Home జాతీయ national telgu తండ్రీకొడుకుల మృతి కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష, అసలేమిటీ కేసు?

తండ్రీకొడుకుల మృతి కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష, అసలేమిటీ కేసు?

3
0

SOURCE :- BBC NEWS

తమిళనాడు, కోవిడ్, జయరాజ్, బెనిక్స్, పోలీసులకు మరణశిక్ష

35 నిమిషాలు క్రితం

చదివే సమయం: 4 నిమిషాలు

పోలీసులు కొట్టడం వల్ల తండ్రీకొడుకులు మరణించిన కేసులో 9 మంది పోలీసులకు తమిళనాడులోని మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ ఘటన 2020లో జరిగింది.

తూత్తుకుడి జిల్లా సాతాంకుళంలో జరిగిన ఈ ఘటనను ‘హత్య’గా పరిగణిస్తున్నట్లు మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు 2026 మార్చి 23వ తేదీన పేర్కొంది. ఏప్రిల్ 6న జడ్జి శిక్ష వివరాలను ప్రకటించారు.

మార్చి 23న జడ్జి ముత్తుకుమారన్ తీర్పును చదువుతూ.. తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మరణాలను హత్యగా నిర్ధరిస్తున్నట్లు తెలిపారు.

‘జయరాజ్, బెనిక్స్‌లపై పెట్టిన కేసు తప్పుడు కేసు’ అని విచారణలో తేలిందని జడ్జి పేర్కొన్నారు. కేసు విచారణ ఆధారంగా, ‘నిందితులందరూ నేరస్థులే’ అని తీర్పునిచ్చారు.

“నిందితులందరికీ శిక్ష విధించాల్సిన అవసరం ఉంది” అని జడ్జి వ్యాఖ్యానించారు.

ఈ కేసులో మొదటి నిందితుడిగా సాతాంకుళం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన శ్రీధర్ ఉన్నారు. ఆయనతో పాటు సబ్ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు సామదురై, ముత్తురాజ్, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు, పాల్‌దురైలపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో పాల్‌దురై 2020 ఆగస్టులో కరోనాతో మరణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
తమిళనాడు, కోవిడ్, జయరాజ్, బెనిక్స్, పోలీసులకు మరణశిక్ష

‘లాఠీపై రక్తం’

బాధితులకు పరిహారం చెల్లించడానికి దోషుల ఆస్తి విలువను నిర్ధరించి, ఆ వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయమూర్తి ఆదేశించారు.

తీర్పు అనంతరం జయరాజ్, బెనిక్స్ కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది జెబసింగ్ మదురై జిల్లా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులందరినీ నేరస్థులుగా ప్రకటించడం తమకు దక్కిన విజయమని అన్నారు.

న్యాయమూర్తి ముత్తుకుమారన్ తన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించారని జెబసింగ్ తెలిపారు. ముఖ్యంగా, “లాఠీపై ఉన్న రక్తం డీఎన్ఏ పరీక్షలో నిర్ధరణ అయిన విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు” అని చెప్పారు.

అంతేకాకుండా, జయరాజ్, బెనిక్స్‌లను తరలించిన ప్రైవేట్ వాహనంలో సేకరించిన రక్త నమూనాలు, వీడియో ఆధారాలు ఈ కేసులో కీలకంగా నిలిచాయని న్యాయవాది జెబసింగ్ వివరించారు.

తమిళనాడు, కోవిడ్, జయరాజ్, బెనిక్స్, పోలీసులకు మరణశిక్ష

ఫొటో సోర్స్, Handout

బెనిక్స్ సోదరి ఏమన్నారు?

నిందితులకు గరిష్ట శిక్ష పడుతుందని ఆశించినట్లు బెనిక్స్ సోదరి పెర్సి మీడియాతో తెలిపారు.

సోదరుడిని, తండ్రిని కోల్పోయి తన కుటుంబం దుఃఖంలో ఉందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, “నిందితులకు కఠినమైన శిక్ష పడితేనే.. రేపు మరో అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడరు” అని అన్నారు.

ఏమిటీ కేసు?

తూత్తుకుడి జిల్లా సాతాంకుళంలో 58 ఏళ్ల జయరాజ్, ఆయన కుమారుడు 31 ఏళ్ల బెనిక్స్ ఒక సెల్‌ఫోన్ షాపు నడుపుతుండేవారు. అప్పట్లో లాక్‌డౌన్ కారణంగా దుకాణాలు తెరవడానికి సమయ పరిమితులు ఉండేవి.

2020, జూన్ 19 (శుక్రవారం): రాత్రి సమయంలో షాపు మూసివేసే విషయంలో బెనిక్స్‌కు, సాతాంకుళం పోలీస్ స్టేషన్‌కు చెందిన కొందరు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

దీనిపై పోలీసులు జయరాజ్, బెనిక్స్‌లపై కేసు పెట్టి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మొదట జయరాజ్‌ను స్టేషన్‌కు తరలించగా, తండ్రి కోసం వెళ్లిన బెనిక్స్‌ను కూడా పోలీసులు అక్కడే నిర్బంధించారు.

2020 జూన్ 21: ఇరువురినీ కోవిల్‌పట్టి సబ్ జైలుకు తరలించారు.

పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌లో.. బాధితులే పోలీసులను దూషించి, “నేలపై పడ్డారని, ఆ క్రమంలోనే వారికి గాయాలయ్యాయని” పేర్కొన్నారు.

అయితే, ఒకరోజు వ్యవధిలోనే బెనిక్స్, జయరాజ్ మరణించారు.

“జూన్ 22, సోమవారం సాయంత్రం ఛాతీ నొప్పితో స్పృహతప్పి పడిపోయిన బెనిక్స్‌ను వార్డెన్లు గమనించి, సబ్ జైలు సూపరింటెండెంట్ శంకర్ సహాయంతో కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, రాత్రి 9 గంటల సమయంలో బెనిక్స్‌ మరణించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బెనిక్స్ తండ్రి జయరాజ్‌కు జ్వరం రావడంతో ఆయనను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. జయరాజ్‌ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మరణించారు” అని జైలు అధికారులు ఆ సమయంలో తెలిపారు.

దీంతో, మృతుల బంధువులు సాతాంకుళంలో నిరసనకు దిగారు. వీరికి మద్దతుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలన్నీ మూసివేశారు. పోలీసులు కొట్టడం వల్లే వారు చనిపోయారని బంధువులు ఆరోపించారు.

సీబీఐకి కేసు

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయం కావడంతో, సాతాంకుళం పోలీస్ స్టేషన్‌కు చెందిన రఘు గణేష్, బాలకృష్ణన్ అనే ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచి, ఆ తర్వాత సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వారందరినీ బదిలీ చేశారు.

అయితే, ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌, దీనిపై రిపోర్ట్ సమర్పించాలని జిల్లా పోలీసులను ఆదేశించింది. ప్రజలపై పోలీసుల దాడి కరోనా మహమ్మారిలా వ్యాపిస్తోందని, ఈ విషయాన్ని సులువుగా తీసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ వ్యవహారంపై విచారణకు వెళ్లిన కోవిల్‌పట్టి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ భారతీదాసన్‌కు అక్కడి పోలీసులు సహకరించకపోవడమే కాకుండా, ఒక కానిస్టేబుల్ ఆయనతో చాలా అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి. మెజిస్ట్రేట్ భారతీదాసన్ దీనిపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు రిపోర్ట్ సమర్పించారు.

అనంతరం సాతాంకుళం పోలీస్ స్టేషన్‌ను రెవెన్యూ శాఖ నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఆధారాలను రక్షించడానికి, పోలీసుల జోక్యాన్ని నిరోధించడానికి, తహసీల్దార్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉన్నారు.

తర్వాత ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కి అప్పగించారు. కేసు విచారణ అనంతరం, సాతాంకుళం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శ్రీధర్, సబ్ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు సామదురై, ముత్తురాజా, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వెలుముత్తు, పాల్‌దురైలపై అభియోగాలు నమోదయ్యాయి.

వీరందరిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిలో పాల్‌దురై 2020 ఆగస్టులోనే కరోనా సోకడం వల్ల మరణించారు.

ఈ కేసులో సీబీఐ రెండు దశల్లో 2,427 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. మదురైలోని మొదటి అదనపు సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)