Home జాతీయ national telgu బీఎన్‌పీ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌తో సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోగలదా?

బీఎన్‌పీ నేతృత్వంలోని బంగ్లాదేశ్‌తో సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోగలదా?

2
0

SOURCE :- BBC NEWS

బీఎన్‌పీ నేత తారిక్ రెహమాన్‌

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారీ విజయం సాధించినప్పుడు, భారత ప్రభుత్వం ఆచితూచి గౌరవప్రదంగా స్పందించింది.

బెంగాలీలో పోస్టు చేసిన మెసేజ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీఎన్‌పీ నేత తారిక్ రెహమాన్‌ను అభినందించారు.

‘‘మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకున్న నమ్మకానికి ఈ విజయం నిదర్శనం.. ప్రజాస్వామ్య, ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు భారత్ మద్దతుగా ఉంటుంది. రెండు దేశాల ఉమ్మడి లక్ష్యాలు, సంబంధాల విషయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

మోదీ స్పందించిన తీరు చాలా ముందు చూపుతో, అత్యంత జాగ్రత్తతో ఉంది.

2024 జులైలో నెలకొన్న నిరసనల తర్వాత దేశం విడిచి పారిపోయిన వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

అప్పటి నుంచి రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.

షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చినందుకు భారత్‌ను చాలామంది బంగ్లాదేశీయులు తప్పుపట్టారు. ఈ అసంతృప్తికి సరిహద్దు హత్యలు, జల వివాదాలు, వాణిజ్య ఆంక్షలు, రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి పాత ఫిర్యాదులు కూడా తోడయ్యాయి.

రెండు దేశాల మధ్య వీసా సర్వీసులను పెద్ద ఎత్తున సస్పెండ్ చేశారు. సరిహద్దుల మీదుగా సాగే రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. దిల్లీ, ఢాకా మధ్య విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ సాధ్యమేనని నిపుణులు అంటున్నారు. కానీ, దీనికి సంయమనం, పరస్పర సహకారం కావాల్సి ఉందని పేర్కొంటున్నారు.

”పోటీలో ఉన్న అన్ని పార్టీల్ కెల్లా రాజకీయంగా అత్యంత అనుభవం ఉన్న, మితవాద ధోరణితో ఉండే బీఎన్‌పీతో సానుకూలంగా ఉండడం భారత్‌కు అత్యంత సురక్షితమైన ముందడుగు. కానీ, రెహమాన్ ఆ దేశాన్ని ఎలా పాలిస్తారు? అనేదే ఇక్కడ ప్రశ్న. భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను స్థిరపర్చాలని రెహమాన్ కోరుకుంటున్నారు. కానీ, ఇది చెప్పినంత తేలిక కాదు” అని లండన్‌కు చెందిన ఎస్ఓఏఎస్ యూనివర్సిటీలో పొలిటికల్, ఇంటర్నేషనల్ స్టడీస్‌ను బోధించే అవినాష్ పాలివాల్ చెప్పారు.

దిల్లీకి బీఎన్‌పీ అంత పరిచయం లేని పార్టీ కూడా కాదు.

మోదీ, హసీనా

ఫొటో సోర్స్, LightRocket via Getty Images

2001లో తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా నేతృత్వంలో బీఎన్‌పీ.. జమాత్ ఏ ఇస్లామీతో కలిసి బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేపట్టింది.

అప్పుడు, ఆ దేశంతో భారత సంబంధాలు చాలా వేగంగా క్షీణించాయి. బీఎన్‌పీ-జమాత్ పాలనా కాలమంతా రెండు దేశాల మధ్య సంబంధాలలో అస్థిరత, పరస్పర అపనమ్మకం కొనసాగింది.

ఖలీదా జియాను అభినందించిన తొలి విదేశీ ప్రముఖుడు భారత అప్పటి దేశ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రానే. అయితే, ప్రారంభంలో కాస్త మర్యాదపూర్వక సంబంధాలు కొనసాగినా.. ఆ తర్వాత నమ్మకం సన్నగిల్లింది.

వాషింగ్టన్, బీజింగ్, ఇస్లామాబాద్‌తో బీఎన్‌పీ కొనసాగించిన సంబంధాలను చూస్తుంటే.. ఢాకా వ్యూహాత్మకంగా తమకు దూరమవుతుందని దిల్లీ భావించింది.

ఈశాన్య భారతంలో తిరుగుబాటుదారులకు మద్దతును నిరోధించడం, బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలను కాపాడటం భారత్‌కు పరీక్షలు మారాయి.

బంగ్లాదేశ్‌లోని భోలా, జెస్సోరే వంటి జిల్లాల్లో ఎన్నికల తర్వాత హిందువులపై జరిగిన దాడులు దిల్లీని ఆందోళనకు గురి చేశాయి. అయితే, అంతకంటే మరింత ప్రమాదకరమైన విషయం చిట్టగ్యాంగ్‌లో 2004 ఏప్రిల్‌లో 10 ట్రక్కుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం.

బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆయుధ రవాణా. ఈ ఆయుధాలు భారత రెబల్ గ్రూప్‌లకు చెందినవిగా ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు టాటా గ్రూప్ ప్రతిపాదిత 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.27,168 కోట్లు ) ఇన్వెస్ట్‌మెంట్ గ్యాస్ ధరల విషయంలో నెలకొన్న విభేదాల కారణంగా నిలిచిపోయి, 2008లో పూర్తిగా ఆగిపోయింది.

రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే వచ్చాయి. 2014లో ప్రతిపక్షంలో ఉన్న ఖలీదా జియా అప్పటి భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీతో జరగాల్సిన మీటింగ్‌ను భద్రతా కారణాలను చూపుతూ రద్దు చేశారు. ఇది దిల్లీకి అవమానంగా చాలామంది చూశారు.

ఆనాటి అస్థిరమైన చరిత్రనే ఆ తర్వాత షేక్ హసీనా కాలంలో భారత బంగ్లాదేశ్‌పై ఎందుకు దృష్టి పెట్టిందో తెలుసుకునేందుకు సాయపడుతుంది.

షేక్ హసీనా తన పదవీ కాలంలో.. తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా భద్రత సహకారం కల్పించడం, అనుసంధాన్ని మెరుగుపర్చడం, చైనాతో కాకుండా భారత్‌తో విస్తృతంగా సంబంధాలు కొనసాగించడం చేశారు.

వ్యూహాత్మకంగా విలువైన భాగస్వామ్యాన్ని కల్పించారు.

భారత్, బంగ్లాదేశ్‌లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన వచ్చిన షేక్ హసీనా ప్రస్తుతం దిల్లీలో నివసిస్తున్నారు. 2024లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై తీవ్ర అణచివేతకు పాల్పడినట్లు తేల్చిన బంగ్లాదేశ్ స్పెషల్ ట్రైబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

ఆమె గైర్హాజరులోనే ఈ శిక్ష వేసింది. నిరసనల అణచివేసే క్రమంలో 1400 మంది మరణించారని, వారిలో చాలామంది భద్రతా బలగాల చేతిలోనే మరణించారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

అయితే, హసీనాను అప్పగించడానికి భారత్ నిరాకరించడం, ఢాకాతో సంబంధాల పునరుద్ధరణను మరింత క్లిష్టతరం చేసింది.

గత నెలలో ఖలీదాజియా అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఢాకా వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. తారిక్ రెహమాన్‌ను కలిశారు.

ఇటీవల తారిక్ రెహమాన్ తానునిర్వహించిన ర్యాలీలో.. ‘దిల్లీ కాదు, పిండి(పాకిస్తాన్ మిలటరీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండి) కాదు.. అన్నింటికంటే బంగ్లాదేశ్ ముఖ్యం’ అన్నారు.

హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత… ఇస్లామాబాద్‌తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఏమాత్రం సమయాన్ని వృథా చేయలేదు బంగ్లాదేశ్.

14 ఏళ్ల విరామం తర్వాత గత నెలలోనే ఢాకా-కరాచి మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించింది. 13 ఏళ్లల్లో తొలిసారి పాకిస్తాన్ విదేశీ మంత్రి బంగ్లాదేశ్‌లో పర్యటించారు.

సీనియర్ సైనిక అధికారులు పరస్పరం పర్యటనలు కొనసాగించారు. భద్రతా సహకారం మళ్లీ చర్చలోకి వచ్చింది. 2024-25లో వాణిజ్యం 27 శాతం పెరిగింది.

ఒకప్పుడు స్తంభించిపోయిన సంబంధాలు మళ్లీ గాడినపడ్డాయనే స్పష్టమైన సంకేతాలు ఈ పరిణామాలు అందించాయి.

”పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెట్టుకోవడం మనకు ఆందోళనకర అంశం కాదు. సార్వభౌమ దేశంగా ఆ దేశానికి ఆ హక్కు ఉంది” అని దిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌ స్మృతి పట్నాయక్ బీబీసీతో అన్నారు.

”అయితే, అసాధారణం ఏంటంటే.. హసీనా పదవీ కాలంలో ఈ రెండు దేశాల మధ్య అసలు సంబంధాలు లేకపోవడం. అప్పట్లో సంబంధాలు కేవలం ఒక్క వైపే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు అంతే వేగంగా మరోవైపుకు కదులుతుండటం ప్రమాదకరం” అని చెప్పారు.

హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మరింత ఇబ్బంది కలిగించే అంశంగా మారింది.

”హసీనాను భారత్ అప్పగించదన్న వాస్తవాన్ని బీఎన్‌పీ అంగీకరించాల్సి ఉంది. అదే సమయంలో ఢాకాలోని విపక్ష పార్టీలు ఆమెను తిరిగి దేశానికి తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రానున్నాయి. విదేశీ విధానంలో బీఎన్‌పీని సవాలు చేయడానికి వారి వద్దనున్న ఆయుధాల్లో ఇదొకటి” అని పట్నాయక్ వివరించారు.

ఇదంత తేలిక కాదని తెలిపారు.

2024 జులైలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తర్వాత అవామీ లీగ్‌కు చెందిన వేలాది మంది సభ్యులు భారత్‌లోకి వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి.

”ఒకవేళ దిల్లీ తన గడ్డపైనుంచే అవామీ లీగ్‌ పునరుద్ధరణకు ప్రయత్నిస్తే.. అది తీవ్ర చిక్కులతో కూడుకున్న అంశంగా మారుతుంది. ఎన్నికలకు ముందు హసీనా ప్రవాసంలో ఉంటూ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లు బంగ్లాదేశ్‌లో చర్చనీయమయ్యాయి. ఆమె తన చర్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోయినా లేదా నాయకత్వ మార్పుకు అనుమతి కల్పిస్తూ పక్కకు తప్పుకోకపోయినా.. భారత్‌లో ఆమె కొనసాగడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను క్లిష్టతరం చేసే ప్రమాదం ఉంది” అని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రొఫెసర్ శ్రీరాధ దత్తా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)