Home జాతీయ national telgu బీటీఎస్ మళ్లీ వస్తోంది.. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, 2 లక్షల 60 వేల మంది అభిమానుల...

బీటీఎస్ మళ్లీ వస్తోంది.. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, 2 లక్షల 60 వేల మంది అభిమానుల మధ్య షో

6
0

SOURCE :- BBC NEWS

బీటీఎస్ ఆర్మీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, యునా కు
    • హోదా, బీబీసీ కొరియన్
    • నుంచి, సోల్
  • 20 మార్చి 2026, 11:51 IST

  • చదివే సమయం: 7 నిమిషాలు

దక్షిణ కొరియా రాజధాని సోల్‌ ఈ ఏడాది అతిపెద్ద కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఇటీవలకాలంలో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన బీటీఎస్ బ్యాండ్ ఇక్కడ ప్రదర్శన ఇవ్వనుంది.

గ్వాంగ్వామున్ స్క్కేర్ వద్ద శనివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి 2 లక్షల 50 వేల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా.

2022 అక్టోబరు తర్వాత తొలిసారిగా ఆర్ఎమ్, జిన్, సుగా, జే-హోప్, జిమిన్, వి, జుంగ్ కుక్ కలిసి ఈ ప్రదర్శన ఇవ్వనున్నారు.

కానీ ప్రదర్శన జరగనున్న ప్రధాన ప్రాంగణంలోకి కేవలం 22 వేల మందికి మాత్రమే ఉచిత టిక్కెట్లు లభించాయి.

మిగతా ప్రేక్షకులు బయట ఏర్పాటు చేసిన భారీ తెరలపై కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.

రష్యా నుంచి గత ఏడాది చదువుకోవడానికి సోల్‌కు వచ్చిన అమీ ఆస్ట్రోవ్‌స్కాయా అలా షో చూడబోతున్నవారిలో ఒకరు.

“నేనిక్కడ ఉండటానికి కారణం బీటీఎస్. వారి వల్లే కొరియా చరిత్ర, సంస్కృతి, ఆహారం, క్రీడలు, భాష తెలుసుకోవడం ప్రారంభించాను” అని ఆమె చెప్పారు.

ఒక గంటపాటు సాగే ఈ ప్రదర్శన 14వ శతాబ్దానికి చెందిన రాయల్ ప్యాలస్ ప్రవేశ ద్వారం నేపథ్యంగా ఉండనుంది.

ఈ సందర్భంగా బీటీఎస్ తన కొత్త ఆల్బమ్ ‘ఆరిరాన్’లోని పాటలు ప్రదర్శించనుంది. ఈ ఆల్బమ్ శుక్రవారం మధ్యాహ్నం విడుదలవుతోంది.

ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నెట్‌ఫ్లిక్స్‌ ప్రత్యక్ష ప్రసారంలో చూడనున్నారు.

ఇందుకోసం నెట్‌ఫ్లిక్స్ బీటీఎస్‌తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పునరాగమనమే కాదు..

దక్షిణ కొరియాకు ఇది కేవలం ఒక కే-పాప్ బ్యాండ్ పునరాగమనమే కాదు. పాప్ సంగీతం, ఉత్సాహభరితమైన నృత్యాలతో ప్రపంచవ్యాప్తంగా కొరియా సాంస్కృతిక ప్రభావాన్ని విస్తరించిన శక్తి మళ్లీ రంగప్రవేశం చేయడం కూడా.

ప్రపంచంలోని పేరున్న పాప్ సంగీత బృందాల్లో ఒకటైన బీటీఎస్ తమ ఖ్యాతి పీక్‌కు చేరుకున్న సమయంలోనే ‘తప్పనిసరి మిలటరీ సర్వీస్’లో చేరాల్సి వచ్చింది.

2022లో జిన్‌తో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చివరిగా నిరుడు జూన్‌లో సుగా తన సర్వీస్ పూర్తి చేయడంతో, బృందం మొత్తం మళ్లీ కలిసే మార్గం ఏర్పడింది.

ఇప్పుడీ బృందం ప్రపంచ పర్యటనకు సిద్ధమవుతోంది.

సింగపూర్, టోక్యో నుంచి మ్యూనిక్, లాస్ ఏంజెలస్ వరకు 30కి పైగా నగరాల్లో జరిగే 82 కార్యక్రమాల వీరి ప్రపంచ పర్యటన వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

బీటీఎస్ పునరాగమనం చేస్తున్న కే-పాప్ రంగం మరింత విస్తరించి, పోటీ ఎక్కువైన రంగంగా మారింది.

