SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
7 ఏప్రిల్ 2025, 10:42 IST
దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అభిశంసన సరైనదేనని రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
60 రోజుల్లోపు దక్షిణ కొరియాలో ఎన్నికలు నిర్వహించాల్సిఉంటుంది. పార్లమెంట్‌లో అభిశంసన ఎదుర్కొని పదవి పోగొట్టుకున్న యూన్‌కు, రాజ్యాంగ ధర్మాసనం తీర్పూ వ్యతిరేకంగా వచ్చింది.
2022లో అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన యూన్ అసలు పార్లమెంటులో అభిశంసన ఎదుర్కొనే పరిస్థితి ఎలా వచ్చింది? ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి ? భార్యకు గిఫ్ట్ రూపంలో వచ్చిన బ్యాగ్ యూన్ రాజకీయ జీవితాన్ని ఎలా మార్చివేసింది?

లగ్జరీ బ్యాగ్ వివాదమేంటి?
గత ఏడాది యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఆయన భార్య కిమ్ కియోన్ హీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.
కిమ్ కియోన్ హీ ఒక లగ్జరీ బ్యాగ్‌ను బహుమతిగా స్వీకరించారనే వివాదం పాలక పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ)ని ఏడాదిన్నర క్రితం గందరగోళంలో పడేసింది.
2023 చివర్లో బయటకు వచ్చిన స్పై కెమెరా ఫుటేజ్‌లో ఒక పాస్టర్ ఆమెకు డియోర్ అనే బ్రాండెడ్ బ్యాగ్‌ను బహుకరిస్తున్నట్టు కనిపించింది.
ఈ వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు యూన్ సుక్ యోల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి.
వామపక్ష యూట్యూబ్ చానల్ వాయిస్ ఆఫ్ సోల్ ప్రసారం చేసిన ఈ వీడియోను పాస్టర్ చోయ్ జే-యంగ్ తన వాచ్‌లో ఉన్న కెమెరాను ఉపయోగించి రహస్యంగా చిత్రీకరించినట్టు ప్రచారం జరిగింది. .
పాస్టర్ చోయ్ ఒక దుకాణానికి నడుచుకుంటూ వెళ్తున్నట్టు, బూడిద-నీలం రంగు లెదర్ బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్టు ఆ వీడియోలో కనిపించింది. దాని ధర 3 మిలియన్ వోన్ (దాదాపు రూ. 1.75 లక్షలు ) అని రసీదు ఉంది. ఆ తర్వాత సోల్‌లోని కోవానా కంటెంట్స్ అనే కంపెనీకి వెళ్లారు చోయ్. ఆ కంపెనీ యూన్ భార్య కిమ్ కియోన్ హీకి చెందినది. ”మీరు ఈ వస్తువులను నాకు ఎందుకు తెస్తున్నారు?” అని పాస్టర్ చోయ్‌ను కిమ్ అడుగుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాగ్ తీసుకున్నట్టు అంగీకరించిన అధ్యక్ష కార్యాలయం
ఆ బ్యాగ్‌ను 2022 సెప్టెంబర్‌లో కిమ్‌కు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
కిమ్ బహుమతిని స్వీకరించినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా, బ్యాగ్‌ను స్వీకరించినట్టు, దానిని ప్రభుత్వ ఆస్తిగా భద్రపరిచినట్టు అధ్యక్ష కార్యాలయం ధ్రువీకరించిందని కొరియా హెరాల్డ్ తెలిపింది.
ఈ వీడియో తర్వాత దక్షిణకొరియా ప్రజల్లో ఆగ్రహం కనిపించింది. అప్పట్లో నిర్వహించిన ఓ పోల్‌లో దేశంలోని ఓటర్లలో 69శాతం అధ్యక్షుని భార్య చర్యలపై వివరణ కోరుకుంటున్నారని తేలింది. ఆమె ప్రవర్తన అనుచితంగా ఉందని డిసెంబర్‌లో జరిగిన పోల్‌లో 53శాతం ప్రజలు నమ్ముతున్నారని తేలింది.
సోల్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు రీ జోంగ్-హూన్ అప్పట్లో దీనిని “పొలిటికల్ బాంబ్ “గా అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారులు, వారి జీవిత భాగస్వాములు ఒకేసారి దాదాపు 59 వేల వోన్‌లకంటే కంటే ఎక్కువ విలువైన బహుమతులు లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షా 75వేల వోన్‌లకు పైగా విలువైన బహుమతులు స్వీకరించడం చట్టవిరుద్ధం.
ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఈ విషయంలో యూన్‌పై తీవ్ర విమర్శలు చేసింది.
“అధ్యక్ష కార్యాలయం, అధికార పార్టీ క్షమాపణ చెబితే ఈ విషయం ముగిసిపోతుందని మాట్లాడటంలో అర్థం లేదు” అని ప్రతిపక్ష నాయకుడు హాంగ్ ఇక్-ప్యో అన్నారు.
అధికార పార్టీకే చెందిన నాయకురాలు కిమ్ క్యుంగ్-యుల్ కూడా కిమ్‌హీ పై విమర్శలు చేశారు. ఆమెను ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోనెట్‌తో పోల్చారు. విలాసవంతురాలైన రాణిగా మేరీ ఆంటోనెట్‌కు పేరుంది.
51 ఏళ్ల కిమ్ కియోన్‌పై ఉన్న వివాదాల్లో ఇది ఒకటి.
స్టాక్ ధరల మోసంలో కిమ్‌హీ ప్రమేయం ఉందని ప్రతిపక్షం అంతకుముందు చాలా కాలంగా ఆరోపిస్తూ వచ్చింది. దీనిపై దర్యాప్తు జరపాలని కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లును అప్పుడు అధ్యక్షునిగా ఉన్న యూన్ వీటో చేశారు.
గత సంవత్సరం, సోల్ ప్రభుత్వం ఒక ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును రద్దు చేసింది. దీని నిర్మాణం వల్ల కిమ్ కుటుంబానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా భూమి ధరలను పెంచారన్న ఆరోపణలొచ్చాయి.
ఈ కుంభకోణం యూన్ పార్టీలోనూ చీలికలకు కారణమైంది.
ఆ తర్వాత గత ఏడాది డిసెంబరు 3 దక్షిణకొరియాలో మార్షల్ లా (తాత్కాలిక సైనిక పాలన) విధిస్తున్నట్టు యూన్ ప్రకటించడం, జాతీయ అసెంబ్లీ డిమాండ్‌తో సైనిక పాలన ఎత్తివేయడం ఒకే రోజు జరిగిపోయాయి. ఆ తర్వాత యూన్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంతో ఆయన పదవీచ్యుతుడయ్యారు.
కుటుంబం చుట్టూ ఉన్న స్కామ్ ఆరోపణలు, రాజకీయంగా వివాదాస్పద నిర్ణయాలు యూన్‌కు పదవి పోగొట్టుకునేలా చేశాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)