Home జాతీయ national telgu బావి నుంచి బంక్ వరకు పెట్రోల్ ప్రయాణం

బావి నుంచి బంక్ వరకు పెట్రోల్ ప్రయాణం

11
0

SOURCE :- BBC NEWS

oil barrels

ఫొటో సోర్స్, Getty Images

బైక్‌లో నింపే పెట్రోల్… ఇంట్లో వాడే వంటగ్యాస్… కారులో ఉండే డీజిల్…

ఇవి అన్నీ మన నిత్య జీవితంలో అసరమయ్యే ఇంధన వనరులు. ఇవి మనల్ని చేరే వరకు చేసే ప్రయాణం చాలా పెద్దది. భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ నుంచి మొదలై రిఫైనరీలు, పైప్‌లైన్లు, ట్యాంకర్లు దాటి చివరకు మన వాహనాలు, వంట గదులను చేరతాయి.

ఈ మొత్తం ప్రయాణం ఎలా జరుగుతుంది? క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడుతుంది? భూమిలో ఎక్కడ ఉందో ఎలా కనుగొంటారు?

రిఫైనరీల్లో అది పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌గా ఎలా మారుతుంది?

ఈ మొత్తం ప్రక్రియను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ఆర్కే ప్రసాద్ బీబీసీకి వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడింది?

క్రూడ్ ఆయిల్ నుంచే పెట్రోల్, డీజీల్, వంట గ్యాస్, సీఎన్జీ గ్యాస్ వంటి మనం నిత్యం వాడే వాటితో పాటు బెంజీన్, టోలిన్, స్టైరీన్ వంటి హైడ్రోకార్బన్లు కూడా వస్తాయి. అయితే ఇవన్ని ఒక్కరోజులో ఏర్పడిన పదార్థాలు కావు.

అలాగే క్రూడ్ ఆయిల్ కూడా ఒక రోజులో ఏర్పడిన పదార్థం కాదు. ఇది కోట్ల సంవత్సరాల పాటు జరిగిన సహజ ప్రక్రియ ఫలితం. కోట్ల సంవత్సరాల క్రితం సూక్ష్మ జీవులు, వృక్షాలు, మొక్కలు, సముద్ర జీవులు చనిపోయి భూమి, సముద్రం అడుగున మట్టిలో కూరుకుపోయాయి. కాలక్రమంలో వాటిపై మరిన్ని మట్టి, రాళ్ల పొరలు పేరుకుపోయాయి.

ఈ పొరల బరువుతో భారీ ఒత్తిడి, అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడాయి. ఈ పరిస్థితుల్లో ఆ జీవ పదార్థాలు నెమ్మదిగా రసాయన మార్పులకు గురై హైడ్రోకార్బన్‌లుగా మారాయి. లక్షల నుంచి కోట్ల సంవత్సరాల పాటు జరిగిన ఈ ప్రక్రియలో అవి చివరకు క్రూడ్ ఆయిల్ గా మారాయి. అందుకే క్రూడ్ ఆయిల్‌ను శిలాజ ఇంధనం (ఫాజిల్ ఫ్యూయల్) అని పిలుస్తారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

క్రూడ్ ఆయిల్ ని ఎలా గుర్తిస్తారు?

భూమిలో ఎక్కడ ఆయిల్ ఉందో ముందుగా తెలుసుకోవడం కూడా పెద్ద ప్రక్రియే.

సైస్మిక్ సర్వేలు, ఇతర శాస్త్రీయ పరీక్షలు కూడా చేసి చివరకు ఆ ప్రాంతంలో ఆయిల్ ఉందా లేదా నిర్ధరిస్తారు.

భూమి లోపల ఎక్కడ క్రూడ్ ఆయిల్ లేదా గ్యాస్ ఉండొచ్చో తెలుసుకోవడానికి చేసే శాస్త్రీయ పరీక్షలనే సైస్మిక్ సర్వేలు అంటారు. ఇందులో భూమి ఉపరితలంపై లేదా సముద్రంలో చిన్న శక్తివంతమైన కంపనలు సృష్టిస్తారు. ఆ కంపనాలు భూమి, సముద్రం లోపలికి వెళ్లి, రాళ్ల పొరలకు తగిలి తిరిగి పైకి వస్తాయి.

ఈ తిరిగి వచ్చిన తరంగాలను ప్రత్యేకమైన సెన్సర్లు రికార్డ్ చేస్తాయి. భూమిపై అయితే జియోఫోన్స్ (geophones), సముద్రంలో అయితే హైడ్రోఫోన్స్ (hydrophones) వాడతారు. ఈ డేటాను కంప్యూటర్లలో విశ్లేషించి, భూమి లోపల ఏ పొరలో ఏ రకమైన రాళ్లు ఉన్నాయో, ఎక్కడ ఖాళీ స్థలం ఉందో, ఎక్కడ హైడ్రోకార్బన్ నిల్వ ఉండే అవకాశం ఉందో అంచనా వేస్తారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఏ లోతులో ఏవి లభిస్తాయి?

భూమిలో క్రూడ్ ఆయిల్ ఒకే పొరలో ఉండదు. కోట్ల సంవత్సరాలుగా ఏర్పడిన పోరస్ రాళ్ల (స్పాంజ్‌లాంటి రంధ్రాలున్న) మధ్య చిన్న రంధ్రాల్లో చిక్కుకుని ఉంటుంది. పైభాగంలో గట్టి రాళ్ల పొర (cap rock) ఉండటం వల్ల అది బయటకు రాకుండా నిల్వగా ఉంటుంది.

లోతు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత, ఒత్తిడి మారుతాయి. అందుకే ఏ లోతులో ఏ పదార్థం ఎక్కువగా దొరుకుతుందో కూడా మారుతుంది.

2,000 నుంచి 4,000 మీటర్ల లోతులో…

ఈ లోతులో సాధారణంగా లైట్ క్రూడ్ ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో తేలికపాటి హైడ్రోకార్బన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రిఫైనరీలో పెట్రోల్, ఎల్పీజీ, నాఫ్తా వంటి ఉత్పత్తులు తయారవడానికి అనుకూలంగా ఉంటాయి.

4,000 నుంచి 8,000 మీటర్ల లోతులో…

ఇక్కడ హెవీ క్రూడ్ ఆయిల్ (బెల్లం పాకంలా మందంగా) లేదా కండెన్సేట్ (పెట్రోల్‌లా తేలికగా) దొరకొచ్చు. ఇవి భారమైన హైడ్రోకార్బన్లు కలిగినవి. డీజిల్, లూబ్రికేటింగ్ ఆయిల్స్, బిటుమెన్ (తారు) వంటి పదార్థాలకు ఇవి ఉపయోగపడతాయి.

8,000 మీటర్లు ఆపైన…

ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల సహజ వాయువు (నేచురల్ గ్యాస్) ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రధానంగా మీథేన్ ఉంటుంది. ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్ కూడా ఉంటాయి.

అంటే తక్కువ లోతులో అయిల్ ఎక్కువగా దొరికితే…దాని తర్వాత హెవీ ఆయిల్, చాలా లోతులో గ్యాస్ లభ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయిల్ కంపెనీలు ముందుగా సైస్మిక్ సర్వే చేసి, ఏ పొరలో ఏ పదార్థం ఉండే అవకాశం ఉందో అంచనా వేసి తర్వాత డ్రిల్లింగ్ చేస్తాయి.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

చమురు బావి నుంచి క్రూడ్ ఆయిల్ ఎలా తీస్తారు?

భూమిలో ఆయిల్ ఉందని నిర్ధరించిన తర్వాత డ్రిల్లింగ్ ప్రారంభమవుతుంది. ఇది కొంత వరకు బోర్ వెల్ తవ్వే విధానంలా ఉంటుంది. ప్రత్యేకమైన డ్రిల్లింగ్ రిగ్స్ ఉపయోగించి భూమిలో లోతుగా పైపులు పంపిస్తారు.

ఈ యంత్రంతో భూమిలో లోతుగా ఒక రంధ్రం తవ్వుతూ స్టీల్ పైపులు లోపలికి పంపిస్తారు. తవ్వే సమయంలో రాళ్లు, మట్టి బయటకు రావడానికి డ్రిల్లింగ్ మడ్ అనే ప్రత్యేక ద్రవాన్ని కూడా పంపిస్తారు. ఆ రంధ్రం ఆయిల్ ఉన్న రాళ్ల పొర (reservoir rock) వరకు చేరిన తర్వాత అక్కడ స్టీల్ కేసింగ్ పైపులు అమర్చి బావిని బలంగా కట్టుదిట్టం చేస్తారు. తరువాత ఆ రాళ్ల పొరలో ఉన్న చిన్న చిన్న రంధ్రాల్లో నిల్వగా ఉన్న క్రూడ్ ఆయిల్ ఒత్తిడి వల్ల పైకి రావడం ప్రారంభమవుతుంది. సహజ ఒత్తిడి సరిపోకపోతే ప్రత్యేక పంపులు లేదా గ్యాస్ ప్రెషర్ ఉపయోగించి ఆయిల్‌ను పైకి తీస్తారు. ఈ విధంగా భూమిలో వేల మీటర్ల లోతులో ఉన్న క్రూడ్ ఆయిల్‌ను బావి ద్వారా పైకి వెలికి తీస్తారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

బావి నుంచి రిఫైనరీకి ఎలా చేరుతుంది?

బావి నుంచి బయటకు వచ్చిన క్రూడ్ ఆయిల్ నేరుగా వినియోగానికి పనికిరాదు. మొదట దాన్ని స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడ క్రూడ్ ఆయిల్‌తో పాటు వచ్చిన నీరు, మట్టి, ఇసుక, గ్యాస్ వంటి మలినాలను వేరు చేసే ప్రాథమిక శుద్ధి ప్రక్రియ జరుగుతుంది.

దీనికి ప్రత్యేకమైన సెపరేటర్లు, ఫిల్ట్రేషన్ వ్యవస్థలు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ తర్వాత కొంతవరకు శుభ్రమైన క్రూడ్ ఆయిల్‌ను పెద్ద నిల్వ ట్యాంకుల్లో ఉంచుతారు. అక్కడి నుంచి రిఫైనరీ ఉన్న ప్రాంతాన్ని బట్టి దాన్ని పెద్ద పైప్‌లైన్ల ద్వారా, లేదా రైల్వే ట్యాంకర్లు, రోడ్ ట్యాంకర్ లారీల ద్వారా రవాణా చేస్తారు.

పైప్‌లైన్లు సాధారణంగా ఎక్కువ పరిమాణంలో క్రూడ్ ఆయిల్‌ను నిరంతరం పంపించడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా బావి నుంచి వెలికి తీసిన క్రూడ్ ఆయిల్ అనేక దశలు దాటి చివరకు రిఫైనరీలకు చేరుతుంది.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

రిఫైనరీలో ఏమవుతుంది?

రిఫైనరీ అనేది క్రూడ్ ఆయిల్‌ను ఉపయోగకరమైన ఇంధనాలుగా మార్చే భారీ పారిశ్రామిక వ్యవస్థ. రిఫైనరీకి వచ్చిన క్రూడ్ ఆయిల్‌ను ముందుగా శుభ్రపరుస్తారు. అందులో ఉండే నీరు, ఉప్పు, మట్టి వంటి మలినాలను తొలగించిన తర్వాత దాన్ని పెద్ద బట్టీల్లో సుమారు 350°C నుంచి 400°C వరకు వేడి చేస్తారు. తరువాత ఆ వేడైన క్రూడ్ ఆయిల్‌ను డిస్టిలేషన్ టవర్ అనే పొడవైన కాలమ్‌లోకి పంపిస్తారు.

ఈ టవర్‌లో ఉష్ణోగ్రత పైభాగానికి వెళ్లే కొద్ది తగ్గుతూ ఉంటుంది. అందువల్ల క్రూడ్ ఆయిల్‌లోని వేర్వేరు హైడ్రోకార్బన్ భాగాలు వాటి మరిగే ఉష్ణోగ్రతల (బాయిలింగ్ పాయింట్) ప్రకారం విడిపోతాయి. సాధారణంగా 30°C నుంచి 200°C మధ్య తేలికపాటి భాగాలుగా ఎల్‌పీజీ, పెట్రోల్ ఏర్పడతాయి. 150°C నుంచి 275°C మధ్య కిరోసిన్ వస్తుంది. 250°C నుంచి 350°C మధ్య డీజిల్ వేరు అవుతుంది. ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద భారమైన భాగాలు లూబ్రికేటింగ్ ఆయిల్, ఫ్యూయల్ ఆయిల్, బిటుమెన్ వంటి పదార్థాలుగా విడిపోతాయి.

ఈ విధంగా ఒకే క్రూడ్ ఆయిల్‌ను ఉష్ణోగ్రతల ఆధారంగా వేర్వేరు ఇంధనాలుగా విడగొట్టే ప్రక్రియనే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అని పిలుస్తారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఒకే క్రూడ్ ఆయిల్.. ఉత్పత్తులు అనేకం

రిఫైనరీలో ఒకే క్రూడ్ ఆయిల్ నుంచి అనేక రకాల ఉత్పత్తులు తయారవుతాయి. సాధారణంగా ఒక బ్యారెల్ (159 లీటర్లు) క్రూడ్ ఆయిల్ నుంచి 15 నుంచి 20 రకాల పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. రిఫైనరీలో జరిగే డిస్టిలేషన్, తదుపరి రసాయన ప్రక్రియల ద్వారా ఇవి వేర్వేరు ఉత్పత్తులుగా మారతాయి.

