SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎల్లెన్ సాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
-
14 మే 2025
తెలివైన వాళ్ళు కూడా మనుషులే, మానవాతీతంగా ఏమీ ఉండరు. వాళ్లు కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. చాలా సాధారణ విషయాలు కూడా వాళ్లకు తెలిసుండకపోవచ్చు.
మహామహా శాస్త్రవేత్తలు అనిపించుకున్న వారు కూడా ఎన్నో పొరపాట్లు, తప్పుడు అంచనాలు వేసి ఉంటారు.
ఉదాహరణకు ఐన్‌స్టీన్‌ను తీసుకుందాం. సాపేక్ష సిద్ధాంతానికి ఆయన పితామహుడు. గురుత్వాకర్షణను కనుగొని వివరించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త.
కానీ అంత గొప్ప ఐన్‌స్టీన్ కూడా కొన్నిసార్లు తన సిద్ధాంతాలను తానే నమ్మలేదు.
సెల్ఫ్ డౌట్ కారణంగా ఐన్‌స్టీన్ అనేకసార్లు తప్పుడు అంచనాలు వేశారు.
ఐన్‌స్టీన్ చేసిన పెద్ద బ్లండర్
ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీ ( సాపేక్ష సిద్ధాంతం) మీద పని చేస్తున్నప్పుడు, విశ్వం సంకోచించడానికి లేదా వ్యాకోచించడానికి గురుత్వాకర్షణ కారణమవుతుందని నమ్మారు.
అయితే దీనికి విరుద్ధంగా, విశ్వం స్థిరంగా ఉందని, మార్పులు చేర్పులు లేవన్నది అప్పటికే చాలామంది ఆమోదించిన సిద్ధాంతం ఒకటి ఉంది.
అదే ఐన్‌స్టీన్, జనరల్ రిలేటివిటీపై 1917లో రూపొందించిన రీసర్చ్ పేపర్‌లో ‘కాస్మొలాజికల్ కాన్‌స్టాంట్’ ను చేర్చారు. వాస్తవానికి ఇది ఐన్‌స్టీన్ తాను అప్పటి వరకు చెబుతూ వచ్చిన ‘గురుత్వాకర్షణ ప్రభావం’ సిద్ధాంతానికి విరుద్ధం.
ఈ పదాన్ని చేర్చడం ద్వారా విశ్వంలో మార్పు ఉండదని, అది స్థిరంగా ఉంటుందనే సంప్రదాయవాదానికి ఆయన మద్దతు తెలిపినట్లయింది.
అయితే, దాదాపు ఒక దశాబ్దం తర్వాత, శాస్త్రవేత్తలు విశ్వం స్థిరంగా లేదని, గతిశీలంగా ఉందని చూపించే కొత్త ఆధారాలను ప్రకటించడం ప్రారంభించారు.
‘‘మై వరల్డ్ లైన్: యాన్ ఇన్ఫార్మల్ ఆటోబయోగ్రఫీ’’ అనే పుస్తకంలో భౌతిక శాస్త్రవేత్త జార్జ్ గామో దీని గురించి ప్రస్తావించారు.
రీసర్చ్ పేపర్‌లో కాస్మోలాజికల్ కాన్‌స్టాంట్ అనే పదాన్ని చేర్చడం ఐన్‌స్టీన్ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని గామో అభివర్ణించారు.
అయితే, ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. విశ్వం గతిశీలత ఒక మిస్టీరియస్ డార్క్ ఎనర్జీ వల్ల సంభవిస్తుందని శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఆధారాలు లభించాయి.
ఐన్‌స్టీన్ తన సమీకరణాలలో గురుత్వాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉపయోగించిన కాస్మొలాజికల్ కాన్‌స్టాంట్, విశ్వం గతిశీలతకు కారణమైన శక్తిగా చూడవచ్చు. అందువల్ల ఐన్‌స్టీన్ మొదట నమ్మిన సిద్ధాంతం తప్పుకాదని తేలింది.
విశ్వంలో మార్పు నిజం కాదని చెప్పడానికి ఐన్‌స్టీన్ ఉపయోగించిన కాస్మొలాజికల్ కాన్‌స్టాంట్ విశ్వంలో మార్పులకు కారణమని తేలడం ఇక్కడున్న ట్విస్ట్.


ఫొటో సోర్స్, NASA/ESA/J Merten/D Coe
సుదూర గెలాక్సీలు
ఐన్‌స్టీన్ జనరల్ రిలేటివిటీ సిద్ధాంతం ప్రకారం, ఒక నక్షత్రం లేదా ఏదైనా పెద్ద వస్తువు గురుత్వాకర్షణ ప్రభావ క్షేత్రం వెనుక ఉన్న సుదూర వస్తువు నుంచి వచ్చే కాంతిని వక్రీకరించి, ఒక భారీ భూతద్దంలా పనిచేస్తుంది.
