Home జాతీయ national telgu ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న ఆసియన్ల సంపద.. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనం

ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న ఆసియన్ల సంపద.. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనం

5
0

SOURCE :- BBC NEWS

BSE

ఫొటో సోర్స్, Getty Images

5 గంటలు క్రితం

ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనం చూశాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశం సహా ప్రపంచంలోని చాలా దేశాలపై దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2న పెంచారు.

దీంతో ఆసియా , అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి.

సోమవారం జపాన్, హాంకాంగ్, భారత్, సింగపుర్ సహా చాలా దేశాలు స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలను చూశాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మార్కెట్ల పతనంపై స్పందిస్తూ “ఏదీ పతనమవకూడదని కోరుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు విషయాలను సరిదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవాలి” అన్నారు.

సోమవారం ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే భారీ పతనం నమోదైంది.

భారత్‌లో మార్కెట్లు ఏ మేరకు పతనమయ్యాయి.. కొన్ని ఇతర మార్కెట్లు ఎలా కుదేలయ్యాయో చూద్దాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఆసియా

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఆసియాలో మార్కెట్ ఎంత పడిపోయింది?

డోనల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌లో కూడా కనిపించింది.

సోమవారం ఉదయం నిఫ్టీ 4 శాతం కంటే ఎక్కువ తగ్గుదలను చూసి, మార్కెట్ ముగిసే సమయానికి 3.24 శాతం నష్టపోయింది.

మరోవైపు సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక, ఏఎఫ్‌పీ ప్రకారం.. హాంకాంగ్ హాంగ్ సెంగ్‌కు గత 28 ఏళ్లలో ఇదే భారీ పతనం.

ఇతర ఆసియా దేశాలలోనూ స్టాక్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది.

  • జపాన్ నిక్కీ 6.3 శాతం పడిపోయింది
  • హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 13.22 శాతం పడిపోయింది
  • చైనా షాంఘై కాంపోజిట్ 6.6 శాతం పడిపోయింది
  • ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్200.. 4.5 శాతం పడిపోయింది
  • దక్షిణ కొరియా కోస్పి 4.4 శాతం పడిపోయింది
  • తైవాన్ టైక్స్ 9.7 శాతం పతనమైంది.
  • సింగపూర్ ఎస్టీఐ 7.1 శాతం పడిపోయింది
  • అమెరికా డో జోన్స్ ఫ్యూచర్స్ 2 శాతం పడిపోయాయి
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?

స్టాక్ మార్కెట్ గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అడిగినప్పుడు “మార్కెట్‌లో ఏం జరుగుతుందో మీకు చెప్పలేను. కానీ అమెరికా బలంగా ఉంది” అన్నారు.

“ఎలాంటి పతనాన్నీ నేను కోరుకోవడం లేదు, కానీ కొన్నిసార్లు పరిస్థితిని చక్కదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవలసి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.

సుంకాలు విధించిన తర్వాత ఉద్యోగాలు, పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచం త్వరలో అమెరికాను చెడుగా చూడటం మానేస్తుందని ఆయన తెలిపారు.

సుంకాల విధింపును ట్రంప్ సమర్థించుకున్నారు. ఏ ఒప్పందమైనా తాత్కాలికమేనన్నారు.

“నేను చాలామంది యూరోపియన్, ఆసియా నాయకులతో మాట్లాడాను. వారు రాజీకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు” అని ట్రంప్ అన్నారు.

స్టాక్ మార్కెట్లు

ఫొటో సోర్స్, Reuters

నిపుణులు ఏమంటున్నారు?

ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ విధించి స్టాక్ మార్కెట్లో గందరగోళ పరిస్థితికి కారణమయ్యారని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఈ విషయంపై ఆర్థిక విశ్లేషకురాలు జూలియా లీతో బీబీసీ మాట్లాడారు. ‘ఎఫ్‌టీఎస్‌ఇ రసెల్‌’ను ఆమె పర్యవేక్షిస్తుంటారు. ఇది లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌కు అనుబంధ సంస్థ.

జూలియా లీ మాట్లాడుతూ “అన్ని స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. అన్ని రంగాలలో ట్రేడింగ్ తక్కువ ఉంది. అమెరికాలోనూ అదే పరిస్థితి, వాల్ స్ట్రీట్‌లో మళ్లీ కష్టకాలం వస్తుందని సూచిస్తుంది” అని తెలిపారు.

“రెసిప్రోకల్ టారిఫ్‌లు ద్రవ్యోల్బణం, మాంద్యం భయాలను పెంచుతున్నాయి” అని లీ అన్నారు.

ఆర్థిక నిపుణులు నీల్ న్యూమాన్ కూడా బీబీసీ బిజినెస్ టుడే కార్యక్రమంలో ఈ విషయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

స్టాక్ మార్కెట్ కోలుకునే అవకాశం ఉందని, కానీ మాంద్యం ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు.

జపాన్ కంపెనీ అయిన ‘అట్రిస్ అడ్వైజరీ టోక్యో’కు నీల్ న్యూమాన్ వ్యూహ అధిపతి(స్ట్రాటజీ హెడ్).

జపాన్ స్టాక్ మార్కెట్‌లో బ్యాంకింగ్ స్టాక్‌లు, లోహాలు, ఖనిజాలు, సాంకేతిక పరిశ్రమలు తీవ్రంగా పతనమయ్యాయి.

“అమెరికా ఒక ముఖ్యమైన మార్కెట్, కానీ అదే ప్రపంచంలో ఏకైక మార్కెట్ కాదు. జపాన్, చైనా, దక్షిణ కొరియాల మధ్య ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి” అని న్యూమన్ గుర్తుచేశారు.

“కొత్త వాణిజ్య సంబంధాలు ఏర్పడకపోతే, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముప్పు కొనసాగుతుంది” అని న్యూమాన్ అభిప్రాయపడ్డారు.

అమెరికాకు చెందిన మూడు ప్రధాన స్టాక్ సూచీలు 5 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఎస్ అండ్ పీ 500 దాదాపు 6 శాతం పడిపోయింది. యూకేలో ఎఫ్టీఎస్ఈ 100 దాదాపు 4 శాతం పడిపోయింది, గత ఏడాదిలో అతిపెద్ద పతనమిదే.

జర్మనీ, ఫ్రాన్స్‌లోని స్టాక్ మార్కెట్లు కూడా ఇలాంటి పెద్ద నష్టాలను చవిచూశాయి.

భారత జీడీపీపై ప్రభావం

ఆసియా మార్కెట్ల మాదిరిగానే, భారత స్టాక్ మార్కెట్ కూడా సోమవారం ఉదయం నుంచి భారీ క్షీణతతో ట్రేడయింది.

మార్చిలో మార్కెట్లో కనిపించిన స్వల్ప పెరుగుదల టారిఫ్ ప్రకటనల తర్వాత మాయమైంది.

సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 2 వేల పాయింట్లకు పైగా పతనమైంది.

బీబీసీ కరస్పాండెంట్ నిఖిల్ ఇనామ్‌దార్‌తో స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అరుణ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, మార్కెట్ అస్థిరత కొనసాగుతుందని, వాణిజ్యంపై చర్చలు మాత్రమే ఈ పతనాన్ని ఆపగలవని అన్నారు.

అమెరికాలో మాంద్యం భయం కారణంగా భారతీయ ఐటీ కంపెనీలలో భారీ పతనం కనిపిస్తోంది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉంటే, ఐటీ కంపెనీల కాంట్రాక్టులు తగ్గుతాయని ప్రజలు భయపడుతున్నారు.

తాజా పరిణామాలతో చాలామంది విశ్లేషకులు భారతదేశ జీడీపీ అంచనాలను కూడా తగ్గించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)