Home జాతీయ national telgu థాయ్ లెస్బియన్ ప్రేమ కథలు వందల కోట్ల విలువైన పరిశ్రమగా ఎలా మారాయి?

థాయ్ లెస్బియన్ ప్రేమ కథలు వందల కోట్ల విలువైన పరిశ్రమగా ఎలా మారాయి?

15
0

SOURCE :- BBC NEWS

జీఎంఎంటీవీ నుంచి వచ్చిన మొట్టమొదటి గర్ల్స్ లవ్ (జీఎల్) సిరీస్‌లో జంటగా పాన్సా ‘మిల్క్’ వోస్బీన్, పత్రానిట్ ‘లవ్’ లింపాటియాకార్న్ నటించారు.

ఫొటో సోర్స్, Napasin Samkaewcham / BBC News Thai

హైస్కూల్‌లో చేరినప్పుడు ఒంగ్సాకు అక్కడి జీవితం కాస్త ఇబ్బందిగా, ఒంటరిగా, కొత్తగా అనిపిస్తుంది. అలాంటి ఆ అమ్మాయి అక్కడ బాగా ఫేమస్ అయిన బాలికల్లో ఒకరైన ‘సన్‌’ను కలిసినప్పుడు తొలిచూపులోనే ప్రేమలో పడిపోతుంది.

తన మనసులో మాటను చెప్పేందుకు భయపడిన ఒంగ్సా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘టియెర్రా’ (ఎర్త్) అనే మారుపేరుతో సన్‌కు మెసేజ్‌లు పంపడం మొదలుపెడుతుంది. వాటిని చూసి తనను ఎవరో అబ్బాయి రహస్యంగా ప్రేమిస్తున్నారేమోనని సన్ పొరబడుతుంది.

ఆ తర్వాత ఒంగ్సా నిజ జీవితంలో సన్‌కు స్నేహితురాలిగా మారుతుంది. అయినా మారు పేరుతో ఆన్‌లైన్‌లో సన్‌తో చాటింగ్ అలాగే కొనసాగిస్తుంటుంది.

అయితే, చిగురిస్తున్న తమ బంధాన్ని రహస్యంగా కొనసాగించడంలోని మానసిక ఒత్తిడి కారణంగా వారు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.

“నాలాంటి వ్యక్తితో ఉన్నందుకు జనం నిన్ను విమర్శిస్తారేమోనని నాకు భయంగా ఉంది” అని ఒంగ్సా ఆవేదన వ్యక్తం చేస్తుంది.

అయితే వాళ్లిద్దరూ ఆనందంగా కలిసిన సమయంలో సన్ నవ్వుతూ ”ఇతరులు ఏమనుకుంటారో నాకు అనవసరం, నాకు కేవలం నువ్వు మాత్రమే ముఖ్యం” అని చెబుతారు.

ఇదొక ప్రయోగం. మొదటగా ‘బ్యాడ్ బడ్డీ’ సిరీస్‌లో ఒక లెస్బియన్ జంటను చేర్చడం ద్వారా ఈ ప్రయోగం మొదలైంది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ఒక సరికొత్త టీవీ సిరీస్‌ జోన్రా (శైలి) గా అవతరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
'23.5 డిగ్రీస్ ఆఫ్ ఎర్త్ టిల్ట్' అనే టైటిల్‌తో వెలువడిన నవల ఆధారంగా, అదే టైటిల్‌తో జీఎంఎంటీవీ తొలిసారిగా పూర్తిస్థాయి జీఎల్ సిరీస్‌ను నిర్మించింది.

ఫొటో సోర్స్, Wasawat Lukharang / BBC News Thai

థాయ్‌లాండ్ కేంద్రంగా సాంస్కృతిక ఎగుమతి…

ఆసియాలోనే అత్యంత విజయవంతమైన సాంస్కృతిక ఎగుమతి (కల్చురల్ ఎక్స్‌పోర్ట్‌) గా, వందల కోట్ల రూపాయల విలువను సంతరించుకున్న ‘గర్ల్స్ లవ్’ (జీఎల్) అనే శైలి థాయ్‌లాండ్‌ను ఒక కీలక కేంద్రంగా నిలబెట్టింది. వినోద రంగంలో ఎల్జీబీటీక్యూ ప్రాతినిధ్యాన్ని మారుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ‘ఫ్యాన్ కల్చర్’ను పునర్నిర్వచిస్తోంది.

