SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, vishwaksens/insta
కామెడీ రాయడం కష్టం. తీసి మెప్పించడం మరీ కష్టం.
జాతిరత్నాలు సినిమాతో ఈ పని అవలీలగా సాధించాడు దర్శకుడు అనుదీప్. తర్వాత ప్రిన్స్‌తో ఫ్లాప్ ఇచ్చాడు.
కొంచెం గ్యాప్ తర్వాత విశ్వక్‌సేన్ హీరోగా ఫంకీ తీశాడు.
ట్రైలర్‌తో నవ్వించిన ఈ సినిమా, థియేటర్‌లోనూ అలాగే నవ్వించిందా?

ఫొటో సోర్స్, vishwaksens/insta
కథ ఏమంటే..
యువ దర్శకుడు కోమల్ (విశ్వక్‌సేన్) సుదర్శన్ (నరేష్) అనే నిర్మాతతో సినిమా స్టార్ట్ చేస్తాడు. నాలుగు కోట్ల బడ్జెట్ 40 కోట్లకు చేరుకుంటుంది. పూర్తి కావాలంటే ఇంకో నాలుగు కోట్లు కావాలని దర్శకుడి డిమాండ్.
ఈ టెన్షన్ తట్టుకోలేక సుదర్శన్ ఆస్పత్రిపాలవుతాడు. ఆ తర్వాత అతని కూతురు చిత్ర (కయాదు లోహర్) ఎంట్రీ.
మరి సినిమా పూర్తయిందా? డైరెక్టర్, నిర్మాత కూతురి మధ్య కెమిస్ట్రీ ఏంటి? ఇది మిగతా కథ.
ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
జాతిరత్నాలు మ్యాజిక్ రిపీట్ అయిందా?
ఒక రకంగా ఇది జాతిరత్నాలు 2 అని చెప్పొచ్చు. అందులో ముగ్గురు రత్నాలుంటారు. దీంట్లో ఒకే రత్నం. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కావడానికి అనేక కారణాలున్నాయి. కరోనా టైమ్‌లో జనం థియేటర్ వినోదానికి మొహంవాచి ఉన్నారు. సినిమా పగలబడి నవ్వించే సరికి జనం బ్రహ్మరథం పట్టారు.
జాతిరత్నాలు ఒక రకంగా సోషల్ సెటైర్. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైమింగ్‌తో వన్‌లైనర్లు పేలిపోయాయి. అన్నింటికీ మించి బలమైన కథ ఉంది. సంఘటనలు, సంఘర్షణ ఉన్నాయి. ఫంకీలో ఇవే లోపించాయి.
ఆగిపోయిన సినిమాని పూర్తి చేయడంలో ఏ మలుపులూ లేవు. క్యారెక్టరైజేషన్ అసలు లేదు. హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నా నటనకు అవకాశం తక్కువే.
మొదటి 15 నిమిషాలు వన్‌లైనర్లు నవ్విస్తాయి. తర్వాత అంతా రిపిటేషన్. 128 నిమిషాల నిడివిని కూడా భరించడం కష్టమైపోతే దీనికి పూర్తి బాధ్యత డైరెక్టర్ అనుదీప్‌దే.
ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
లాజిక్ అడగొద్దు ప్లీజ్..
సినిమాలో వచ్చే ప్రతిపాత్ర పిచ్చి జోకులేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే కాస్త చిరాకుగా అనిపిస్తే తప్పులేదు. నరేష్, సంపత్, ఈశ్వరీరావులు అద్భుతమైన నటులు. కానీ, వాళ్లు పూర్తిగా వృథా అయిపోయారు.
భారం మొత్తం విశ్వక్‌సేన్ భుజాల మీద పడింది. కామెడీ టైమింగ్ ఆయన జోనర్ కాకపోయినా నవ్వించడానికి ప్రయత్నించాడు.
సంపత్ క్యారెక్టర్, మధ్యలో వచ్చే ఎస్సై పాత్ర, హీరోయిన్ కాసేపు పాజిటివ్, కాసేపు నెగెటివ్.. అసలు అనుదీప్ స్క్రిప్ట్ వర్క్ ఏమైనా చేశాడా? లేదంటే లొకేషన్‌లో సీన్స్ రాసుకుని ఎలాగైతేనేం సినిమాని పూర్తయింది అనిపించాడా?
సీనియర్ నిర్మాత నాగవంశీ ఈ కథని ఎలా ఒప్పుకున్నాడనే అనుమానం వస్తే తప్పు కాదు.
ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
మ్యాజిక్ పదేపదే రిపీట్ కాదు. అయినా వన్‌లైనర్లనే నమ్ముకుని సినిమా తీయడం సాహసమే. లాజిక్ అడగొద్దని దర్శకుడు కోరాడు.
సినిమా పుట్టినప్పటి నుంచి లాజిక్ అనేది బ్రహ్మపదార్థమే. అయితే థియేటర్‌లో కూర్చోపెడితే చాలు, ప్రేక్షకుడు సంతృప్తి పడతాడు. ఇబ్బంది పెడితే ఫోన్ చూసుకుంటాడు.
కామెడీ అంటేనే అతిశయోక్తి. పాత్రలు విచిత్రంగా, విడ్డూరంగా ప్రవర్తిస్తేనే నవ్వు పుడుతుంది. అబ్సర్డ్‌ని ఎవరూ ప్రశ్నించరు. కానీ, సినిమా అంటే ఒక కథ చుట్టూ ఉన్న దృశ్యాల సమాహారం. సన్నివేశాల్ని విడదీసి చూడమంటే కుదరదు.
ఫొటో సోర్స్, Sithara Entertainments/YT
ప్లస్ పాయింట్స్:
- హీరోయిన్ స్క్రీన్ ప్రెజెన్స్
- అక్కడక్కడ నవ్వులు
మైనస్ పాయింట్స్:
- కథ
- పూర్ ఎడిటింగ్
సినిమాలో దిల్‌రాజు, నాగవంశీ , హరీష్ శంకర్ కామియోలుగా కనపడడం విశేషం. దర్శకుడు అనుదీప్ కూడా కనిపిస్తాడు. నవ్వించే ప్రయత్నం కూడా చేస్తాడు.. కానీ..!!
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



