Home జాతీయ national telgu ‘తల్లే పిల్లల్ని చంపేస్తోంది’, ఏమవుతోంది మమకారం?

‘తల్లే పిల్లల్ని చంపేస్తోంది’, ఏమవుతోంది మమకారం?

3
0

SOURCE :- BBC NEWS

మహిళలు, మానసిక ఒత్తిడి, వివాహేతర సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

(గమనిక: ఈ కథనంలో కలిచివేసే అంశాలు ఉన్నాయి)

చిన్న నాటి స్నేహితుడి ప్రేమ కోసం, ఒక తల్లి తన ముగ్గురి పిల్లల్ని చంపేసిన వార్త చూడగానే నాలో తెలియని బాధ, ఆలోచనలు చుట్టుముట్టాయి.

ఇటీవల తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో 45 ఏళ్ల ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురు పిల్లల వయసు 8 నుంచి 12 ఏళ్ల లోపు ఉంటుంది.

కన్న తల్లే పిల్లల్ని చంపడం లాంటి వార్తలు చూసిన ప్రతిసారీ సమాజం ఎటు వెళ్తోందనే ఆలోచనలు చుట్టుముడతాయి.

ఇలాంటి వార్తలు వినడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటివి చోటుచేసుకున్నాయి. ఇవి చూస్తుంటే… ఇది ఆధునిక సమాజపు పోకడా? లేదా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఒక అమ్మాయిని కాపాడటం కోసం దుర్మార్గుడైన తన కొడుకునే చంపేసే తల్లి కథతో ‘మదర్ ఇండియా’ అనే హిందీ సినిమా వచ్చింది. బహుశా ఇప్పటి తరానికి ఈ సినిమా గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఈ సినిమా మహబూబ్ ఖాన్ దర్శకత్వంలో 1957లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్.

ఒక తల్లి తన చేతులతో కన్నబిడ్డలను చంపడం సమాజం ఆమోదించని విషయం. కానీ, ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో బాధితులు అమాయకమైన పసిపిల్లలు.

మహిళలు, అమ్మ, చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

‘ఆకలి చంపుకొని, పిల్లలకు పెట్టే తల్లి’

అమ్మ అంటేనే మమకారానికి, మాతృత్వానికి, త్యాగానికి ప్రతీకగా చూసే సమాజం మనది. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకొని దాచుకునే స్వభావం తల్లిది. అమ్మ అంటే ప్రేమ తప్ప ద్వేషం, పగ అనే పదాలు ఊహకు కూడా అందవు. ఆఖరికి తన ఆకలిని చంపుకొని పిల్లలకు తిండి పెట్టే తల్లులెందరో.

వివాహేతర బంధంలో ప్రేమను వెతుక్కుంటూ కన్న బిడ్డల్ని చంపడమేంటి? ఇలాంటి వైపరీత్యాలకు దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి? సమాజమా? వర్గమా?.

వీటి చుట్టూ చాలా సామాజిక, ఆర్థిక, మానసిక కోణాలు అల్లుకుని ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు.

తెలంగాణలో జరిగిన ఘటనను పరిశీలిస్తే, ఈమె ఆర్థికంగా దిగువ మధ్య తరగతి లేదా అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న మహిళ అని తెలుస్తోంది. స్కూల్ రీయూనియన్‌లో చిన్ననాటి స్నేహితుడిని కలిసి ప్రేమలో పడింది. ఈమె వివాహ బంధంలో సంతృప్తిగా లేకపోవడంతో కొత్త జీవితానికి పిల్లలు అడ్డువస్తారని చంపేసినట్లు వార్తలొచ్చాయి.

వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

వైద్యపరంగా ఇలాంటి పరిస్థితిని ఏమంటారు?

“ఇలా సొంత తల్లులే పిల్లల్ని చంపడాన్ని సాధారణ విషయంగా చూడలేం. అమెరికా లాంటి దేశాల్లో శిశు హత్యల్లో 2.5 శాతం సొంత తల్లిదండ్రులు చేసినవే ఉంటాయి. ఇందుకు చాలా ఆర్థిక, మానసిక కారణాలుంటాయి” అని హైదరాబాద్‌కు చెందిన మెంటల్‌హెల్త్ ప్రొఫెషనల్, సైకో థెరపిస్ట్, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ నిపుణురాలు డాక్టర్ పూర్ణిమ నాగరాజ అన్నారు.

తల్లి తన చేతులతో తానే పిల్లలను చంపడాన్ని మెటర్నల్ ఫిలిసైడ్ అంటారని ఆమె చెప్పారు.

సైకోటిక్ ఫిలిసైడ్‌లో తల్లులు ఒక మానసిక ఉన్మాద స్థితిలో… కారణాలేవీ లేకుండా కూడా పిల్లల్ని హతమారుస్తారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా చేస్తారని పూర్ణిమ అన్నారు. ఇందుకు వాళ్లు పుట్టి పెరిగిన వాతావరణం లేదా అనుభవించిన పరిస్థితులు కూడా కారణం కావొచ్చని తెలిపారు.

“మరికొన్ని కేసుల్లో పిల్లలపై ప్రేమ ఉంటుంది కానీ, ఈ ప్రపంచంలో తమ పిల్లలకు రక్షణ దొరకదేమో, చనిపోతే వాళ్లు హాయిగా ఉంటారనే ఆలోచనతో, పిల్లలపై మితిమీరిన ప్రేమతో హతమారుస్తారు” అని డాక్టర్ పూర్ణిమ అన్నారు.

దీన్ని ఆల్ట్రూయిస్టిక్ ఫిలిసైడ్ అంటారు. ఇలాంటి వాళ్లకు సమాజంపై, చుట్టూ ఉండే మనుషులపై విపరీతమైన ద్వేషం, పగ ఉంటాయని డాక్టర్ చెప్పారు.

పిల్లలు

ఫొటో సోర్స్, Getty Images

కారణాలు..

“పిల్లలు వద్దనుకున్న తర్వాత పిల్లలు పుట్టినా, లేదా భాగస్వామిపై ద్వేషం ఉన్నా ఆ కోపం తీర్చుకోవడానికి పిల్లలను చంపేస్తుంటారు. వివాహేతర సంబంధాలున్న వారిలో చాలామంది పిల్లలను తమ సంతోషానికి ఆటంకంగా చూస్తారు” అని పూర్ణిమ వివరించారు.

ఓవైపు భర్తతో సుఖం లేకపోవడం, మరోవైపు పుట్టిన పిల్ల ఏడుస్తుంటే.. కోపంతో ఆ నెలల పసికందును చంపేసిన ఘటన 2023 జూలైలో విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఆ పసికందును తల్లే పొదల్లో కప్పిపెట్టేసిందని వార్తల్లో వచ్చింది.

ఇలా పిల్లలను సొంత తల్లులే చంపడానికి వివాహేతర సంబంధాలు మాత్రమే కాదు, మానసిక, ఆర్థిక పరిస్థితులు కూడా కారణం అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.

‘పోస్ట్‌పార్టం సైకోసిస్’ చాలా ప్రమాదకరమైంది. ఈ సమయంలో తల్లి శరీరంలో, మనసులో జరిగే మార్పులు ఒక్కొక్కసారి తీవ్రంగా ఉంటాయి. ఇవి కూడా విపరీత పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉందని పూర్ణిమ అంటున్నారు.

వైవాహిక బంధాల్లో అసంతృప్తి, తర్వాత చోటు చేసుకునే పరిణామాల గురించి ఆలోచించలేకపోవడం, మానసిక ఒత్తిడి, సమాజం పట్ల ద్వేషం – ఇలాంటి విపరీత చర్యలకు కారణాలని బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) 2018లో సమర్పించిన రిపోర్టులో పేర్కొంది.

శిశు హత్యలు చేసి, శిక్షను అనుభవిస్తున్న నలుగురు మహిళల సామాజిక, ఆర్థిక అంశాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు.

15 ఏళ్ల లోపు వారిలో ప్రతి లక్ష మందిలో 0.6-2.1 మందిని హతమార్చిన ఘటనలు ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. భారత్‌లో తగినన్ని ఫోరెన్సిక్ సైకియాట్రిక్ కేంద్రాలు, ఫోరెన్సిక్ సైకియాట్రిస్టులు లేకపోవడం వల్ల ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు కాలేదని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

మహిళలు,

ఫొటో సోర్స్, Getty Images

ఇది ఒక వర్గానికే పరిమితమా?

“సాధారణంగా శ్రామిక వర్గాల్లో మహిళలకు అవసరమైన ప్రైవసీ ఉండదు. వాళ్లకంటూ విడిగా గదులు ఉండవు. పిల్లలు, భర్త అందరూ ఒకేచోట గడపాలి. ఇరుగుపొరుగు చూస్తారనే భయం కూడా ఉంటుంది. ఉన్నత లేదా మధ్య తరగతి వారి మాదిరిగా హాలీడే లేదా రిసార్ట్‌లకు వెళ్లి గడిపే స్వేచ్ఛ కూడా వారికి ఉండదు” అని డాక్టర్ పూర్ణిమ అన్నారు.

వీళ్లకు ప్రైవసీ లేకపోవడం ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తోందా? లేదా, పిల్లలకు తమ బంధం గురించి తెలిస్తే ప్రశ్నిస్తారని లేదా అడ్డు పడతారని అనుకుంటారా?. ఓవైపు ఒక వ్యక్తిపై విపరీతమైన ప్రేమ. అదే మనసుతో చిన్నారులను అంతం చేసే ఉన్మాదం. ఒకే మనిషిలో కనిపించే రెండు విరుద్ధ స్వభావాలకు కారణాలేంటి?

“నిరక్షరాస్యత కూడా కొంత వరకు పాత్ర పోషిస్తుంది. కానీ, ఇవి కేవలం ఒక వర్గానికే పరిమితం అని చెప్పలేం” అని పూర్ణిమ అన్నారు.

2024లో బెంగళూరుకు చెందిన 39 ఏళ్ల మహిళ తన నాలుగేళ్ల కొడుకును గోవాలో ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి చంపేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది. ఈమె ఒక టెక్ కన్సల్టెన్సీకి సీఈవో. కొడుకు కోసం భర్తతో చేస్తున్న కస్టడీ పోరాటంలో ఆమె కొడుకునే హతమార్చేశారు.

మహారాష్ట్రలోని పన్వేల్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ తన 8 ఏళ్ల కూతురిని 29వ అంతస్తు పైనుంచి తోసేసి, తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తల్లో వచ్చింది. ఈ ఘటన 2025 మార్చిలో చోటు చేసుకుంది.

“ఇంట్లో భార్య మానసిక పరిస్థితిపై దృష్టి పెట్టకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా భార్యాభర్తలు కలిసి గడిపే సమయం దొరక్కపోవడం.. ఇవన్నీ ఒత్తిడికి దారి తీస్తాయి” అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

ఒక్క బెంగళూరులోనే 2022లో ఆగస్టు 4 నుంచి 22 మధ్య, మూడు మెటర్నల్ ఫిలిసైడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు మహిళలు డెంటిస్టులు, మరొకరు గృహిణి. ఇవి చూసినప్పుడు మెటర్నల్ ఫిలిసైడ్ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతోంది.

ఈ కథనం రాస్తున్న సమయంలోనే నా మొబైల్‌లో “ప్రేమలో పడిందని 16 ఏళ్ల కూతుర్ని చంపేసిన తల్లి” అనే హెడ్‌లైన్‌తో నోటిఫికేషన్ వచ్చింది.

తల్లే పిల్లల్ని హతమార్చడాన్ని ఎలా చూడాలి? మారుతున్న సమాజంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి గురించి వస్తున్న ఒక హెచ్చరిక అనుకోవాలా?

పరువు హత్య

ఫొటో సోర్స్, AFP

పరువు

వేరే కులం వ్యక్తిని ప్రేమించిందని 16 ఏళ్ల కూతుర్ని తల్లే చంపేసిన ఘటన 2025 ఏప్రిల్‌లో తిరుపతి దగ్గర ఓ గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దలు వద్దన్నా కూడా ఆ అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకుంది, గర్భం దాల్చింది. కడుపుతో ఉన్న కూతుర్ని తల్లి ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసినట్లు వార్తలొచ్చాయి. ఆ అమ్మాయిని వెంటనే దహనం కూడా చేశారని రాశారు. కోపంతో, భయంతో, సమాజంలో ఒత్తిడి వల్ల చంపేసినట్లు చివరకు గ్రామ పెద్ద దగ్గర ఆమె ఒప్పుకున్నారు.

“కన్న పిల్లలపై ప్రేమ కన్నా పరువు పోతుందనే సామాజిక భయం వీళ్లను వెంటాడుతుంది” అని నిపుణులు అంటారు.

ఇక మరో కేసులో.. తమ పిల్లలను దుష్ట శక్తి ఆవరించిందంటూ, తిరిగి బతికి వస్తారనే మూఢనమ్మకంతో కూతుళ్లిద్దరినీ తల్లిదండ్రులిద్దరు కలిసి చంపేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 2021లో జరిగింది. తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులు, సామాజికంగా ఉన్నత వర్గానికి చెందిన వారే.

వీటి వెనుక పాతుకుపోయిన మూఢ నమ్మకాలు, మానసిక దుర్బలత కూడా కారణాలుగా ఉంటాయని డాక్టర్ పూర్ణిమ అన్నారు.

ఇలాంటి పరిణామాలకు ప్రధానంగా మానసిక సమస్యలే ఎక్కువ కారణమని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ 2007లో “చైల్డ్ మర్డర్స్ బై మదర్స్, ప్యాట్రన్స్ అండ్ ప్రివెన్షన్” అనే అంశంపై నిర్వహించిన అధ్యయనంలో పేర్కొంది. అంతేకాదు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం కష్టమని ఈ అధ్యయనం అభిప్రాయపడింది.

న్యాయస్థానం

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి శిక్షలున్నాయి?

ఇలా చేసిన వారికి చట్టంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి?.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బ్రెజిల్, కెనడా, కొలంబియా, ఫిన్‌లాండ్, జర్మనీ, గ్రీస్, హాంగ్‌కాంగ్, భారత్, ఇటలీ, జపాన్, కొరియా, న్యూజీలాండ్, నార్వే, ఫిలిప్పీన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్, తుర్కియే, బ్రిటన్‌లలో శిశు హత్యలకు వ్యతిరేకంగా చట్టాలున్నాయి.

భారత్‌లో శిశుహత్యల శిక్షలకు ప్రత్యేకంగా చట్టం లేదు. కానీ, ఇలాంటి నేరాలను ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే, దోషికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.

అయితే, తల్లి మానసిక స్థితి బాగోలేక ఇలాంటి చర్యకు పాల్పడినట్లు కోర్టు భావిస్తే, ఐపీసీ సెక్షన్ 84 ఆమెకు రక్షణ కల్పిస్తుంది. 2020లో కేరళకు చెందిన ఓ మహిళ పుట్టిన పసికందును ఇయర్ ఫోన్ కేబుల్స్‌తో చంపేసిన కేసులో తల్లి మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది.

‘అవగాహన కల్పించాలి’

మానసిక ఒత్తిడిని ఒక సమస్యగా పరిగణించకపోవడం భారత్‌లో అతి పెద్ద సమస్య అని, ఎవరైనా అసాధారణ రీతిలో ప్రవర్తిస్తున్నప్పుడు మానసిక నిపుణులను సంప్రదించడం వల్ల, సరైన అవగాహన కల్పించడం ద్వారా వీటిని కొంతవరకు నివారించవచ్చని విశాఖపట్నానికి చెందిన ‘గాయత్రీ మెడికల్ హాస్పిటల్’ సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ నడుకూరు రాజు అభిప్రాయపడ్డారు.

“సొంత పిల్లలను చంపిన తర్వాత ఆమెకు వచ్చే లాభం ఏమీ ఉండదు. చంపే బదులు పిల్లలను వదిలిపెట్టి ఆమె దూరంగా వెళ్లిపోవచ్చు. కానీ, విచక్షణారహిత ఆలోచనలు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇలాంటి దారుణాలకు పాల్పడేలా చేస్తాయి. ప్రేమ, కోపం, ద్వేషం, అసంతృప్తి లాంటి భావాలు ఒక్కొక్కసారి ఇలాంటి పనులకు ప్రేరేపిస్తాయి” అని డాక్టర్ రాజు అన్నారు.

మానసిక సమస్యల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా, మొత్తంగా సమాజంపై ఉందని అంటూ, దీనికి చాలా సమయం పడుతుందేమో అన్నారు డాక్టర్ రాజు. పాఠ్యాంశాల్లో మోరల్ సైన్స్, నీతి కథలు తప్పకుండా ఉండాలని ఆయన సూచించారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)