SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Red Crescent/ BBC Urdu
2 గంటలు క్రితం
‘ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేశాం’ అని భారత్ ప్రకటించింది.
”తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాం. వాటిని పూర్తిగా ధ్వంసం చేశాం” అని కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు.
భారత దాడుల్లో పిల్లలు, మహిళలు సహా 26మంది చనిపోయారని, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు చెప్పారు.
పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని అహ్మద్‌పుర్ శర్‌కియా, మురీద్కే, సియాల్‌కోట్, శకర్‌గఢ్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రాంతంలోని కోట్లీ, ముజఫరాబాద్‌ను భారత్ లక్ష్యంగా చేసుకుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి చెప్పారు.

భారత్ ఏయే ప్రాంతాల్లో దాడులు చేసిందంటే…
పాకిస్తాన్‌పై జరిపిన దాడుల వివరాలను భారత ఆర్మీ ప్రకటించింది.
”గడచిన మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నిర్మిస్తోంది. నియామకాలు, శిక్షణ, లాంచ్ పాడ్‌లు, పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంతటా ఉన్నాయి’’ అని దాడుల వివరాలు తెలియజేసేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి చెప్పారు.
‘ఉగ్రవాద శిబిరాలు ఉన్న ప్రాంతాలు’ పేరుతో భారత్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల వివరాలను ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె తెలియజేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అహ్మద్‌పుర్ శర్‌కియా(బహావల్‌పుర్)
పాకిస్తాన్‌పై భాారత ఆర్మీ దాడిచేసిన ప్రాంతాలు, జరిగిన నష్టంపై బీబీసీ ఉర్దూ వివరాలు అందించింది.
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌పుర్ జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పట్టణం అహ్మద్‌పుర్ శర్‌కియా.
సుబ్హాన్ మసీదును లక్ష్యంగా చేసుకుని ఈ ప్రాంతంలో నాలుగు దాడులు జరిగాయని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు. దాడుల్లో మసీదు దెబ్బతిందని, చుట్టుపక్కలున్న ప్రజలపై ప్రభావం పడిందని తెలిపారు.
మూడేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు ఈ దాడుల్లో చనిపోయారని, 31 మంది గాయపడ్డారని తెలిపారు.
నిషేధిత సంస్థ జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం బహావల్‌పూర్‌లోనే ఉంది, మదరస్‌తుల్ సాబిర్, జామా మసీద్ సుబ్హాన్ అందులో భాగం.

ఫొటో సోర్స్, BBC Urdu
మురీద్కే
పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలోని శోఖూపురా జిల్లాలో ఉన్న పట్ణణం మురీద్కే. ఉత్తర లాహోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ పట్ణణం ఉంది.
లాహోర్‌కు దగ్గరలోని ఈ నగరం జమాత్-ఉద్-దావాకు కేంద్రమైన దావా వల్-ఇర్‌శాద్ కారణంగా గతంలోనూ వార్తల్లో నిలిచింది.
మురీద్కేలోని ఉమ్మల్ కురా మసీదు, దాని చుట్టుపక్కల ఉన్న క్వార్టర్లను లక్ష్యంగా చేసుకుని భారత్ నాలుగు దాడులు చేసిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు. ఈ దాడుల్లో ఒకరు చనిపోయారని, ఇంకొకరు గాయపడ్డారని, మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని తెలిపారు.
మురీద్కేలో భారత్ దాడి చేసిన ప్రాంతానికి బీబీసీ ప్రతినిధి ఉమర్ దరాజ్ నన్‌గైనా వెళ్లారు. దాడులకు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతం జీటీ రోడ్డుకు కొంచెం దూరంలో ఉందని, అయితే అది ప్రజలు నివసించే ప్రాంతమని ఉమర్ తెలిపారు. ఇది చాలా పెద్ద ప్రాంతమని చుట్టూ కంచె ఉంటుందని చెప్పారు.
”ఆ కాంప్లెక్ లోపల ఒక స్కూలు, ఆస్పత్రి ఉన్నాయని, వాటి పక్కనే ఉన్న భవనాన్ని, పెద్ద మసీదును లక్ష్యంగా చేసుకున్నారని స్థానిక ప్రజలు చెప్పారు. దాడుల తర్వాత భవనం ధ్వంసమయింది. శిథిలాలు దూరంగా వ్యాపించాయి. మసీదులో ఓ భాగం కూడా ధ్వంసమయింది. ఈ కాంప్లెక్స్‌పై కూడా ప్రభావం పడింది” అని ఆయన తెలిపారు.
రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో స్కూలు, ఆస్పత్రి, ఇతర భవనాలు ఉన్నాయని, మరోవైపు ఉద్యోగులు నివసించేందుకు కొన్ని క్వార్టర్లు ఉన్నాయని స్థానికులు చెప్పినట్టు ఉమర్ తెలిపారు.
తొలుత ఇది జమాత్-ఉద్-దావా, దాని అనుబంధ సంస్థల సంక్షేమ కార్యక్రమాల కేంద్రంగా ఉండేదని, విద్యాకాంప్లెక్స్, హెల్త్ సెంటర్ అందుకే నిర్మించారని బీబీసీ ప్రతినిధి తెలిపారు. తర్వాత ఈ సంస్థపై నిషేధం విధించడంతో ఈ ప్రాంతం నిర్వహణ బాధ్యతలను పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకుందని, సాధారణ ప్రజలకు నివాస ప్రాంతంగా ఇది మారిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ముజఫరాబాద్
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్. ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమైన ఆఫీసులు, ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.
శవాయి నాలాలోని మాజిద్-ఐ-బిలాల్ మసీదును లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.
షహీద్ గలీగా పిలిచే కొండపైకి వెళ్లే ముజఫరాబాద్ ప్రధాన రహదారిపై శవాయి నాలా ఉందని బీబీసీ ప్రతినిధి తబిండా కౌకబ్ చెప్పారు.
దాడి జరిగిన శవాయి, దగ్గరలోని సమామ్ బాండి ప్రాంతాల నుంచి కొందరు ప్రజలు నగరంలోని ఇతర చోట్లకు వెళ్లారని ఆమె తెలిపారు. అక్కడ వాహనాలు బారులు తీరాయని, తమ వారి పరిస్థితి తెలుసునేందుకు కొందరు వచ్చారని, బంధువులను తమ వెంట తీసుకెళ్తున్నారని ఆమె తెలిపారు.
బిలాల్ మసీదును లక్ష్యంగా చేసుకుని ఏడు దాడులు జరిగాయని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.
కోట్లీ
నియంత్రణరేఖ వెంట ఉన్న కోట్లీలో భారత్ దాడులు జరిపింది. ఇస్లామాబాద్‌కు 120కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. కోట్లీలోని ఒక మసీదును కూడా లక్ష్యంగా చేసుకున్నారని, ఈ దాడిలో 16 ఏళ్ల బాలిక, 18 ఏళ్ల వ్యక్తి చనిపోయారని, మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, Naseer chaudhry/ BBC Urdu
సియాల్‌కోట్
చీనాబ్ నది ఒడ్డున ఉండే సియాల్‌కోట్ పంజాబ్ ప్రావిన్సులో ప్రముఖ నగరం. ఉత్తర సియాల్‌కోట్‌లోని కోట్లి లోహారాం గ్రామంపై రెండు షెల్స్ ప్రయోగించారని, వాటిలో ఒకటి పేలలేదని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
శకర్‌గఢ్
పంజాబ్‌లోని నరోవల్ జిల్లాలో శకర్‌గఢ్ ఉంది. శకర్‌గఢ్‌పై రెండు షెల్స్ ప్రయోగించారని, డిస్పెన్సరీ స్వల్పంగా ధ్వంసమయిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై దాడి జరిగిన రెండు వారాల తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో భారత్ దాడులు జరిపింది.
ఈ దాడులకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడుల బాధితులకు న్యాయం చేయడంలో భాగంగా దాడులు జరిపామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు.
”ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన, వాటిని అమలు చేసిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని భారత ఆర్మీ తెలిపింది.
పాకిస్తాన్ మిలటరీ స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకోలేదని చెప్పింది.
”ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని భారత్ చెప్పడం అబద్ధం. నివాసిత ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయి” అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాకిస్తానీ చానల్ జియో టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)