SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, UGC
పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఒక వైన్ షాపు వద్ద మద్యం కొంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దీనితోపాటు ఆయన రోడ్డు పక్కన తన వాహనాన్ని ఆపి కూర్చున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
అయితే, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు. ఈ కేసు డీల్ చేస్తున్న ఏలూరు పోలీసులు, తూర్పు గోదావరి పోలీసులు ఈ ఫుటేజ్ తాము రిలీజ్ చేసింది కాదని చెప్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సీసీ కెమెరా ఫుటేజ్‌లో దృశ్యాలను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, ఏలూరు ఐజీ మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
మార్చి 24న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్‌లో బయలుదేరినప్పటి నుంచీ తూర్పుగోదావరి జిల్లాలోని కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడిపోయి మరణించిన చోటు వరకు సేకరించిన వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ ఇందులో ఉంది.


ఫొటో సోర్స్, UGC
కొనసాగుతున్న దర్యాప్తు
ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్‌పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కొంతమూరు రహదారి వద్ద అదే రోజు రాత్రి 11.42 గం.లకు ప్రమాదానికి గురైనట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోంది.
మార్చి 25 ఉదయం అక్కడ ఆయన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో గాయాలతో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతదేహం కనిపించింది.
దీంతో ఆయన హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వరకు ఆయన ప్రయాణం చేసిన ప్రతిచోటా సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. అలాగే ఆయన ఎవరెవరినీ కలిశారనే దానిపైనా ఆరా తీస్తున్నారు.
“విజయవాడ, రాజమహేంద్రవరంలోని దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించాం.” అని ఏలూరు పోలీసులు తెలిపారు.
మార్చి 25 తెల్లవారుజామున ఆయన మృతదేహం కనిపించింది. అంతకు ముందు సీసీటీవీ ఫుటేజ్‌లో ఆయన కొవ్వూరు టోల్ గేట్ వద్ద బైక్ నడుపుతూ కనిపించారు.
ఇది రోడ్డు ప్రమాదమని, బైక్ ప్రమాదవశాత్తు పల్లం ప్రాంతంలోకి జారిపడటంతో…ప్రవీణ్ కుమార్ తలకు గాయాలై చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
“ప్రవీణ్ కుమార్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు ఆయన మృతిపై తమకు అనుమానాలున్నాయని చెప్పడంతో…అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం.” అని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
13 వీడియోలను సేకరించాం: పోలీసులు
ఏలూరు పోలీసులు తాము సేకరించిన వీడియోల గురించి వివరించారు.
“హైదరాబాద్ నుంచి ఆయన బయలుదేరిన తర్వాత మొట్టమొదట చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద తొలి సీసీ టీవీ ఫుటేజ్ మధ్యాహ్నం 01.29 గం.లకు నమోదైంది. దాన్ని సేకరించాం. అక్కడి నుంచి ఆయన మరణించిన ప్రదేశం 381 కిలోమీటర్లు ఉంది. దాని తర్వాత ఆయన కనిపించిన మరో 12 చోట్ల సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించాం. చివరిదైన నయారా పెట్రోల్ బంక్ వద్ద ఫుటేజ్‌లో ఆయన వాహనం జాతీయ రహదారి పల్లపు ప్రాంతంలో పడినట్లు, ఆ సమయంలో అక్కడ దుమ్మురేగినట్లు కనిపిస్తోంది” అని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
రోడ్డు పక్కన పాస్టర్ ఎందుకు కూర్చున్నారు?
హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆయన విజయవాడ సమీపంలోని మహానాడు జంక్షన్ దాటాక రామవరప్పాడు రింగ్ దగ్గరున్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించినప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ కనిపించలేదు. దీంతో మధ్యలో ఎక్కడో ఆగి ఉంటారని తాము భావించామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు.
అయితే అక్కడేం జరిగిందనే విషయాన్ని అదే జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు మీడియాకు వివరించారు.
“అక్కడ ఒకరు ద్విచక్రవాహనం మీద నుంచి పడిపోయినట్లు ఉన్నారంటూ ఒక ఆటో డ్రైవర్ సమాచారం అందించాడు. దాంతో నేను అక్కడికి వెళ్లాను. ఆయన ఎవరో నాకు తెలియదు, పైకి లేపి రెయిలింగ్ వద్ద కూర్చోబెట్టాను. ముఖం కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాను. అక్కడే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆయన వాహనానికి ఉన్న హెడ్‌లైట్ వేలాడుతూ కనిపించింది. దానిని రిపేరు చేయించుకుని వెళ్లాలని ఆయనకు చెప్పాను.” అని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.
“బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోవడం, కొట్టుపోయినట్టుగా చేతులకు గాయాలు ఉండటంతో వీడియోలు, ఫోటోలు తీశాను.” అని ఎస్ఐ సుబ్బారావు చెప్పారు.
ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫుటేజ్‌తో మాకు సంబంధం లేదు: ఏలూరు ఐజీ
మద్యం దుకాణంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ అంటూ సర్క్యూలేట్ అవుతున్న సీసీ ఫుటేజ్ ఎక్కడ నుంచి వచ్చిందో ఇంకా తెలియదలేదని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ అన్నారు.
“ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వివరాలు మాకు వైద్యులు అందించారు. చేతుల మీద, తల మీద గాయాలున్నాయి. అలాగే శరీరంపై కాలిన గాయం ఉండటంతో పాథాలజీ రిపోర్టు కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ వచ్చిన తర్వాత పూర్తి రిపోర్ట్ ఇవ్వగలుగుతాం.” అని ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.
సోషల్ మీడియాలో ఈ అంశంపై రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు పెట్టడం, వ్యాఖ్యనాలు చేయడం చట్టరీత్యా నేరమవుతుందని…ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని ఏలూరు ఐజీ అశోక్ కుమార్ మరోమారు కోరారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS