Home జాతీయ national telgu “తనతో పెళ్లి వద్దన్నందుకు ఎర్రటి ఇంజెక్షన్ ఎక్కించాడు”, తర్వాత తెలిసిందేమిటంటే..

“తనతో పెళ్లి వద్దన్నందుకు ఎర్రటి ఇంజెక్షన్ ఎక్కించాడు”, తర్వాత తెలిసిందేమిటంటే..

9
0

SOURCE :- BBC NEWS

ఎయిడ్స్, హెచ్ఐవీ, వివాహం రద్దు, హెచ్ఐవీ రక్తం, హెచ్‌ఐవీ వైరస్,  హైదరాబాద్, పోచారం, నేరాలు

ఫొటో సోర్స్, UGC

(గమనిక:ఈ కథనంలో కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

తనతో పెళ్లికి నిరాకరించిందని, మరదలు అయ్యే యువతికి ఓ యువకుడు హెచ్ఐవీ సోకిన తన రక్తాన్ని ఎక్కించారని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

హైదరాబాద్ శివారులోని అన్నోజీగూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉండే 24 ఏళ్ల యువతికి, అదే కాలనీలో ఉండే 25 ఏళ్ల యువకుడికి వివాహం చేయాలని కొన్ని నెలల కిందట రెండు కుటుంబాలు నిర్ణయించాయి.

వారిద్దరూ బావ, మరదళ్లు అవుతారు.

తండ్రి చనిపోవడంతో యువకుడు తన తల్లితో కలిసి ఉంటున్నారు. వారు జనగామ ప్రాంతం నుంచి పాతికేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. యువకుడు పోచారంలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో డ్రైవర్ కమ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.

“అతని తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉండటంతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు, ఆరు నెలల క్రితం యువతి తల్లిదండ్రులు యువకుడికి టెస్టులు చేయించారు. ఉప్పల్‌లోని ఓ ల్యాబ్‌లో టెస్టులు చేయించగా యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. పెళ్లిని రద్దు చేసుకున్నాం” అని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

వివాహం రద్దు కావడంతో, అప్పటి నుంచి ఆ యువకుడు పగ పెంచుకున్నారని పోచారం ఐటీ కారిడార్ ఎస్ఐ విజయ్ భాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

“ఆ అమ్మాయి తనకే దక్కాలన్న ఉద్దేశంతో ఆ యువకుడు తన రక్తాన్ని యువతికి ఎక్కించినట్లు మా విచారణలో తేలింది. హెచ్ఐవీ రక్తం ఎక్కించడం వల్ల ఇకపై వేరొకరికి ఇచ్చి పెళ్లి చేయరని భావించాడు” అని ఎస్ఐ వివరించారు.

ఎయిడ్స్, హెచ్ఐవీ, వివాహం రద్దు, హెచ్ఐవీ రక్తం, ఇంజెక్షన్,  హైదరాబాద్, పోచారం, నేరాలు

ఫొటో సోర్స్, UGC

‘బలవంతంగా ఇంట్లోకి వచ్చి…’

మార్చి 11న ఈ ఘటన జరిగిందని యువతి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

“ఆరోజు సాయంత్రం పూలు అమ్ముకోవడానికి మార్కెట్‌కు వెళ్లాం. ఆ సమయంలో ఇంట్లో నా కూతురు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన యువకుడు ఇంట్లోకి వెళ్లి, మరోసారి పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, మా అమ్మాయి నిరాకరించింది. దీంతో తనతో తీసుకువచ్చిన ఎర్రరంగు లిక్విడ్ ఉన్న ఇంజెక్షన్ బలవంతంగా నా కుమార్తె చేతికి ఎక్కించాడు” అని యువతి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

యువతి భయపడి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

రెండు రోజుల తర్వాత యువతికి జ్వరం, ఒళ్లు నొప్పులు రావడంతో తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. ఆ సమయంలో డాక్టర్ ప్రశ్నించడంతో యువతి అసలు విషయం బయటపెట్టినట్లు ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు.

“హెచ్ఐవీతో కూడిన ప్రమాదకర రక్తాన్ని ఎక్కించి, తన కుమార్తెపై హత్యాయత్నం చేసిన ఆ యువకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి” అని ఆమె తండ్రి చేసిన ఫిర్యాదులో పోలీసులు పేర్కొన్నారు.

