SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Reuters
-
- రచయిత, సరీన్ హబీషియన్
-
20 మార్చి 2026, 12:16 IST
-
చదివే సమయం: 2 నిమిషాలు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చిత్రంతో ఉన్న బంగారు స్మారక నాణేన్ని ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదించింది.
ఈ 24 కారెట్ల నాణేన్ని జులై 4న జరగనున్న అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించారు.
ఇందులో ట్రంప్ తన పిడికిళ్లను బిగించి బల్లపై చేతులుంచినట్లుగా ఉన్న చిత్రాన్ని ముద్రించారు.
ఈ డిజైన్ చట్టబద్ధతపై సందేహాలు ఉన్నప్పటికీ అమెరికా మింట్ ప్రజెంటేషన్ అనంతరం అమెరికా కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఫెడరల్ చట్టం ప్రకారం జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలు కరెన్సీపై ముద్రించకూడదు. అయితే ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తన విచక్షణాధికారంతో ప్రత్యేక బంగారు నాణేలను ముద్రించి విడుదల చేయవచ్చు.
అమెరికా మింట్ తుది కొలతలు సిద్ధం చేసిన తర్వాత ఈ నాణెం ముద్రణకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
కమిషన్ ఉపాధ్యక్షుడు జేమ్స్ మెక్‌కెరీ మాట్లాడుతూ.. “ఈ నాణెన్ని ప్రస్తుత రూపంలోనే ఆమోదించాలని ప్రతిపాదిస్తున్నాను. వీలైనంత పెద్దగా, కనీసం మూడు అంగుళాల వ్యాసంతో తయారు చేయాలి” అన్నారు.

ఫొటో సోర్స్, Daniel Torok
అమెరికా క్వార్టర్ డాలర్ నాణెం ఒక అంగుళం కంటే తక్కువ వెడల్పు కలిగి ఉంటుంది.
గత ఏడాది ట్రంప్ కమిషన్ ఆఫ్ పైన్ ఆర్ట్స్ సభ్యులను తొలగించి, వారి స్థానంలో తన అనుచరులను నియమించారు.
న్యూయార్క్‌కు చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రిచీ టోరీ ‘ట్రంప్’ (ది రిస్ట్రిక్ట్ అగ్లీ మనీ పోర్ట్రైట్) యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.
అధ్యక్షులు తమ చిత్రాలతో కరెన్సీ విడుదల చేయకుండా అడ్డుకోవడమే దీని లక్ష్యం. అయితే ఈ బిల్లు ఆమోదం పొందలేదు.
ఈ విషయంపై స్పందించాల్సిందిగా బీబీసీ కోరినా అమెరికా మింట్ నుంచి స్పందన రాలేదు.
ఇప్పటివరకు కాల్విన్ కూలిడ్జ్ మాత్రమే జీవించి ఉండగానే అమెరికా నాణెంపై కనిపించిన అధ్యక్షుడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