“మొదట్లో మాకు అంతగా నమ్మకం లేదు. ఆ తర్వాత, దర్శకుడిగా బీఎల్ (బాయ్స్ లవ్) కథలో ఒక అమ్మాయిల జంటను చేర్చి ఒక ప్రయోగం చేశాను. ముఖ్యంగా ‘బ్యాడ్ బడ్డీ’ కథలో నటీమణులు మిల్క్–లవ్ జంటను ప్రవేశపెట్టాను” అని థాయ్‌లాండ్‌కు చెందిన జీఎంఎంటీవీ ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన నొఫార్నాచ్ చైయావిమ్హాన్ బీబీసీతో చెప్పారు.

లెస్బియన్ పాత్రల్లో నటించిన థాయ్ నటీమణులు పాన్సా ‘మిల్క్’ వోస్బీన్, పత్రానిట్ ‘లవ్’ లింపాటియాకార్న్‌లకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

థాయ్ జీఎల్ సిరీస్

ఫొటో సోర్స్, GMMTV

సరికొత్త టీవీ సిరీస్ జోన్రాకు బీజం…

“మేము ఒక కొత్త ధోరణిని చూశాం. పాన్సా ‘మిల్క్’ వోస్బీన్, పత్రానిట్ ‘లవ్’ లింపాటియాకార్న్‌ జంట గురించి ప్రేక్షకులు సానుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. అంతేకాదు, అమ్మాయిల జంట ప్రధాన పాత్రధారులుగా ఉండే సిరీస్‌ను నిర్మించాలని వారు కోరడం మొదలుపెట్టారు” అని దర్శకుడు నొఫార్నాచ్ చైయావిమ్హాన్ వివరించారు.

ప్రేక్షకుల కోరికకు స్పందించిన జీఎంఎంటీవీ తొలిసారిగా జీఎల్ సిరీస్ ‘23.5 డిగ్రీస్ ఎర్త్ టిల్ట్’‌ను నిర్మించింది.

‘23.5 డిగ్రీల ఎర్త్ టిల్ట్’ అనే నవల ఆధారంగా, అదే పేరుతో ఈ సిరీస్ తయారైంది. ఇందులో మిల్క్, లవ్ మళ్లీ ఒంగ్సా, సన్ పాత్రల్లో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సిరీస్ 2024లో ప్రసారమైన సమయంలోనే, థాయ్‌లాండ్‌లోని ప్రముఖ టీవీ ఛానల్ ‘చానల్ 3’ ఈ కొత్త ధోరణిని పసిగట్టింది.

అప్పటికే అది ‘జీఏపీ: ది పింక్ థియరీ’ అనే సిరీస్‌ను ప్రసారం చేస్తోంది.

సుమారు 7 కోట్ల జనాభా ఉన్న థాయ్‌లాండ్‌లో ఇది మొట్టమొదటి భారీ హిట్ జీఎల్ సిరీస్‌గా నిలిచింది. యూట్యూబ్‌లో కూడా ఇది అత్యంత వేగంగా 30 కోట్లకు పైగా వీక్షకులను సంపాదించింది.

మీడియా విశ్లేషణ సంస్థ ‘రాకెట్ మీడియా ల్యాబ్’ గణాంకాల ప్రకారం, ఆ సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 21 జీఎల్ సిరీస్‌లు నిర్మితమయ్యాయి. వీటిలో 51 మహిళా జంటలు నటించాయి.

థాయ్ జీఎల్ సిరీస్ నటీమణులు

ఫొటో సోర్స్, GMMTV

అభిమానుల సమావేశాలకు జీఎల్ యాక్టర్లు

మరోవైపు, జీఎల్ సిరీస్ యాక్టర్లు తమ అభిమానులను కలిసేందుకు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, జపాన్, సింగపూర్, కంబోడియా, అమెరికా దేశాలలో పలు జీఎల్ ‘ఫ్యాన్ మీటింగ్’లకు టిక్కెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడైపోయాయి.

