SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
‘బ్రేకింగ్ న్యూస్: లాహోర్‌లో యోగాకు అనుమతి లేదు’ అనే క్యాప్షన్‌తో పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోను లాహోర్‌లోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ(డీహెచ్ఏ) నుంచి ఇషా అమ్జాద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ఇషా అమ్జాద్ ఒక ట్రైనర్. డీహెచ్ఏలోని తన ఇంటికి సమీపంలోని పబ్లిక్ పార్కులో యోగా చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తాను యోగా చేస్తుండగా ఓ అపరిచితుడు తనను వేధించారని ఆమె ఆరోపించారు.
ఆ తరువాత, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ యోగా చేయకూడదని, వెళ్లిపోవాలని సూచించారని ఇషా ఆ వీడియోలో చెప్పారు.
ఈ సంఘటన గురించి ఇషా బీబీసీతో మాట్లాడుతూ, యోగా చేస్తున్నప్పుడు, “పార్కులో ఉన్న ఒక వ్యక్తి చాలా సేపు నన్ను చూస్తూ, నవ్వుతూ, నా వీడియోలు తీశాడు. నా దగ్గరకు వచ్చి తనతో టిక్‌టాక్ చేయమని అడగడం మొదలుపెట్టాడు. తరువాత నేను యోగా చేయకుండా ఆపడానికి ప్రయత్నించాడు” అని చెప్పారు.
ఆ తరువాత అక్కడ ఉన్న ఒక సెక్యూరిటీ గార్డు కూడా వచ్చి తనను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారన్నారు.
‘ఇలాంటివి నాకు కొత్త కాదు. పాకిస్తాన్‌లో నివసిస్తుండడం వల్ల నాకు ఇలాంటివన్నీ అలవాటైపోయాయి’ అని ఇషా అన్నారు.
గార్డు అలా చెప్పడంతో తాను అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని.. కానీ, అంతలో ఆ అపరిచితుడు మళ్లీ తన దగ్గరకు వచ్చి పార్క్‌లో ఆడవాళ్లు ఏం చేయకూడదో చెప్పడం మొదలు పెట్టారని, దాంతో తనకు చాలా కోపం వచ్చిందని ఇషా తెలిపారు.
ఈ విషయంపై పార్కులో ఉన్న సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేయగా, ఆ అపరిచితుడి నుంచి తనకు భద్రత కల్పించకపోగా తననే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని ఇషా తెలిపారు.

ఇషా పోస్ట్ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.
చాలా మంది మహిళలు ఆ పోస్ట్‌పై స్పందించారు. వారికి ఎదురైన ఇలాంటి అనుభవాల గురించి ప్రస్తావించారు.
ఇషాకు అసభ్యకరంగా, బెదిరిస్తూ, ద్వేషపూరితంగా ఆన్‌లైన్‌లో కామెంట్స్ వచ్చాయి.
దీని గురించి ఇషా మాట్లాడుతూ, సోషల్ మీడియాలో లేదా ఆన్‌లైన్‌లో వచ్చే ద్వేషపూరిత వ్యాఖ్యలు పార్క్ నుంచి పంపించేయడంకన్నా పెద్ద సమస్య అని.. “అది భయానకమైన ట్రోలింగ్” అని అన్నారు.
సోషల్ మీడియా వినియోగదారులు తనకు ద్వేషపూరిత సందేశాలను పంపడం చాలా ప్రమాదకరమని ఆమె చెప్పారు.
ఆన్‌లైన్‌లో కొంతమంది కామెంట్స్ చూసిన తర్వాత అలాంటి బాధపెట్టే కామెంట్స్ చదవొద్దని తన స్నేహితులు, కుటుంబీకులు చెప్పారని ఇషా అన్నారు.
ఈ సంఘటన తర్వాత కొంతమంది మహిళలు తనను సంప్రదించారని, వారిలో ఒక బృందం మళ్ళీ వ్యాయామం చేయడానికి ఆ పార్కుకు వెళ్లిందని ఇషా చెప్పారు.
అప్పుడు కూడా ఆ సెక్యూరిటీ గార్డ్ వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలన్నారని, అయితే ఆ మహిళలలో కొంతమంది భర్తలు కూడా అక్కడ ఉండడంతో సెక్యూరిటీ గార్డ్‌ని అసలు ఆ పార్క్ రూల్స్ ఏంటి అని అడిగారని తెలిపారు.
నిబంధనల కాపీ పార్క్ గేటుకు అతికించి ఉందని, అందులో యోగా చేయరాదని ఎక్కడా లేదని ఆమె చెప్పారు.
షార్ట్స్ వేసుకోకూడదంటూ పురుషుల దుస్తులపై ఆంక్షలు ఉన్నాయే కానీ యోగాకు సంబంధించిన ప్రస్తావన ఏమీ లేదని ఇషా చెప్పారు.
తాను పార్కుకు వెళ్లినప్పుడు యోగా చేయడానికి వీలుగా ఉండే దుస్తులు ధరించినట్లు తెలిపారు.
అయితే, వదులుగా ఉన్న దుస్తులతో యోగా చేయడం సాధ్యం కాదు కాబట్టి తాను అలాంటివి ధరించలేదన్నారు.

పార్కులో యోగా నిషేధించారా?
‘లాహోర్ నగరంలోని ఏదైనా పబ్లిక్ పార్క్ నిర్వాహకుడిని లేదా సెక్యూరిటీ గార్డును లాహోర్‌లోని పార్కులలో మహిళలు యోగా చేయడం నిషేధించారా అని అడిగితే, ఆ పార్కు కోసం నిర్దేశించిన నియమాలు, నిబంధనలు చూపించారు.
వాటిలో ఎక్కడా మహిళలు పార్కులో యోగా చేయకూడదని రాయలేదు.
పాకిస్తాన్ అంతటా పార్కులలో పురుషులు తరచుగా యోగా చేయడం కనిపిస్తుంది.
ఇంటి నుంచి బయటకు వెళ్లడం, మోటార్ సైకిల్ నడపడం, లేదా ఏదైనా పని కోసం ఒంటరిగా బయటకు వెళ్లడం పురుషులకు సాధారణ విషయంగా పరిగణిస్తారు.
కానీ మహిళలను మాత్రం ఎప్పుడైనా, ఎక్కడైనా ఆపి నువ్వు చేసేపని సరైనది కాదని చెబుతారు’ అన్నారు ఇషా.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)