SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
అప్‌డేట్ అయ్యింది 5 గంటలు క్రితం
చదివే సమయం: 6 నిమిషాలు
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాల్గొననున్నారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) మీడియా విభాగం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
“ఢాకాలో, ఫిబ్రవరి 17న, బీఎన్‌పీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు” అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
“ఈ ముఖ్యమైన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ పాల్గొనడం భారత్ – బంగ్లాదేశ్ ప్రజల బలమైన, శాశ్వత స్నేహానికి నిదర్శనం. రెండు దేశాలు కట్టుబడి ఉన్న ప్రజాస్వామ్య విలువల పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.”
“చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే పొరుగువారిగా.. ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజల బలమైన మద్దతుతో, తారిక్ రెహమాన్ నేతృత్వంలో ముందుకు సాగనున్న బంగ్లాదేశ్‌ను భారత్ స్వాగతిస్తోంది” అని విదేశాంగ శాఖ పేర్కొంది.
బంగ్లాదేశ్‌లో కొలువుదీరనున్న కొత్త క్యాబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ 13 దేశాల అధినేతలను ఆహ్వానించారు.
ఈనెల 17న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.

ఇప్పటివరకు ఆహ్వానాలు పంపిన దేశాల్లో భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, మలేషియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ ఉన్నాయని ప్రస్తుతం ఢాకాలో ఉన్న బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ చెప్పారు.
బంగ్లాదేశ్ 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ దేశ తదుపరి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
శుక్రవారం (ఫిబ్రవరి 13) ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం, తారిక్ రెహమాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీకి బీఎన్‌పీ కృతజ్ఞతలు తెలిపింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలంటూ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్టు బీఎన్‌పీ చైర్‌పర్సన్ కార్యాలయం తెలియజేసిందని బీబీసీ బంగ్లా ప్రతినిధి శుభజ్యోతి ఘోష్ శనివారం (ఫిబ్రవరి 14) ధ్రువీకరించారు.
దీనికిముందు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు బీఎన్‌పీ అధ్యక్షుడి విదేశాంగ విధాన సలహాదారు హుమాయున్ కబీర్ కూడా చెప్పారు.
షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బీఎన్‌పీతో భారత్ మెరుగైన సంబంధాలే కొనసాగిస్తోంది. విజయం సాధించినందుకు బీఎన్‌పీని అభినందించిన మొదటి నాయకులలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.
భారత్‌తో సంబంధాల బలోపేతంపై తారిక్ రెహమాన్ కూడా సానుకూలంగా మాట్లాడుతున్నారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
‘అందరితో స్నేహం’
శనివారం ఢాకాలో, దక్షిణాసియా నాయకులను ఆహ్వానించడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బీఎన్‌పీ నాయకుడు ఏఎన్‌ఎం ఎహ్సానుల్ హక్ స్పందిస్తూ, “నాకు కచ్చితంగా తెలియదు, కానీ అందరినీ ఆహ్వానిస్తారని ఆశిస్తున్నా. ప్రధాని మోదీని కూడా తప్పనిసరిగా ఆహ్వానించాలి. అది కనీస మర్యాద. నిర్వాహకులు దానిని పాటిస్తారనే అనుకుంటున్నా” అని అన్నారు.
బీఎన్‌పీ తన ఎన్నికల ప్రచారంలో ‘అందరితో స్నేహం’ అనే హామీ ఇచ్చింది.
అంతకుముందు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం) దేశాల నాయకులకు ఆహ్వానాలు పంపుతామని, ఇందులో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ పేరు కూడా ఉంటుందని బీఎన్‌పీ సీనియర్ నాయకులు సంకేతాలిచ్చారు.
2014లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత, అదే తరహాలో సార్క్ దేశాల నాయకులు మళ్లీ కలుసుకోవడం ఢాకాలో జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధాని మోదీ అభినందన సందేశంపై బీఎన్‌పీ సంతోషం వ్యక్తం చేసింది.
“గౌరవనీయులైన నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. జాతీయ ఎన్నికల్లో బీఎన్‌పీ నిర్ణయాత్మక విజయం సాధించడంలో తారిక్ రెహమాన్ నాయకత్వ ప్రతిభను మీరు గుర్తించిన విధానానికి మేం చాలా కృతజ్ఞులం” అని ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటన
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సోమవారం (ఫిబ్రవరి 16) భారత్ పర్యటనకు వస్తున్నారు.
మేక్రాన్ పర్యటన పూర్తి షెడ్యూల్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 16న అర్థరాత్రి ఆయన దిల్లీ చేరుకుంటారు. ఫిబ్రవరి 17న ముంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబయిలో మేక్రాన్‌తో కలిసి పాల్గొంటారు. అక్కడ ఒప్పందంపై సంతకం చేస్తారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో పత్రికా ప్రకటన విడుదల చేస్తారు.
మేక్రాన్ పర్యటన ఫిబ్రవరి 19 వరకు కొనసాగనుంది. ఆ సాయంత్రం ఆయన పారిస్‌కు బయలుదేరుతారు.
అంతర్జాతీయ నేతల బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాని మోదీ తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చన్న ఊహాగానాలు ముందునుంచే వచ్చాయి.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
ఈసారి పాత సంప్రదాయాన్ని బద్దలుకొడుతూ బంగ్లాదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతుందని ప్రముఖ వార్తాపత్రిక ది డైలీ స్టార్ తెలిపింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం బంగభవన్ దర్బార్ హాల్‌లో జరగదు. బదులుగా బీఎన్‌పీ నేతృత్వంలోని ప్రభుత్వం మంగళవారం జాతీయ పార్లమెంట్ సౌత్ ప్లాజా నుంచి తన పాలనా వ్యవహారాలను ప్రారంభిస్తుందని తెలిపింది.
బీఎన్‌పీ ప్రాధాన్యాలకు అనుగుణంగా పార్లమెంట్ హౌస్‌లో వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రధాన సలహాదారు కార్యాలయం, క్యాబినెట్ విభాగంలోని అనేక వర్గాలను ఉటంకిస్తూ డైలీ స్టార్ తెలిపింది.
కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం ఉదయం 10 గంటలకు అక్కడే జరుగుతుందని, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది.
ఎన్నికల సంఘం కార్యదర్శి అక్తర్ అహ్మద్ శనివారం విలేఖరుల సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ధ్రువీకరించినట్టు ఢాకా ట్రిబ్యూన్ రాసింది.
ఫిబ్రవరి 12న జరిగిన జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 300 సీట్లలో 209 సీట్లు గెలుచుకోగా, ప్రధాన ప్రత్యర్థి జమాత్-ఎ-ఇస్లామీ 68 స్థానాల్లో విజయం సాధించింది.
ఫొటో సోర్స్, AFP via Getty Images
బీఎన్‌పీ విషయంలో మారుతున్న దిల్లీ సమీకరణాలు
బీబీసీ బంగ్లా ప్రతినిధి శుభజ్యోతి ఘోష్ ప్రకారం.. అవామీ లీగ్,షేక్ హసీనా ఇద్దరూ బంగ్లాదేశ్ రాజకీయాలకు దూరమైన తర్వాత బీఎన్‌పీతో సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి భారత్ ప్రయత్నిస్తోందని.. అయితే తారిక్ రెహమాన్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చాలా సమయం పట్టిందని నిపుణులు భావిస్తున్నారు.
ఆయన ప్రకారం, ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత విజయం సాధించిన పార్టీని అధికారికంగా అభినందించే మొదటి నాయకుడు భారత ప్రధాన మంత్రి కావడం సంప్రదాయంగా వస్తోంది.
శుక్రవారం ఉదయం తారిక్ రెహమాన్ విజయం స్పష్టంగా తెలియగానే, ప్రధాని మోదీ ఈ సంప్రదాయాన్ని పునరావృతం చేశారు. ఉదయం 9 గంటలకు ‘ఎక్స్’లో ముందుగా అభినందన సందేశాన్ని పోస్ట్ చేశారు. అరగంట తర్వాత బెంగాలీ సందేశాన్ని పోస్ట్ చేసి, ఆపై నేరుగా తారిక్ రెహమాన్‌కు ఫోన్ చేశారు.
ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే, దీనికి ముందు తారిక్ రెహమాన్‌పై భారత్ వైఖరి ఇలా లేదు.
బంగ్లాదేశ్ ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో భారత్‌కు బలమైన బీఎన్‌పీ ప్రభుత్వం మంచి ఎంపిక అని భారత్‌లోని పరిశీలకులు అంగీకరిస్తున్నారు.
గత బీఎన్‌పీ ప్రభుత్వాల సమయంలో దిల్లీతో సంబంధాలు ఎంత అస్థిరంగా ఉన్నా, ప్రస్తుతానికి ఆ పాత సమస్యలన్నింటినీ పక్కనపెట్టి ముందుకు సాగడానికి భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని మోదీ సందేశం ఇప్పుడు స్పష్టం చేస్తోంది.
2014లో తారిక్ రెహమాన్ బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్‌గా లండన్‌లో నివసిస్తున్నప్పుడు స్నేహ హస్తం చాచారు.
అవామీ లీగ్, కాంగ్రెస్ మధ్య చారిత్రక సంబంధాలున్నాయి. కాంగ్రెస్ పదేళ్ల పాలన (2004-14) తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు తారిక్ రెహమాన్ బీజేపీ ప్రభుత్వంతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రధాన మంత్రి మోదీకి ఒక బహుమతిని కూడా పంపారు. అయినప్పటికీ, భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
తారిక్ రెహమాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని భారత నిఘా సంస్థలు అప్పట్లో ప్రభుత్వానికి సూచించినట్లు దిల్లీలోని చాలా మంది పరిశీలకులు విశ్వసిస్తున్నారు.
ప్రధాని మోదీ ఇప్పుడు తారిక్ రెహమాన్‌కు అభినందన సందేశం పంపడం హసీనా ప్రభుత్వ పతనం తర్వాత భారత్ వైఖరిలో మార్పుకు సంకేతమని నిపుణులు అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