“వాళ్లు ఎప్పుడూ నా అంచనాలను మించిపోతారు. ఒత్తిడి ఉండొచ్చు, కానీ వారు తమ ఉత్తమ ప్రదర్శన ఇస్తారని నమ్ముతున్నా” అని రెండుపదుల వయస్సులోఉన్న విద్యార్థిని పార్క్ జూయంగ్ అన్నారు. ఆమె చాలా కాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు.

బీటీఎస్ బృందంపై ఉన్న ఇష్టంతో రష్యా నుంచి సోల్‌కు వచ్చిన  అమీ ఆస్ట్రోవ్‌స్కాయా

ఫొటో సోర్స్, BBC/Jungmin Choi

ఇప్పటికే చేరిన ‘ఆర్మీ’

బీటీఎస్ అభిమానులు తమను తాము “ఆర్మీ” అని పిలుచుకుంటారు. వీరుఇప్పటికే గ్వాంగ్వామూన్ స్క్వేర్ వద్దకు చేరడం మొదలైంది.

జర్మనీకి చెందిన 58 ఏళ్ల ఆర్కిటెక్ట్ మార్గరిటా పెరెజ్ శనివారం నాటి కార్యక్రమానికి టికెట్ పొందలేకపోయారు. అయినా షో జరిగే ప్రదేశానికి సమీపంలోనే ఉండటానికి ఆమె ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

ఈ భారీ కార్యక్రమం కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ముఖ్య ప్రదేశాలను లైట్లతో అలంకరిస్తున్నారు.

బీటీఎస్‌కు ప్రతీకగా భావించే పర్పుల్ కలర్‌తో కొన్ని ప్రాంతాలను అలంకరించారు.

జన సమూహాన్ని నియంత్రించడానికి స్వాత్ బృందాలు సహా సుమారు 7వేల మంది పోలీసులను మోహరించారు.

డ్రోన్‌లను అడ్డుకునే సాంకేతిక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

రాజధాని నడిబొడ్డు ప్రాంతం బీటీఎస్ కోసం భారీ ఓపెన్ ఎయిర్ స్టేడియంలా మారుతోంది.

దీంతో అనేక భవనాలలోకి ప్రవేశాన్ని పరిమితం చేశారు.

సమీపంలోని మూడు మెట్రో స్టేషన్లు కూడా మూసివేయనున్నారు.

కచేరీకి ముందు, తర్వాత కొన్ని గంటల పాటు ఈ ప్రాంగణంలోకి ప్రవేశాన్ని 31 చెక్ పాయింట్ల ద్వారా నియంత్రిస్తారు. అక్కడ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తారు.

దక్షిణ కొరియాలో తుపాకీ నియంత్రణ చట్టాలు కఠినంగా ఉండటంతో, వ్యక్తిగతంగా ఆయుధాలు కలిగి ఉండటం చాలా అరుదు.

సాధారణంగా ఆయుధాలు పోలీసు స్టేషన్లలోనే భద్రపరుస్తారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రజలు వాటిని తిరిగి తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిషేధించారు.

అయితే ఈ స్థాయి ఏర్పాట్లు కొంతమంది దక్షిణ కొరియా ప్రజల్లో సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

“పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించారు. ఇతర ప్రాంతాల్లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే స్పందించడానికి సిబ్బంది అందుబాటులో ఉండకపోవచ్చు. అలాగే నియంత్రణల వల్ల రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారవచ్చు” అని ఒక నెటిజన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

బీటీఎస్ కచేరీ జరిగే ప్రాంతం

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ మద్దతుపై విమర్శలేంటి?

ప్రేక్షకుల రద్దీని నియంత్రించడం, రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు వేదిక కల్పించడం లాంటి చర్యలు తీసుకున్నామే కానీ, ప్రత్యక్షంగా ఎటువంటి ఆర్థిక సాయం అందించలేదని సోల్ నగర అధికారి ఒకరు బీబీసికి తెలిపారు.