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (వంటగ్యాస్), కిరోసిన్, నాఫ్తా (పెట్రో కెమికల్ పరిశ్రమల్లో ముడి పదార్థం), జెట్ ప్యూయల్, బిటుమెన్ (తారు) వంటి ఉత్పత్తులతో పాటు ప్లాస్టిక్ తయారీకి అవసరమైన స్టైరీన్ వంటి పెట్రో కెమికల్స్ కూడా ఈ క్రూడ్ అయిల్ డిస్టిలేషన్ నుంచే వస్తాయి.

అంటే మన రోజువారీ జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులకు కూడా క్రూడ్ ఆయిల్ ఒక ముఖ్యమైన ముడి పదార్థంగా పనిచేస్తుంది.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

రిఫైనరీ నుంచి పెట్రోల్ బంకుకి…

రిఫైనరీలో తయారైన పెట్రోల్‌ను ముందుగా భారీ స్టోరేజ్ ట్యాంకుల్లో నిల్వ చేస్తారు. అక్కడ నాణ్యత పరీక్షలు చేసి, అవసరమైన ప్రమాణాలు ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. తరువాత దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఉపయోగిస్తారు.

రిఫైనరీల నుంచి పెట్రోల్‌ను ప్రధానంగా మూడు మార్గాల్లో పంపిస్తారు.

పెద్ద పైప్‌లైన్లు: వందల కిలోమీటర్ల దూరం వరకు నేరుగా పంపించే విధానం

రైల్వే ట్యాంకర్లు: ఎక్కువ పరిమాణంలో ఇంధనాన్ని ఒకేసారి తరలించడానికి

రోడ్ ట్యాంకర్ లారీలు: డిపోల నుంచి పెట్రోల్ బంక్‌లకు చేరవేయడానికి

ఈ విధంగా రిఫైనరీ నుంచి బయలుదేరిన పెట్రోల్ ముందుగా ఆయిల్ కంపెనీల డిపోలు లేదా టెర్మినల్స్‌కు చేరుతుంది. అక్కడి నుంచి ట్యాంకర్ లారీల ద్వారా సమీప ప్రాంతాల్లోని పెట్రోల్ బంక్‌లకు సరఫరా చేస్తారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

బంకులో పెట్రోల్, డీజీల్ ఎలా నిల్వ చేస్తారు?

పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్, డీజీల్ నేల కింద ఉన్న ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ ఉంచుతారు. ఈ ట్యాంకులను భద్రతా ప్రమాణాల ప్రకారం నిర్మిస్తారు.

పెట్రోల్, డీజీల్ చాలా త్వరగా ఆవిరయ్యే, అగ్ని ప్రమాదానికి గురయ్యే ఇంధనం కావడంతో భద్రతా కారణాల వల్ల ఈ ట్యాంకులను భూమి కింద ఏర్పాటు చేస్తారు. ఇలా ఉంచడం వల్ల సూర్యరశ్మి ప్రభావం తక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత మార్పులు తగ్గుతాయి, అలాగే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుంది.

ఈ ట్యాంకులు ప్రత్యేకమైన లోహంతో తయారుచేసి, లీకేజీ జరగకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలతో నిర్మిస్తారు. పెట్రోల్, డీజీల్ నిల్వ, సరఫరా వ్యవస్థలు అన్నీ పెట్రోలియం నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా నియమాల ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రమాణాలను పూర్తిగా పాటించిన తర్వాతే పెట్రోల్ బంక్‌లకు అనుమతులు ఇస్తారు.

పెట్రోల్ బంకుల్లో నిర్మించిన ఈ ట్యాంకుల నుంచి మెషిన్ల ద్వారా పంపులకి చేరి…ఆ పంపుల నుంచి మన వాహనాల ట్యాంకుల్లోకి పెట్రోల్, డీజీల్ చేరతాయి.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఏమిటి?

ఆయిల్ పరిశ్రమలో క్రూడ్ ఆయిల్‌ను సాధారణంగా బ్యారెల్స్‌లో కొలుస్తారు.

ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు.

ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నుండి వివిధ ఉత్పత్తులు తయారవుతాయి.

