Home LATEST NEWS telugu తాజా వార్తలు బ్రిటన్ నుంచి భారత్‌కు లక్షల కొద్దీ పాత టైర్లు ఎందుకు వస్తున్నాయి, వాటిని ఇక్కడేం చేస్తున్నారు?

బ్రిటన్ నుంచి భారత్‌కు లక్షల కొద్దీ పాత టైర్లు ఎందుకు వస్తున్నాయి, వాటిని ఇక్కడేం చేస్తున్నారు?

8
0

SOURCE :- BBC NEWS

టైర్లు, రీసైక్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

29 మార్చి 2025, 08:59 IST

ప్రతి ఏడాది కొన్ని లక్షల పాత టైర్లు రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారతదేశానికి చేరుకుంటున్నాయి. వాటిని ఫర్నేస్‌లలో కాల్చేస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పర్యావరణానికి నష్టం కలుగుతుంది. ఈ విషయాలు ‘బీబీసీ ఫైల్ ఆన్ 4 ఇన్వెస్టిగేట్స్‌’ విచారణలో బయటపడ్డాయి.

బ్రిటన్‌ నుంచి వచ్చే పాత టైర్లలో ఎక్కువ భాగం ఇండియన్ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని, పరిశ్రమలో దీని గురించి తెలియనివారు ఎవరూ లేరని బ్రిటన్‌లోని అతిపెద్ద టైర్ రీసైక్లింగ్ ప్లాంట్ ‘రబ్బర్ వరల్డ్’ యజమాని ఎలియట్ మాసన్ బీబీసీతో అన్నారు.

బ్రిటన్‌ ఇలా పాత టైర్లను ఎగుమతి చేస్తూ నియమాలను ఉల్లఘింస్తూ వస్తోందని టైర్ రికవరీ అసోసియేషన్ (టీఆర్ఏ)తో సహా పరిశ్రమలోని చాలామంది ఆరోపిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

భారత్‌లోని గ్రామాల్లో పాత టైర్లను కాల్చే ప్లాంట్‌లు…

ఈ పాత టైర్లు భారత్‌లో చట్టబద్ధంగా నడుస్తున్న రీసైక్లింగ్ కేంద్రాలకు వెళుతున్నాయని అధికారిక పత్రాల్లో ఉంటుంది. కానీ ఈ టైర్లు పైరోలిసిస్ ప్లాంట్లకి చేరుతాయి.

అధికారిక పత్రాల్లో పేర్కొన్నట్టు వాస్తవానికి రీసైక్లింగ్ ప్లాంట్లల్లో పాత టైర్లను చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. వీటిని గుర్రపు రేసు ట్రాక్‌లలో, పిల్లల ప్లేగ్రౌండ్‌లలో ఉపయోగిస్తారు.

అయితే పైరోలిసిస్ ప్లాంట్‌లో ఇలా జరగదు. ఆక్సిజన్ లేని వాతావరణంలో, దాదాపు 500C ఉష్ణోగ్రత వద్ద టైర్లను కాల్చుతారు. దీని నుంచి ఉక్కు, కొద్ది మొత్తంలో నూనె, వివిధ పరిశ్రమలలో ఉపయోగించే కార్బన్ బ్లాక్‌ కూడా వస్తుంది.

ముంబైకి సమీపంలోని వాడా లో ఇటువంటి ఒక పారిశ్రమిక క్లస్టర్‌ను బీబీసీ బృందం సందర్శించింది. ఆ ప్రదేశాలలో క్షీణిస్తున్న వృక్షసంపద, మసి, కలుషితమైన జలాలు ఉన్నాయి. దగ్గు, కంటి సమస్యలతో బాధ పడుతున్నామని గ్రామస్థులు చాలాకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.

“ఈ కంపెనీలను మా గ్రామం నుంచి తరలించాలి. లేకపోతే మేం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేం.” అని వారు బీబీసీతో అన్నారు.

