SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, ANI
3 గంటలు క్రితం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై దాడి తర్వాత, ప్రధానమంత్రి మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని దేశానికి తిరిగి వచ్చారు.
రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం సౌదీ అరేబియా వెళ్లారు.
పహల్గామ్ దాడిని ‘ఉగ్రవాద దాడి’గా అభివర్ణించిన ఆయన, ‘దాడికి బాధ్యులను వదిలిపెట్టబోమని’ అన్నారు.
దిల్లీ చేరుకున్న వెంటనే, పరిస్థితి గురించి తెలుసుకోవడానికి అత్యవసర సమావేశం నిర్వహించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో నరేంద్ర మోదీ పరిస్థితిని చర్చించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే కశ్మీర్‌లో ఉన్నారు.


ఫొటో సోర్స్, ANI
భద్రత కట్టుదిట్టం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి తర్వాత దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో 20 మందికి పైగా పర్యటకులు మరణించారు.
మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది.
దాడి తర్వాత దిల్లీ పోలీసులు నగర వ్యాప్తంగా భద్రతను పెంచారు.
ముఖ్యంగా పర్యటక ప్రదేశాలు, నగర సరిహద్దులలో, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించగలిగేలా తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతున్నాయి.
మరోవైపు, లోయలోని భద్రతా సిబ్బంది వివిధ ప్రదేశాలలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రోడ్లపై విస్తృతంగా బారికేడ్లు ఏర్పాటుచేశారు.
జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల నుంచి దాడికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నట్లు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. పహల్గాంలో కొంతమంది కొవ్వొత్తుల మార్చ్ నిర్వహించి దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు.
“కశ్మీర్ గురించి చాలా విచారకరమైన వార్తలు వస్తున్నాయి. ఉగ్రవాదంపై ఈ పోరాటంలో అమెరికా భారతదేశానికి అండగా నిలుస్తుంది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు కోలుకోవాలని మేం ప్రార్థిస్తున్నాం. ప్రధానమంత్రి మోదీకి, భారత ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి గురించి హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్టు రాహుల్ గాంధీ ఎక్స్ ఖాతాలో తెలిపారు.
“నేను హోంమంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కశ్మీర్ పీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రాతో మాట్లాడాను. ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు అందాయి” అని ఆయన రాశారు .
‘‘బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలి, మా పూర్తి మద్దతు వారికి ఉంటుంది ఇస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)