సగటున పెట్రోల్ 70 నుంచి 75 లీటర్లు (సుమారు 44-47%), డీజిల్ 40 నుంచి 45 లీటర్లు (25-28%), జెట్ ఫ్యూయల్ 15 నుంచి 20 లీటర్లు (9-12%), ఎల్పీజీ 5 నుంచి 10 లీటర్లు (3-6%), బిటుమెన్ 10 నుంచి 12 లీటర్లు (6-8%), ఇతర రసాయన పదార్థాలు (నాఫ్తా, కెమికల్స్, వాక్స్ మొదలైనవి) 10 నుంచి 15 లీటర్లు (6-10%) ఉండే అవకాశం ఉంటుంది.

సుమారు రెండు లీటర్ల క్రూడ్ ఆయిల్ నుంచి ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది. మిగతా భాగాలను డీజిల్, ఎల్పీజీ, జెట్ ఫ్యూయల్, బిటుమెన్, ఇతర రసాయనాలుగా మార్చవచ్చు. ఇది సగటు అంచనా మాత్రమే.

నిజమైన నిష్పత్తులు రిఫైనరీ డిజైన్, క్రూడ్ ఆయిల్ రకం (లైట్ లేదా హెవీ) మీద ఆధారపడి మారవచ్చు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్, డీజీల్ ఏ రంగులో ఉంటాయో తెలుసా…

ముందుగా పెట్రోల్ సంగతి చూద్దాం. పెట్రోల్ రంగులేని అంటే colourless లేదా చాలా స్వల్పంగా పసుపు రంగులో ఉండే పారదర్శక ద్రవం. అంటే బంక్‌లో మనం చూసేది ప్రత్యేకమైన రంగు. అది సహజంగా ఉండదు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌లో కలిసిపోయే oil-soluble dyesని చిన్న పరిమాణంలో కలుపుతాయి.

ఇవి ఇంధనంలో కరిగిపోతాయి కానీ ఇంజిన్‌పై ప్రభావం చూపవు. కానీ డై కలపడం వల్ల బంక్‌లో అది ప్రత్యేక రంగుతో కనిపిస్తుంది.

డీజిల్ విషయానికి వస్తే…. సాధారణంగా లేత పసుపు లేదా పల్చటి గోధుమ రంగులో ఉంటుంది. అది పూర్తిగా నీళ్లలా పారదర్శకంగా ఉండదు, కొద్దిగా పసుపు ఛాయ కనిపిస్తుంది.

డీజిల్‌లో భారీ హైడ్రోకార్బన్లు కారణంగా ఈ లేత రంగు కనిపిస్తుంది. ఇవి పెట్రోల్ కంటే భారంగా ఉండటంతో కొద్దిగా రంగు ఉంటుంది. అందుకే డీజిల్ చూసినప్పుడు పెట్రోల్ కంటే కొంచెం గాఢంగా కనిపిస్తుంది.

వేర్వేరు పెట్రోలియం ఉత్పత్తులను సులభంగా గుర్తించడానికి రంగులు వాడతారు.

ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ ఒకేలా కనిపిస్తే గందరగోళం అవుతుంది. అవి వేరే పనులకు వాడకుండా ఉండటానికి ప్రత్యేక రంగులు కలుపుతారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్‌కు ఎక్స్‌పైరీ తేదీ ఎందుకు ఉండదు?

ఫుడ్ ఐటమ్స్, మెడిసిన్స్ లా పెట్రోల్ కి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందా…

పెట్రోల్ అనేది ఆహారం లాంటి పదార్థం కాదు. పెట్రోల్ అనేది కార్బన్, హైడ్రోజన్ అణువులతో తయారైన స్థిరమైన రసాయనాల మిశ్రమం. అందుకే ఇది ఒక్కసారిగా పాడైపోదు.

ఆహారం అంటే సాధారణంగా ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నీరు వంటి పదార్థాల మిశ్రమం. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవులకు ఆహారంగా పని చేస్తాయి. అందుకే అన్నం, పాలు, కూరలు కొంతసేపటికి కుళ్లిపోతాయి

కానీ హైడ్రోకార్బన్లు మాత్రం ప్రధానంగా కార్బన్ (సి), హైడ్రోజన్ (హెచ్) మాత్రమే కలిగిన రసాయనాలు. వీటిలో నీరు ఉండదు, ప్రోటీన్లు ఉండవు, సూక్ష్మజీవులు సులభంగా ఉపయోగించుకునే నిర్మాణం ఉండదు. అందుకే బ్యాక్టీరియా వీటిపై త్వరగా పని చేయలేదు.

అయితే ఎక్కువ కాలం గాలి తగిలితే లేదా తెరిచి ఉంచితే అందులోని తేలికపాటి భాగాలు ఆవిరైపోవడం, గాలితో రసాయన మార్పులు జరగడం వల్ల నాణ్యత కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పెట్రోల్ బంక్‌లలో ఇలాంటి సమస్యలు సాధారణంగా ఉండవు.

ఎందుకంటే అక్కడ పెట్రోల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. రోజూ వాహనాలు వస్తూ ఉండటం వల్ల అది త్వరగా వినియోగంలోకి వెళ్లిపోతుంది. అందుకే పెట్రోల్ బంక్‌లలో దానికి ప్రత్యేకంగా ఎక్స్‌పైరీ తేదీ రాయాల్సిన అవసరం ఉండదు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోల్ వాసన ఇష్టంగా ఎందుకు అనిపిస్తుంది?

కొందరికి పెట్రోల్ ఘాటు వాసన ఇష్టం ఉంటుంది. పెట్రోల్‌కు ఘాటు వాసన రావడానికి కారణం అందులో ఉండే తేలికగా ఆవిరయ్యే హైడ్రోకార్బన్ రసాయనాలు. పెట్రోల్‌లో ముఖ్యంగా బెంజీన్, టోల్యూయిన్, జైలీన్ వంటి తేలికగా ఆవిరయ్యే పదార్థాలు ఉంటాయి. ఇవి గాలిలో వేగంగా కలసిపోయే గుణం ఉంటుంది. అందుకే పెట్రోల్ బంక్ దగ్గరకి వెళ్లగానే ఘాటు వాసన స్పష్టంగా తెలుస్తుంది.

చాలా మందికి పెట్రోల్ వాసన ఇష్టంగా ఉంటుంది కదా…దానికి కారణముంది.

పెట్రోల్ వాసనలో ఉన్న కొన్ని రసాయనాలు మన మెదడుపై తాత్కాలికంగా ప్రభావం చూపుతాయి. పెట్రోల్‌ బెంజీన్, టోల్యూయిన్ వంటి తేలికగా ఆవిరయ్యే పదార్థాలు ముక్కు ద్వారా లోపలికి వెళ్లినప్పుడు, అవి నాడీవ్యవస్థను స్వల్పంగా ఉత్తేజితం చేస్తాయి. అందువల్ల కొందరికి ఆ వాసన కొత్తగా, ప్రత్యేకంగా అనిపిస్తుందని న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ చెప్పారు.

ఇంకో కారణం జ్ఞాపకం.దీనినే మెమోరీ కనెక్షన్ అంటారు. చిన్నప్పుడు బైక్, కారు, ప్రయాణం, పెట్రోల్ బంక్‌లతో కలిసిన అనుభవాలు మెదడులో ఉంటాయి. తర్వాత అదే వాసన వస్తే మళ్లీ ఆ చిన్ననాటి మెమరీలు గుర్తుకువస్తాయి. దాంతో మనసుకు మళ్లీ ఒక పరిచయ భావన కలుగుతుంది.

అయితే ఆ వాసన నచ్చినా, ఎక్కువసేపు పీల్చడం మంచిది కాదు ఎందుకంటే అందులోని కొన్ని రసాయనాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించి…దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చనని న్యూరాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బీబీసీతో తెలిపారు.

పెట్రోల్, డీజిల్, ముడి చమురు, గ్యాస్, కిరోసిన్, తారు

డీజిల్‌లో ఉండే హైడ్రోకార్బన్లు పెట్రోల్ కంటే భారమైనవి. ఇవి త్వరగా ఆవిరి కావు, కానీ గాల్లోకి వచ్చినప్పుడు భారీ, మందమైన వాసన ఇస్తాయి.

పెట్రోల్‌లో ఉండే తేలికపాటి పదార్థాలు (బెంజీన్, టోల్యూయిన్) వాసన కొందరికి తక్షణంగా ప్రత్యేకంగా అనిపిస్తాయి. కానీ డీజిల్‌లో ఉన్న పెద్ద కార్బన్ గొలుసులు, సల్ఫర్ పదార్థాలు వాసన కొందరికి భరించలేనట్లుగా ఉంటుంది.

ఆ వాసన నచ్చినా, నచ్చకపోయినా ఎక్కువసేపు పీల్చడం మంచిది కాదని డాక్టర్ రాజేశ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)