు.

ఈ విషయంలో తన సొంత అనుభవాలు చాలా సానుకూలంగా ఉన్నాయని, ఇక శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం గురించి తానేమీ ఆందోళన చెందట్లేదని తెలిపారు.

మనిషి పాలు తాగుతానని కొందరు తనను విచిత్రంగా చూస్తారని, ఇదొక్కటే తన సమస్య అని ఆయన చెప్పారు.

బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

పాలు తాగే పిల్లల పరిస్థితి ఏంటి?

”తల్లి పాలు తాగాలని నేనెప్పుడూ పెద్దవారికి చెప్పను. అవి వారికి హాని చేస్తాయని నేను అనట్లేదు. కానీ, ఇలా చేయడం వల్ల నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు, తల్లిపాల అవసరం ఉన్న ఇతర పిల్లలకు అవి దొరకక ఇబ్బందులు ఎదురవ్వొచ్చు” అని డాక్టర్ మేఘన్ ఆజాద్ అన్నారు.

శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎలా ఉపయోగపడతాయనే అంశంపై మేఘన్ పరిశోధన చేస్తున్నారు.

తల్లిపాలు ఎక్కువగా ఉంటే వాటిని లాభాల కోసం విక్రయించకుండా, అవసరాల్లో ఉన్న పిల్లలకు అందించాలని డాక్టర్ లార్స్ అభిప్రాయపడ్డారు.

”చాలా బలహీనంగా ఉన్న పిల్లలకు సరిపడా తల్లిపాలు అందుబాటులో లేవు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో వచ్చే చాలా రకాల రోగాలను నయం చేసే శక్తి తల్లిపాలకు ఉంటుంది. ఇవి ప్రాణాలను కాపాడగలవు” అని లార్స్ తెలిపారు.

కష్టాల్లో ఉన్న తల్లులు డబ్బు కోసం ఆన్‌లైన్‌లో బాడీబిల్డర్లకు పాలను విక్రయిస్తే, రాబోయే కాలంలో అందరూ ఇదే ధోరణిని అనుకరిస్తారని అప్పుడు తల్లిపాల కొరత మరింత ఏర్పడుతుందని ఆజాద్ అన్నారు.

ఇలా చేస్తున్నందుకు తానేమీ ఇబ్బంది పడట్లేదని జేమీసన్ అన్నారు.

”నేను పిల్లలను ఆకలిలోకి నెడుతున్నానని ఆరోపిస్తుంటారు. నేనేమీ ఆసుపత్రుల బయట నిలబడి తల్లుల నుంచి పాలను తీసుకోవట్లేదు. తమకు అదనంగా పాలు ఉత్పత్తి అవుతున్నాయంటూ పాలను అమ్మడానికి 100 మంది మహిళల నన్ను సంప్రదించారు” అని ఆయన చెప్పారు.

బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్య ప్రయోజనాలు

మనుషుల పాలపై పెద్దగా పరిశోధనలు జరుగలేదు.

”చాలా కాలంగా పరిశోధనల కోసం నిధులు కేటాయించేవారు తల్లిపాలను పెద్దగా పట్టించుకోలేదు. దాన్నొక మహిళల అంశంగా చూశారు. వాటికి ప్రాధాన్యం లేదని అనుకున్నారు. ఇది పితృస్వామ్య దృక్పథం” అని ఆజాద్ అన్నారు.

అయితే, ఈ దృక్పథం మారుతోంది.

అడల్ట్స్, తల్లిపాలు తాగడం వల్ల కలిగే ప్రమాదాల గురించే కాకుండా, అవి పెద్దలకు అందించే కొన్ని ప్రయోజనాల గురించి కూడా చర్చ జరుగుతోంది.

పెద్దవారిలో కనిపించే ఆర్థరైటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి వ్యాధులకు వీటివల్ల కలిగే ప్రయోజనాల గురించి అధ్యయనం చేస్తున్నారు.

తల్లిపాలలో ఉండే ప్రీబయాటిక్ ఫైబర్లు అయిన హ్యుమన్ మిల్స్ అలిగోశాకరైడ్స్ (హెచ్‌ఎంఓ) వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆజాద్ ఆసక్తి కనబరిచారు.

ఈ ఫైబర్లను పెద్దవారు జీర్ణించుకోలేరు. కానీ, శిశువుల్లో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి.

బ్రెస్ట్ మిల్క్

ఫొటో సోర్స్, Getty Images

”ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ హెచ్‌ఎంఓలు ప్రయోజనం కలిగిస్తాయా లేదా అని పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. మైక్రోబయోమ్ అనేది ఆరోగ్యానికి చాలా రకాలుగా ముఖ్యమైనది. గట్ మైక్రోబయోమ్‌ను అభివృద్ధి చేసే కొత్త మార్గాలను అన్వేషిస్తే చాలా రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ దిశలో తల్లిపాలలోని హెచ్‌ఎంఓలు ఆశావహంగా కనిపిస్తున్నాయి” అని ఆజాద్ వివరించారు.

ఒక ఎలుకపై చేసిన ప్రయోగంలో గుండెపోటు, స్ట్రోక్‌లకు కారణమయ్యే ఆర్టిలరీ బ్లాకేజ్ (అథెరోస్కెరోసిస్) అభివృద్ధిని ఒక హెచ్‌ఎమ్ఓ తగ్గించినట్లుగా డాక్టర్ లార్స్ గుర్తించారు. 2021లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది.

”కృత్తిమ సమ్మేళనాలతో తయారయ్యే అనేక ఫార్మాస్యూటికల్ ఔషధాలతో పోలిస్తే, మానవ పాల సమ్మేళనాలు చాలా ప్రత్యేకమైనవి, సురక్షితమైనవి, ప్రభావవంతమైనవి. మానవుల కోసం మానవుల్లో అభివృద్ధి చెందిన ఏకైక అంశం ఇదే” అని లార్స్ చెప్పారు.

కానీ, దీనికి సంబంధించిన క్లినికల్ డేటా తగినంతగా అందుబాటులో లేదు.

ఇప్పుడు జరుగుతున్న క్లినికల్ అధ్యయనాలు ఒకవేళ విజయవంతమైతే గుండెపోటు, స్ట్రోక్స్ వంటివాటిని అరికట్టడంలో ఈ సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఏటా లక్షల మంది గుండెజబ్బులు, స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారు.

”గుండెపోటు, స్ట్రోక్ మరణాలను తగ్గిస్తే అది ఎంతపెద్ద అభివృద్ధి అవుతుందో ఊహించుకోండి” అని డాక్టర్ డార్స్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)