Home జాతీయ national telgu పొన్నియన్ సెల్వన్‌ 2లోని ‘వీరా రాజ వీర’ పాటపై వివాదమేంటి? దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం...

పొన్నియన్ సెల్వన్‌ 2లోని ‘వీరా రాజ వీర’ పాటపై వివాదమేంటి? దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పాయి? ఏఆర్ రెహమాన్ ఏమంటున్నారు?

8
0

SOURCE :- BBC NEWS

ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, పొన్నియన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images

10 నిమిషాలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

పొన్నియిన్ సెల్వన్ 2′ చిత్రంలోని ‘వీరా రాజ వీర’ పాట సంగీతాన్ని ఠాకర్ సోదరులు స్వరపరిచిన ‘శివ స్తుతి’ నుంచి తీసుకున్నారని ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ కేసులో దిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

భారతీయ క్లాసికల్ సింగర్ ఫయాజ్ వసీఫుద్దీన్ ఠాకర్ 2023లో దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

“మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’ చిత్రంలోని ‘వీరా రాజ వీర’ పాట సంగీతాన్ని నా తండ్రి నాసిర్ ఫయాజుద్దీన్ ఠాకర్, జహీరుద్దీన్ ఠాకర్ స్వరపరిచిన ‘శివ స్తుతి’ నుంచి కాపీ చేశారు” అని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు.

వారిద్దరూ మరణించిన తర్వాత, కుటుంబ ఒప్పందం ప్రకారం కాపీరైట్ తనకు దక్కిందని వసీఫుద్దీన్ ఠాకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, పొన్నియన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Getty Images

ఏఆర్ రెహమాన్ తరఫున వాదనలేంటి?

‘వీరా రాజ వీర’ సౌండ్ రికార్డింగ్‌కు చిత్ర బృందం తనకు తగిన క్రెడిట్ ఇవ్వలేదని ఆయన అన్నారు.

చిత్ర నిర్మాణ సంస్థలు మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

వసీఫుద్దీన్ ఠాకర్ ఆరోపణలను ఏఆర్ రెహమాన్ న్యాయవాది ఖండించారు.

“శివ స్తుతి” అనేది సాంప్రదాయ ధృపద్ సంగీత శైలి అని రెహమాన్ వాదించారు. “వీరా రాజ వీర” పాట పాశ్చాత్య సంగీతం ఆధారంగా రూపొందిందని, ఇది హిందుస్తానీ సంగీత సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదని ఆయన వాదించారు.

పబ్లిక్ డొమైన్‌లో ఉన్న క్లాసికల్ కంపోజిషన్లపై ఎవరూ ప్రత్యేక హక్కులను పొందలేరని కూడా ఏఆర్ రెహమాన్ అన్నారు.

రెండేళ్లుగా దిల్లీ హైకోర్టులో విచారణ సాగుతున్న ఈ కేసులో గత ఏడాది ఏప్రిల్ 25న తీర్పు వెలువడింది.

‘వీరా రాజ వీర’ పాటను ‘శివ స్తుతి’ సంగీతం ఆధారంగా రూపొందించి, కొన్ని మార్పులు చేశారని న్యాయమూర్తి తన తీర్పులో తెలిపారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం పిటిషనర్ హక్కులను ఉల్లంఘిస్తోందని న్యాయమూర్తి అన్నారు. ఈ పాట క్రెడిట్ స్లైడ్‌ను అన్ని ఓటీటీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో మార్చాలని ఆదేశించారు.

దివంగత ఉస్తాద్ నాసిర్ ఫయాజుద్దీన్ ఠాకర్, జహీరుద్దీన్ ఠాకర్‌ల ‘శివ స్తుతి’ ఆధారంగా రూపొందిందని క్రెడిట్ స్లైడ్‌లో రాయాలని తీర్పులో చెప్పారు.

దిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద ఏఆర్ రెహమాన్ రెండు కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

వ్యాజ్యం ఖర్చుల కింద వసీఫుద్దీన్ ఠాకర్‌కు 2 లక్షలరూపాయలు చెల్లించాలని కూడా ఏఆర్ రెహమాన్‌ను ఆదేశించారు.

దీనిపై ఏఆర్ రెహమాన్ దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేశారు.

ఏఆర్ రెహమాన్‌పై ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో వసీఫుద్దీన్ ఠాకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, పొన్నియన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Getty Images

‘కంపోజిషన్‌పై మాత్రమే హక్కులను క్లెయిమ్ చేస్తున్నాం’

ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం ఫిబ్రవరి 13 విచారించింది.

విచారణ సందర్భంగా ‘వీరా రాజ వీర’ పాట ఠాకర్వాణి సంగీత సంప్రదాయంతో ముడిపడి ఉందని ఏఆర్ రెహమాన్ అంగీకరించారని న్యాయమూర్తులు తెలిపారు.

“పిటిషనర్ పూర్వీకులే దీన్ని మొదట పాడారని భావించవచ్చా?” అని వారు రెహమాన్ న్యాయవాదిని అడిగారు.

దీనిపై ఏఆర్ రెహమాన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కొంత సమాచారం అందించారు.

“1991లో కుంటేచా, 2015లో ఉదయ్ పావల్కర్, 2017లో నిర్మలా దవే , 2023లో కబీరీ గరుమ్ ఇదే సంగీతాన్ని ఉపయోగించినప్పుడు పిటిషనర్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు” అని ఆయన అన్నారు.

దీనికి… “మేం రాగంపై హక్కులను క్లెయిమ్ చేయడం లేదు. కంపోజిషన్‌పై మాత్రమే హక్కులను క్లెయిమ్ చేస్తున్నాం” అని వసీఫుద్దీన్ ఠాకర్ స్పందించారు.

న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ “ఇది నిపుణుల మధ్య యుద్ధం కాదు. మీ పిటిషనర్ ఒక ప్రొఫెషనల్ సంగీతకారుడు. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని అనుసరిస్తారు. ఆయన గౌరవం, గుర్తింపును ఆశిస్తున్నారు” అని చెప్పారు.

2 కోట్లరూపాయలు డిపాజిట్ చేయాలని దిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించడానికి ఏఆర్ రెహమాన్‌కు సమయమిస్తూ కేసు విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు న్యాయమూర్తులు.

ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, పొన్నియన్ సెల్వన్ 2

ఫొటో సోర్స్, Ilaiyaraaja/Facebook

కాపీరైట్ వివాదాలు ఎందుకొస్తున్నాయి?

“ఇళయరాజా తన పాటల కాపీరైట్‌ను క్లెయిమ్ చేస్తూ దావా వేసిన తర్వాత ఇలాంటి కేసులు బయటికొస్తున్నాయి” అని సినీ విమర్శకుడు, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ఎస్. అంధానన్ బీబీసీతో చెప్పారు.

తన పాటలను వాడుకుంటున్న వారిపై ఇళయరాజా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

అక్టోబర్ 2021లో విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా ఆయన ఇది ప్రస్తావించారు.

“2014 నుంచి నా పాటలపై ఉన్న కోర్టు ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని ఇళయరాజా చెప్పారు.

గత ఏడాది ఏప్రిల్‌లో అజిత్ కుమార్ చిత్రం ‘గుడ్, బ్యాడ్, అగ్లీ’లో అనుమతి లేకుండా తన మూడు పాటలను ఉపయోగించుకున్నందుకు చిత్ర బృందానికి ఇళయరాజా నోటీసు పంపారు.

‘ఓథా రూపయమ్ థారిన్’, ‘ఎన్ జోదీ మంజా కురువీ’, ‘ఇలామయి ఇధో ఇధో’ పాటలకు 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

“సంగీతం హక్కులపై అవగాహన ఉన్నవారు కోర్టును ఆశ్రయించడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది స్వాగతించదగిన చర్య” అని కాపీరైట్ గురించి బీబీసీతో మాట్లాడుతూ న్యాయవాది శరవణన్ అన్నారు.

ప్రస్తుతం ఆయన ఇళయరాజా కాపీరైట్ కేసుల వ్యవహారాలను చూస్తున్నారు.

“ఒక సినిమా తీసినప్పుడు, సంగీతం, సాహిత్యం, నేపథ్య సంగీతానికి డబ్బు చెల్లిస్తారు. “సినిమా విడుదలైన తర్వాత మొత్తం సినిమాను అమ్మేయవచ్చు. అప్పుడు పాటలతో సహా సినిమాను ప్రదర్శించవచ్చు. కానీ పాటలను విడిగా ఉపయోగించినప్పుడు, హక్కులు స్వరకర్తకు మాత్రమే చెందుతాయి. ఇవి ఆయన సంగీత రచనకు సంబంధించిన హక్కులు. ఇది మేధో సంపత్తి హక్కుల కిందకు వస్తుంది” అని శరవణన్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)