గ్రావిటేషనల్ లెన్సింగ్ థియరీ చాలా చిన్నదని, దాన్ని ప్రచురించాల్సిన అవసరం కూడా లేదని ఐన్‌స్టీన్ భావించారు.
అయితే, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఇంజనీర్ ఆర్.డబ్ల్యు. మెండెల్ దానిని ప్రచురించేలా ఐన్‌స్టీన్‌ను ఒప్పించారు.
1936 నాటి ఈ థియరీ గురించి ఐన్‌స్టీన్ సైన్స్ జర్నల్ ఎడిటర్‌కు ఇలా రాశారు. “ఈ చిన్ని ప్రచురణలో మీ సహకారానికి చాలా ధన్యవాదాలు. ఆర్‌డబ్ల్యు మెండెల్ నన్ను ఒత్తిడి చేసి వేయించాడు. దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. కానీ, అతన్ని సంతోషపడనివ్వండి’’ అని పేర్కొన్నారు.
అయితే, ఐన్‌స్టీన్ దీనికి ప్రాధాన్యత లేదని భావించినప్పటికీ, తర్వాత ఖగోళ శాస్త్రంలో అదొక మైలురాయిలాంటి సిద్ధాంతంగా మారింది.
దీని కారణంగానే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ అంతరిక్ష సంస్థలు హబుల్ టెలిస్కోప్ ద్వారా గెలాక్సీ గురించి సమాచారాన్ని సేకరించగలుగుతున్నాయి.

ఫొటో సోర్స్, NASA/ESA
పెట్టెలో పిల్లి
1905 పరిశోధనా పత్రంతో సహా అనేక పరిశోధనాత్మక రచనల్లో, కాంతి అనేది తరంగాల రూపంలోనేకాక, కణాల రూపంలో ఉంటుందని ఐన్‌స్టీన్ వివరించారు. ఈ థియరీ భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన శాఖకు పునాది వేసింది.
క్వాంటం మెకానిక్స్ సూక్ష్మ అణువుల ప్రపంచంలోని అనేక అంశాలను వివరిస్తుంది. ఉదాహరణకు, ఒక సూపర్ పొజిషన్‌లో ఉన్న క్వాంటం ఆబ్జెక్ట్‌ను పరిశీలించి, దానికి ఒక విలువను కేటాయించే వరకు అది అనే స్థితుల(మల్టిపుల్ స్టేట్స్)లో ఉండే అవకాశం ఉంది.
భౌతిక శాస్త్రవేత్త ఎర్విన్ ష్రోడింగర్ దీనికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక పెట్టె లోపల ఉన్న పిల్లిని ఎవరైనా మూత తెరిచి చూసే వరకు బతికి ఉన్నట్లు భావించవచ్చు, లేదా చనిపోయినట్లు కూడా అనుకోవచ్చు.
అయితే, ఈ ‘అనిశ్చిత’ భావనను ఐన్‌స్టీన్ ఒప్పుకోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
1935లో బోరిస్ పోడోల్‌స్కీ, నాథన్ రోసెన్‌లతో కలిసి ఐన్‌స్టీన్ ఒక రీసర్చ్ పేపర్‌ను ప్రచురించారు.
సూపర్‌పొజిషన్‌లోని రెండు వస్తువులను ఏదో ఒక రూపంలో అనుసంధానించి వేరు చేసినప్పుడు, మొదటి దానికి ఒక వ్యాల్యూ ఇచ్చిన తర్వాత, కనీసం పరిశీలించకుండానే రెండోదాని వ్యాల్యూ కూడా తెలుసుకోవచ్చు.
ఐన్‌స్టీన్ ఆలోచన క్వాంటం సూపర్‌పొజిషన్‌ను ఖండించినట్లు భావించినప్పటికీ, ఒక దశాబ్దం తర్వాత ఈ సిద్ధాంతం ‘ఎంటాంగిల్‌మెంట్’ అనే క్వాంటం మెకానిక్స్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన థియరీకి దారులు తెరిచింది.
దీని ప్రకారం, దూరంగా ఉండి, విడివిడిగా ఉన్న రెండు వస్తువులను కూడా ఒకే వస్తువుగా చూడవచ్చు.
ఐన్‌స్టీన్ తన సైన్స్ థియరీల ద్వారా మేధావిగా పేరు సంపాదించారు. అయితే, ఆయన వేసిన కొన్ని పొరపాటు అంచనాలు కూడా చివరకు కొత్త థియరీలుగా ఆవిర్భవించాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS