Home LATEST NEWS telugu తాజా వార్తలు ట్రంప్ సుంకాలతో భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి?

ట్రంప్ సుంకాలతో భారత్‌లో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి?

2
0

SOURCE :- BBC NEWS

ట్రంప్, అమెరికా, టారిఫ్స్, భారత్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

2 ఏప్రిల్ 2025

ఒక దేశంలోకి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించే పన్నునే సుంకం (టారిఫ్ లేదా దిగుమతి సుంకం లేదా దిగుమతి పన్ను) అంటారు. ఏ కంపెనీ అయితే ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందో, ఆ కంపెనీయే ప్రభుత్వానికి సుంకం చెల్లిస్తుంది.

విదేశీ కంపెనీల నుంచి నిర్దేశిత రంగాలను రక్షించేందుకు దేశాలు ఈ సుంకాలను విధిస్తుంటాయి.

అమెరికా వస్తువులను దిగుమతి చేసుకునే దేశాలు భారీగా పన్నులు విధిస్తే, అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కూడా భారీగా పన్నుల వడ్డింపు ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నారు.

ఈమేరకు బుధవారం రాత్రి ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్‌ను ప్రకటించారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ట్రంప్,జిన్  పింగ్

ఫొటో సోర్స్, Getty Images

చైనాతో భారీ వాణిజ్య లోటు

సమాన పన్నులు విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడారని వాణిజ్య నిపుణుడు బిశ్వజిత్ ధార్ చెప్పారు.

రెసిప్రొకల్ టారిఫ్స్‌పై శ్వేతసౌధం జారీ చేసిన ఫ్యాక్ట్ షీట్‌ను బిశ్వజిత్ ధార్ ప్రస్తావించారు.

‘‘అమెరికా తను మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) హోదా ఇచ్చిన దేశాల వ్యవసాయోత్పత్తులపై సగటున 5 శాతం సుంకం విధిస్తోంది. కానీ, భారత్ తన మోస్ట్ ఫేవర్డ్ దేశాల వ్యవసాయోత్పత్తులపై 39 శాతం సుంకాలు విధిస్తోంది అని ఫ్యాక్ట్‌ షీట్‌లో ఎత్తిచూపింది.’’

అమెరికా మోటారు సైకిళ్లపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత మోటారు సైకిళ్లపై అమెరికా కేవలం 2.4 శాతం సుంకాన్ని మాత్రమే విధిస్తోంది.

అమెరికాకు చైనాతో భారీ వాణిజ్యలోటు ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో చైనా వాటా 24.7 శాతం ఉండగా, భారత్ వాటా కేవలం 3.8 శాతం మాత్రమే. తాాజాగా ట్రంప్ ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్స్‌లో భాగంగా చైనాపై 34 శాతం, ఇండియాపై 26 శాతం టారిఫ్‌లను ప్రకటించారు.

ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులు ముఖ్యంగా 30 రంగాలకు చెందినవి. వీటిల్లో ఆరు వ్యవసాయ రంగానికి చెందినవి కాగా, మిగిలిన 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. మరి ఈ రంగాలపై టారిఫ్‌లు చూపే ప్రభావం ఏమిటో చూద్దాం.

మోదీ, ట్రంప్

భారత్‌లో భారీ సుంకాలు

అమెరికా వస్తువులపై అత్యధిక సుంకం విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ దిగుమతులపై సగటున 17 శాతం సుంకం విధిస్తోంది. మరోవైపు అమెరికా సుంకం 3.3 శాతం మాత్రమే.

2024లో భారత్ సగటు సుంకాల రేటు 11.66 శాతంగా ఉంది.

భారత ప్రభుత్వం 150 శాతం, 125 శాతం, 100 శాతం టారిఫ్ రేట్లను రద్దు చేసినట్టు ది హిందూ ఒక కథనాన్ని రిపోర్టు చేసింది.

ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైన తర్వాత భారత ప్రభుత్వం టారిఫ్ రేటును మార్చింది.

ఇప్పుడు భారతదేశంలో అత్యధిక టారిఫ్ రేటు 70%.

గతంలో భారత్‌లో లగ్జరీ కార్లపై 125 శాతం సుంకం ఉండగా, ఇప్పుడు దాన్ని 70 శాతానికి తగ్గించారు.

ఈ పరిస్థితుల్లో 2025లో భారత్ సగటు టారిఫ్ రేటు 10.65 శాతానికి తగ్గింది. సాధారణంగా ప్రతి దేశం సుంకాలు విధిస్తుంది. కానీ, ఇతర దేశాలతో పోలిస్తే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి.

ఔషధాలు, అమెరికా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

మందుల కంపెనీలకు ఊరట

పరస్పర సుంకాల కారణంగా దెబ్బతిన్న దిగుమతుల జాబితా నుంచి ఫార్మా ఉత్పత్తులను డొనల్డ్ ట్రంప్ ప్రభుత్వం మినహాయించడంతో భారత ఔషధ తయారీదారుల షేర్లు గురువారం 5 శాతం పెరిగినట్టు రాయిటర్స్ పేర్కొంది.

భారత పారిశ్రామిక ఎగుమతులలో ఔషధరంగానిదే అగ్రస్థానమని వాణిజ్య పరిశోధనా సంస్థ జీటీఆర్ఐ తెలిపింది.

ఏటా భారత్ 12.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపై దాదాపుగా ఎటువంటి పన్ను చెల్లించడం లేదు.

అయితే, భారత్‌ దిగుమతి చేసుకునే అమెరికా మందులపై 10.91 శాతం సుంకం విధించడం వల్ల ‘వాణిజ్య అంతరం’ 10.91శాతంగా ఉంది.

అమెరికాలో విక్రయించే జనరిక్ ఔషధాలలో సగానికిపైగా భారత్ నుంచి వెళ్లినవే. జనరిక్ మెడిసిన్ అనేది బ్రాండెడ్ వెర్షన్‌కు చౌకైన వెర్షన్.

అమెరికాలో అలాంటి చౌకైన మందులను భారత్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. డాక్లర్లు రాసే పది ప్రిస్క్రిప్షన్లలో 9 ఈ మందులకు సంబంధించినవే ఉంటాయి. దీనివల్ల బిలియన్ల కొద్దీ డాలర్ల ఆరోగ్య రంగ ఖర్చును అమెరికా తగ్గించుకోగలుగుతోంది.

కన్సల్టింగ్ సంస్థ ఐక్యూవీఐఏ ప్రకారం, 2022లో భారత్ జనరిక్ ఔషధాలు 2019 బిలియన్ల డాలర్లను ఆదా చేశాయి.

ఫార్మా మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా బీబీసీతో మాట్లాడుతూ, “భారత్ దిగుమతి చేసుకునే అమెరికన్ మందులు అర బిలియన్ డాలర్లు మాత్రమే. కాబట్టి వీటిపై దాని ప్రభావం నామమాత్రమే’’ అని అన్నారు.

ఈ కారణంగానే భారత అతిపెద్ద ఔషధ తయారీ కంపెనీల గ్రూప్ అయిన ఐపీఏ కూడా అమెరికన్ ఔషధ దిగుమతులపై సున్నా సుంకాన్ని సిఫార్సు చేసింది. తద్వారా పరస్పర సుంకం భారత్ పై ప్రతికూల ప్రభావం చూపదు.

బంగారం నగలు

ఫొటో సోర్స్, Getty Images

బంగారం చౌక, మొబైల్ ఖరీదు

భారత్ 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండి, వజ్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ రంగంపై ట్రంప్ 13.32 శాతం సుంకం విధించబోతున్నారు. దీని ప్రభావంతో భారత్‌లో నగలు, ఖరీదైన ఆభరణాలు చౌక కానున్నాయి.

అమెరికాలో నగల కొనుగోలుదారుల ఖర్చు పెరగనుంది. ఈ రంగంలో ఎగుమతులు తగ్గితే, ఆ ప్రభావం చేతివృత్తిదారులు, వ్యాపారులపై పడుతుంది.

భారత్, అమెరికాకు 14.39 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్, టెలికాం, ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తోంది. దీనిపై 7.24 శాతం సుంకం పెంచే అవకాశం ఉంది. దీని వల్ల ఐఫోన్, ఇతర మొబైల్ ఫోన్లు ఖరీదైనవిగా మారొచ్చు. భారత్‌లో కూడా అనేక మొబైల్స్ ధరలు పెరగొచ్చు.

అదే సమయంలో, భారత్ 4.93 బిలియన్ డాలర్ల విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అమెరికా మొదట దానిపై బారీ పన్నులు విధిస్తుంది. అయితే పరస్పర సుంకాల కారణంగా అమెరికాలో వస్త్రాలు చౌకగా మారతాయి.

పాదరక్షల రంగం 15.56 శాతం ఎక్కువగా టారిఫ్ వ్యత్యాసాన్ని ఎదుర్కోవచ్చు.

ట్రంప్ సుంకాలు

వ్యవసాయ రంగంలో..

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో ఉంది. గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ) ప్రకారం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించే సగటు సుంకం 37.7%, ఉండగా, అమెరికా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకం 5.3 శాతం.

భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వ్యవసాయ వాణిజ్యం రూ.800 కోట్లు మాత్రమే. భారత్ ప్రధానంగా బియ్యం, రొయ్యలు, తేనె, కూరగాయల ఆధారిత ఉత్పత్తులు, ఆముదం, నల్ల మిరియాలను ఎగుమతి చేస్తోంది.

అమెరికా భారత్‌కు బాదం, వాల్ నట్స్, పిస్తా, యాపిల్, పప్పుధాన్యాలు ఎగుమతి చేస్తోంది.

భారత్ 2.58 బిలియన్ డాలర్ల విలువైన సముద్ర ఆహారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తోంది. దీనిపై అమెరికా 27.83 శాతం వరకు సుంకాలు విధించవచ్చు. ఇది అమెరికాలో రొయ్యలను ఖరీదైనవిగా చేస్తుంది. ఫలితంగా ఎగుమతులు తగ్గి, భారత్‌లో రొయ్యలు చౌకగా లభించవచ్చు. దీనివల్ల ఈరంగంపై ఆధారపడిన వారి ఆదాయం తగ్గుతుంది.

అలాగే, భారత్ నుంచి దిగుమతి చేసుకునే చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, కోకోపై 24.99 శాతం సుంకం విధించే అవకాశం ఉంది. దీని వల్ల అమెరికాలో భారతీయ స్వీట్లు, స్నాక్స్ ఖరీదైనవిగా మారతాయి.

పాల ఉత్పత్తులపై ఉన్న 38.23 శాతం సుంకం వ్యత్యాసం 181.49 మిలియన్ డాలర్ల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది.

నెయ్యి, వెన్న, పాలపొడి ఖరీదైనవిగా మారి వాటి మార్కెట్ వాటా తగ్గుతుంది. ఇవి భారతదేశంలో చౌక కావచ్చు.

వంట నూనె రంగంపై 10.67 శాతం సుంకం విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొబ్బరి, ఆవనూనెల ధరలు పెరుగుతాయి. దీంతో ఆవాలు, కొబ్బరి పండించే రైతులపై ప్రభావం పడనుంది.

ఈ కారణంగా, భారతదేశంలో ఆవాలు, కొబ్బరి ధరలు పడిపోవచ్చు. ఇది నేరుగా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.

సుంకాల పెంపు ఉత్పత్తిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, ఉత్పత్తి తగ్గితే ఉపాధి కూడా తగ్గుతుంది.

ఇది మొత్తం ఆర్థిక చక్రాన్ని ఏదో విధంగా ప్రభావితం చేస్తుంది.

ట్రంప్ సుంకాలపై భారత్ స్పందిస్తే బాదం, వాల్ నట్స్, సోయాబీన్ వంటి అనేక వస్తువులు భారత్ లో ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది.

ట్రంప్ టారిఫ్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో ఏం జరుగుతుంది?

ట్రంప్ టారిఫ్‌లు అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమవుతాయని, వినియోగదారులకు భారంగా మారతాయని, దిగుమతి వస్తువులు అమెరికన్ కంపెనీల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

దీనికి ప్రతిగా ఇతర దేశాలు విధించే సుంకాలు అమెరికా ఎగుమతిదారులను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.

సుంకాల కారణంగా వచ్చే ఏడాదిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ 0.6 శాతం క్షీణిస్తుందని, దీని వల్ల 2.5 లక్షల ఉద్యోగాలు పోతాయని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది.

కెనడా, మెక్సికో తమ దిగుమతుల కోసం అమెరికా మార్కెట్‌పై ఆధారపడుతున్నాయని, అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, మాంద్యాన్ని నివారించడం అసాధ్యమని మూడీస్ అనలిటిక్స్ పేర్కొంది.

అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌లే కేంద్రంగా తన ఆర్థిక విధానాలు రూపొందించారు.

అమెరికాలో వాణిజ్య సమతుల్యత తీసుకురావాలని, అమెరికా దిగుమతులు, ఎగుమతుల మధ్య అంతరాన్ని తగ్గించాలని ఆయన కోరుకుంటున్నారు.

2024లో అమెరికా 900 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటులో ఉంది.

మార్చి 4న అమెరికా కాంగ్రెస్ లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు భూమ్మీద ఉన్న ప్రతి దేశం దశాబ్దాలుగా మనల్ని దోచుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ ఇలా జరగనివ్వం’ అని అన్నారు.

దీర్ఘకాలంలో సుంకాలు అమెరికా ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతాయని, ఉద్యోగాలను కాపాడుతాయని ట్రంప్ చెప్పారు. దీంతో పన్ను ఆదాయం, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.

ఈ సుంకం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, సుంకం కారణంగా విదేశీ కంపెనీలు అమెరికాలో వస్తువులను తయారు చేస్తాయని ఆయన అన్నారు.

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అమెరికాలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ట్రంప్ మార్చి 24న ప్రకటించారు. సుంకాల కారణంగా తమ కార్యకలాపాలను అమెరికాకు తరలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS