SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
3 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
ఎన్నికల్లో భారీ విజయం సాధించిన అనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ).. భారత్ షేక్ హసీనాను అప్పగించాలన్న తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
2024 ఆగస్ట్ ఉద్యమం తర్వాత, పదవీచ్యుతురాలైన షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు.
వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, బీఎన్‌పీ సీనియర్ నాయకుడు సలావుద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ “ఆమెను అప్పగించే అంశం గురించి విదేశాంగ మంత్రి ఇప్పటికే ప్రస్తావించారు. మేం కూడా దానిని సమర్థిస్తున్నాం” అని అన్నారు.
“చట్ట ప్రకారం ఆమెను అప్పగించాలని మేం డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇది రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖల మధ్య విషయం. విచారణను ఎదుర్కోవడానికి వీలుగా ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పపగించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించాం.”

“భారత్‌తో సహా అన్ని దేశాలతోనూ మేం పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాం” అని అహ్మద్ తెలిపారు.
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్‌పీ భారీ విజయం సాధించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2024 ఆగస్ట్ విద్యార్థి ఉద్యమం తర్వాత జరిగిన మొదటి ఎన్నికలివి.
2024 విద్యార్థి ఉద్యమాన్ని హింసాత్మకంగా అణచివేశారన్న ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు.
హసీనా అమానవీయ నేరాలకు పాల్పడినట్లు ట్రిబ్యునల్ నిర్ధరించింది.
ట్రిబ్యునల్ నిర్ణయం చట్టవిరుద్ధమని, తమ వాదనలు వినకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని షేక్ హసీనా పేర్కొన్నారు.
షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఈ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు.
ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN/AFP via Getty Images
ఇవి ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు కావు : హసీనా
తాజా ఎన్నికలు ‘ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు కావు’ అని షేక్ హసీనా అభివర్ణించారు.
ఎన్నికలకు సంబంధించి వస్తున్న విమర్శలను సలావుద్దీన్ అహ్మద్ తిరస్కరించారు.
“ఈ ఎన్నికల్లో అందరూ పాల్గొన్నారు, ఆ విషయం దేశ ప్రజలకు తెలుసు. అవామీ లీగ్ బహిష్కరణ గురించి చెప్పాలంటే, 2024 ఆగస్ట్ నాటి తిరుగుబాటు ద్వారా ప్రజలు ఇప్పటికే వారిని తిరస్కరించారు” అని అహ్మద్ అన్నారు.
అవామీలీగ్ ఎన్నికల్లో పాల్గొనకుండా బహిష్కరించాలనే నిర్ణయాన్ని మొహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంది.
ఉద్యమ సమయంలో పార్టీ వ్యవహార శైలి గురించి దర్యాప్తు జరుగుతోంది. అందుకే గతేడాది ఆ పార్టీ కార్యకలాపాలపై నిషేధం విధించారు.
“ఆమె మీద కేసు నమోదైంది. ఆమె పార్టీ అవామీ లీగ్‌పైనా దర్యాప్తు జరుగుతోంది. ఇదంతా న్యాయ ప్రక్రియలో భాగం” అని అహ్మద్ అన్నారు.
ఫొటో సోర్స్, Narendra Modi/X
భారత్- అవామీ లీగ్ మధ్య సంబంధం
భారత్ – బంగ్లాదేశ్‌లోని అవామీ లీగ్ మధ్య సంబంధాలు చారిత్రాత్మకమైనదే కాదు, బలమైన విశ్వాసంపై కూడా ఆధారపడి ఉంది.
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఏర్పడిన ఈ సంబంధం 50 ఏళ్లకు పైగా కొనసాగింది.
ఏడాదిన్నర క్రితం అవామీ లీగ్ అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ఆ పార్టీ నాయకురాలు షేక్ హసీనాకు భారత ఆశ్రయమిచ్చింది.
భారత్‌లో ఆమె సురక్షితంగా ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె భారత అతిథిగా నివసిస్తున్నారు.
షేక్ హసీనాతో పాటు వేల మంది అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్టీ మద్దతుదారులు, రాజకీయ నాయకులు 2024 ఆగస్ట్ 5 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
బంగ్లాదేశ్‌లో సమ్మిళిత, భాగస్వామ్య ఎన్నికలను కోరుకుంటున్నట్లు భారత్ పదేపదే అధికారిక ప్రకటనలు చేసింది. దీనర్థం అవామీ లీగ్‌కు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని భారత్ కోరుకుంటున్నట్లు స్పష్టమైంది.
అయితే, ఎన్నికల్లో అలా జరగలేదు. అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం విధించిన తర్వాత ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బంగ్లాదేశ్ ఎన్నికల కమిషన్ నిరాకరించింది.
దీంతో ఫిబ్రవరి 12న అవామీ లీగ్ లేకుండానే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



