Home జాతీయ national telgu నార్వే యువరాణి-ఎప్‌స్టీన్‌ల మధ్య స్నేహం: ‘అతను కోరుకునే తరహా వ్యక్తిత్వం కాదు నాది’

నార్వే యువరాణి-ఎప్‌స్టీన్‌ల మధ్య స్నేహం: ‘అతను కోరుకునే తరహా వ్యక్తిత్వం కాదు నాది’

15
0

SOURCE :- BBC NEWS

జెఫ్రీ ఎప్‌స్టీన్,  అమెరికన్ జస్టిస్ డిపాార్ట్‌మెంట్, నార్వే  యువరాణి, రాజ కుటుంబం

ఫొటో సోర్స్, Visionhaus/Getty Images

దివంగత లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్నేహం చేసినందుకు దేశ ప్రజలను క్షమాపణ కోరారు నార్వే యువరాణి మెట్టే మరిట్.

వాళ్లిద్దరి మధ్య మూడేళ్ల పాటు సంభాషణలు జరిగినట్లు వెల్లడైంది.

“రాజు, రాణితో పాటు రాజకుటుంబానికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి తెచ్చినందుకు కూడా నేను క్షమాపణ చెబుతున్నాను” అని ఆమె ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎప్‌స్టీన్‌తో స్నేహం గురించి స్పందించాలని కొన్నాళ్లుగా ఆమెపై ఒత్తిడి పెరుగుతోంది.

ఆమె స్పందనపై కింగ్ హెరాల్డ్ 5 , క్వీన్ సొంజా ఏమీ మాట్లాడలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

క్రౌన్ ప్రిన్స్‌ హాకోన్‌తో పాటు ప్రధానమంత్రి జోనస్ గహార్ స్టోర్‌ను కలిశారు కింగ్ హెరాల్డ్ 5.

ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడిన క్రౌన్ ప్రిన్స్ హాకోన్, తన భార్య మీతో మాట్లాడాలని అనుకుందని వెల్లడించారు.

‘‘అయితే ఇప్పుడామె మాట్లాడదు. మాట్లాడేందుకు నీకు అనుమతి లేదని నేను ఆమెకు చెప్పాను’’ అని హాకోన్ వెల్లడించారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్,  అమెరికన్ జస్టిస్ డిపాార్ట్‌మెంట్, నార్వే  యువరాణి, రాజ కుటుంబం

ఫొటో సోర్స్, Rune Hellestad/Getty Images

ఎప్‌స్టీన్ ఇంట్లో 4 రోజులున్న యువరాణి

అమెరికన్ న్యాయ విభాగం ఇటీవల విడుదల చేసిన ఫైళ్లలో భాగంగా 2011- 14 మధ్య కాలంలో నార్వే యువరాణి- ఎప్‌స్టీన్ ప్రమేయం ఉన్న వందల సంఖ్యలో ఈమెయిళ్లు వెలుగులోకి వచ్చాయి.

అందులో కొన్నింటిలో ఎప్‌స్టీన్‌ను నేరుగా కలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా ఉంది. ఫ్లోరిడాలోని ఎప్‌స్టీన్ పామ్ బీచ్ హౌస్‌లో ఆమె నాలుగు రోజులు గడిపారు. ఆ సమయంలో ఎప్‌స్టీన్ ఇంట్లో లేరని బహిర్గతమైన ఈమెయిల్స్ వెల్లడించాయి.

ఈ ఉత్తర ప్రత్యుత్తరాలలో వారి మధ్య సాగిన స్నేహాన్ని చూసి నార్వే ప్రజలు నిర్ఘాంతపోయారు. ఎప్‌స్టీన్ 2008లో జైలుశిక్ష అనుభవించిన విషయం ఆమెకు అప్పటికే తెలుసని మెయిళ్ల ద్వారా అర్థమవుతోంది.

“గత ఈమెయిల్ తర్వాత నీ గురించి గూగుల్‌లో వెతికాను. చేసిన పని మంచిది కాదని ఒప్పుకో” అని ఆమె 2011 అక్టోబర్‌లో రాసి ఉన్న మెయిల్‌లో ఉంది.

జెఫ్రీ ఎప్‌స్టీన్,  అమెరికన్ జస్టిస్ డిపాార్ట్‌మెంట్, నార్వే  యువరాణి, రాజ కుటుంబం

ఫొటో సోర్స్, Corbis via Getty Images

‘నా నిర్ణయం తప్పే’

యువరాణి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో తాను చింతిస్తున్నట్లు చెప్పడంతోపాటు తనది “సరైన నిర్ణయం కాదు” అని అందులో చెప్పారు. ఆమెకు ఎప్‌స్టీన్‌ ఎంత బాగా తెలుసనే దాని గురించి మరిన్ని వివరాలు అందించాలని ప్యాలెస్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

అతను ఎలాంటి వాడో ముందుగానే గ్రహించలేకపోయినందుకు యువరాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారని ప్యాలెస్ శుక్రవారం నాటి ప్రకటనలో తెలిపింది.

ఆమె దీనిపై మరింత వివరణ ఇవ్వాలని అనుకున్నారు. అయితే తాను ప్రస్తుతం ‘చాలా విచారంలో ఉన్నాననీ, బయటపడటానికి సమయం ఇవ్వాలని కోరారు.

“మిమ్మల్నందరినీ నిరుత్సాహపరిచినందుకు ముఖ్యంగా నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఎప్‌స్టీన్ నాకు మధ్య నడిచిన సందేశాలలోని కొంత భాగంలో ప్రస్తావించినట్లుగా ఉండాలనుకునే వ్యక్తిని కాదు నేను” అని ఆమె చెప్పారు.

మెట్టే మరిట్‌ 2001లో నార్వే యువరాజు హాకొన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి జరిగే నాటికే ఆమెకు మరియస్ బోర్గ్ హొయిబే అనే నాలుగేళ్ల కొడుకు ఉన్నారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్,  అమెరికన్ జస్టిస్ డిపాార్ట్‌మెంట్, నార్వే  యువరాణి, రాజ కుటుంబం

ఫొటో సోర్స్, NTB/Ane Hem via REUTERS

మరియస్ బోర్గ్‌కు ఇప్పుడు 29 ఏళ్లు. ఫిబ్రవరి 4న ప్రారంభమైన హైప్రొఫైల్ కేసు విచారణలో ఆయనపై 38 అభియోగాలు ఉన్నాయి. అందులో 4 అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. అయితే వాటిని ఆయన తిరస్కరిస్తున్నారు.

ఆయన రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కాకున్నప్పటికీ, ప్రజా జీవితంలో లేనప్పటికీ అతను సవతి తండ్రి యువరాజు హాకొన్ ఇంట్లో ప్రిన్సెస్ ఇంగ్రిడ్ అలెగ్జాండ్రా, ప్రిన్స్ స్వెర్రే మాగ్నస్‌తో కలిసి పెరిగారు.

కొడుకు మీద కోర్టు విచారణ గురించి ప్రిన్సెస్ మెట్టే మరిట్ ఏమీ మాట్లాడలేదు. అయితే ప్రిన్స్ హాకొన్ మాట్లాడుతూ, తన ఇంట్లో చాలా జరుగుతోందని, కొన్నాళ్లుగా “తన వాళ్లను జాగ్రత్తగా చూసుకోవడం” తనకు చాలా ముఖ్యమైన అంశంగా మారిందని చెప్పారు.

“మరియస్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతనికి మేము మద్దతిస్తాం. అలాగే మిగతా పిల్లల్ని కూడా చూసుకోవాలి. వాళ్లకు కూడా మా సంరక్షణ కావాలి. యువరాణిని కూడా నేను జాగ్రత్తగా చూసుకోవాలి” అని ఆయన చెప్పారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్,  అమెరికన్ జస్టిస్ డిపాార్ట్‌మెంట్, నార్వే  యువరాణి, రాజ కుటుంబం

ఫొటో సోర్స్, Rune Hellestad/Getty Images

మెట్టే మరిట్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు. ఆమెకు పల్మనరీ ఫైబ్రోసిస్ అనే వ్యాధి ఉంది. ఊపిరితిత్తుల మార్పిడి రోగుల జాబితాలో ఆమెను చేర్చేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరియస్ బోర్గ్ బుధవారం కోర్టులో సాక్ష్యం చెప్పే సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు చాలా కష్టపడ్డారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి పత్రికలు తనను ‘చాలా ఇబ్బంది’ పెడుతున్నాయని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఓస్లో జిల్లా కోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న కేసులో అతను దోషిగా తేలితే కనీసం 10 ఏళ్లు జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు, కత్తితో దాడి చేయడం, నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారనే అనుమానంతో ఆయన్ని నాలుగోసారి అరెస్ట్ చేశారు.

22 ఏళ్ల ప్రిన్సెస్ అలెగ్జాండ్రా కూడా పత్రికలను విమర్శించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక పోస్టు పెట్టారు.

ప్రభుత్వ ప్రసార సంస్థలు ఎన్‌ఆర్కే, అప్టెన్‌పొస్టెన్, వీజీ వెబ్‌సైట్‌ల ద్వారా బహిర్గతమైన సుదీర్ఘ వ్యాఖ్యలలో “ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు” అని యువరాణి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాశారు.

తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదని చెబుతూనే “మరియస్, అమ్మ, నాన్న, మాగ్నస్ అనే కాదు. ఎవరి మీద వ్యక్తిగత దాడి సరికాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. నా మనసు సరిగ్గా లేదు అందుకే నేను ఈ పోస్టు రాస్తున్నాను’’ అని ఆమె ఆ పోస్టులో రాశారు.

దీనిపై ప్యాలెస్ వివరణ కోసం బీబీసీ సంప్రదించినప్పుడు తాము ఎలాంటి వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడటం లేదని ప్యాలెస్ వర్గాలు చెప్పాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)