SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
(ఈ కథనంలో ఆత్మహత్య వివరణలు ఉంటాయి)
”ఊబకాయంతో బాధపడేవారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఇతరులు సాధారణంగా చేసే పనులు కూడా మాకు కష్టమవుతాయి. ప్రతీ విషయంలో మేం వెక్కిరింతలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని తేని జిల్లా పన్నాపురంకు చెందిన 27 ఏళ్ల అభిమన్యు అన్నారు.
కుటుంబం లేదా స్నేహితుల ఇళ్లలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే తొలుత తనకు అక్కడ ఎలాంటి కుర్చీ వేస్తారో అనే ఆలోచనే వస్తుందని ఆయన చెప్పారు.
కూర్చుంటే ఎక్కడ కుర్చీ విరిగిపోతుందనే భయంతోనే ఫంక్షన్లకు వెళ్తుంటానని, కొన్నిసార్లు ఇదే కారణంతో శుభకార్యక్రమాలకు కూడా వెళ్లనని తెలిపారు. ఒకవేళ ఫంక్షన్లకు వెళ్లినా తనను చూసి నవ్వుతారనే భయంతో భోజనం చేయకుండానే వస్తానని ఆయన వెల్లడించారు.
”నేను ఏదైనా ఈవెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడివారంతా చేసే పనులు ఆపి నన్ను చూస్తుంటారు. నేను బస్సులో కూడా ప్రయాణించను” అని ఆయన చెప్పారు.
బరువు కారణంగానే ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ తిరస్కరణలు ఎదురయ్యాయని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అభిమన్యు తెలిపారు.
”నేను ఇంటర్వ్యూకు వెళ్తే వాళ్లు నా నైపుణ్యాలను చూడరు. ఉద్యోగం ఇవ్వరు. నువ్వు ఎక్కువ సేపు నిలబడలేవు. ఎక్కువసేపు టూ వీలర్ నడపలేవు అని చెబుతుంటారు” అని తనకు ఎదురైన అనుభవాలను అభిమన్యు పంచుకున్నారు.


ఊబకాయం కారణంగా ఎదుర్కొనే ఒత్తిడి, బాధను అభిమన్యు ఎవరితోనూ పంచుకోరు.
‘ఊబకాయం వల్ల కలిగే బాధను అనుభవాలను ఎవరికీ చెప్పను. ఎందుకంటే ఒకవేళ దీని గురించి నేను మాట్లాడితే చిన్నచూపు చూస్తారు” అని ఆయన చెప్పారు.
అభిమన్యు 207 కేజీల బరువు నుంచి ప్రస్తుతం 180 కిలోలకు తగ్గారు. కఠోర వ్యాయామం, ఆహార నియంత్రణ విధానాల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు.
”లావుగా ఉన్నవారిని ఏకాకిలా మార్చకండి. వారికి కాస్త మద్దతు ఇస్తే, తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు” అని అభిమన్యు సూచించారు.
బరువు కారణంగా అనేకసార్లు ఎగతాళి, వెక్కిరింతలు వంటి చర్యలతో ఒత్తిడికి గురైనప్పటికీ మానసిక ఆరోగ్య నిపుణులను కలవలేదని, తన స్నేహితుల మద్దతుతో ఒత్తిడిని జయించానని అభిమన్యు తెలిపారు.
అభిమన్యు వంటి చాలామంది ప్రజలు ఊబకాయం కారణంగా ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాలను కోల్పోతుంటారు. లావుగా ఉండటం వల్ల కలిగే ఒత్తిడిని పరిష్కరించకపోతే చాలా ప్రతికూల పర్యవసనాలకు దారి తీస్తుందని ఇటీవలి ఒక ఉదాహరణ చూపిస్తుంది.
కాంచిపురం దురైపాకానికి చెందిన ఇబ్రహీం బాదుషా (46), షంషద్ బేగమ్ (33) అధిక బరువు కారణంగా ఫిబ్రవరిలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో షంషద్ బేగమ్ చనిపోయారు. విషమ పరిస్థితుల్లో ఉన్న ఇబ్రహీంను ఆసుపత్రిలో చేర్చారు.
బరువు పెరగడం కారణంగా ఆరోజు తామిద్దరం చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని బీబీసీతో ఇబ్రహీం చెప్పారు. ప్రస్తుతం ఆయన బరువు 178 కిలోలు.

ఫొటో సోర్స్, Getty Images

ఒత్తిడి, ఊబకాయం అనేవి ఒక నాణేనికి రెండు ముఖాల వంటివి. లావుగా ఉన్న వారు ఎక్కువగా డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 1990-2022 మధ్య కాలంలో పిల్లలు, కౌమారదశ (5-19 ఏళ్లు)లో ఉన్నవారిలో ఊబకాయం 2 నుంచి 8 శాతానికి పెరిగింది. అంటే నాలుగు రెట్లు పెరిగింది. 18 ఏళ్లు అంతకంటే పైబడిన 7 నుంచి 16 శాతానికి అంటే రెట్టింపు అయింది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (2019-21) వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌లో 24 శాతం మహిళలు, 23 శాతం పురుషులు ఒబెసిటీతో ఉన్నారు.
ఇందులో 6.4 శాతం మహిళలు, 4 శాతం పురుషులు వయస్సు 15-49 ఏళ్ల మధ్య ఉంటుంది.
అలాగే, అయిదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు కూడా పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4 (2015-16)లో మోర్టాలిటీ రేటు 2.1 శాతం ఉండగా, అయిదో సర్వే నాటికి 3.4 శాతానికి పెరిగింది.
ఒబెసిటీ వేగంగా పెరుగుతున్న సామాజిక వ్యాధిగా మారుతున్నందున దీనితో వచ్చే మానసిక సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మానసిక ఆరోగ్య కౌన్సిలర్లు, వైద్య ప్రపంచం నొక్కిచెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవీణ్ రాజ్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో బేరియాట్రిక్ సర్జన్. రెండేళ్ల క్రితం తన వద్దకు బరువు తగ్గడానికి చికిత్స కోసం వచ్చిన దాదాపు 150 మందిపై ఆయన ఒక అధ్యయనం చేశారు.
లావుగా ఉన్న వారు ఎలాంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనే అంశాన్ని ప్రవీణ్ రాజ్ బృందం అధ్యయనం చేసింది.
”72 శాతం రోగులు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం మంది ఒబెసిటీ కారణంగానే మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యారు” అని అధ్యయనంలో తేలింది.
ఒబెసిటీ కారణంగా తాను ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడమని ముంబయికి చెందిన దీపక్ తెలిపారు.
”క్యూలో నిలబడటం ఇబ్బందిగా ఉంటుంది. బస్సుల్లో లేదా ఇంకెక్కడైనా మాతో సీటు పంచుకోవడానికి అందరూ వెనకాడతారు. ఇతరుల వల్ల కలిగే ఇబ్బంది కారణంగా పెద్దగా బయటకు వెళ్లను” అని ఆయన చెప్పారు.
ఐటీలో పనిచేసే దీపక్ 150 కిలోల బరువు నుంచి ఇప్పుడు 112 కిలోలకు తగ్గారు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా ఆయన బరువు తగ్గించుకున్నారు.
”నేను అన్ని రకాల డైట్ ప్రయత్నించాను. జిమ్‌కు వెళ్లాను. కానీ, బరువు తగ్గలేదు. ఒకవేళ కష్టపడి కాస్త బరువు తగ్గినా మళ్లీ వెంటనే బరువు పెరిగేవాడిని” అని దీపక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఊబకాయంతో లావుగా ఉండాలని ఎవరూ కోరుకోరని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని డాక్టర్ ప్రవీణ్ అన్నారు.
”చాలామంది, ముఖ్యంగా 20-25 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలు పైకి చూడటానికి సంతోషంగా కనిపిస్తారు. కానీ వాస్తవానికి వారు సంతోషంగా ఉండరు. ఎందుకంటే, చూసే ప్రతీ ఒక్కరూ వారికి ఏదో సలహా ఇస్తూనే ఉంటారు. సమాజం వారిని బద్ధకస్తులుగా ముద్ర వేస్తుంది” అని ప్రవీణ్ చెప్పారు.
లావుగా ఉండే వ్యక్తులు మానసికంగా చాలా ప్రభావితం అవుతారు. ఎందుకంటే వారిని చూసే ప్రతీఒక్కరూ వారి శరీర ఆకృతి గురించి మాట్లాడుతుంటారు.
”దీన్ని దాచడానికి వారు సంతోషంగా ఉన్నట్లుగా నటించడం మొదలుపెడతారు. కానీ, నేను నా దగ్గరికి వచ్చేవారితో మాట్లాడుతున్నప్పుడు వీటిని తలుచుకొని వారు ఏడుస్తుంటారు. తమ బలహీనతను దాచే ప్రయత్నంలో భాగంగా సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు.
అలాగే కుటుంబ సమస్యలు, రిలేషన్‌షిప్ సమస్యలు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి తామే కారణమనే అపరాధ భావంలో ఉంటారు. సమాజం గానీ, కుటుంబసభ్యులు గానీ వారిని అర్థం చేసుకోరు. ఇది తినడం వల్ల కాదు, ఒక వ్యక్తి జీవక్రియపై ఆధారపడిన అంశమని అందరూ అర్థం చేసుకోవాలి” అని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

లావుగా ఉన్న వారికి జీవిత భాగస్వామి దొరకడం కూడా కష్టమేనని, ఏదో ఒక సమయంలో కుటుంబీకులు కూడా నిర్లక్ష్యం చేయడం మొదలుపెడతారని అభిమన్యు అన్నారు.
తన ప్రేమ జీవితానికి ఒబెసిటీ అడ్డుపడిందని ఆయన తెలిపారు.
తనకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని, స్నేహితుల మద్దతుతో వాటి నుంచి బయటపడ్డానని ఆయన చెప్పారు.
లావుగా ఉన్నవారు తమచుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ.. తమపై వచ్చే జోకులు, ఎగతాళిని పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తారని, తమ సమస్యలను దాచేందుకు ప్రయత్నిస్తారని ఆయన అన్నారు.
ఒబెసిటీ వల్ల ఏర్పడే మానసిక ఆరోగ్య సమస్యలను చాలామంది సీరియస్‌గా తీసుకోరని చెన్నైకి చెందిన మానసిక ఆరోగ్య కౌన్సిలర్ మేరీ చెప్పారు.
మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల తిండి అలవాట్లు, నిద్ర, జీవనశైలిలో పెనుమార్పులు వస్తాయని ఆమె తెలిపారు.
సమాజం ఆదర్శంగా భావించే శరీర ఆకృతికి రావడానికి లావుగా ఉన్నవారు ఎంతో కష్టపడతారని దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటారని చెప్పారు.
కొందరు అధిక బరువు ఉన్నప్పటికీ సానుకూల దృక్పథంతో నిరంతరం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు.
”చిన్నప్పటి నుంచి నేను అధిక బరువు ఉండేదాన్ని. బరువు కారణంగా నేనెప్పుడూ ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లలేదు. కానీ, నిరంతరం బరువు తగ్గడంపైనే దృష్టి పెడతాను. కాస్త బరువు తగ్గినా దాన్ని స్ఫూర్తిగా తీసకొని మరింత కష్టపడతాను. నేను సంతోషంగా ఉన్నాను” అని చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్, 32 ఏళ్ల కావ్య చెప్పారు.

ఇతరులు గేలి చేస్తున్నారని, ఆట పట్టిస్తున్నారనే కారణంతో వేగంగా బరువు తగ్గేందుకు ప్రయత్నించకూడదని వైద్యులు చెబుతున్నారు. అలాగే నిపుణుల సలహా లేకుండా వివిధ రకాల డైట్‌లు అనుసరించకూడదని సూచిస్తున్నారు.
”మొదట ఒక వ్యక్తి అధిక బరువుకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత వారి బరువు ఆధారంగా జీవన శైలిలో మార్పులు, మందులు, బేరియాట్రిక్ సర్జరీ వంటి చికిత్సలను వైద్యులు సూచిస్తారు” అని డాక్టర్ ప్రవీణ్ చెప్పారు.
ముఖ్య గమనిక:
మానసిక ఆరోగ్య సమస్యలను మందులు, థెరపీతో సులభంగా పరిష్కరించుకోవచ్చు. మానసిక ఆరోగ్య సహాయం కోసం మీరు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ హెల్ప్‌లైన్ (1800 599 0019)ను సంప్రదించవచ్చు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
SOURCE : BBC NEWS