ఎలియట్ మాసన్, రబ్బర్ వరల్డ్

ఇలా భారతదేశంలో 2,000 వరకు పైరోలైసిస్ ప్లాంట్లు ఉన్నాయని పర్యావరణ ఉద్యమకారుడు ఒకరు బీబీసీతో అన్నారు. వీటిలో దాదాపు సగం ప్లాంట్లు లైసెన్స్ లేనివేనని ఆయన అన్నారు.

ఇదే వాడాలో ఈ ఏడాది జనవరిలో ఒక ప్లాంట్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు మరణించారు. ఆ ప్లాంట్ యూరోప్ దేశాల నుంచి వచ్చిన టైర్లను ప్రాసెస్ చేస్తోంది. పేలుడు జరిగిన ఈ ప్లాంట్‌ యజమానులను బీబీసీ సంప్రదించింది, కానీ వారు స్పందించలేదు.

పేలుడు తర్వాత, ఒక బహిరంగ సమావేశం జరిగింది. వాడా జిల్లాకు చెందిన ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఏడు పైరోలైసిస్ ప్లాంట్‌లను అధికారులు మూసివేశారు.

దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని బీబీసీ వివరణ కోరగా, ఇంకా స్పందన రాలేదు.

గ్రామాల్లో పని చేసే వారే కాదు, ప్లాంట్ కార్మికులు పైరోలైసిస్ ద్వారా ఉత్పత్తి అయ్యే కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండెజబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌ల బారిన పడే ప్రమాదం ఉందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు బీబీసీతో చెప్పారు.

పాత టైర్లను కాల్చే ప్లాంటు

భారత్ ఎలా చేరుతున్నాయి…?

లాభాపేక్షలేని జర్నలిజం గ్రూప్ సోర్స్ మెటీరియల్‌తో కలిసి, బ్రిటన్‌ నుంచి టైర్లు ఎలా భారతదేశం చేరుతున్నాయో పరిశీలించాం.

ఈ పరిశ్రమలో పని చేసే ఒక వ్యక్తి సహాయంతో భారతదేశానికి టైర్లు పంపే షిప్‌మెంట్‌లో ట్రాకర్ల పెట్టాం.

ఈ షిప్‌మెంట్‌ 8 వారాల ప్రయాణం తర్వాత భారత్‌కు చేరుకుంది. మరో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఓ చిన్న గ్రామం వద్ద ఆగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన మసి పేరుకు పోయి ఉంది. డ్రోన్ ఫుటేజ్ ప్రకారం వేల కొద్ది టైర్లను భారీ ఫర్నేసులలోకి పంపడానికి సిద్ధం చేసి ఉంచారు.

అదే కాంపౌండ్‌లో ఉన్న కంపెనీలలో ఒకదానిని సంప్రదించాం. కొన్ని దిగుమతి చేసుకున్న టైర్లను ప్రాసెస్ చేస్తున్నట్లు ఆ కంపెనీ ధ్రువీకరించింది. అయితే, ఇదంతా ప్రమాదకరమైన ప్రక్రియ కాదని, చట్టవిరుద్ధం కూడా కాదని వారు అన్నారు.

ప్రమాదం

టైర్లు కాల్చడం చట్టవిరుద్ధం…

బ్రిటన్‌లో డ్రైవర్లు తమ టైర్లను మార్చుకున్నప్పుడు, గ్యారేజీ వాళ్లు రీసైక్లింగ్‌ కోసం కొంత మొత్తాన్నివసూలు చేస్తారు. సాధారణంగా ప్రతి టైర్‌కు 300-600 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.

రబ్బర్ వరల్డ్ వంటి రీసైకిల్ ప్లాంట్‌లు ఈ ఫీజు తీసుకుని టైర్లు రీసైకిల్ అవుతాయని హామీ ఇస్తాయని ఎలియట్ మాసన్ చెప్పారు.

ఇలా బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం దాదాపు ఐదు కోట్ల వేస్ట్ టైర్లను (దాదాపు 7,00,000 టన్నులు) రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది.