ఎయిడ్స్, హెచ్ఐవీ, వివాహం రద్దు, హెచ్ఐవీ రక్తం, ఇంజెక్షన్,  హైదరాబాద్, పోచారం, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

‘ఎయిడ్స్ ఉందని యువకుడికి ముందే తెలుసు’

మార్చి 13, సాయంత్రం తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆ యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండుకు పంపించామని ఎస్ఐ విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

“అతనికి ఎయిడ్స్ ఎలా సోకిందన్న విషయంపైనా విచారణ చేస్తున్నాం. పుట్టినప్పట్నుంచి ఉందని కొన్నిసార్లు, తర్వాత సోకిందని కొన్నిసార్లు చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తున్నాం” అని పోలీసులు చెప్పారు.

అయితే, తనకు ఎయిడ్స్ ఉందని తెలిసినప్పటికీ.. పెళ్లి చేసుకునేందుకు యువకుడు సిద్ధమయ్యారని విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ప్రస్తుతం ఆ యువతి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

తాజాగా చేసిన రక్త పరీక్షల్లో ఆమెకు హెచ్ఐవీ నెగిటివ్ వచ్చిందని, రెండు నెలల తర్వాత మరోసారి టెస్టులు చేస్తే స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పినట్లు విజయభాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

మొత్తం వ్యవహారంపై యువతి తండ్రితో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్‌లో సంప్రదించగా, స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

యువకుడి తల్లితో మాట్లాడేందుకు కూడా బీబీసీ ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు.

ఎయిడ్స్, హెచ్ఐవీ, వివాహం రద్దు, హెచ్ఐవీ రక్తం, ఇంజెక్షన్,  హైదరాబాద్, పోచారం, నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

‘కొన్నిసార్లు వెంటనే తెలియకపోవచ్చు’

యువతికి ప్రస్తుతానికి నెగిటివ్ వచ్చినప్పటికీ దశల వారీగా టెస్టులు చేయాల్సి ఉంటుందని సికింద్రాబాద్ కిమ్స్ ఇన్ఫెక్షియస్ డీసీజెస్ అండ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ పాటిల్ ప్రతీక్ యశ్వంత్ బీబీసీతో చెప్పారు.

“హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి నుంచి రక్తాన్ని నేరుగా మరొక వ్యక్తికి ఎక్కించినప్పుడు వైరస్ సోకేందుకు 90 శాతానికి పైగా అవకాశం ఉంది. పీసీఆర్ టెస్ట్, సీరోలాజికల్ టెస్ట్ చేసినప్పుడు మొదటిసారి తెలియకపోవచ్చు. ఈ టెస్ట్‌లు విడతల వారీగా తర్వాత దశల్లో చేయాల్సి ఉంటుంది” అని ఆయన చెప్పారు.

“కొన్నిసార్లు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న వ్యక్తి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నప్పుడు వైరల్ లోడ్ తక్కువగా ఉండవచ్చు. అంతమాత్రాన వైరస్ లేదని కాదు. వైరస్‌ను వ్యాప్తి చేయగలరు కానీ ఇన్ఫెక్షన్ రిస్క్ కొంచెం తక్కువ ఉండొచ్చు” అని డాక్టర్ పాటిల్ ప్రతీక్ వివరించారు.

“రక్త కణాల మాటున వైరస్ ఉండే అవకాశం ఉంది. దానివల్ల వైరస్ పాజిటివ్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అబ్జర్వేషన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు టెస్ట్‌లు చేస్తూ ఫలితాలు చూసుకుంటూ ఉండాలి” అని చెప్పారు.

అయితే తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో కూడిన వ్యక్తిత్వం డీవియెంట్ బిహేవియర్ కిందకు వస్తుందని చెప్పారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ మీనా హరిహరన్.

“తనకు దక్కకపోతే వేరొకరికి కూడా దక్కకూడదన్న స్వార్థం ఈ ఘటనలో కనిపిస్తోంది. వ్యక్తిగత స్వార్థంతో కూడిన ప్రవర్తనతో మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తాడు” అని వివరించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)