Home జాతీయ national telgu నాగర్ కర్నూలు గ్రౌండ్ రిపోర్ట్: “డిసెంబరు 21న పుట్టిన మా పాప ఫిబ్రవరి 21నే చనిపోయింది”

నాగర్ కర్నూలు గ్రౌండ్ రిపోర్ట్: “డిసెంబరు 21న పుట్టిన మా పాప ఫిబ్రవరి 21నే చనిపోయింది”

6
0

SOURCE :- BBC NEWS

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

“చిన్నపిల్లకు ఎవరో చెప్పినట్లు, లోపల వాళ్ల నాయన (నాన్న)ను కొడుతుంటే, మా పాప గట్టిగా ఏడ్చేసింది సారూ.. వాళ్ల నాయనను కొట్టడం ఆపేస్తే పాప ఏడుపు ఆపేసింది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు చిలికేశ్వరం మౌనిక.

నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలం కుమ్మెర గ్రామంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా తలెత్తిన వివాదం రెండు కులాల మధ్య పంచాయితీగా మారింది.

రజక కులానికి చెందిన కుటుంబంపై ఊళ్లోని రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కొందరు దాడి చేశారని, ఆ దాడి వల్ల రెండు నెలల పసికందు చనిపోయిందనే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

తన రెండు నెలల కుమార్తెను రెడ్డి కులానికి చెందిన వ్యక్తులు కాలితో తన్నడంతో చనిపోయిందని రజక కులానికి చెందిన చిలికేశ్వరం గణేశ్ ఆరోపిస్తున్నారు.

దీన్ని స్థానిక రెడ్డి కులస్థులు ఖండిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

అబ్బాయిది రజక కులం.. అమ్మాయిది ఎస్సీ కులం

ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంతో రాష్ట్ర నేతలు నాగర్ కర్నూల్ వెళ్లి గణేశ్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఘటనపై పారదర్శకంగా విచారణ చేస్తున్నామని నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

ఫిబ్రవరి 23న బీబీసీ కుమ్మెర గ్రామానికి వెళ్లింది.

ఘటనపై నలుగురైదుగురు చర్చించుకుంటూ కనిపించారు. కానీ దాని గురించి మాతో మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

గణేశ్ ఇంటికి వెళ్లే ప్రధాన రహదారిపై పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబాన్ని కలిసేందుకు ముందుగా ఆయన ఇంటికి వెళ్లాం.

ప్రస్తుత సర్పంచ్ తుకారాం రెడ్డి ఇంటి వెనుక వైపు ఉన్న గణేశ్ ఇల్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. కానీ పునాది దశలోనే ఇంటి నిర్మాణం ఆగిపోయినట్లు కనిపించింది. వారి కుటుంబం ఆ పక్కనే రేకుల షెడ్డు వేసుకుని ఉండేది.

ఫిబ్రవరి 18న దాడి ఘటన తర్వాత గణేశ్ కుటుంబం ఊళ్లో ఉండటం లేదని గ్రామస్థులు చెప్పారు.

గణేశ్‌కు నేను ఫోన్ చేసినప్పుడు తామంతా నాగర్ కర్నూల్‌లో తలదాచుకుంటున్నామని చెప్పారు.

“దాడి ఘటన తర్వాత ఊళ్లోకి వెళ్లడం మానేశాం. రెడ్డి కులస్థులు ఏమైనా చేస్తారనే భయంతో ఊళ్లోకి వెళ్లడం లేదు” అని గణేశ్ భార్య మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఊళ్లో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారని, ఎక్కడా కుల పంచాయతీ లేదని కుమ్మెర గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు సంతోష్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

కుమ్మెరకు చెందిన చిలికేశ్వరం గణేశ్‌, మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్‌కు చెందిన మౌనికను ప్రేమించి ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు.

మౌనికది ఎస్సీ (మాదిగ) కులం కాగా, గణేశ్‌ది రజక కులం. గణేశ్ అక్క కీర్తి కూడా ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. గణేశ్‌కు రెండు నెలల పాప ఉంది.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

అసలేం జరిగింది?

కుమ్మెరలో ఏటా మహాశివరాత్రి నుంచి ఐదు రోజులపాటు మల్లన్న జాతర జరుగుతుంది.

ఫిబ్రవరి 18న జాతర సందర్భంగా గణేశ్ భార్య మౌనిక, చిలికేశ్వరం చంద్రకళ, బుట్టా పార్వతమ్మ, ఆలూరి కీర్తి, మహేశ్వరి జాతరకు వెళ్లారు. మౌనిక తన రెండు నెలల పాపను కూడా వెంట తీసుకెళ్లారు. క్యూ లైను వద్ద గ్రామానికి చెందిన ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి తమను అడ్డుకున్నారని, వంద రూపాయలు చెల్లిస్తే దర్శనానికి అనుమతిస్తామని చెబుతూ వెనక్కి పంపించేశారని ఆలూరి కీర్తి ఆరోపిస్తున్నారు.

“గుట్టపైన శివుడు దర్శనం అయ్యాక కిందకి వచ్చి మల్లన్న స్వామి దర్శనానికి వచ్చాం. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మా ముందున్న ఫ్యామిలీని పంపించి, మమ్మల్ని ఆపేశారు. వందరూపాయలు అక్కడ పెడితేగానీ వెళ్లనివ్వనని చెప్పారు” అని ఆరోపించారు కీర్తి.

తమ ముందున్న, వెనకున్న వాళ్ల నుంచి డబ్బులు అడిగారో లేదో తమకు తెలియదని చెప్పారు.

అయితే మల్లన్న దర్శనానికి ఎలాంటి టికెట్ ఉండదని గ్రామస్థులు చెబుతున్నారు. కేవలం బోనాల సమయంలో బోనం సమర్పించేందుకు 20 రూపాయల టికెట్ ఉంటుంది. అయితే కొబ్బరికాయలు అమ్మే దుకాణంపై ’50రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొంటే ఒకరికి దర్శనం ఉచితం’ అని రాసి ఉంది.

దీనిపై కొందరు గ్రామస్థులను ప్రశ్నిస్తే, కొబ్బరికాయ కొంటేనే దర్శనం ఉచితం అనే నిబంధన లేదని చెబుతున్నారు.

“డబ్బులు చేతికి ఇచ్చేది లేదని, హుండీలో వేస్తాం లేదా అన్న దానానికి ఇస్తామంటే లోపలికి రానివ్వలేదు” అని కీర్తి చెబుతున్నారు.

అయితే, ఈ విషయాలను శ్రీనివాస్ రెడ్డి అన్న ఉండ్యాల శేఖరరెడ్డి ఖండించారు.

“వారు దర్శనం చేసుకోకుండా ఏమీ రాలేదు. గర్భగుడిలోకి వెళతామంటే శ్రీనివాస్ రెడ్డి వద్దని వారించారు. అది కూడా అక్కడ పూజారులుగా ఉండే యాదవులు ముందు నుంచి పెట్టుకున్న నిబంధనే. అందుకే వద్దని వారించారు. అయినప్పటికీ గణేశ్ తల్లి చంద్రకళ గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వచ్చారు” అని అన్నారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

‘మమ్మల్ని బూతులు తిట్టారు’

ఆ సందర్భంలో మాటమాట పెరిగి.. తమను శ్రీనివాస్ రెడ్డి బూతులు తిట్టారని మౌనిక ఆరోపిస్తున్నారు.

“గొడవ జరిగింది. గలీజుగా మాట్లాడారని దర్శనానికి వెళ్లకుండా కిందకు వచ్చి రచ్చకట్ట వద్ద కూర్చుని ఏడుస్తున్నాం. సాయంత్రం ఐదు గంటలప్పుడు గణేశ్ వచ్చి చిన్న పిల్లను ఇంటికి తీసుకురాకుండా అక్కడే ఎందుకు ఉన్నారని అడిగారు” అని మౌనిక చెప్పారు.

“ఎప్పుడూ మాటలు పడని వాళ్లం.. ఈ రోజు ‘రెడ్డి’తో మాటలు పడ్డాం. గుడికి సున్నం వేయాలన్నా, రంగులెయ్యాలన్నా.. దేవుడిని అలంకరించాలన్నా మనం కావాలి. దర్శనానికి మనం వద్దా అని మా ఆయన, మా అత్తమ్మ చంద్రకళ ఏడ్చారు” అని మౌనిక చెప్పారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

వాట్సాప్ గ్రూపులో పోస్టుతో మళ్లీ గొడవ

తమ ఆడవాళ్లను బూతులతో దూషించారని, మీ ఇంట్లో వాళ్లను అలాంటి మాటలంటే ఊరుకుంటారా.. అంటూ కుమ్మెర గ్రామ వాట్సాప్ గ్రూపులో గణేశ్ ఓ వాయిస్ మెసేజ్ పోస్టు చేశారని గ్రామస్థులు, ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. అది విని రెడ్డి కులస్థులు, గుడి వద్దనే ఉన్న గణేశ్‌ను కొబ్బరికాయలు కొట్టే గదిలో పడేసి, కొట్టారని వారు చెబుతున్నారు.

ఆయన్ను కొడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

”శ్రీనివాస్ రెడ్డి సహా మరికొందరు గదిలోకి తీసుకెళ్లి, కిందపడేసి ఎట్లా పడితే అట్లా కొట్టారు. మొత్తం 20-30 మంది కొట్టారు” అని గణేశ్ చెబుతున్నారు. కొడుతుంటే తనను విడిచిపెట్టాలని గణేశ్, ఆయన చనిపోతాడని మౌనిక అరుస్తున్న అరుపులు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నాయి.

”మమ్మల్ని కొట్టండి.. ఏమన్నా చేయండి.. చిన్నపాప ముఖం చూసి వదిలిపెట్టండి అని, నా భార్య వేడుకుంది. వారి కాళ్ల వద్ద పడితే.. నన్ను కొడుతున్న కోపంలో ఎస్.మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి పాపను కాలితో తన్నాడు. పాప ఎగిరి దూరంగా పడింది” అని గణేశ్ ఆరోపిస్తున్నారు.

ఇదే విషయాన్ని గణేశ్ భార్య మౌనిక, అక్క కీర్తి కూడా చెబుతున్నారు.

ఈ విషయాన్ని మధుసూదన్ రెడ్డి భార్య మాధవి ఖండించారు.

”మధుసూదన్ రెడ్డికి ముగ్గురు ఆడపిల్లలు. మా ఆయన అలా ఎందుకు చేస్తారు? అంత చిన్న పసిపిల్లను ఎందుకు కాలితో తన్నుతారు? అది నిజం కాదు” అని ఆమె బీబీసీతో అన్నారు.

శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసి గాయపరిచారని తెలిసిన తర్వాతే గుడి వద్దకు మధుసూదన్ రెడ్డి వెళ్లారని, అప్పటివరకు ఊళ్లోనే ఉన్నారని ఆమె చెబుతున్నారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

‘శ్రీనివాస్ రెడ్డి తలకు గాయమైంది’

ఊరి నుంచి సుమారు రెండున్నర కిలోమీటర్ల దూరంలో వట్టెం రిజర్వాయర్ సమీపంలో గుడి ఉంటుంది.

శ్రీనివాస్ రెడ్డి పోలీసుల అదుపులో ఉండడంతో మొత్తం వివాదంపై ఆయన అన్న ఉండ్యాల శేఖరరెడ్డి బీబీసీతో మాట్లాడారు.

”గొడవలో మా తమ్ముడు ఒక దెబ్బ కొట్టాడు. దానికి గణేశ్ రాయి తీసుకుని శ్రీనివాస్ రెడ్డిని గాయపరిచాడు. తల పగిలి రక్తం కారింది. వాళ్లు ఐదారు మంది వచ్చి కొట్టారు. మేం స్టేషన్‌కు వచ్చి పిటిషన్ ఇచ్చాం. ఈయనకు గాయాలున్నాయి. తలకు దెబ్బ తగిలింది. కాబట్టి పోలీసులు వెంటనే కేసు కట్టారు. ఇరువర్గాలను ఆసుపత్రికి పంపించారు” అని శేఖర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

అయితే, తనపై దాడి చేయబోయిన క్రమంలో గోడ తగిలి శ్రీనివాస్ రెడ్డికి గాయమైందని, తానేమీ కొట్టలేదని గణేశ్ చెబుతున్నారు. ఫిబ్రవరి 18న పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, వారు తీసుకోలేదని చెబుతున్నారు.

ఈ విషయంపై డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.

”ఇరువర్గాలు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డికి అయిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశాం. తనను, తన తల్లిని కొట్టినట్టు గణేశ్ చెబుతుండగా, ఆ దెబ్బలు కనిపించలేదు. అందుకే కోర్టు పర్మిషన్‌తో కేసు నమోదు చేయాలని అనుకున్నాం” అని వివరించారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

ఫిబ్రవరి 18న ఘర్షణ.. ఫిబ్రవరి 21న పాప మరణం

ఫిబ్రవరి 21 తెల్లవారుజామున పాపను పాలు తాగించి పడుకోబెట్టానని, కాసేపటికే చలనం లేకుండా అయిపోయిందని మౌనిక చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు చెప్పారన్నారు.

”పాప నాకు డిసెంబరు 21న పుడితే, మళ్లీ సరిగ్గా రెండు నెలలకు ఫిబ్రవరి 21న చనిపోయింది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మౌనిక.

