SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, US National Archives
హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలో ఉన్న బ్రిటిష్ ఆధీనంలోని స్థావరంవైపు ఇరాన్ రెండు మిసైల్స్‌ను ప్రయోగించింది. అయితే, అవి లక్ష్యాన్ని చేరలేదు.
హార్ముజ్ జలసంధి మీదుగా ఇరాన్ చేస్తున్న దాడులను నిరోధించేందుకు తమ సైనిక స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చని అమెరికాకు బ్రిటన్ శుక్రవారం సూచించింది.
దీనికి ఇరాన్ ప్రతిస్పందిస్తూ, అమెరికా ఆ సైనిక స్థావరాన్ని వినియోగించడాన్ని “ఉద్రిక్తతలను తీవ్రం చేయడం”గా పరిగణిస్తామని బ్రిటన్‌ను హెచ్చరించింది.
అయితే, ఇరాన్ శనివారం ప్రయోగించిన క్షిపణి దాడులు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నేంటంటే.. ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భారత్ వరకూ, అంటే హిందూ మహాసముద్రం వరకూ వ్యాపించిందా?
ఇది వ్యూహాత్మకంగా భారత్‌కు ఎలాంటి సంకేతం?

ఇక రెండో ప్రశ్న ఏంటంటే, మేం యుద్ధంలో చేరబోమని చెబుతున్నప్పటికీ బ్రిటన్ కూడా యుద్ధంలో చేరినట్టేనా? ఈ యుద్ధం మరింత తీవ్రతరం కానుందా?
యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న నిపుణులు బీబీసీతో మాట్లాడుతూ, ఈ పరిణామం భారత్‌కు ఆందోళనకరమేనని, అలాగే డియెగో గార్సియాపై దాడి, ఈ యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశాలను కూడా పెంచిందని అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, EPA
ఇరాన్ దాడి
డియెగో గార్సియాపై క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. అయితే, ఆ అధికారుల పేర్లు వెల్లడించలేదు.
ఆ తర్వాత, బీబీసీ వివిధ వర్గాలతో మాట్లాడింది. వారు కూడా ఈ దాడులను ధ్రువీకరించారు.
ఆ స్థావరం లక్ష్యంగా ఇరాన్ రెండు మిసైల్స్ ప్రయోగించిన విషయాన్ని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించలేదు. అయితే, ఆ విషయాన్ని ఖండించనూ లేదు.
“ఈ ప్రాంతంలో ఇరాన్ విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. ఈ దాడులు బ్రిటిష్ ప్రయోజనాలకు, బ్రిటన్ మిత్రదేశాలకు ముప్పు” అని రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
డియెగో గార్సియా నుంచి “రక్షణాత్మక బాంబు దాడులు” చేసేందుకు అమెరికా సైన్యానికి బ్రిటన్ అనుమతి ఇచ్చింది.
ఇప్పటికైతే, హిందూ మహాసముద్రంలోని యూకే అధికార పరిధిలోని డియెగో గార్సియా నుంచి అమెరికా బాంబు దాడులు చేసినట్లు ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు, హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాను చేరగల మిసైల్స్ ఇరాన్ వద్ద ఉన్నాయా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.
అమెరికా వైమానిక దళానికి చెందిన లాంగ్ రేంజ్ బాంబర్లు తరచూ ఉపయోగించే ఈ బ్రిటిష్ సైనిక స్థావరం ఇరాన్ నుంచి దాదాపు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇరాన్ వద్ద 2000 కిలోమీటర్ల పరిధి కలిగిన మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నట్లు భావిస్తున్నారు.
అయితే, ఇరాన్ వద్దనున్న ఖొర్రమ్‌షహర్ మిసైల్ అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదని కొందరు సైనిక వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన అల్మా రీసర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అంచనా ప్రకారం, ఇరాన్ దగ్గరున్న ఖొర్రమ్‌షహర్ మిసైల్ రేంజ్ 3000 కిలోమీటర్లు.
ఉత్తర కొరియాకు చెందిన ఒక మిడిల్ రేంజ్ మిసైల్ ఆధారంగా దీనిని అభివృద్ధి చేసినట్లు భావిస్తున్నారు.

భారత్ ముందున్న సవాలేంటి?
హిందూ మహాసముద్రంలో ఇరాన్ మిసైల్ దాడి భారత్‌ను ప్రభావితం చేస్తుందా?
బీబీసీ అడిగిన ఈ ప్రశ్నకు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రేమానంద మిశ్రా స్పందిస్తూ, “డియెగో గార్సియాను అత్యంత సురక్షితమైన ప్రాంతంగా భావిస్తారు. ఒకవేళ ఇరాన్ ఆ స్థావరంపై దాడి చేసి తన లక్ష్యాన్ని ఛేదించలేకపోయినా, ఆ ఆపరేషన్ విజయవంతమైతే మాత్రం అది భవిష్యత్తుకు ముప్పు. ఇది భారత్ ఇండో-పసిఫిక్ వ్యూహానికి ఆందోళన కలిగించే అంశం” అని అన్నారు.
“ఈ సముద్ర ప్రాంతంలో నౌకల స్వేచ్చాపూరిత రాకపోకలు, మరీముఖ్యంగా సముద్ర భద్రత విషయంలో భారత వ్యూహాత్మక స్వతంత్ర విధానానికి ఇది ప్రశ్నార్థకంగా పరిణమిస్తుంది” అన్నారాయన.
‘‘ఒకవేళ ఈ యుద్ధం ముదిరి చైనా, అమెరికా మధ్య యుద్ధం జరిగితే, అప్పుడు భారత్ ఏం చేస్తుంది? అసలు భారత్ ఏం చేయగలదు? నిజానికి ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్రానికి సంబంధించి భారత వ్యూహాత్మక స్వతంత్రతకు డియెగో గార్సియా అత్యంత కీలకం” అని ప్రేమానంద అభిప్రాయపడ్డారు.
“డియెగో గార్సియా విషయంలో భారత్, అమెరికాకు ఒకవిధమైన సంబంధముంది. అక్కడ ముప్పు పెరిగితే అమెరికాపై భారత్ ఆధారపడడం మరింత పెరుగుతుంది. ఎందుకంటే, అమెరికా లేకుండా చైనా విస్తరణవాదాన్ని, చైనా నిఘాను ఎదుర్కొనే పరిస్థితిలో భారత్ లేదు” అన్నారు ప్రేమానంద.
మిడిల్ ఈస్ట్ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫాం వ్యవస్థాపకురాలు డాక్టర్ శుభదా చౌధరి కూడా డియెగో గార్సియాపై ఇరాన్ మిసైల్ దాడి భారత్‌కు పెద్ద సవాల్ అని అన్నారు.
హిందూ మహాసముద్రంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా శుభదా ప్రస్తావించారు.
“డియెగో గార్సియాలో అమెరికన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లు, పేట్రియాట్/థాడ్ క్లాస్ ఎయిర్ డిఫెన్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ యుద్ధ సామగ్రితో సహా చాలా సైనిక ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా అమెరికా, బ్రిటన్ అణు జలాంతర్గాములు ఈ జలాల్లో నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. ఏదైనా భారత నౌకాదళ టాస్క్‌ఫోర్స్‌ను పంపినా, అవి దాడి చేయగల పరిస్థితికి చేరుకోకముందే యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ) ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఆమె చెప్పారు.

యుద్ధం ఇంకా ముదురుతుందా?
ఇరాన్‌తో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో నేరుగా జోక్యం చేసుకునేందుకు బ్రిటన్, యూరప్ విముఖత చూపాయి. కానీ, డియెగో గార్సియాపై ఇరాన్ మిసైల్ దాడి ఈ పరిస్థితిని మార్చేస్తుందా?
ఈ ప్రశ్నకు ప్రేమానంద్ మిశ్రా సమాధానమిస్తూ, “ఈ దాడి యూకే సంకోచించకుండా చేస్తుంది. మీరు డియెగో గార్సియాపై ఐఆర్ఎంబీ (ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్) ప్రయోగిస్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటన్ నౌకా దళ, సైనిక స్థావరాలు ప్రమాదంలో పడనున్నాయని అర్థం. అందువల్ల యూరప్, లేదా బ్రిటన్ విషయంలో ఆ సంకోచం దూరమవుతుంది. వారు అమెరికా గొడుగు కిందకు రావాల్సి ఉంటుంది” అని అన్నారు.
అలాగే, “వారి సైనిక స్థావరాలు కూడా సురక్షితం కాదని, ఇరాన్ చేసిన ఈ దాడి యుద్ధ తీవ్రతను మరింత పెంచుతుందని యూరప్‌కు ఇదొక సంకేతం” అన్నారాయన.
శుభదా చౌదరి మాట్లాడుతూ.. అమెరికా, బ్రిటన్‌ల మధ్య ఉన్న ప్రత్యేకమైన సంబంధం విస్తృతమైనదని, అమెరికా చేపట్టే ఏ భారీ సైనిక చర్యలోనైనా బ్రిటన్ తటస్థంగా ఉండడం దాదాపుగా అసాధ్యమని అన్నారు.
నేటీ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా గూఢచార సమాచార మార్పిడి, సైనిక సహకారం వాటంతట అవే యాక్టివ్ అవుతాయి.
“ఫైవ్ ఐస్ అలయెన్స్ (యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) కూటమిలో బ్రిటన్ అంతర్భాగం. బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్‌కు ఇష్టమున్నా, లేకపోయినా.. ఒప్పందం ప్రకారం ఇరాన్‌తో సంబంధమున్న ఏ ఘర్షణలోనైనా అమెరికాతో గూఢచార సమాచారం పంచుకోవాల్సిన బాధ్యత ఉంటుంది” అని ఆమె అన్నారు.
“అంతేకాకుండా, హిందూ మహాసముద్రంలో అమెరికాకు లీజుకు ఇచ్చిన బ్రిటిష్ (బీఐవోటీ) భూభాగం డియెగో గార్సియా. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా నిర్వహించే ఏ వైమానిక కార్యకలాపాలకైనా ఈ స్థావరాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల, యూకే దానంతట అదే భాగస్వామి అవుతుంది” అన్నారామె.

డియెగో గార్సియా ఎందుకంత కీలకం?
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, వలస కాలనీలు తగ్గిపోతూ చాలా దేశాలు స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి.
“అలాంటి పరిస్థితుల్లో, తమ ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్ యూనియన్, చైనాలతో పోలిస్తే విదేశీ స్థావరాలపై పట్టు తగ్గిపోతోందని అమెరికా భావించింది. హిందూ మహాసముద్రంలో ఒక స్థావరం అవసరమని భావించింది” అని బ్రిటిష్ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌లో స్వార్జ్‌మన్ అకాడమీ ఫెలో నిత్య లాభ్ రాశారు.
ఇది ఎర్రసముద్రానికి సమీపంలోని బాబ్ ఎల్ మండెబ్ జలసంధికి, దక్షిణ చైనా సముద్రంలోని మలక్కా జలసంధికి సుమారు 3000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో ఇక్కడి నుంచి అమెరికన్ సైన్యం ఈ సముద్ర ప్రాంతమంతటా పట్టు నిలుపుకోగలదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డియెగో గార్సియాలో యూకే చిన్న సైనిక స్థావరం ఏర్పాటు చేసింది. యుద్ధం ముగిసేవరకు బ్రిటిష్ సైనికులు అక్కడ ఉన్నారు.
1961లో,బ్రిటిష్ వలస పాలనలో ఉన్న మారిషన్ నుంచి చాగోస్ దీవుల సమూహాన్ని వేరుచేసి స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించాలని యుకే ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో అమెరికా, యూకే సైనిక స్థావరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని భావించారు.
కొన్నేళ్ల తర్వాత, చివరగా ‘బ్రిటిష్ ఇండియన్ ఓషన్ టెరిటరీ’ (బీఐవోటీ) ఏర్పాటుకు అయ్యే ఖర్చులో సగం వరకు(దాదాపు 14 మిలియన్ డాలర్లు) చెల్లించేందుకు అమెరికా అంగీకరించింది. అప్పటి నుంచి డియోగో గార్సియా సైనిక స్థావరం అమెరికా కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మారింది.
ఇక్కడ భారీ ఎయిర్‌ఫీల్డ్ ఉంది. బీ-52 బాంబర్లు, కేసీ-135 ట్యాంకర్లు, గూఢచార విమానాలు, రవాణా విమానాల లాంటి భారీ సైనిక విమానాలు దిగేందుకు అనుకూలమైన రన్‌వేలు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడి లోతైన పోర్ట్ విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, సబ్‌మరైన్ల వంటి భారీ నౌకలను నిలిపేందుకు అనుకూలం.
1991 నాటి గల్ఫ్ యుద్ధం, 2003లో జరిగిన ఇరాక్ యుద్ధ సమయంలో అమెరికా వైమానిక దాడులకు డియెగో గార్సియానే కీలక స్థావరంగా ఉపయోగపడింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



