Home జాతీయ national telgu ‘డ్రగ్స్ తీసుకుని’ పోలీసులకు చిక్కిన టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

‘డ్రగ్స్ తీసుకుని’ పోలీసులకు చిక్కిన టీడీపీ ఎంపీ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

9
0

SOURCE :- BBC NEWS

  • 2 గంటలు క్రితం

  • చదివే సమయం: 6 నిమిషాలు

మొయినాబాద్, ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/putta mahesh kumar/pilot rohit reddy

తెలుగుదేశం నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, భారత రాష్ట్ర సమితి పార్టీ తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుని తమకు చిక్కినట్టు తెలంగాణ పోలీస్‌కు చెందిన డ్రగ్స్ వ్యతిరేక విభాగం ఈగిల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు తెలిపారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే భాగస్వామ్య పక్ష సిట్టింగ్ ఎంపీ, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలే డ్రగ్స్ తీసుకుని దొరికారన్న పోలీసుల ప్రకటన రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

వారితో పాటు మరో నలుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నారని, పార్టీలో ఉన్న మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

వీరిలో ఎంపీ మహేశ్ కుమార్ స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగిల్ విభాగం, తెలంగాణ పోలీసు ఇతర విభాగాలతో కలసి మార్చి 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో సోదాలు చేసింది. ఆ సమయంలో అక్కడ 11 మంది దొరికినట్టు ఈగిల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు చెప్పారు. అయితే అప్పటికప్పుడు వారికి డ్రగ్స్ పరీక్షలు చేయగా, ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే అప్పటికప్పుడు జరిపే పరీక్షలు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ సమక్షంలో రక్త నమూనాలు తీసుకుని పరీక్షించగా, ఆ ఐదుగురితో పాటు ఆరో వ్యక్తికీ డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తే ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్.

వీరందరిపై మొయినాబాద్ స్టేషన్లో ఆయుధాల చట్టం, నార్కొటిక్స్ చట్టం, బీఎన్ఎస్ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు.

”ఇద్దరిలో మొత్, కొకైన్, మిగతా వాళ్లలో కొకైన్ కనిపించింది. ఇక అక్కడ దొరికిన పౌడర్ ఏ పదార్థం అనేది పరీక్షలు చేసిన తరువాతే తెలుస్తుంది” అన్నారు ఎస్పీ గిరిధర్. దొరికిన వారిలో ప్రజా ప్రతినిధులతో పాటు, వ్యాపారస్తులు, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారని పోలీసులు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
డ్రగ్స్ వ్యతిరేక విభాగం ఈగిల్ ఎస్పీ గిరిధర్, మొయినాబాద్, ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

‘ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ రక్తపరీక్షలో పాజిటివ్’

”ముందుగా మూత్ర పరీక్షలు చేస్తాం. అయితే శరీర మెటబాలిజం వల్ల కొందరిలో గంట, రెండు గంటలు ఆలస్యంగా డ్రగ్ ఆనవాళ్లు కనిపిస్తాయి. తరువాత అది వివాదం అవుతుంది అని, కచ్చితత్త్వం ఉండాలని భావించిన ప్రభుత్వం జీవో 4 ఇచ్చింది. ఆ జీవో ప్రకారం, అనుమానితులు అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయాలి. రక్త పరీక్ష ద్వారా డ్రగ్ తీసుకున్నారా లేదా అన్నది కచ్చితంగా తెలుస్తుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ విషయంలో అదే జరిగింది. మూత్రంలో రాలేదు కానీ రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చింది” అన్నారు ఎస్పీ గిరిధర్.

మొయినాబాద్, ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

వీరిపై గతంలో డ్రగ్ కేసులు ఉన్నాయా అనేది విచారణ చేస్తున్నట్టు ఎస్పీ గిరిధర్ చెప్పారు.

పుట్టా మహేశ్ మరొకరితో కలసి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో ఫామ్ హౌస్‌కి వచ్చినట్టు పోలీసులు చెప్పారు.

ఈ పదకొండు మందిలో ఒక మహిళ ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

”రోహిత్, మహేశ్, రితేశ్, మనీత్, కౌశిక్, అర్జున్ – ఈ ఆరుగురికీ పాజిటివ్ వచ్చింది” అన్నారు ఎస్పీ.

మొయినాబాద్, ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

కాల్పులు

పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో అక్కడ తుపాకీ పేలుడు శబ్దం వినిపించినట్లు చెప్పారు.

”మేం వెళ్లే సరికి నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే మా సిబ్బంది అలర్ట్ అయి కాల్పులు చేసిన వ్యక్తిని పట్టుకున్నాం. అతను తుపాకి చేత్తో పట్టుకుని ఆకాశం వైపు గురిపెట్టి ఉండగా మేం పట్టుకున్నాం. ఎందుకు కాల్పులు జరిపారు అన్నది విచారణలో తెలియాలి” అన్నారు ఎస్పీ గిరిధర్.

ఆ ఆయుధాన్ని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

మొయినాబాద్, ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

రాజకీయ దుమారం

ఈ డ్రగ్స్ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు.

”బీఆర్ఎస్ హయాంలో (తెలంగాణ) డ్రగ్స్ మాఫియా కేంద్రంగా మారింది. రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. బీఆర్ఎస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. డ్రగ్స్ అంటే ఏంటో తనకు తెలియదని గతంలో కేటీఆర్ అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉంది” అని విమర్శించారు తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి.

దీనిపై బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ స్పందించారు.

“మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడుతుండటం అత్యంత దురదృష్టకరం. వ్యక్తిగతంగా నేను డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా వ్యతిరేకం. మా పార్టీ డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వాడుతున్నా లేదా విక్రయిస్తున్నా, వారి పార్టీతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాల్సిందే. అయితే, ఈ దారుణమైన పరిస్థితిలోకి బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. బీఆర్ఎస్‌పై రాజకీయ కక్ష సాధింపు కోసం డ్రగ్స్ కేసును వాడుకోవడం మీ హేయమైన రాజకీయాలకు నిదర్శనం. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్(తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్) సూచనను నేను స్వాగతిస్తున్నా. మనమే ఆదర్శంగా నిలుద్దాం. ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులతో సమాధానం చెబుతానని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాను” అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్.

అయితే బీఆర్ఎస్ తమ పార్టీ నాయకుడైన రోహిత్ రెడ్డిపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది ఇంకా స్పష్టత లేదు.

మొయినాబాద్ ఫామ్ హౌస్, డ్రగ్స్, రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్, కాల్పులు, పుట్టా మహేశ్, కేటీఆర్

ఫొటో సోర్స్, UGC

అటు ఆంధ్రప్రదేశ్ నుంచి వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు దీనిపై స్పందించాయి.

⁠” డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికిన ఎంపీ పుట్టా మహేశ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ⁠టీడీపీ ఎంపీ చట్ట సభల గౌరవాన్ని మంటగలిపారు. మహేశ్‌తో ఎంపీ పదవికి రాజీనామా చేయించాలి. డ్రగ్స్ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలి. దీని వెనుక అసలు సూత్రధారులను అరెస్ట్ చేయాలి” అని డిమాండ్ చేశారు వైయస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ మార్గాని భరత్.

”మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ దొరకడం సిగ్గుచేటు. దిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్‌తో విందు, చిందు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం? డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది కదా, ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు? డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఎంపీగా పుట్టా మహేశ్ పై అనర్హత వేటు వేయాలి. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి. డ్రగ్స్ వాడకంపై నిజంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి” అని డిమాండ్ చేశారు వైయస్ షర్మిళ.

అయితే విచారణ పూర్తయ్యే వరకు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)