ఈ సిరీస్‌లకు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణం, గతంలో ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్ సంబంధాలను చూపించిన విధానంకంటే థాయ్ జీఎల్ కథలు కొత్త కోణంలో ఉండటమే కారణం.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పలు సిరీస్‌లలో లెస్బియన్, గే, బైసెక్సువల్ పాత్రలు ఎక్కువగా విషాదకరమైన ముగింపులతో ముడిపడి ఉంటాయి, లేదా హఠాత్తుగా మాయమైపోతుంటాయని బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్‌ స్క్రీన్ ఇండస్ట్రీ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇవా చెయుక్-ఇన్ లీ అన్నారు.

“ప్రపంచవ్యాప్తంగా టీవీ సిరీస్‌లను గమనిస్తే, మహిళల మధ్య ప్రేమను ప్రతిబింబించే కథలు చాలా తక్కువగా ఉన్నాయి. చివరికి హాలీవుడ్‌లో కూడా. తెరపై ఆ పాత్రలు మరణించడమో లేదా విషాదకరమైన, అసంతృప్తికరమైన ముగింపులను చూస్తుంటాం. దీనినే ‘డెడ్ లెస్బియన్ సిండ్రోమ్’ అని పిలుస్తాం. ఇక్కడ ఎల్‌జీబీటీక్యూ పాత్రలకు ఎక్కువగా విషాదకరమైన జీవితాలే ఉంటాయి” అని ఆమె చెప్పారు.

ఇలాంటి పాత కథన ధోరణిని థాయ్ జీఎల్ సిరీస్‌లు సంపూర్ణంగా మార్చేశాయి.

జీఎల్ కథలపై ఇష్టంతో థాయ్‌లాండ్ పర్యటనకు వచ్చిన బ్రెజిల్ పౌరురాలు లూయిజా జెడ్

ఫొటో సోర్స్, Luiza Z

బలమైన స్త్రీవాదంతో ముడిపడిన పాత్రలు…

”మరింత సంతృప్తికరమైన కథా గమనమే థాయ్ ‘గర్ల్స్ లవ్’ కథలను ప్రత్యేకంగా నిలబెడుతోంది. వాటిలో జంటలు సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మెజారిటీ కథల్లో వారి బంధం లేదా ముగింపు చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంటుంది” అని డాక్టర్ ఇవా చెయుక్-ఇన్ లీ చెప్పారు.

”థాయ్ జీఎల్ కథల్లో ప్రధాన పాత్రలు చాలావరకు బలమైన స్త్రీవాదంతో ముడిపడి ఉంటాయి. కొన్ని పాత్రల వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. అయితే, నిజ జీవితంలో లెస్బియన్లు పలు రకాలుగా, పలు రూపాల్లో ఉంటారు. కాబట్టి వైవిధ్యభరితమైన ప్రాతినిధ్యాన్ని చూపించే విషయంలో వారికి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయని భావిస్తాను” అని ఆమె అన్నారు.

“ఇద్దరు మహిళల మధ్య ప్రేమ అనేది కేవలం ఒక కథలో ఉపకథగా మాత్రమే కాదు, అది ప్రధాన కథాంశం కూడా కాగలదని థాయ్ జీఎల్ డ్రామాలను చూసినప్పుడు నాకు తొలిసారిగా అనిపించింది” అని బ్రెజిల్‌కు చెందిన జీఎల్ కథల అభిమాని లూయిజా జెడ్ బీబీసీతో చెప్పారు.

”వారు ఒకరికొకరు ఆత్మీయులుగా మారిన విధానం, వారి సంబంధంలోని గాఢతను, కష్టాలను, భావోద్వేగాలను ప్రతిబింబించిన తీరు అద్భుతంగా ఉంది. అంతేకాకుండా, ఆ కథల్లో సంతోషకరమైన ‘శుభం కార్డు’ పడటం ఈ సమాజం అంగీకరించినట్లుగా తనలో తనకు అనిపించేలా చేస్తుంది” అని ఆమె అభిప్రాయపడ్డారు.

”థాయ్ కథల్లో ఎప్పుడూ సంతోషకరమైన ముగింపే ఉంటుంది. అది మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఇద్దరు కథానాయికల పాత్రలను కథ నుంచి తొలగిస్తారేమోనని గానీ, వారి కథ విషాదంగా ముగుస్తుందేమోనని గానీ ఆందోళన అక్కర్లేదు” అని లూయిజా వ్యాఖ్యానించారు.

సింగపూర్‌కు చెందిన టాన్ జీ యీ

ఫొటో సోర్స్, Wasawat Lukharang / BBC News Thai

‘అడ్డంకులు’ ఉన్నా అభిమానుల చెంతకు…

అంతర్జాతీయంగా సులభంగా అందుబాటులో ఉండటంతో జీఎల్ సిరీస్‌లు మరింత ఊపందుకున్నాయి. చాలా సిరీస్‌లు యూట్యూబ్‌లో, బహుళ భాషల సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఈ సౌలభ్యం వల్ల చైనా, ఇండోనేషియా వంటి కఠినమైన నిబంధనలు ఉన్న దేశాల్లోని అభిమానులు తమకు ఉన్న అడ్డంకులను అధిగమించగలుగుతున్నారు.

ఎందుకంటే, ఆయా దేశాల్లో హోమోసెక్సువల్ కంటెంట్‌పై ఆంక్షలు ఉన్నాయి.

సెన్సార్‌లు ‘అశ్లీలమైనవి’గా లేదా చట్టవిరుద్ధమైనవిగా భావించే కంటెంట్‌ను కలిగిన దాదాపు పది వేల వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా ఖాతాలను ఇటీవల చైనా మూసివేసింది.

దీంతో అక్కడి ప్రేక్షకులు విదేశీ జీఎల్ కంటెంట్‌ను ఒక ‘సురక్షితమైన సాంస్కృతిక వేదిక’గా భావిస్తున్నారు.

సినీ నిర్మాత రేచెల్ డాక్స్

ఫొటో సోర్స్, Rachel Dax

‘ఆ చిత్రాన్ని సౌదీ అరేబియాలో ఎక్కువ చూశారు…’

తాను తీసిన లెస్బియన్ చిత్రాల్లో ఒక చిత్రాన్ని ఇతర దేశాల కంటే సౌదీ అరేబియాలో ఎక్కువగా చూశారని యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన దర్శకురాలు రేచెల్ డాక్స్ బీబీసీతో చెప్పారు.

”అత్యంత కఠినమైన ‘గే’ వ్యతిరేక చట్టాలున్న దేశాల్లోని ప్రజలకు, వారి లైంగికతకు సంబంధించిన వాస్తవాల గురించి లభించే ఏకైక సానుకూల గుర్తింపు ఇదే కావచ్చు. ఈ సినిమాలు వారికెంతో సహాయపడతాయి” అని ఆమె అన్నారు.

రనుక సోంగ్‌మువాంగ్

ఫొటో సోర్స్, Wasawat Lukharang / BBC News Thai

థాయ్ సమాజ వైఖరిలో మార్పు…

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ గుర్తింపు థాయ్ సమాజంలో వైఖరిని కూడా సూక్ష్మంగా మారుస్తోందని కొందరు అభిమానులు భావిస్తున్నారు.

ఈ జోన్రా పట్ల తన తల్లి స్పందన చాలా సాధారణంగానే ఉందని జీఎల్ అభిమానుల వెబ్‌సైట్ నిర్వాహకురాలు రనుక సోంగ్‌మువాంగ్ చెప్పారు.

”నాకు ‘ది సీక్రెట్ ఆఫ్ అజ్’ సిరీస్ ఇష్టం. అందులో ప్రధానమైన డాక్టర్ పాత్ర చాలా అందంగా ఉంటుంది” అని రనుక తల్లి అన్నారు.

సాధారణ సమాజంలో స్వలింగ సంబంధాల విషయానికొస్తే, ఆసియాలోనే అత్యంత ఉదారవాద దేశాలలో థాయ్‌లాండ్ ఒకటి.

తైవాన్, నేపాల్ మాదిరిగానే థాయ్‌లాండ్‌లో కూడా వివాహ సమానత్వం చట్టం అమల్లో ఉంది.

ఫిలిప్పీన్స్‌లో కూడా ఎల్‌జీబీటీక్యూ జంటలు బహిరంగంగా కలిసి జీవించడానికి ఆమోదించే మార్పు కనిపిస్తోంది. కానీ, ఫిలిప్పీన్స్ సమాజంలో కీలక పాత్ర పోషించే క్యాథలిక్ చర్చి మాత్రం ఈ స్వలింగ వివాహాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మలేషియా, ఇండోనేషియా, బ్రూనై తదితర దేశాల్లో స్వలింగ సంబంధాలకు ఆమోదం చాలా తక్కువ. అక్కడ కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.

ఉదాహరణకు బ్రూనైలో ఎవరైనా పురుషుల మధ్య లైంగిక సంబంధం ఉందని రుజువైతే మరణశిక్ష విధించాలనే చట్టాలు ఉన్నాయి. అయితే, ఆచరణలో ఈ నేరానికే కాదు ఇప్పుడు ఆ దేశంలో ఏ నేరానికీ ఎవరినీ ఉరి తీయట్లేదు.

'23.5 డిగ్రీస్ ఆఫ్ టిల్ట్' సిరీస్‌లో మాత్రం ఒంగ్సా, సన్ మధ్య ప్రేమ ప్రయాణం

ఫొటో సోర్స్, GMMTV

‘శుభం కార్డు’

కొన్ని జీఎల్ కథల్లో పాత్రలు సామాజిక వివక్షను నేరుగా ఎదుర్కొంటాయి.

‘పాయిజనస్ లవ్’ సిరీస్‌లో కథానాయిక ‘పాట్’ తమను విడదీయవద్దంటూ తన ప్రేమికురాలైన ‘ప్రేమ్’ తల్లిదండ్రులను బతిమాలతారు. కానీ, ప్రేమ్ తండ్రి మాత్రం వారు విడిపోవాలని ఆదేశిస్తారు.

పాట్ మాత్రం ప్రేమ్ తల్లిదండ్రులిద్దర్నీ అమ్మా, నాన్నా అని పిలుస్తూ బతిమాలుతుంది.

‘మా ప్రేమ చాలా నిజాయితీతో కూడుకున్నది, స్వచ్ఛమైంది’ అని చెబుతుంది.

దీనికి ప్రేమ్ తండ్రి స్పందిస్తూ, ‘నన్ను నాన్నా అని పిలిచే సాహసం చేయకు, అది నాకు అసహ్యం కలిగిస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

‘23.5 డిగ్రీస్ ఆఫ్ టిల్ట్’ సిరీస్‌లో మాత్రం ఒంగ్సా, సన్ మధ్య ప్రేమ ప్రయాణం చాలా సాఫీగా, సంతోషకరమైన ముగింపు దిశగా సాగుతుంది.

ఒకవేళ ఏడాది పాటు విడిపోవాల్సి వస్తే ఎలా తట్టుకోగలమని సన్ అడిగినప్పుడు, ఒంగ్సా తమ పేర్లను భూగోళశాస్త్రానికి లింక్ పెడుతూ, ”మన మధ్య ఎన్ని కాంతి సంవత్సరాల దూరం ఉన్నా ఫర్వాలేదు. అంతా మంచే జరుగుతుంది. చివరికి మన కక్ష్యలు మనల్ని మళ్లీ ఒకచోటకు చేరుస్తాయి” అని సమాధానమిస్తుంది.

‘‘ఎందుకంటే భూమి (ఎర్త్) గమ్యం ఎప్పుడూ సూర్యుడు (సన్)తో అనుసంధానమై ఉంటుంది కాబట్టి” అని ఒంగ్సా అంటుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)