బ్రిటన్‌లోని రీసైక్లింగ్ ప్లాంట్‌లు అక్కడే రీసైక్లింగ్ చేయొచ్చు, లేదా టైర్లను కంప్రెస్ చేసి (బేల్) బయటి దేశాలకు రీసైక్లింగ్‌కు పంపొచ్చు. అయితే అధికారిక గణాంకాల ప్రకారం వీటిలో సగం రీసైక్లింగ్ కోసం భారతదేశానికి చేరుకుంటాయి. కానీ టీఆర్ఏ ప్రకారం వీటిలో 70 శాతం పైరోలైసిస్‌ ప్లాంట్‌లకి పంపిస్తారు.

“అనేక బ్రిటన్ రీసైక్లింగ్ వ్యాపారాలు టైర్లను బేల్ చేసి భారతదేశానికి పంపుతాయి. ఎందుకంటే ఇది లాభదాయకం. టైర్లను ముక్కలు చేయడానికి కావాలసిన యంత్రాలను కొనడం ఖర్చుతో కూడుకున్నది ” అని మాసన్ వివరించారు.

మాసన్ నడుపుతున్న రబ్బర్ వరల్డ్ వంటి పెద్ద వ్యాపారాలకు పర్యావరణ అనుమతులు, తనిఖీలు కఠినంగా ఉంటాయి. కానీ చిన్న ఆపరేటర్లు కొంత మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకుని, చట్టబద్ధంగా వ్యాపారం చేయవచ్చు.

దీనిని T8 మినహాయింపు అని పిలుస్తారు. ఈ మినహాయింపుతో వ్యాపారులు వారానికి 40 టన్నుల కార్ టైర్లను రీసైక్లింగ్ చేయడానికి అనుమతి ఉంటుంది.

కానీ చాలామంది వ్యాపారులు పరిమితి కంటే ఎక్కువ టైర్లను ఎగుమతి చేశారని మాసన్ బీబీసీతో చెప్పారు.

రీసైక్లింగ్ కోసం భారతదేశానికి బేల్డ్ టైర్లు పంపుతున్నాం అని సూచించే పత్రాలు ఉన్న డీలర్‌లలో ఒకరు… అవి పైరోలైసిస్ కోసం భారతదేశానికి వెళ్తున్నాయని తెలుసని అంగీకరించారు.

అయితే దిగుమతి చేసుకున్న టైర్లను పైరోలైసిస్ చేయడం చట్టవిరుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించింది.

“చాలా కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి… టైర్లు భారతదేశానికి వెళ్లాక ఏం జరుగుతుందో నేను నియంత్రించలేను” అని ఆయన అన్నారు.

పాత టైర్ల ఎగుమతిపై కఠినమైన నియంత్రణలు ఉన్నాయని, జరిమానాలు- జైలు శిక్ష ఉంటాయని బ్రిటన్ పర్యావరణం, ఆహారం గ్రామీణ వ్యవహారాల శాఖ (డెఫ్రా) బీబీసీకి తెలిపింది.

2021లో, ఆస్ట్రేలియా బేల్డ్ టైర్ల ఎగుమతులను నిషేధించింది. అక్కడి ఆడిటర్లు బేల్డ్ టైర్లు ఎక్కడికి చేరుకుంటున్నాయా అని తనిఖీ చేసిన తర్వాత… ఈ నిర్ణయం తీసుకుంది.

ఫైటింగ్ డర్టీ వ్యవస్థాపకురాలు జార్జియా ఎలియట్ స్మిత్ టైర్లను “ప్రమాదకర వ్యర్థాలు”గా గుర్తించాలని కోరుకుంటున్నారు.

పైరోలిసిస్ కోసం బ్రిటన్‌ నుండి భారతదేశానికి టైర్లను పంపడం “పెద్ద సమస్య” అని బ్రిటన్‌ ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలి అని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS