SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసమని చెబుతూ ఓ బిల్లు తీసుకువచ్చింది.
తల్లిదండ్రులను చూసుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పదివేల రూపాయలు లేదా 15 శాతం నేరుగా వారి తల్లిదండ్రులకే చేరేలా ఏర్పాటు చేయనుంది.
‘ది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026’ అన్నది ఈ బిల్లు.
తల్లిదండ్రులు, ప్రైవేటు ఉద్యోగులు సహా తెలంగాణ పరిధిలో పనిచేసే అందరికీ వర్తిస్తుంది.
ఈ బిల్లు గవర్నర్ ఆమోదం తర్వాత చట్టంగా మారుతుంది.
ఫొటో సోర్స్, LEGISLATURE.TELANGANA.GOV.IN
బిల్లులో ఏముంది?
ఈ చట్టం వస్తే, ఉద్యోగి జీతంలో 15 శాతం లేదా 10 వేల రూపాయలను (రెండింటిలో ఏది తక్కువైతే అది) ఉద్యోగిపై ఆధారపడ్డ తల్లిదండ్రులకు ఇస్తారు.
ఆహారం, నివాసం, బట్టలు, వైద్యం ఇతర అత్యవసరాల నిమిత్తం ఆ డబ్బు ఇస్తారు.
ఏ ఆదాయం లేని తల్లిదండ్రులతో పాటు సవతి తల్లిదండ్రులకు కూడా ఇది వర్తిస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తెలంగాణ పరిధిలో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థల సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేటు ఉద్యోగుల గురించి ఏం చెప్పారు?
ప్రైవేటు ఉద్యోగులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ బిల్లు ప్రకారం ఉద్యోగి అంటే తెలంగాణలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తి అని అర్థం. సంస్థ అంటే తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ లేదా రిజిస్టర్డ్ / లైసెన్సుడ్ / ప్రైవేటు సంస్థలు అని అర్థం.
అంతేకాదు, ఈ బిల్లులో ఎనీ పర్సన్, ఎంప్లాయి అన్న పదాలు వాడారు తప్ప, మగ-ఆడ అనే మాటలు ఉపయోగించలేదు. అంటే మగ ఉద్యోగులతో పాటు, మహిళా ఉద్యోగులు కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు.
ఎలా అమలు చేస్తారు?
ఈ చట్టం అమలు కోసం సీనియర్ సిటిజన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. అందులో రాష్ట్ర స్థాయి మానిటరింగ్ బాడీ ఉంటుంది. ఇక జిల్లా స్థాయిలో కలెక్టర్ నాయకత్వంలో యంత్రాంగం ఏర్పాటు చేస్తారు. జీతంలో వాటా కోరే తల్లిదండ్రులు ఆ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. తమకు వేరే ఆదాయం లేదని నిరూపించుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లో ఇరుపక్షాల వాదనలూ విని, దానిపై యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఉద్యోగి కూడా తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే, సీనియర్ సిటిజన్ కమిషన్‌కు అప్పీల్ చేయవచ్చు.
ఈ కమిషన్‌కి సివిల్ కోర్టు స్థాయి అధికారాలు ఉంటాయి. న్యాయ శాస్త్రం, సామాజిక సేవ, ప్రభుత్వ పనితీరుపై అవగాహన, అనుభవం ఉన్న కమిషనర్ లేదా డైరెక్టర్ హోదాకు తక్కువ కాని వారిని ఇందులో కమిషనర్‌గా నియమిస్తారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సీనియర్ సిటిజన్ కమిషనర్‌గా పనిచేసిన వ్యక్తిని చీఫ్ కమిషనర్‌గా నియమిస్తారు. వారు జిల్లా స్థాయి వ్యవస్థ ఇచ్చిన ఆదేశాలను విచారించి తగిన నిర్ణయం తీసుకుంటారు.
ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది ప్రభుత్వం త్వరలో ప్రకటిస్తుంది.
ఫొటో సోర్స్, @revanth_anumula
అలాంటి వారిని బహిష్కరించాలి: రేవంత్ రెడ్డి
ఈ బిల్లు తెలంగాణ ఉభయ సభల్లో ఆమోదం పొందింది. అన్ని పక్షాలూ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. గవర్నర్ ఆమోదం రావాల్సి ఉంది.
బిల్లుపై చర్చ సందర్భంగా పురాణ కథలు, రేమండ్స్ కంపెనీ అధినేత సింఘానియా వ్యవహారం, తన వ్యక్తిగత అనుభవాలను గుర్తు చేస్తూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.
”బాధ్యతతో, భావోద్వేగంతో ఎంతో ఆలోచన చేసి ఈ బిల్లును తీసుకువస్తున్నాం. తల్లిదండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చట్టం. అనాథలుగా మారిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం ఈ సమాజానికి మంచిది కాదు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసుకోవడం చట్టబద్ధ బాధ్యతగా చేస్తూ ‘మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ యాక్ట్ 2007’ ఉంది. అయినా వివక్ష, నిర్లక్ష్యం కొనసాగుతున్నాయి.
తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బిల్లును తీసుకువస్తున్నాం. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే మా ప్రయత్నం” అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
ఫొటో సోర్స్, Getty Images
‘డబ్బు కాదు, ఆప్యాయత కావాలి’
అయితే ఈ బిల్లుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ సిటిజన్ల హక్కుల కోసం పనిచేసిన రావు చెలికాని. యునెస్కోలో సుదీర్ఘ కాలం పాటు వృద్ధుల హక్కుల కోసం ఆయన పనిచేశారు. వృద్ధుల సమస్యకు చట్టబద్ధమైన పరిష్కారాల కంటే మానవతతో కూడిన పరిష్కారాలు ఎక్కువ అవసరం అని ఆయన అన్నారు.
”అత్యవసర పరిస్థితుల్లో చట్టపరమైన మద్దతు అవసరం కావచ్చు. వారికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. దగ్గరి బంధువుల ఆప్యాయత కూడా కావాలి. ఇప్పటికే ఆర్డీవో దగ్గర ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ సరిపోతుంది. దానిపై కలెక్టర్ దగ్గరకు అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు అక్కడకు వెళ్లవచ్చు. అక్కడ రీకన్సిలియేషన్ (సయోధ్య) కోసం సీనియర్ సిటిజన్ ప్రతినిధిని తీసుకోవాలి అని నిబంధన కూడా ఉంది” అని చెప్పారు రావు చెలికాని.
అయితే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు రాజీ పడుతుంటారని ఆయన అన్నారు.
”పిల్లలతో ఎంత కొట్లాడినా సాయంత్రానికి సయోధ్య కుదుర్చుకోవాలి. చట్ట ప్రకారం వెళ్తే ఒంటరిగా మిగిలిపోతారు. అయినవారిని దూరం చేసుకుని చట్ట ప్రకారం వెళ్లడం అరుదు. కేసులు పెట్టి, వెనక్కు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరకు సాయంత్రం అయ్యేసరికి పిల్లలు అవసరం, సహవాసం చాలా మందికి అవసరం.
ఎందుకంటే వృద్ధులు వయసును బట్టి కూడా కాస్త తొందరపడతారు. ఆందోళన, ఆవేదన ఎక్కువ ఉంటాయి వృద్ధుల్లో. అందుకే కొత్త తరంతో సమస్యలు వస్తాయి. సీనియర్ సిటిజన్ సమస్యలకు మానవతతో కూడిన పరిష్కారాలు కావాలి. చట్టప్రకారం శిక్షలతో పనికాదు” అన్నారు రావు చెలికాని.
ఇక ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తల్లిదండ్రులు ఈ చట్టం ప్రకారం తమ హక్కును పొందవచ్చా వంటి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై స్పందన కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఫోన్, వాట్సాప్ ద్వారా సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



