Home జాతీయ national telgu డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఏమన్నది..

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్‌పై సుప్రీంకోర్టు ఏమన్నది..

9
0

SOURCE :- BBC NEWS

వైసీపీ, కూటమి ప్రభుత్వం, అనంత బాబు, హత్య, నేరం

ఫొటో సోర్స్, NAVEEN

ఆంధ్రప్రదేశ్‌లో ‘డెడ్‌ బాడీ డోర్‌ డెలివరీ కేసు’గా వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు అభివర్ణించిన ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయభాస్కర్ (అనంత బాబు) కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత బాబుకి డీఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చేందుకు పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఒక్కటయ్యాయని సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది.

ఇది ఏమాత్రం ఉపేక్షించరాని తప్పు అని, ఈ వ్యవహారంలో పోలీసుల తీరు ఆక్షేపణీయమని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినట్టు జిల్లా కోర్టులో ఈ కేసును వాదించిన న్యాయవాది, ప్రస్తుతం ఆ కేసు ప్రాసిక్యూషన్‌కి సహాయం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అడ్వొకేట్‌ ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీకి తెలిపారు.

ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ కేసు విచారణతో సంబంధమున్న నాటి కాకినాడ డీఎస్పీ, ప్రస్తుతం భీమవరం అడిషనల్‌ ఎస్పీగా పనిచేస్తున్న వి. భీమారావు, ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, అప్పట్లో సర్పవరం సీఐగా పనిచేసి, ప్రస్తుతం కోనసీమ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆకుల మురళీకృష్ణ, అప్పట్లో సర్పవరం స్టేషన్‌ ఎస్‌ఐగా ఉన్న ఎన్‌. సతీశ్ బాబును రాష్ట్ర ప్రభుత్వం రెండురోజుల కిందట సస్సెండ్‌ చేసింది.

విచారణలో లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వదిత్‌ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నలుగురిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పరారీలో ఏ–2 అనంత లక్ష్మీదుర్గ

మరోవైపు ఈ హత్య కేసు విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నాలుగురోజుల కిందట ఈ కేసులో రెండో నిందితురాలిగా అనంత బాబు భార్య అనంత లక్ష్మీదుర్గ అలియాస్‌ రోజాను చేర్చింది.

హత్యకు ఆమె సహకరించడమే కాకుండా, సాక్ష్యాలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంటూ, ఈ కేసులో ఏ–2గా చేరుస్తూ రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసినట్టు సిట్‌ సభ్యుడైన ఓ అధికారి బీబీసీకి తెలిపారు.

ఫోరెన్సిక్, సీసీటీవీ, డిజిటల్‌ ఆధారాలను సిట్‌ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత.. అనంత బాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గలను ప్రధాన నిందితులుగా పేర్కొంటూ అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేశామని ఆయన వివరించారు.

అయితే ప్రస్తుతం ఏ–2 లక్ష్మీదుర్గ పరారీలో ఉన్నారని, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసిందని సిట్‌ అధికారి వెల్లడించారు.

వైసీపీ, కూటమి ప్రభుత్వం, అనంత బాబు, హత్య, నేరం

ఫొటో సోర్స్, MUPPALLA SUBBARAO

ఈ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది అనంతబాబే

2022 మే 19 అర్ధరాత్రి వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్‌భాస్కర్‌ (అనంత బాబు) గతంలో తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తన కారులో తీసుకుని వెళ్లి ఆయన తల్లిదండ్రులకు అప్పగించారు.

మొదట కారు డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో చనిపోయారని, ఆ తర్వాత అప్పు విషయంలో జరిగిన చిన్నపాటి గొడవలో ప్రమాదవశాత్తూ చనిపోయారని తర్వాత చెప్పారు.

దీంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత దళితసంఘాలు, ప్రజాసంఘాలు జోక్యం చేసుకున్నాయి.

సుబ్రహ్మణ్యం మృతి వివాదంగా మారడంతో చివరికి పోలీసులు అనంత బాబుపై హత్య (సెక్షన్‌ 302), సాక్ష్యాల ధ్వంసం (సెక్షన్‌ 201), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ (నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి.. ఘటన జరిగిన ఐదురోజుల తర్వాత మెజిస్ట్రేట్‌ఎదుట హాజరుపరిచారు.

ఈ కేసులో బెయిల్‌ కోసం అనంత బాబు చేసిన అభ్యర్థనను దిగువకోర్టు, హైకోర్టు నిరాకరించాయి. హైకోర్టు తీర్పును 2022 అక్టోబరు 21న అనంత బాబు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

ఆయనకు 2022 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఆ పిటిషన్‌ మరోసారి 2026 ఫిబ్రవరి 20వ తేదీనచీఫ్ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా పోలీసులు, దర్యాప్తు సంస్థ వైఫల్యాలను ప్రస్తావిస్తూ సీజేఐ కీలక వ్యాఖ్యలు చేసినట్టు న్యాయవాది సుబ్బారావు బీబీసీకి తెలిపారు.

నిందితుడు ఏళ్ల తరబడి మధ్యంతర బెయిల్‌పై బయట తిరుగుతుండటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసిందని ఆయన వెల్లడించారు.

వైసీపీ, కూటమి ప్రభుత్వం, అనంత బాబు, హత్య, నేరం

ఫొటో సోర్స్, Getty Images

పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

”నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్‌ 167(2) కింద డిఫాల్ట్‌ బెయిల్‌ సులభంగా వచ్చేలా పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నించారు. 2022 డిసెంబర్ నుంచి నిందితుడు మధ్యంతర బెయిల్‌పైనే ఉన్నారు. హత్యా నేరం జరిగినప్పుడు ఇంత నిర్లక్ష్యమెలా వహిస్తారు? ‘ అని ఈ కేసులో నాటి పోలీసుల తీరుపై ధర్మాసనం వ్యాఖ్యానించిందని సుబ్బారావు చెప్పారు.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను నియమించి సమగ్ర విచారణ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా.

హత్య జరిగిన కాలంలో వైసీపీ అధికారంలో ఉందనీ ఎమ్మెల్సీగా ఉన్న నిందితుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేయగలిగారని, ఫోరెన్సిక్‌ నివేదిక కూడా లేకుండా చేశారని, దాంతో సప్లిమెంటరీ చార్జిషీటు దాఖలు చేశామని లూథ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం ఈ ఏడాది నవంబరు 30లోపు విచారణను పూర్తి చేయాలని ట్రయల్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఈ కేసు విచారణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఏపీ హైకోర్టుకు సూచించింది.

”మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనంత బాబుపై ఆరోపణలు రాగానే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కింది కోర్టులోగానీ, హైకోర్టులోగానీ బెయిల్ రాకపోతే ఆయన నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అప్పట్లో అధికార దుర్వినియోగం జరిగితే ఆయన్ని రిమాండ్‌కి ఎందుకు పంపిస్తారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా పార్టీకి చెందిన నాయకుడిని ఇబ్బంది పెట్టాలని, ఆ కేసులో ఆయన భార్యని చేర్చింది… ఇది అన్యాయం. దీన్ని చట్టపరంగానే ఆయన ఎదుర్కొంటారు” అని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ బీబీసీతో అన్నారు.

ఆరోపణలు వచ్చిన తర్వాత అనంత బాబు మీద వైసీపీ సస్పెన్షన్ విధించింది. అయితే 2022 డిసెంబరులో బెయిల్ రాగానే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసింది.

వైసీపీ, కూటమి ప్రభుత్వం, అనంత బాబు, హత్య, నేరం

ఫొటో సోర్స్, NAVEEN

న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చింది: సుబ్రహ్మణ్యం తండ్రి

తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తమ కుమారుడి హత్య కేసులో నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం వచ్చిందని మృతుడు సుబ్రహ్మణ్యం తండ్రి సత్యనారాయణ బీబీసీతో అన్నారు.

‘‘కేసులో ప్రధాన నిందితులైన అనంత బాబు, ఆయన భార్యకు శిక్ష పడటం కాదు.. అసలు అనంత బాబు మా కుమారుడిని ఎందుకు హత్య చేశాడన్నది తేలాలి..మా బిడ్డను అన్యాయంగా చంపేశారు’’ అని సత్యనారాయణ అన్నారు.

దాదాపు నాలుగైదేళ్లు ఆయన దగ్గర డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేశాడనీ, పని మానేసిన రెండు నెలల తర్వాత మాట్లాడాలని నా కొడుకును అనంత బాబు పిలిపించుకుని తీసుకువెళ్లి అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో తన కొడుకు మృతదేహం తీసుకుని తన దగ్గరకే వచ్చారని సత్యనారాయణ తెలిపారు.

‘‘మొదట యాక్సిడెంట్‌ అన్నాడు.. ఆ తర్వాత చిన్న గొడవలో ప్రాణం పోయిందన్నాడు. మేము గట్టిగా మాట్లాడేసరికి .. ఊరికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తాను అని అన్నాడు’’ అని తెలిపారు.

సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మా న్యాయవాది తనకు చెప్పారనీ, దీంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చిందని సత్యనారాయణ అన్నారు.

‘‘అనంత బాబు, ఆయన భార్య పాత్రలే కాదు.. ఇంకా మరికొందరి పాత్ర కూడా ఉండి ఉంటుంది. దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టాలి” అని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు

వైసీపీ, కూటమి ప్రభుత్వం, అనంత బాబు, హత్య, నేరం

ఫొటో సోర్స్, MUPPALLA SUBBARAO

స్పందించని అనంత బాబు.. అడిషనల్‌ ఎస్పీ

ఈ విషయమై అనంత బాబుతో మాట్లాడేందుకు బీబీసీ ఫోన్‌ ద్వారా ప్రయత్నించింది. ఆయన అందుబాటులోకి రాలేదు. రాగానే ఆయన స్పందనను ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

మరోవైపు ఈ కేసులో సస్పెండైన నలుగురు పోలీసుల్లో ఒకరైన భీమవరం అడిషనల్‌ ఎస్‌పీ భీమారావుకు బీబీసీ ఫోన్‌ చేయగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. సస్పెండైన మిగతా ముగ్గురు పోలీసులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి స్పందన రాగానే ఈ కథనంలో అప్‌డేట్‌ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)