Home LATEST NEWS telugu తాజా వార్తలు నిధి తివారీ: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీ హోదా వరకు ఎదిగిన ఈమె ఎవరు?

నిధి తివారీ: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీ హోదా వరకు ఎదిగిన ఈమె ఎవరు?

2
0

SOURCE :- BBC NEWS

నిధి తివారీ 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి

ఫొటో సోర్స్, Dr. Sushil Jaiswal

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి నిధి తివారీ నియమితులయ్యారు.

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) సంస్థ మార్చి 29న ఈ నియామకానికి సంబంధించిన ఒక ఉత్తర్వును జారీ చేసింది.

నిధి నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని తెలిపింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని డీఓపీటీ పేర్కొంది.

ఇప్పటి వరకు నిధి, ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)లో ఉప కార్యదర్శి (డిప్యూటీ సెక్రటరీ)గా పని చేస్తున్నారు. ఆమె నియామకం కో టర్మినస్ ఆధారంగా జరిగింది. కో టర్మినస్ అంటే ప్రధానమంత్రి పదవీకాలం ముగిసేంతవరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఉండే పదవీకాలం.

ఇప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా ఆమె ప్రధాని మోదీ రోజువారీ పరిపాలనా పనులను చూస్తారు. అంటే రోజువారీ షెడ్యూల్‌ను నిర్వహించడం, పాలసీ, పాలనా సమన్వయం, కమ్యూనికేషన్ వంటివి ఆమె పర్యవేక్షిస్తారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నిధి తివారీ

ఫొటో సోర్స్, FB/Unofficial: Diplomats of India

ఎవరీ నిధి తివారీ?

నిధి తివారీ, 2014 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 96వ ర్యాంకు సాధించారు.

ప్రైవేట్ సెక్రటరీగా నియామకానికి ముందు ఆమె గత రెండున్నరేళ్లుగా ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారు. ఉప కార్యదర్శిగా విదేశాంగ, భద్రతా అంశాలకు చెందిన కీలక విభాగాలను ఆమె నిర్వహించారు.

దీనికంటే ముందు, నిధి తివారీ 2022 నవంబర్‌లో అండర్ సెక్రటరీగా పీఎంఓలో చేరారు.

2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంకు సాధించడానికి ముందు ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్)గా పని చేశారు.

నిధి తివారీ భర్త సుశీల్ జైస్వాల్ డాక్టర్. ఆయన వారణాసిలో సొంతంగా ఆసుపత్రి నడుపుతున్నారు.

”సర్వీస్‌లో రకరకాల బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఇది చాలా పెద్ద బాధ్యత. నిధి చాలా కష్టపడుతుంది. ఈ బాధ్యత స్వీకరించడానికి ఆమె ఉత్సాహంగా ఉంది” అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డాక్టర్ సుశీల్ జైస్వాల్ అన్నారు.

పీఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ, విదేశాంగ మంత్రిత్వ శాఖలో పని చేశారు. ఆ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల బృందంలో నిధి సభ్యురాలు.

అంతర్జాతీయ సంబంధాల్లో ఆమెకు ఉన్న నైపుణ్యాలు పీఎంఓలో చేరాక ఉపయోగపడ్డాయి. అక్కడ ఆమె జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ నేతృత్వంలోని ‘విదేశీ, భద్రతా’ విభాగంలో పనిచేశారు.

నిధి తివారీ అపాయింట్‌మెంట్ లెటర్

ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధత

లఖ్‌నవూకు చెందిన నిధి తివారీ ఇక్కడే తన ప్రాథమిక విద్య, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

బీఎస్సీ (బయాలజీ)లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు.

2006లో బీహెచ్‌యూలో బయోకెమిస్ట్రీలో ఆమె పీజీ పూర్తయింది. పీజీలో ఆమె బంగారు పతకం సాధించారు.

తర్వాత, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఆమె శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. 2008లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు చదవడం మొదలుపెట్టారు నిధి.

”సైంటిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆమె రెండుసార్లు (2008, 2009) యూపీ సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామ్ (పీసీఎస్)కు ఎంపికయ్యారు. 2008లో బేసిక్ శిక్షా అధికారిగా, 2009లో అసిస్టెంట్ కమిషనర్ (సేల్స్ ట్యాక్స్)గా ఆమె సెలెక్ట్ అయ్యారు” అని డాక్టర్ సుశీల్ జైస్వాల్ చెప్పారు.

2012 సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా నిధి ఉత్తీర్ణత సాధించారు. కానీ, అప్పుడామె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటంతో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఆమె ఉద్యోగంలో కొనసాగారు.

తర్వాత 2013లో మరోసారి సివిల్స్ పరీక్ష రాసి 96వ ర్యాంక్ సాధించారు.

అజిత్ డోభాల్

ఫొటో సోర్స్, Getty Images

మోదీ టీమ్‌లో ఎవరెవరు ఉన్నారు?

ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ ప్రమోద్ కుమార్ (పీకే) మిశ్రా పనిచేస్తున్నారు. పీకే మిశ్రా, గుజరాత్ క్యాడర్‌ 1972కు బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి.

ప్రధాని మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 2001-2004 కాలంలోనూ ప్రమోద్ కుమార్ ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు.

ఈ జాబితాలోని రెండో పేరు అజిత్ డోభాల్. ఈయన ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారు. డోభాల్ చాలా కాలంగా ఎన్‌ఎస్‌ఏకు సేవలు అందిస్తున్నారు. 2014 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. 1968లో అజిత్ డోభాల్, కేరళ క్యాడర్‌లో ఐపీఎస్‌గా చేరారు. 2004-05లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్‌గా ఉన్నారు.

తదుపరి పేరు శక్తికాంత దాస్. ఆయన 2025 ఫిబ్రవరి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ-2గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒడిశాలో జన్మించిన శక్తికాంత దాస్ 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టమైన అధికారుల్లో ఒకరిగా దాస్‌కు పేరుంది. ఈయన ఆరేళ్లు ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేశారు.

వీరే కాకుండా, పీఎంఓలో వివేక్ కుమార్ (ఐఎఫ్‌ఎస్ 2004), హార్దిక్ సతీశ్‌చంద్ర షా ప్రైవేట్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. షా 2010 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఆఫీసర్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS