SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
అర్ధరాత్రి పన్నెండున్నర దాటింది. మీరింకా మేల్కొనే ఉన్నారు. అప్పుడే మీకు ఆకలి కూడా అయ్యింది.
ఆన్‌లైన్ యాప్ ద్వారా మీకు నచ్చిన రెస్టారెంట్ లేదా ఫుడ్ కౌంటర్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేశారు.
మరో అరగంటలో వేడి వేడి బిర్యానీ మీ చేతుల్లో ఉంది.
హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో రాత్రిపూట పని చేసేవారికి ఇలాంటివి చాలా చాలా కామన్.
అర్ధరాత్రి ఫుడ్ అవుట్‌లెట్లకు వెళ్లి వేడి వేడి బిర్యానీ తింటూ అది వీడియో తీసి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసేవాళ్లు చాలామందే కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అర్ధరాత్రి ఏదో ఒకటి తినాలనుకునే వాళ్లకు ఫుడ్ డెలివరీ యాప్‌లు బాగా పనికొస్తున్నాయి.
వీటివల్ల బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, ఇంకా అనేక ఆహార పదార్థాలు కోరుకున్న చోటుకు తేలిగ్గా వస్తున్నాయి.
అయితే మనం బిర్యానీలాంటి ఆహారం రాత్రిపూట ఆలస్యంగా తిన్నప్పుడు మన శరీరంలో ఏం జరుగుతుంది? అర్ధరాత్రి ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
ఫొటో సోర్స్, Getty Images
‘మన శరీరానికొక గడియారం ఉంది’
మనిషి శరీరం సర్కేడియన్ రిథమ్ అనే జీవ గడియారాన్ని అనుసరిస్తుందని వైద్య నిపుణులు చెబుతారు.
“ఇది 24 గంటలు మన శరీరంలో పని చేసే గడియారం. ఇది మన శరీరంలో మార్పులను బట్టి పని చేస్తుంది. నిద్రపోవడం, మేల్కోవడం, ఆకలి, చురుగ్గా ఉండటం, అలసిపోవడం లాంటి వాటిని ఈ గడియారం నిర్వహిస్తుంది” అని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ బసుమణి చెప్పారు.
మన మెదడు పగలు, రాత్రిని బట్టి ఈ గడియారాన్ని నియంత్రిస్తుందని ఆయన వివరించారు.
‘‘పగటిపూట ఉత్సాహంగా ఉంటాం. రాత్రిపూట గుండె, ఊపిరితిత్తుల లాంటి కొన్ని శరీరావయవాలు మినహా మిగతా భాగాలు విశ్రాంతిని కోరుకుంటాయి” అని బసుమణి అన్నారు
‘‘ఒక వ్యక్తి రాత్రి తిన్నాక, అది అరిగి బయటకు రావడానికి 3 గంటలు పడుతుంది. రాత్రి 7 గంటలకు తిని 10 గంటలకు నిద్రపోతే తర్వాతి 8 గంటలు పేగులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, తమను తాము శుభ్రపరుచుకుంటాయి” అని బసుమణి వివరించారు.
అయితే ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ అతని జీవ గడియారానికి అనుకూలంగా లేకపోతే, సమతుల్యత కోల్పోతుంది. ఇది శారీరక విధులను ప్రభావితం చేస్తుందని గ్యాస్ట్రోఎంటరాలజిస్టు అరుళ్ ప్రకాశ్ చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
అర్ధరాత్రి బిర్యానీ తింటే ఏమవుతుంది?
“అర్ధరాత్రి అధిక కేలరీల ఆహారం తింటే మన శారీరక వ్యవస్థ దాన్ని జీర్ణం చేసుకోలేదు” అని డాక్టర్ అరుళ్ ప్రకాశ్ చెప్పారు.
“బిర్యానీలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఉప్పు, నూనె ఎక్కువ. పొట్ట, పేగులు విశ్రాంతి తీసుకోవాల్సిన అర్ధరాత్రి, బిర్యానీ లాంటి ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం నెమ్మదిస్తుంది. జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తే ఆహారం పొట్టలో ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, పొట్టలో మంట, ఇతర సమస్యలు వస్తాయి” అని అరుళ్ ప్రకాశ్ వివరించారు.
ఒకరోజులో మనిషి తనకు అవసరమైనంత ఆహారం మాత్రమే తినడం ఉత్తమమని ఆయన సూచించారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లు తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగడం, ఒబేసిటీ ఇంకా అనేక శారీరక సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు.
“మనం పగటిపూట అనేక పనులు చేస్తాం. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రాత్రిపూట అలా ఉండదు” అని బసుమణి చెప్పారు.
“అర్ధరాత్రి 12 గంటలకు బిర్యానీ తింటే, అది జీర్ణం కావడానికి 3 లేదా 4 గంటలు పడుతుంది. అప్పటి వరకు కడుపుకు, పేగులకు విశ్రాంతి ఉండదు. దీంతో అది మరుసటి రోజు సరిగ్గా పని చేయలేదు. దీంతో బాడీ మెటబాలిజం దెబ్బ తింటుంది. ఇది మొత్తంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది” అని ఆయన వివరించారు.

‘రోజూ అర్ధరాత్రి తింటే అనారోగ్యమే’
రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తినడం వల్ల శరీరంలో ఎలాంటి సమస్యలు రావచ్చనే దాని గురించి 2024లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనం వివరించింది.
దీని కోసం పరిశోధన బృందం వివిధ రకాల వ్యక్తుల జీవితాలను సగటున 8.7 ఏళ్లపాటు అధ్యయనం చేసింది.
రాత్రి పదిగంటల లోపు భోజనం చేసినవాళ్లు, పది తర్వాత భోజనం చేసిన వారిని పరిశీలించినప్పుడు ఒక ముఖ్య విషయం గుర్తించారు.
రాత్రిపూట ఆహారం ఆలస్యంగా తినే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య తినే వారిలో చాలా ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది.
రాత్రి 11 గంటల తర్వాత ఆహారం తిన్న వారికి ఈ ప్రమాదం అంతతీవ్రంగా లేదని అధ్యయనం సూచించింది.
రాత్రి ఆలస్యంగా భోజనం చేసేవారికి మధుమేహంతో సహా వివిధ కారణాల వల్ల మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.
రాత్రిపూట తినే ఆహారంలో కేలరీలు అంటే నూనె, వేపుళ్లు, చక్కెర, కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువని అధ్యయనంలో వెల్లడైంది.
రాత్రిపూట తేలికైన, తక్కువ కేలరీల భోజనం తినడం వల్ల ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.
“తరచూ అర్ధరాత్రి తినడం వల్ల ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటీస్ వంటి సమస్యలకు దారి తీయవచ్చు. అసిడిటీ సమస్యలు, జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడవచ్చు” అని డాక్టర్ అరుళ్ ప్రకాశ్ చెప్పారు.
“మన శరీరం కొంత మొత్తంలో మాత్రమే కొవ్వును జీర్ణం చేసుకోగలదు. మిగిలినవన్నీ శరీరంలోనే ఉంటాయి. దీర్ఘకాలంలో ఇది గుండెపోటుకు దారి తీస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
ఫొటో సోర్స్, UGC
నైట్ షిఫ్టుల్లో ఉండేవాళ్లు ఏం చేయవచ్చు?
రాత్రిపూట లేటుగా ఆహారం తినడం వల్ల ఒక్కశాతం కూడా ప్రయోజనం ఉండదు.
వీలైనంత వరకు జీవ గడియారం ఆధారంగా ఆహారం తీసుకోవడాన్ని ప్లాన్ చేసుకోవాలని డాక్టర్ అరుళ్ ప్రకాశ్ చెప్పారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమంది నైట్‌షిఫ్టుల్లో పని చేయాల్సి వస్తోంది. డాక్టర్లు, నర్సులు, పోలీసు అధికారులు, ఫ్యాక్టరీ కార్మికులు, ఐటీ ఉద్యోగులు, మీడియా సంస్థల ఉద్యోగులు రాత్రంతా పని చేయక తప్పని పరిస్థితులున్నాయి.
ఏమీ తినకుండా రాత్రంతా పని చేస్తూ మేల్కొని ఉండటం చాలా కష్టమైన వ్యవహారం.
నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు దాదాపు పగలంతా నిద్రపోతారు. వీరి విషయంలో జీవ గడియారం భిన్నంగా పని చేస్తుందా, వాళ్లు అర్ధరాత్రి తినడం తప్పు కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది.
దీని గురించి బీబీసీ డాక్టర్ అరుళ్‌ను ప్రశ్నించింది.
“ఎవరైనా రాత్రంతా పని చేసి పగలు విశ్రాంతి తీసుకుంటే, వారి శరీరపు సర్కేడియన్ రిథమ్ దానికి తగినట్లు సర్దుబాటు చేసుకుంటుంది. అయితే ఆచరణలో అది అలా పని చేయదు. వారానికి ఐదు రోజులు రాత్రంతా పని చేసి, వారాంతంలో రెండు రోజులు రాత్రిపూట నిద్రపోవాల్సి రావచ్చు” అని ఆయన చెప్పారు.
“ప్రతీవారం నిద్రపోవడం, మేల్కొనే సమయాల్లో హెచ్చుతగ్గుల వల్ల జీవ గడియారం దెబ్బ తింటుంది. పడుకోవడం, పని చేయడం, తినే విషయంలో శరీరం గందరగోళంగా ఉంటే అది మొత్తం పని తీరును ప్రభావితం చేస్తుంది” అని డాక్టర్ అరుళ్ అన్నారు.
రాత్రంతా మేల్కొని ఉండేవారు రాత్రిపూట భోజనం చేయకుండా ఉండటం అసాధ్యమని డాక్టర్ బసుమణి చెప్పారు.
అర్ధరాత్రి తిన్నప్పటికీ బిర్యానీ, నూడుల్స్ లాంటి కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్‌కు బదులు పండ్లు, జ్యూసులు, కూరగాయల వంటి సాధారణ ఆహారం తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



