Home జాతీయ national telgu పాకిస్తాన్‌ ఏజెంట్లతో నిఘా సమాచారాన్ని పంచుకున్నారనే అభియోగాలపై అరెస్టయిన జ్యోతిమల్హోత్రా,ఇతరుల గురించి పోలీసులు ఏం చెబుతున్నారు?

పాకిస్తాన్‌ ఏజెంట్లతో నిఘా సమాచారాన్ని పంచుకున్నారనే అభియోగాలపై అరెస్టయిన జ్యోతిమల్హోత్రా,ఇతరుల గురించి పోలీసులు ఏం చెబుతున్నారు?

2
0

SOURCE :- BBC NEWS

యూట్యూబర్స్

ఫొటో సోర్స్, Kamal Saini

2 గంటలు క్రితం

పాకిస్తాన్‌కు నిఘా సమాచారం అందించారనే ఆరోపణలపై హరియాణా, పంజాబ్ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు.

వారిలో హిసార్‌కు చెందిన ట్రావెల్ వ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, కైతాల్‌లోని మస్త్‌గఢ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్, పంజాబ్‌లోని మలేర్‌కోట్లాకు చెందిన ఒక యువతి, మరో వ్యక్తి ఉన్నారు.

జ్యోతిని ఐదు రోజులపాటు పోలీసు రిమాండ్‌కు పంపారు.

రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు కొంతమంది పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని, ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సమాచారాన్ని వారితో పంచుకున్నారనే అభియోగాలు ఉన్నాయి .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హరియాణా డీఎస్పీ కమల్‌జీత్

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు ఏం చెప్పారు?

జ్యోతి మల్హోత్రా ఒక ట్రావెల్ వ్లాగర్. ఆమె తన యూట్యూబ్ ఛానల్‌కు ‘ట్రావెల్ విత్ జో’ అని పేరు పెట్టారు.

ఆమె తన యూట్యూబ్ చానల్‌లో అనేక దేశాల ట్రావెల్ విశేషాలు పంచుకున్నారు.

జ్యోతి తన యూట్యూబ్ చానల్‌లో పాకిస్తాన్ పర్యటన గురించి అనేక వీడియోలను కూడా పోస్ట్ చేశారు.

హరియాణాలోని హిసార్‌కు చెందిన డీఎస్పీ కమల్‌జిత్ మాట్లాడుతూ, “మాకు లభించిన సమాచారం ఆధారంగా హిసార్ నివాసి జ్యోతి మల్హోత్రాను అధికారిక రహస్యాల చట్టం, బీఎన్‌ఎస్ 152 కింద అరెస్ట్ చేశాం” అని చెప్పారని బీబీసీ ప్రతినిధి కమల్ సైని తెలిపారు.

జ్యోతి మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కొంత అనుమానాస్పద సమాచారం లభించినట్టు పోలీసులు తెలిపారు.

“ఆమెను ఐదు రోజుల రిమాండ్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోంది. ఆమె ఒక పాకిస్తానీ పౌరుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది, దీని గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాం.” అని పోలీసులు తెలిపారు.

జ్యోతి మల్హోత్రా తండ్రి హరీష్ కుమార్

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

జ్యోతి తండ్రి ఏమన్నారు?

గురువారం ఉదయం 9.30 గంటలకు పోలీసు అధికారులు తమ ఇంటికి వచ్చి జ్యోతిని తీసుకెళ్లారని జ్యోతి తండ్రి హరీష్ కుమార్ తెలిపారు.

“ఐదారుగురు వచ్చారు. వారు దాదాపు అరగంట పాటు ఇంట్లో సోదాలు చేశారు, ఆ తర్వాత పోలీసులు ఒక ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు” అని ఆయన చెప్పారు.

జ్యోతి ఒక్కసారే పాకిస్తాన్ వెళ్ళిందని హరీష్ కుమార్ తెలిపారు.

“నా కుమార్తె ప్రభుత్వ అనుమతితో వెళ్ళింది. ఆమె నేపథ్యాన్ని పరిశీలించి, ఆపై వీసా ఇచ్చారు, ఆ తర్వాత ఆమె పాకిస్తాన్ వెళ్ళింది” అని ఆయన అన్నారు.

జ్యోతి ఏ యూట్యూబ్ చానల్ నడుపుతోందో తనకు తెలియదని హరీష్ కుమార్ అన్నారు.

దేవేంద్ర సింగ్

ఫొటో సోర్స్, Kamal Saini/BBC

కైతాల్‌లో అరెస్ట్ అయిన యువకుడు ఎవరు?

పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై కైతాల్‌లోని మస్త్‌గఢ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల దేవేంద్ర సింగ్‌ను హరియాణా పోలీసుల స్పెషల్ డిటెక్టివ్ యూనిట్ (ఎస్‌డీయూ) అరెస్ట్ చేసింది.

‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన సమాచారం సహా రహస్య సైనిక సమాచారాన్ని పంపినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ వీర్భన్ సింగ్ తెలిపారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో అక్రమ ఆయుధాల గురించి పోస్ట్ చేసినందుకు దేవేంద్ర సింగ్‌ను మే 13న అదుపులోకి తీసుకున్నట్లు వీర్భన్ సింగ్ తెలిపారు.

ఈ కేసును డీఎస్పీ వీర్భన్ ధృవీకరిస్తూ, “నిందితుడు దేవేంద్ర సింగ్ కర్తార్‌పూర్ సాహిబ్‌ను సందర్శించే నెపంతో పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ అతనికి పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పరిచయం ఏర్పడింది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, అతను సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపుతూనే ఉన్నాడు” అని చెప్పారు.

“పటియాలాలో చదువుతున్న దేవేంద్ర సింగ్, తన మొబైల్ ఫోన్‌తో ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాన్ని ఫోటోలు తీసి ఐఎస్ఐ ఏజెంట్లకు పంపాడు.” అని పోలీసులు తెలిపారు.

పోలీసులు.. దేవేంద్ర మొబైల్ ఫోన్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలిస్తున్నారు.

దేవేంద్రను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

నిందితులు, పోలీసులు

ఫొటో సోర్స్, Charanjit Kaushal/BBC

మలేర్‌కోట్లాలో ఇద్దరి అరెస్ట్

మే 11న, పాకిస్తాన్ హైకమిషన్‌లో ఒక అధికారికి సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలపై పంజాబ్‌లోని మలేర్‌కోట్లాలో ఒక మహిళ సహా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు చెప్పారని బీబీసీ ప్రతినిధి చరణ్‌జీవ్ కౌశల్ తెలిపారు.

ఈ విషయాన్ని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

అరెస్ట్ అయిన వారిని మలేర్‌కోట్లా నివాసితులు గుజాలా, యామిన్ మొహమ్మద్‌గా గుర్తించారు. గుజాలా నుంచి రెండు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఆన్‌లైన్‌ ఎక్స్‌ఛేంజ్ ద్వారా డబ్బు తీసుకుని రహస్య సమాచారాన్ని చేరవేశారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు.

నిందితులిద్దరూ తమ ఎక్స్‌ఛేంజ్ ఆపరేటర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన సూచనల మేరకు ఇతర స్థానిక ఆపరేటర్లకు డబ్బు పంపేవారని డీజీపీ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)