SOURCE :- BBC NEWS

4 గంటలు క్రితం
చదివే సమయం: 7 నిమిషాలు
(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)
అది వేసవికాలం.
పశ్చిమ సిరియాలోని లాటకియా ప్రావిన్స్‌లో ఉన్న తమ ఊరి నుంచి కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, తెల్లరంగు కారు ఆమె ముందు వచ్చి ఆగింది.
ముగ్గురు సాయుధులు ఆ కారులో నుంచి దిగి, ప్రభుత్వ భద్రతా దళాలమని చెప్పి, బలవంతంగా లాక్కెళ్లారని రమియా చెప్పారు.
భద్రతాకారణాల రీత్యా ఆ యువతి పేరు మార్చాం.
ఏడుస్తూ, అరవడంతో వాళ్లు తనను కొట్టారని ఆమె చెప్పారు.
“వాళ్లలో ఒకరు నువ్వు సున్నీవా లేక అలవైట్‌వా అని అడిగారు. నేను అలవైట్ అని చెప్పగానే, వాళ్లు ఆ తెగను అవమానించడం మొదలుపెట్టారు” అని రమియా చెప్పారు.
డిసెంబర్ 2024లో బషర్ అల్ అసద్ నియంతృత్వం పాలన పతనమైనప్పటి నుంచి కిడ్నాప్ అయినట్లు చెబుతున్న మహిళల్లో రమియా ఒకరు.

దాదాపు 80 మందికి పైగా మహిళలు అదృశ్యమైనట్లు వారి కుటుంబాలు, మీడియా, ఇతర సోర్సుల ద్వారా వచ్చిన సమాచారాన్ని రికార్డ్ చేసినట్లు మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సిరియన్ ఫెమినిస్ట్ లాబీ (ఎస్ఎఫ్ఎల్) సంస్థ తెలిపింది. అందులో 26 కేసులు కిడ్నాప్‌లుగా నిర్ధరించినట్లు ఆ సంస్థ చెబుతోంది.
కనిపించకుండా పోయిన వారిలో దాదాపుగా అందరూ అలవైట్ తెగకు చెందినవారే. ఇది షియా ఇస్లాం నుంచి వచ్చిన ఒక తెగ, సిరియా జనాభాలో సుమారు పది శాతం ఉంటుంది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు కూడా ఇదే తెగకు చెందినవారు.
ఫొటో సోర్స్, Kenana Hendawi/Anadolu via Getty Image
మతపరమైన హింస
ఇద్దరు అలవైట్ మహిళలు, మరో ముగ్గురు మహిళలకు చెందిన కుటుంబాలు తమ కిడ్నాప్, దాడి వివరాలను బీబీసీతో పంచుకున్నారు. గోప్యత, భద్రతాకారణాల రీత్యా వారి అసలు పేర్లను ప్రస్తావించడం లేదు. అందరి పేర్లు మార్చాం.
సమగ్ర దర్యాప్తు చేయడంలో తాత్కాలిక ప్రభుత్వ పోలీసింగ్ విధులు నిర్వర్తిస్తున్న జనరల్ సెక్యూరిటీ సర్వీస్ పూర్తిగా విఫలమైందని వారందరూ అన్నారు. తన బాధ చెప్పుకున్నప్పుడు ఆ అధికారులు తనను ఎగతాళి చేశారని వారిలో ఒకరు చెప్పారు.
గత నవంబర్‌లో 42 కిడ్నాప్ ఆరోపణలు వచ్చాయని, వాటిని విచారించగా అందులో ఒకటి మినహా మిగిలినవన్నీ తప్పుడు ఆరోపణలని ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
బీబీసీ మరోసారి మంత్రిత్వ శాఖను సంప్రదించగా, ఇందులో చెప్పాల్సిందేమీ లేదని అన్నారు.
అయితే, కొన్ని కిడ్నాప్‌లు నిజమేనని.. అందులో కొంతమంది భద్రతా సిబ్బంది పాల్గొన్న ఘటనలు కూడా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వెల్లడించారు. కానీ, అలాంటి వారిని విధుల నుంచి తొలగించారని కూడా ఆ అధికారి చెప్పారు.
ఎస్ఎఫ్ఎల్ రికార్డ్ చేసిన కిడ్నాప్‌లు, అదృశ్యాల కేసులు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ నెల మధ్యన జరిగాయి. ఇది 2025 మార్చి నెలకు ముందు, ఆ తర్వాతి పరిస్థితులను సూచిస్తోంది.
ఆ సమయంలో, పశ్చిమ తీరప్రాంతాల్లో 1,400 మందికి పైగా.. అందులోనూ ఎక్కువగా అలవైట్ పౌరులు ఈ తెగ సంబంధిత హింసలో చనిపోయారు.
అసద్ అనుచరుల భారీ దాడి తర్వాత, సున్నీ ఇస్లామిక్ ప్రభుత్వానికి అనుకూలమైన బలగాలు ప్రతీకార హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
అసద్ హయాంలో చాలామంది అలవైట్లు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కానీ, మాజీ అధ్యక్షుడిని వ్యతిరేకించినందుకు అదే తెగకు చెందిన ఇతరులు కూడా అణచివేతను ఎదుర్కొన్నారు.
‘చచ్చిపోదామనుకున్నాం’
శరీరాన్ని కప్పివుంచే ముసుగు (బుర్ఖావంటింది), కళ్లు మాత్రమే కనిపించేలా నఖాబ్(తలపైన ధరించే ముసుగు) వేసుకోమని బలవంతం చేశారని రమియా చెప్పారు.
ఆమెను ఒక భూగర్భ గదిలో బంధించారు. ఆ గదిలో మంచం, డ్రెస్సింగ్ టేబుల్, మరుగుదొడ్లతో పాటు కండోమ్ కూడా ఉందని ఆమె తెలిపారు.
రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉన్న తర్వాత ఒకసారి తప్పించుకోవడానికి, రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ఆమె చెప్పారు.
ఆమెను బంధించిన వ్యక్తికి అరబిక్ స్పష్టంగా మాట్లాడటం రాదు. ఆయన ఏషియన్‌లా ఉన్నారని, తన నిఖాబ్‌ను తీసి ఫోటోలు తీసినట్లు ఆమె చెప్పారు.
“అదే భవనంలో ఉంటున్న ఒక మహిళ ఆయన భార్యనని చెప్పింది. ఆ ఫోటో నా ధర నిర్ణయించడానికి తీసినట్టు చెప్పింది. నాకంటే ముందు చాలా మందిని కిడ్నాప్ చేశారని, వారిలో కొందరిపై అత్యాచారం చేసి విడుదల చేశారని, మరికొందరిని అమ్మేశారని ఆమె నాతో అన్నారు” అని రమియా తెలిపారు.
కిడ్నాప్ అయిన మహిళల విషయంలో డబ్బు లావాదేవీలు జరిగాయన్న ఏ కేసునూ బీబీసీ ధ్రువీకరించలేకపోయింది. కానీ, తమను అమ్మేస్తామని లేదా బలవంతంగా వివాహం చేసుకుంటామని బెదిరించిన సందర్భాల గురించి బాధితులు చెప్పారని కొందరు యాక్టివిస్టులు చెప్పారు.
‘పలుమార్లు రేప్ చేశారు’
లాటకియా ప్రావిన్స్‌లోని తన గ్రామం నుంచి, ఒక వ్యాన్‌లో తనను కిడ్నాప్ చేశారని 30 ఏళ్ల నెస్మా చెప్పారు.
ఒక పారిశ్రామిక భవనంలా కనిపిస్తున్న, ఎత్తైన కిటికీలు ఉన్న గదిలో ఆమెను ఏడు రోజుల పాటు నిర్బంధించారు. అక్కడ ముగ్గురు వ్యక్తులు తన గ్రామస్థుల గురించి, గత ప్రభుత్వంతో సంబంధాల గురించి ప్రశ్నించారని ఫోన్‌లో ఆమె వివరించారు. ఆ సమయంలో ఆమె గొంతులో వణుకు ధ్వనించింది.
వారంతా ముసుగులు ధరించి సిరియన్ అరబిక్‌లో మాట్లాడారని, ‘అలవైట్ మహిళలు సబాయా అవడానికే పుట్టారు’ అన్నారని ఆమె చెప్పారు.
‘సబాయా’ అనేది పాత అరబిక్ పదం. దీని అర్థం ‘మహిళా బందీలు’. కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదులు మహిళలను లైంగిక బానిసలుగా సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
ఫొటో సోర్స్, Abdulvacit Haci Isteyfi/Anadolu via Getty Images
తనను అపహరించిన వ్యక్తులు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెప్పారు. ”ఆ సమయంలో నాకొకటే అనిపించింది. అది చావు. నేను చచ్చిపోతే.. నా బిడ్డ తల్లిలేనివాడైపోతాడు” అని చెప్పారు నెస్మా.
తీవ్రంగా కొట్టి, తుపాకీ గురిపెట్టి బెదిరించి లీన్‌ను నిత్యం లైంగికంగా వేధించారని ఆమె తల్లి హస్నా బీబీసీకి తెలిపారు.
ఆమెను నిర్బంధించిన వ్యక్తి ముఖం కనిపించకుండా దాచుకునేవాడని, అరబిక్‌లో సరిగ్గా రాదని, మార్చిలో జరిగిన హింసాకాండలో అలవైట్లను చంపిన ఘటనల్లో పాల్గొన్నట్లు గొప్పలు చెప్పుకున్నాడని హస్నా చెప్పారు.
“మా ఆడపిల్లలను సబాయా అని పిలిచేవాడు, ఎందుకంటే వాళ్లు దేవుడిని నమ్మరు” అని హస్నా చెప్పారు. కొంతమంది సున్నీ తీవ్రవాదులు అలవైట్లను మతద్రోహులుగా భావిస్తారు.
తన భార్య నూర్‌ను కిడ్నాప్ చేసి వారాలపాటు నిర్బంధించారని అలీ బీబీసీతో చెప్పారు. తన టీనేజ్ కుమార్తెను 10 రోజులపాటు లైంగికంగా వేధించారని చెప్పిన తల్లి సోమయా కూడా బీబీసీతో మాట్లాడారు.
‘ఫోన్ చేసి బెదిరింపులు’
“నన్ను కిడ్నాప్ చేశారని చెప్పడానికి వెళ్లినప్పుడు భద్రతాధికారులు వెకిలిగా, అవమానకరంగా ప్రవర్తిస్తూ, పిక్నిక్‌కి వెళ్లొచ్చినట్లు చెప్పాలన్నారు” అని నెస్మా బీబీసీతో అన్నారు.
మొదట్లో అధికారులు తన కేసులో నిమగ్నమై ఉన్నట్లు కనిపించారని, కానీ తనను బంధించిన వ్యక్తిని గుర్తించిన తర్వాత తన ఫోన్ ఎత్తడం కూడా మానేశారని రమియా చెప్పారు.
“ఈ విషయాలు బయటకు చెబితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ ఫోన్‌లో బెదిరించారు. అందుకే దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్నాం” అని ఆమె అన్నారు.
“వారు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేశారు, కానీ తరువాత ఏం జరిగిందో మాకు తెలియదు. అతను విడదలయ్యాక మా వెంటపడతాడేమోనని భయంగా ఉంది” అని అలీ బీబీసీకి చెప్పారు.
భద్రతా అధికారులు సానుభూతితో, ఏం జరిగిందో తెలుసుకోడానికి తన కూతురిని పలుమార్లు వివరాలు అడిగి తెలుసుకున్నారని.. కానీ నెలలు గడిచినా ఏమైందో ఇంతవరకూ చెప్పలేదని లీన్ తల్లి చెప్పారు.
ఏం జరిగిందో చెప్పాను, కానీ ఎలాంటి అప్‌డేట్ వారి నుంచి రాలేదని సోమయా చెప్పారు.
ఈ 42 కిడ్నాప్ కేసుల గురించి గత నవంబర్‌లో ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికార ప్రతినిధి నౌర్ అల్ దిన్ అల్ బాబా, ”ఈ కేసుల్లో ఒక్కటే నిజమైనది” అని అన్నారు. మిగిలినవాటిలో కొన్ని స్వచ్చందంగా పారిపోవడం, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉండటం, ఇంట్లో వేధింపులకు తట్టుకోలేక పారిపోవడంలాంటి కేసులని తేల్చిచెప్పారు.
కొందరి విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిందని, కొందరు వ్యభిచారం కేసుల్లో ఇరుక్కున్నారని, ఓ నలుగురి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందువల్ల వారు అరెస్టయ్యారని ఆయన చెప్పారు.
నవంబర్ తరువాత, బీబీసీ సేకరించిన వివరాలపై స్పందన కోరగా… “ఇక మాట్లాడడానికి ఏమీ లేదు” అని మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది.
ఫొటో సోర్స్, OMAR HAJ KADOUR/AFP via Getty Images
”డబ్బు కోసమో, సరదా కోసమో లేదా పాతకక్షల కారణంగానో కొంతమంది ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు” అని కోస్తా ప్రాంతానికి చెందిన ఓ భద్రతాధికారి తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
వీరిలో జనరల్ సెక్యూరిటీ సర్వీస్ సభ్యులు కూడా ఉన్నారని ఆయన అన్నారు.
“కొంతమంది అధికారులు ప్రతీకారం తీర్చుకునే మార్గంగా కిడ్నాప్ ఆలోచన చేస్తారు. కొన్ని కేసులు బయటపడ్డాయి, వీటిలో పాల్గొన్న అధికారులను వెంటనే తొలగించారు” అని ఆయన అన్నారు.
అయితే, కిడ్నాపర్లు ఎవరో తమకు తెలియదని బీబీసీతో మాట్లాడిన నలుగురు మహిళలు, కుటుంబ సభ్యులు చెప్పారు.
‘ఎవరూ ఏమీ చేయలేరనే భావన’
మూడు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల కనీసం 36 మంది అలవైట్ మహిళలు, బాలికల కిడ్నాప్‌ల గురించి విశ్వసనీయ నివేదికలు అందాయని, 8 కేసులను వివరంగా నమోదు చేశామని జులైలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
అలా నమోదైన కేసుల్లో పురోగతి గురించి ఆయా కుటుంబాలకు ఎలాంటి సమాచారం లేదు.
“దర్యాప్తులో పురోగతిపై విశ్వసనీయ భావన లేదు” అని డిప్యూటీ రీజినల్ డైరెక్టర్ క్రిస్టీన్ బెకెర్లే బీబీసీకి చెప్పారు.
ఈ అపహరణలకు ఒక సిద్ధాంతపరమైన నేపథ్యం ఉందని బాధితుల వాంగ్మూలాలు సూచిస్తున్నాయని జర్మనీలో నివసిస్తున్న సిరియన్ మానవ హక్కుల కార్యకర్త, రచయిత యామెన్ హుస్సేన్ చెప్పారు. అది ‘ఓడిపోయిన వర్గాన్ని అవమానించడం’ అనే భావనతో ‘అలవైట్ మహిళల్లో భయాన్ని వ్యాప్తి చేయడం’ లక్ష్యంగా ఉందని అన్నారు.
తప్పించుకోవడం సులభం, లేదా ఎవరూ ఏమీ చేయలేరనే భావన కూడా ఇష్టారాజ్యంగా అపహరణకు పాల్పడే ధోరణి పెరగడానికి కారణమని ఆయన వివరించారు.
కొంతమంది డ్రూజ్ , సున్నీ మహిళలు కూడా కిడ్నాప్ అయ్యారని, తరువాత వారిని విడుదల చేశారని, 16 మంది అలవైట్ మహిళలు ఇప్పటికీ కనిపించడం లేదని సిరియన్ ఫెమినిస్ట్ లాబీ సంస్థ పేర్కొంది.
తమకు జరిగిన దాని గురించి మాట్లాడినందుకు ప్రతీకారం తీర్చుకుంటారేమోనన్న భయం, లైంగిక దాడికి గురయ్యామన్న సామాజిక కళంకం బీబీసీతో మాట్లాడిన కుటుంబాలను వెంటాడుతున్నాయి.
“ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది, తలుపు తట్టిన శబ్దం విన్నా ఉలిక్కిపడుతుంది” అని లీన్ తల్లి చెప్పారు.
నెస్మా వివాహ జీవితం ముగిసిపోయింది.
“నేను నిద్రలో అరిచేస్తాను” అని రమియా చెప్పారు. తాను థెరపిస్ట్‌ని సంప్రదిస్తున్నారని, అయినా నిద్రపట్టడం లేదని అన్నారు.
న్యాయం కోరడానికి తాను, నూర్ చాలా భయపడుతున్నామని అలీ బీబీసీకి చెప్పారు.
అయితే, తన కుమార్తె తిరిగి పాఠశాలకు వెళుతోందని, తనచుట్టూ ఉన్నవారికి ఏం జరిగిందో తెలియదని సోమయా అన్నారు.
“మనకు జరిగినదానిని మరిచిపోకూడదు, అలా అని మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోకూడదు” అని ఆమె చెప్పారు.
ఈ కథనంలోని అంశాల వల్ల మీరు లేదా మీకు తెలిసిన ఎవరైనా ప్రభావితమైతే, సమాచారం, మద్దతును అందించే సంస్థల వివరాలు బీబీసీ యాక్షన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి .
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