ఫిబ్రవరి 18 రాత్రి జరిగిన ఘర్షణలో కాలితో తన్నడం వల్లే పాప చనిపోయిందని గణేశ్, మౌనిక ఆరోపిస్తున్నారు.

”ఒక్క ఐదు నిమిషాలు ముందు వెళ్లి ఉంటే నా బిడ్డ బతికేదేమో సర్. తన్నిన దెబ్బలకు నా బిడ్డకు ఎక్కడ తాకిందో.. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి అరగంట కిందటే చనిపోయినట్టుగా డాక్టర్లు చెప్పారు” అని మౌనిక అన్నారు.

ఘర్షణ తర్వాత నేను, మా అమ్మ వెళ్లి ఆసుపత్రిలో చూపించుకున్నామని, పాపకు ఏమీ కాదులే అన్న ఉద్దేశంతో ఆసుపత్రిలో చూపించలేదని గణేశ్ చెప్పారు.

మరోవైపు, ఘర్షణ తర్వాత పాప బాగానే ఉంది కానీ, పాలు సరిగా తాగేది కాదని, ఇబ్బంది పడుతూ కనిపించిందని మౌనిక చెప్పారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

‘పాపకు ఆరోగ్య సమస్యలున్నాయి’

ఫిబ్రవరి 21న ఘర్షణలో పాప చనిపోయినట్లు గణేశ్, ఆయన కుటుంబసభ్యులు వచ్చి ఫిర్యాదు ఇచ్చారని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

”ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాం. మొత్తం కుమ్మెర గ్రామానికి చెందిన తొమ్మిది మందిపై కేసు పెట్టాం” అని చెప్పారు.

అయితే, తమ ప్రాథమిక విచారణలో పాపకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలిందని చెప్పారు డీఎస్పీ. నెలలు నిండకముందే పుట్టిందని, డెలివరి తర్వాత హైదరాబాద్‌లో దాదాపు నెల రోజులపాటు చికిత్స చేయించారని తేలిందని చెప్పారు.

పాపకు పోస్టుమార్టం చేయించామని, పాప శరీరంపై చిన్నగీత కూడా కనిపించలేదని డీఎస్పీ చెప్పారు. శరీరం లోపల (ఇంటర్నల్ బ్లీడింగ్) ఏదైనా జరిగిందా అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వస్తేనే తెలుస్తుందని డీఎస్పీ చెప్పారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

రాజకీయంగా కలకలం

రజక కుటుంబంపై రెడ్డి కులం వారు దాడి చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, తర్వాత రెండు రోజులకు పాప చనిపోవడంతో ఘటన తెలంగాణలో రాజకీయంగానూ దుమారం రేపింది.

మాజీ ఎమ్మెల్మే మర్రి జనార్దన్ రెడ్డి, ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాగర్ కర్నూల్ వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి.

మరోవైపు, గణేశ్ కుటుంబం నాగర్ కర్నూల్‌లో అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తున్నారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు వచ్చి వారిని పరామర్శిస్తున్నారు.

”మా ఊళ్లో రెడ్డి కులస్థులకు వేరే కులాలంటే చులకన. ఎంత చులకన అంటే కాళ్ల కాడ చెప్పులా చూస్తారు. వాళ్లు చెప్పింది వినకపోతే వాళ్లను పక్కా కొడతారు” అని గణేశ్ ఆరోపించారు.

”మేం ఎస్సీ వాళ్లను మ్యారేజీ చేసుకున్నామని వాళ్ల మైండులో ఉండింది. రెడ్డి ఇళ్లకు పోతే బయటే నిలబెడతారు, దూరంగా ఉండి మాట్లాడతారు, ర్యాష్ గా మాట్లాడుతున్నారు” అని కీర్తి ఆరోపించారు.

ఈ మాటలను కుమ్మెరకు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు సంతోష్ రెడ్డి ఖండించారు.

”ఊళ్లో అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఇలా కుల గొడవలు గతంలో ఎన్నడూ జరగలేదు. జాతర కూడా ఎవరు సర్పంచ్ అయితే, వారి చేతుల మీదుగానే జరుగుతుంది. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలని వేర్వేరుగా చూడటం ఉండదు” అని చెప్పారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

‘చిన్న గొడవను కులాల గొడవగా మార్చేశారు’

”చిన్న గొడవను తప్పుదారి పట్టించి రాష్ట్రస్థాయి నాయకులందర్ని రప్పించేసి ప్రజలకు అసౌకర్యం కలిగించి, మా మీద, మా రెడ్డి సమాజం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మాకు సమాజంలో ఎంత నష్టం చేయాలో అంత నష్టమూ చేస్తున్నారు” అని శేఖర్ రెడ్డి అన్నారు.

కొందరు రాజకీయ కారణాలతో పెద్దది చేశారని ఆయన అంటున్నారు.

”అంత మంది కలిసి గణేశ్‌ను కొట్టారని అంటున్నారు. ఆయన కాలిలో రాడ్డు ఉందట. అలా కొడితే ఎవరైనా లేస్తారా.. లేచి వెళ్లే ప్రయత్నం చేయగలరా? ఇప్పుడు ఆయన అక్కడ ధర్నాలో బాగానే కూర్చున్నాడు కదా. కనిపించని దెబ్బలు తగిలినా సరే నొప్పి ఉండి, లేవలేని పరిస్థితి ఉంటుంది కదా.. మరి అలాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు కదా అక్కడ” అని మధుసూదన్ రెడ్డి భార్య మాధవి అన్నారు.

అలాగే ఊళ్లో తమ ఇల్లు కట్టుకునేందుకు రెడ్డి కులస్థులు అడ్డు పడుతున్నారని గణేశ్ ఆరోపిస్తున్నారు.

”మా ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు ఊళ్లోకి వెళ్లే పరిస్థితి లేదు” అని అన్నారు.

ప్రాణ భయంతో నాగర్ కర్నూల్‌లోనే అక్కడా ఇక్కడా తలదాచుకుంటున్నట్లు చెప్పారు.

”రెడ్డి కులస్థుల వల్లే గణేశ్ ఇల్లు నిర్మాణం ఆగిపోయిందనేది వాస్తవం కాదు. ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చింది. పునాది వరకు కట్టుకున్నారు. మిగిలిన పని చేసుకుంటే బిల్లు వస్తుంది. దానిని ఎవరు ఆపుతారు? పనిచేసుకోకపోతే బిల్లు రాదు కదా. దానికి ఎవరు ఏం చేస్తారు” అని కుమ్మెర గ్రామ మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

రెడ్డి, రజక, కులాలు, ఘర్షణ, రాజకీయం, నాగర్ కర్నూల్

తొమ్మిదిమందిలో ముగ్గురు అరెస్టు

ఈ కేసులో మొత్తం 9 మంది రెడ్డి కులస్థులను నిందితులుగా చేర్చినట్లుగా బీబీసీతో చెప్పారు డీఎస్పీ బుర్రి శ్రీనివాస్. ఇప్పటివరకు ముగ్గుర్ని అరెస్టు చేశామని, మిగిలినవారిని పట్టుకుంటామని చెప్పారు.

ప్రస్తుతం దాడి కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఘర్షణలో గాయాల వల్లనే పాప చనిపోయినట్లుగా తేలితే హత్య కేసులు నమోదు చేస్తామని వివరించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న కుమ్మెర గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, ఆయన కుమారుడు సంతోష్ రెడ్డి సహా మిగిలిన వారి ఇళ్లకు బీబీసీ వెళ్లింది. వారి వివరణ కోసం ప్రయత్నించింది. శ్రీనివాస్ రెడ్డి అన్న శేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి భార్య మాధవి వివరణ ఇచ్చారు. అయితే, మిగలిన వారి ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి.

ఇక, ఈ మొత్తం వివాదంపై ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. దాదాపు 30 మందితో బీబీసీ మాట్లాడే ప్రయత్నం చేయగా, ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.

అయితే, కులాల పట్టింపుల్లేకుండా అందరం కలిసి ఉంటామని మాత్రం చెబుతున్నారు.

ఘటన జరిగిన సమయంలో జాతర వద్ద ఉన్నారా.. అని ప్రశ్నించినప్పుడు, తాము లేమంటూ బీబీసీతో మాట్లాడినవారు చెప్పారు.

గ్రామంలో పోలీసు పికెట్ ఉండటం, వివాదం పెద్దది కావడంతో కొందరు మాట్లాడేందుకు నిరాకరించారు.

”ఘటన జరిగిన రోజు బిందె సేవ. ఆ రోజు గ్రామస్థులు చాలా తక్కువగా వెళతారు. మరుసటి రోజు కల్యాణం ఉంటుంది కనుక ముందు రోజు సహజంగా తక్కువ సంఖ్యలో హాజరవుతారు” అని గ్రామానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని మహిళ ఒకరు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)