Home జాతీయ national telgu నాట్‌గ్రిడ్‌: నేరస్థులు ఎక్కడున్నా పట్టుకోగలదంటున్న ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

నాట్‌గ్రిడ్‌: నేరస్థులు ఎక్కడున్నా పట్టుకోగలదంటున్న ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

5
0

SOURCE :- BBC NEWS

నాట్ గ్రిడ్

ఫొటో సోర్స్, UGC

గుంటూరులోని లాలాపేటకి చెందిన ఆసిఫ్‌ అనే యువకుడు రెండేళ్ల కిందట గంజాయి కేసులో అరెస్టయి రిమాండ్‌కు వెళ్లారు. పలు కేసుల్లో కూడా నిందితుడైన ఆయనపై పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌లో ఏ–1 రౌడీషీట్‌ ఉంది.

గంజాయి కేసులో జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఆసిఫ్ కనిపించకుండా పోయారు.

నిబంధనల మేరకు రౌడీషీట్‌ ఉన్న వాళ్లు ప్రతి శని, ఆదివారాల్లో ఒకరోజు తనపై షీట్‌ తెరిచిన పోలీస్‌ స్టేషన్‌కి కౌన్సిలింగ్‌ కోసం వెళ్లాలి. కానీ ఆసీఫ్ గత రెండేళ్లుగా ఆ పని చేయలేదు.

పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆచూకీ కనుక్కోలేకపోయారు. మొబైల్‌ సిగ్నల్‌ ద్వారా టవర్‌ లొకేషన్‌ ట్రేస్‌ చేద్దామని చూసినా ఆసిఫ్ సెల్‌ఫోన్, సిమ్ వివరాలు లేకపోవడంతో వెతకడం కష్టమైంది.

ఇటీవల పాత గుంటూరు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ఆసిఫ్‌ పేరు బయటకు రావడంతో గుంటూరు ఎస్పీ సతీష్‌కుమార్‌ నిందితుడి ట్రాక్‌ రికార్డ్‌ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.

గత రెండేళ్లుగా ఆసిఫ్ కదలికలు గానీ సమాచారం గానీ తమ వద్ద లేవని, ఫోన్‌లు వాడకపోవడంతో ట్రేస్‌ చేయలేకపోతున్నామని పోలీసులు చెప్పారు. దీంతో నాట్‌ గ్రిడ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆసిఫ్ కదలికలను పసిగట్టారు ఎస్పీ సతీష్‌కుమార్‌.

ఆసిఫ్ ముంబయిలో ఉన్నట్లు నిర్ధరించుకున్నారు. పాత గుంటూరు పోలీసులు ముంబయి వెళ్లి ఆయన్ను పట్టుకుని తీసుకొచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
నాట్ గ్రిడ్

ఫొటో సోర్స్, Getty Images

నాట్‌ గ్రిడ్‌ అంటే ఏమిటి?

నాట్‌గ్రిడ్ అంటే నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్. ఇది పూర్తిగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని డేటాబేస్‌. భారత్‌లో ఉగ్రవాదులు, తీవ్రవాదుల కట్టడి కోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ డేటా బేస్‌.

దేశంలో వివిధ కీలక నిఘా సంస్థలకు పౌరుల సమాచారాన్ని ఇది క్షణాల్లో అందిస్తుంది. ప్రతీ పౌరుడికి సంబంధించి 21 అంశాలకు చెందిన డేటా బేస్‌ ఈ గ్రిడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది.

ఉగ్రదాడులు, తీవ్రవాదుల నుంచి అవాంఛనీయ పరిణామాలు తలెత్తకుండా ముందుగానే వారి కదలికలను, పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి అప్రమత్తమయ్యేందుకు ఈ నాట్‌గ్రిడ్‌‌ను వాడుతున్నారు.

దాడులు జరిగినప్పుడు తీసుకొనే చర్యల కన్నా అలాంటి ఘటనలు తలెత్తకుండా మొదట్లోనే పసిగట్టి నివారించే విధంగా, అంటే కౌంటర్‌ టెరర్రిజం నిర్వహించేందుకు తోడ్పడేలా నాట్ గ్రిడ్‌ను రూపొందించారు.

నాట్‌ గ్రిడ్‌ క్యాంపస్‌

ఫొటో సోర్స్, UGC

ఎప్పుడు రూపొందించారు?

దేశంలో ఉగ్రవాదుల దాడులు జరగకుండా ముందుగా ప్రమాదాన్ని పసిగట్టేందుకు కేంద్ర నిఘా వ్యవస్థలు ఐ.బి. (ఇంటెలిజెన్స్‌ బ్యూరో), రా (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్‌) ఉన్నాయి. అయితే 2008 నవంబర్‌లో ముంబయి నగరంపై టెరర్రిస్టుల దాడి ఘటన.. దేశంలో నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది.

ముంబయి దాడులకు ముందుగా ఉగ్రవాదులు దేశంలో రెక్కీ నిర్వహించినా, పాకిస్తాన్‌ నుంచి ఎన్నిసార్లు వచ్చి వెళ్లినా నిఘా వర్గాలు పసిగట్టలేక పోయాయనే వాదన వినిపించింది.

అనుమానాస్పద వ్యక్తులను, వారి ప్రయాణాలను సందేహించక పోవడం, కీలక సమాచారాన్ని సేకరించడంలోనూ, సమాచారాన్ని సంబంధిత వర్గాలకు అందించి సమన్వయం చేయడంలోనూ నిఘా సంస్థల లోపం కనిపించిందన్న వాదనలు ఉన్నాయి.

దీంతో ఈ సమస్యలను అధిగమించే లక్ష్యంగా 2009 డిసెంబర్‌లో కేంద్రప్రభుత్వం హోంశాఖ ఆధీనంలో జాతీయ నిఘా గ్రిడ్‌ (నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌)ను ఏర్పాటు చేసింది.

టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

సమాచార బదిలీకి వేదిక

వివిధ నిఘా సంస్థల మధ్య కీలక సమాచార మార్పిడికి నాట్‌గ్రిడ్‌ ఒక సమన్వయ వేదికగా పనిచేస్తుంది. ప్రధానంగా 11 సంస్థల మధ్య ఉగ్రవాద సంబంధిత సమాచారం అత్యంత రహస్యంగా పకడ్బందీగా మార్పిడి జరుగుతుంది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌‌మెంట్‌ డైరెక్టరేట్, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, రీసెర్చ్‌ అండ్‌ ఎనాలిసిస్‌ వింగ్, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్, సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇంటెలిజెన్స్, ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌‌లకు డేటాను అందిస్తారు.

ఆయా సంస్థలు మినహా, మిగిలిన ఏ సంస్థలు నాట్‌ గ్రిడ్‌‌లోకి ప్రవేశించి డేటా బేస్‌ని తీసుకోవడానికి గానీ, హాకింగ్‌ చేసేందుకు గానీ వీలు లేకుండా అత్యంత పగడ్బందీగా వ్యవస్థను రూపొందించారు.

పౌరుల సమాచారం దుర్వినియోగం కాకుండా లైసెన్స్‌ కలిగిన కీలక అధికారులు మాత్రమే నాట్‌ గ్రిడ్‌‌ను ఉపయోగించేటట్లుగా రూపొందించారు.

ఏయే సమాచారం ఉంటుంది?

ప్రతీ పౌరుడికి సంబంధించిన 21 అంశాలకు చెందిన పూర్తి సమాచారం నాడ్‌ గ్రిడ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఫోన్‌ ఉన్న ప్రతి వ్యక్తి వివరాలు, ఫోన్‌ కాల్స్, ఇప్పుడు ఏ సిమ్‌లు వాడుతున్నారనే సమాచారంతో పాటు గతంలో వాడి పడేసిన సిమ్‌ల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్‌ కార్డ్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్ వివరాలు, సెబీ లావాదేవీలు, రైల్వేస్, ఎయిర్‌ లైన్స్, బస్‌ ట్రావెల్‌ వివరాలు, టోల్‌గేట్ల మీదుగా సాగించే ప్రయాణ వివరాలు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్, వీసా, ఇమ్మిగ్రేషన్‌ వివరాలు, నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో, క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌ వర్క్‌ సిస్టం వంటి 21 అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించి, వడపోసి డేటా బేస్‌ను సిద్ధంచేస్తుంది.

అనుమానిత వ్యక్తుల, సంస్థల కీలక సమాచారాన్ని క్షణాలలో అవసరమైన నిఘా వర్గాలకు అందజేస్తుంది.

నాట్‌గ్రిడ్‌ అనేది డేటాను నిల్వ చేయకపోయినప్పటికీ, వివిధ డేటాబేస్‌ల నుంచి డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది.

మొదటి దశలో రాష్ట్రాలకు గ్రిడ్‌ సమాచారాన్ని అందించకపోయినా, ఇటీవలి కాలంలో రాష్ట్రాలకు కూడా అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ, పోలీస్‌ కమిషనర్ల వద్ద మాత్రమే ఆ లాగిన్, పాస్‌వర్డ్‌ ఉంటాయి. కేవలం వాళ్లు మాత్రమే ఆపరేట్‌ చేసేందుకు అనుమతించారు.

సతీష్ కుమార్

ఫొటో సోర్స్, UGC

నాట్‌గ్రిడ్‌ సాయంతో పట్టుకున్నాం: ఎస్పీ సతీశ్ కుమార్‌

‘‘రెండేళ్లుగా పరారీలో ఉన్న నిందితుడు ఫోన్‌లు వాడకపోవడంతో అతని కదలికలను పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో నాట్‌గ్రిడ్‌ నుంచి సమాచారం తీసుకుంటే అతను ఇటీవల ఓ ట్రావెల్స్‌ ద్వారా ముంబయికి టికెట్‌ బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది. ముంబయిలో అతని పరిచయస్తులు ఎక్కడున్నారనే సమాచారం సేకరించాం. ఆ ఏరియా లొకేషన్‌ రాగానే మా పోలీసులు అక్కడికి వెళ్తే దొరికాడు” అని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్‌ బీబీసీతో చెప్పారు.

నాట్‌ గ్రిడ్‌ సాయంతో నిందితుడు ఎక్కడున్నాడనే లొకేషన్‌ తెలుసుకొని, ఆ నిందితుడి ఫోటో ఆధారంగా ఏ ఇంట్లో ఉన్నాడో గుర్తించొచ్చని ఎస్పీ వివరించారు. వాస్తవానికి నాట్‌ గ్రిడ్‌ను ఎలా వినియోగిస్తారన్న సమాచారం ఇంతకుమించి బయటకు చెప్పకూడదని ఎస్పీ బీబీసీతో అన్నారు.

”ఇది ఉపయోగించిన రెండు నెలల వ్యవధిలోనే ఎన్నో కేసుల్లో పురోగతి సాధించాం కానీ, వినియోగించే పద్ధతిని పొరపాటున కూడా బయటకు వెల్లడించకూడదు” అని మీడియాకు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బీబీసీతో అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)