SOURCE :- BBC NEWS
6 గంటలు క్రితం
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అల్-కాదిర్ ట్రస్టు అవినీతి కేసులో ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 10 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ కేసులో ఆయన ఇప్పటికే జైలులో ఉన్నారు.
ఇదే కేసులో అకౌంటబిలిటీ కోర్టు ఇమ్రాన్ భార్య బుస్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష, 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానాను విధించింది. అంతేకాకుండా అల్-కాదిర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం నియంత్రణలోకి తీసుకోవాలని ఆదేశించింది.
కోర్టు ఈ శిక్షను ప్రకటించినప్పుడు ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య, ఇతర పీటీఐ నాయకులు కోర్టులోనే ఉన్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. కోర్టు తీర్పు వెల్లడించగానే అక్కడే ఉన్న బుస్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అకౌంటబిలిటీ కోర్ట్ జడ్జి నాసిర్ జావేద్ రాణా 2024 డిసెంబరు 18న తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు వెల్లడి మూడుసార్లు వాయిదా పడింది. అడియాలా జైలులో శుక్రవారం తీర్పును ప్రకటించారు.
ఇమ్రాన్ ఖాన్, బుస్రా బీబీ (ఫైల్ ఫొటో)
ఏమిటీ అల్ కాదిర్ ట్రస్ట్ కేసు
పాకిస్తాన్‌లో అల్ కాదిర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ కోసం 2019 డిసెంబర్ 26న అల్ కాదిర్ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేశారు. దీనికి ట్రస్టీలుగా ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుస్రా బీబీ ఉన్నారు.
బహ్రియా టౌన్‌కు సంబంధించి తన క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే ఇమ్రాన్ ఖాన్ ఈ ట్రస్ట్‌ను రిజిస్టర్ చేశారు.
ప్రైవేట్ హౌసింగ్ సొసైటీ బహ్రియా టౌన్ సీఐఓ మలిక్ రియాజ్, ఆయన కుటుంబీకులకు ఇమ్రాన్‌ఖాన్ ప్రయోజనం చేకూర్చారనే ఆరోపణలు వచ్చాయి.
అనంతరం, బహ్రియా టౌన్ ద్వారా అల్ కాదిర్ యూనివర్సిటీ కోసం 56 ఎకరాల భూమి విరాళంగా అందిందనేది ఆరోపణ.
దీంతో 2023 మేలో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. అల్ కాదిర్ ట్రస్టుకు అందిన విరాళాలపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) దర్యాప్తు చేసింది. ఈ కేసులోనే ఇపుడు అకౌంటబిలిటీ కోర్టు తీర్పు ఇచ్చింది.
‘రహస్య ఒప్పందం’
ట్రస్టుకు అందినది విరాళం కాదని.. మలిక్ రియాజ్, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ఫలితమేనని ఎన్‌ఏబీ ఆరోపించింది.
లండన్‌లో ఉంటున్న రియాజ్‌కు సంబంధించిన 190 మిలియన్ పౌండ్లను (భారత కరెన్సీలో సుమారు రూ. 2 వేల కోట్లు) పాకిస్తాన్ ప్రభుత్వానికి బ్రిటన్ అందజేసింది.
అయితే వాటిని మొత్తంగా జాతీయ ఖజానాలో జమచేయకుండా అందులో నుంచి కొంత బహ్రెయిన్ టౌన్ కరాచీ కేసులో సుప్రీంకోర్టుకు జరిమానా చెల్లించడానికి రియాజ్‌కు ఇమ్రాన్ ప్రభుత్వం ఇచ్చిందని ఎన్ఏబీ అంటోంది. ఆ తర్వాత ఇమ్రాన్ ట్రస్టుకు విరాళం అందిందని ఎన్ఏబీ ఆరోపణ.
2018 నాటి ఎన్నికల్లో పీటీఐ పార్టీ విజయం సాధించడంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు.
తనని అధికారం నుంచి దించేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఆరోపించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని అమెరికా ఖండించింది.
పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. అవినీతి, హింస, దైవదూషణ, హత్య, టెర్రరిజం వంటి ఆరోపణలతో ఈ కేసులు ఫైల్ అయ్యాయి.
ఇమ్రాన్ ప్రధానిగా ఉండగా అందుకున్న బహుమతులను విక్రయించడం ద్వారా సంపాదించిన డబ్బును బహిర్గతపరచనందుకు 2023లో కోర్టు ఆయనకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఇక, 2024లో జాతీయ బహుమతులను విక్రయించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష, దేశ రహస్యాలను లీక్ చేసినందుకు మరో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే, ఈ రెండు శిక్షలను కొన్ని నెలల తర్వాత సస్పెండ్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)