SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, ANI
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆదివారం దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రకటించారు.
రాజకీయంగా గట్టిపోటీ ఉండే రాష్ట్రాలలో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్నికలకు వేదిక సిద్ధమైంది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే రెండు ఫేజ్‌లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. మే 4న ఫలితాలు ప్రకటిస్తారు.
అయితే ఈ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ముందే మొదలైంది. గత రెండు నెలల్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పునఃసమీక్షించింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ రాజకీయ వివాదానికి దారితీసింది.

2021లో ఎనిమిది దశలు.. ఇప్పుడు రెండు దశలు
2021లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో జరిగింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉండగా, 2021లో ప్రధాన ఓటింగ్ సమయంలో 292 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగతా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మరణం కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి, ఐదు నెలల తర్వాత ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
ఈసారి(2026) ఎన్నికలను రెండు దశలలోనే నిర్వహిస్తున్నారు. ఈ మార్పు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
భద్రతా ఏర్పాట్లు, పరిపాలనా సన్నాహాలు, గ్రౌండ్-లెవల్ అంచనాలను సమీక్షించిన తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు.
ఫొటో సోర్స్, Getty Images
ఓటర్ల జాబితాపై వివాదం
2026 ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో మార్పులు అత్యంత వివాదాస్పద అంశంగా మారాయి.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య మునుపటి ఎన్నికలతో పోలిస్తే తగ్గడం ఇదే తొలిసారి.
ఎస్ఐఆర్ తర్వాత దాదాపు 5.46 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించారు.
ఇంకా సుమారు 60.6 లక్షల ఓటర్ల పేర్లపై నిర్ణయం రావాల్సి ఉంది.
ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన లేదా వెయిటింగ్ డెసిషన్ లిస్ట్‌లో ఉన్నవారికి ఎన్నికల సమీక్ష ప్రక్రియ ద్వారా వారి పేర్లను తిరిగి చేర్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో 7 కోట్ల 30 లక్షలు 40 వేల మంది ఓటర్లు ఉన్నారు.
అందులో 82.3 % మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది చాలా ఎక్కువ ఓటింగ్ శాతం.
ఈ ఏడాది కూడా అంతే ఎక్కువ ఓటింగ్ జరుగుతుందా లేదా అన్నది ఓటింగ్ పూర్తయ్యాకే తెలుస్తుంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?
పశ్చిమబెంగాల్‌లో అధికార పార్టీ అయిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మరోసారి మమతా బెనర్జీ నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 2011 నుంచి బెనర్జీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
మమతా బెనర్జీ తన పార్టీకి మళ్లీ విజయం అందించగలిగితే.. వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్లవుతుంది.
అలాంటి విజయం ఆమెను దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కాలం పదవిలో ఉన్న మహిళా నాయకులలో ఒకరిగా నిలబెడుతుంది.
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ వ్యూహం
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు.
2021 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రతిపాదించకుండా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో భారీగా ప్రచారం చేసింది.
ఇటీవలికాలంలో కొన్నిరాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. ప్రధానమంత్రి నాయకత్వంలో పోటీ చేసి, గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించడానికి నాయకుడిని ఎంచుకుంది.
వీటిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా, దిల్లీ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.
ఈసారైనా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తుందా లేదా అనేది తెలియదు.
ఫొటో సోర్స్, ANI
గత ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ కలిసి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ సవాలు చేయడానికి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి.
ఎన్నికల్లో ఈ కూటమి గణనీయమైన ప్రభావాన్ని చూపడంలో విఫలమైనప్పటికీ, ఐఎస్ఎఫ్ నాయకుడు నౌషాద్ సిద్ధిఖీ భంగర్ సీటును గెలుచుకోగలిగారు.
దీంతో టీఎంసీ, బీజేపీ కాకుండా ఆ శిబిరం నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థిగా ఆయన నిలిచారు.
ఇప్పుడు 2026 ఎన్నికల కోసం ఈ కూటమి మళ్లీ ఏర్పడుతుందా లేదా అన్నదానిపై స్పష్టతలేదు.
ఇంతలో, రాజకీయ సమీకరణాల్లో మార్పు మొదలైంది.
హుమాయున్ కబీర్ తృణమూల్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి జనతా ఉన్నయన్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఈసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పాలన, అవినీతి ఆరోపణలు, రాజకీయ విశ్వాసం వంటి అంశాలపై దృష్టి సారిస్తాయని భావిస్తున్నారు.
ఉపాధ్యాయ నియామకాలలో కుంభకోణం, బొగ్గు అక్రమ రవాణా కేసు సహా అవినీతి కేసులపై బీజేపీ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
అయితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఎస్ఐఆర్) చాలా ఎన్నికల ప్రచార అంశాలను వెనక్కినెట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య నమ్మకం లేకపోవడంగురించిన ఆందోళనలను ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుంది.
వివాదాస్పద ఓటరు ఎంట్రీలను పరిష్కరించేందుకు 500 మందికి పైగా న్యాయాధికారులను నియమించాలని కోర్టు ఆదేశించింది.
2026 మార్చి 10న సుప్రీంకోర్టు ప్రత్యేక అప్పీలేట్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ఈ ట్రైబ్యునల్స్‌కు మాజీ హైకోర్టు న్యాయమూర్తులు నేతృత్వం వహిస్తారు. సవరణ ప్రక్రియలో జాబితా నుంచి పేర్లు తొలగించిన ఓటర్ల అప్పీల్స్‌ను విచారిస్తారు.
ఈ వివాదం మధ్య, తృణమూల్ కాంగ్రెస్ ఐదు రోజులపాటు నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఎస్ఐఆర్ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు, ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి బెంచ్ రాష్ట్రాన్ని సందర్శించి వాస్తవ పరిస్థితిని అంచనా వేసింది.
నెక్ట్స్ ఏంటి?
ఎన్నికల తేదీల ప్రకటనతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి పెరిగింది.
ఈ పోటీ మమతా బెనర్జీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో నిర్ణయించడమే కాకుండా, రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని విజయంగా మార్చుకోగలదా అన్నదాన్ని కూడా పరీక్షిస్తుంది.
ఎస్ఐఆర్ చుట్టూ ఉన్న వివాదం 2026 ఎన్నికలలో ఓటర్ల భాగస్వామ్యం, రాజకీయ చర్చలను ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