ప్రభుత్వ వనరులను ఇంతగా వినియోగిస్తున్న ఈ కార్యక్రమానికి నెట్‌ఫ్లిక్స్ మాత్రమే ఏకైక ప్రసార భాగస్వామిగా ఉండటంపై అధికార పార్టీ ఎమ్మెల్యే లిమ్ ఓ క్యోంగ్ ఈ నెల ప్రారంభంలో ఆందోళన వ్యక్తం చేశారు.

కొరియా వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్ భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో, ఈ ప్రదర్శనను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రత్యేక హక్కులతో పాటు, ఈ బ్యాండ్ మళ్లీ కలవడంపై బీటీఎస్‌తో ఓ డాక్యుమెంటరీని నిర్మించే ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌కు దక్కిన ఓ పెద్ద మార్కెటింగ్ విజయం.

ఉచిత టిక్కెట్లు ఇవ్వడం వల్ల నిజమైన బీటీఎస్ అభిమానులకు అవకాశం తగ్గుతుందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉచిత టిక్కెట్లు పొందినవారు వాటిని రీసేల్ చేయకూడదని, ఎలాగూ టిక్కెట్ ఫ్రీగా వచ్చింది కాబట్టి వెళితే వెళదాం లేదంటే లేదన్న ధోరణి తగదంటూ అభిమానులు ప్రచారం మొదలుపెట్టారు.

గత నెల రిజర్వేషన్లు ప్రారంభమైనప్పుడు 13వేల ఉచిత టిక్కెట్లు తక్షణమే బుక్ అయ్యాయి. అప్పుడు ఆన్‌లైన్ క్యూలో ఉన్న లక్ష మందితో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఆ తర్వాత విడుదల చేసిన మరో 7,000 టిక్కెట్లు కూడా నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి.

“నేను స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్ రెండింటిలోనూ ప్రయత్నించాను, కానీ ఏదీ పని చేయలేదు” అని రాచెల్ అనే యువతి చెప్పారు. ఆమె తనను తాను బీటీఎస్ అభిమానిగా చెప్పుకోనప్పటికీ “వారు చాలా టాలెంటెడ్.. వరల్డ్ ఫేమస్ కాబట్టి, వారి ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వదులుకోకూడదని అనుకున్నా” అని తెలిపారు.

అమీ ఆస్ట్రోవ్‌స్కాయా అనే 23 ఏళ్ల యువతి టిక్కెట్ దొరకకపోవడంతో రాత్రంతా ఏడ్చాను, కానీ ఒక స్నేహితురాలి సాయంతో టిక్కెట్ లభించిందని చెప్పారు. “నేను చాలా సంతోషంగా ఉన్నా, నా సమస్యలన్నీ మర్చిపోయా. చాలా ఏళ్ల తర్వాత వారు గ్రూప్‌గా ఇచ్చే ప్రదర్శనకు వెళ్తుండడం నాకు చాలా గొప్ప విషయం” అని ఆమె సుగా, జంగ్‌కుక్ ఫోటోలను పట్టుకుని సంతోషం వ్యక్తం చేశారు.

“ఇక్కడ బీటీఎస్ కచేరీ నిర్వహించడం వల్ల కె-పాప్ సహా కొరియన్ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా మరింతగా ప్రచారమవుతుందని భావిస్తున్నా”అని 50 ఏళ్ల కిమ్ యంగ్-రాన్ అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గ్వాంగ్వామున్‌‌కు వెళ్తున్న సందర్భంగా చెప్పారు.

బీటీఎస్

ఫొటో సోర్స్, BBC/Suhnwook Lee

స్థానికులకు ఇబ్బంది

కచేరీ సమయం దగ్గర పడుతున్నకొద్దీ భద్రత కట్టుదిట్టమైంది. అనేక చౌరస్తాలు మూసివేశారు. కాలినడకన వెళ్లేవారు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. కచేరీ జరిగే ప్రాంతంలో ఇతర కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నవారు ఏం జరుగుతుందో తెలియక అనిశ్చితిలో పడ్డారు.

కచేరీ జరిగే కొద్దిగంటల ముందే గ్వాంగ్వామున్ చౌరస్తా సమీపంలోనే తన వివాహం జరగనుండటంతో 30 ఏళ్ల న్యాయవాది సోన్ యెన్ జు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఆ ప్రాంతంలో ప్రవేశ పరిమితులు ఉండటంతో తను, తన కుటుంబం, వందలాదిమంది అతిథులు వివాహ వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో ఆమెకు తెలియడం లేదు.

”బీటీఎస్‌పై నాకు ఎటువంటి ప్రత్యేక అభిప్రాయాలు లేవు. కానీ ప్రస్తుత పరిస్థితి చిరాకు పుట్టిస్తోంది” అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమం వల్ల స్థానిక వ్యాపారులు లాభపడతారు. చుట్టుపక్కల హోటళ్లన్నీ బుక్ అయిపోయాయి. ఓ నెల ముందు నుంచే ధరలు కూడా పెరిగిపోయాయి. ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, భవంతుల పైకప్పులపై చోటు కోసం హడావుడిగా ఉన్నారు.

తమ అమ్మకాలు క్రిస్మస్‌ రోజులను దాటిపోతాయని పరిసరాల్లోని సీఫుడ్ రెస్టారెంట్ యజమాని కిమ్ సంగ్ డే చెప్పారు. మా మెనూను ఇంగ్లిష్, చైనా, జపాన్ భాషలలో అందుబాటులో ఉంచుతున్నాం.

రెస్టారెంట్‌ను బీటీఎస్ సిగ్నేచర్ కలర్ అయిన పర్పుల్‌తో అలంకరిస్తున్నాం” అని చెప్పారు.

ఈ కార్యక్రమం కోసం వినియోగిస్తున్న వనరులకు ఈ ఆదాయం, పర్యటకం న్యాయం చేస్తాయని ప్రభుత్వం అంటోంది.

బీటీఎస్ 2022లో విరామం ప్రకటించడానికి కొద్ది కాలం ముందు కొరియా సాంస్కృతిక, పర్యటక సంస్థ ఒక అంచనా వేసింది. బీటీఎస్ ఒక్క ప్రదర్శన ద్వారా టిక్కెట్లు, వ్యాపార విక్రయాలు, వసతి, పర్యాటక ఇతర ఖర్చుల రూపంలో 84.2 కోట్ల డాలర్ల(సుమారు 7,000 కోట్ల రూపాయలు ) వరకు ఆదాయం లభిస్తుందని పేర్కొంది.

కొందరు స్థానిక కొరియన్లు దీనిని సమర్థిస్తున్నారు. ”ఇందులో సమస్య ఏముందో నాకు అర్థం కావడం లేదు. బీటీఎస్ కొరియా కోసం ఎంతో చేసింది, ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా విదేశాల్లో మన దేశ ప్రతిష్ఠను పెంచారు. అలాంటి వారి ప్రదర్శన కోసం కేవలం ఒక్క శనివారం గ్వాంగ్వామున్ బహిరంగ ప్రదేశాన్ని మనం ఎందుకు కేటాయించలేం?” అని వేదికకు సమీపంలో నివసించే ఒక స్థానికుడు రాశారు.

అయితే మరికొందరు ఇది సరైన పద్ధతి కాదని వాదిస్తున్నారు. “పర్యటక ఆదాయం, ఆర్థిక ప్రభావం లేదా కె-పాప్ ప్రచారంతో దేశ గౌరవాన్ని పెంచడం వంటి కారణాల కోసం పౌరులు త్యాగాలు చేయాలని ఆశించడం పాతకాలపు ఆలోచనలా అనిపిస్తోంది” అని కాలమిస్ట్ చోయ్ మూన్-సన్ రాశారు.

పాప్ సంగీత విమర్శకుడు జంగ్ మిన్-జే ‘ఎక్స్‌’లో స్పందిస్తూ “నగర నడిబొడ్డును స్తంభింపజేసేంత స్థాయిలో జరిగే ఇటువంటి భారీ పునరాగమన కచేరీకి అనుమతి ఇస్తే, భవిష్యత్తులో ఇతర కళాకారులు లేదా సంస్థలు కూడా ఇదే స్థలాన్ని వాడుకుంటామని అడగవచ్చు. అప్పుడు ఏ ప్రాతిపదికన సోల్ ప్రభుత్వం ఆ అభ్యర్థనలను ఆమోదిస్తుంది లేదా తిరస్కరిస్తుంది?” అని ప్రశ్నించారు.

అయితే.. ‘కింగ్ ఆఫ్ పాప్స్‌’ను మళ్లీ వేదికపై కలిసి చూడాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం గ్వాంగ్వామున్ స్క్వేర్ సరిగ్గా వారు కోరుకున్న వేదిక.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)