Home జాతీయ national telgu ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్‌ను రద్దు చేసిన అమెరికా సుప్రీం కోర్టు

ట్రంప్ గ్లోబల్ టారిఫ్స్‌ను రద్దు చేసిన అమెరికా సుప్రీం కోర్టు

12
0

SOURCE :- BBC NEWS

ట్రంప్, సుంకాలు, అమెరికా సుప్రీం కోర్ట్

ఫొటో సోర్స్, Getty Images

20 ఫిబ్రవరి 2026, 21:01 IST

అప్‌డేట్ అయ్యింది 10 నిమిషాలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

గత ఏడాది ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాల‌కు(గ్లోబల్ టారిఫ్స్‌) వ్యతిరేకంగా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.

ప్రపంచ దేశాల దిగుమతులపై అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన విస్తృత స్థాయి సుంకాలు చట్ట విరుద్ధమని పేర్కొంటూ అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది.

నిరుడు అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలానికే, దిగుమతులపై భారీగా సుంకాలను విధించారు.

వాస్తవానికి, ఇలాంటి నిర్ణయానికి అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం అవసరం. కానీ, ట్రంప్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం) 1977ను వినియోగించుకుంది.

అయితే, అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా టారిఫ్‌లు విధించడం తమ అధికార పరిమితిని అతిక్రమించడమేనని 6 – 3 సభ్యుల మెజారిటీతో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

నేషనల్ ఎమర్జెన్సీ కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉపయోగించుకుని విస్తృత సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అతిక్రమించారని అమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

టారిఫ్‌లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై డోనల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇది ‘సిగ్గుచేటు’గా పేర్కొన్నట్లు సమాచారం.

అమెరికా కాలమానం ప్రకారం, ఫిబ్రవరి 20 ఉదయం రాష్ట్ర గవర్నర్లతో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ వ్యక్తి ఒకరు తనకు చెప్పినట్లు బీబీసీ ప్రతినిధి బెర్నాడ్ డెబ్యూస్‌మాన్ జూనియర్ తెలిపారు.

అయితే, ట్రంప్ నుంచి నేరుగా కానీ.. వైట్‌హౌస్ వర్గాల నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

సుప్రీం కోర్టు 6-3 మెజార్టీతో టారిఫ్‌ల నిర్ణయాన్ని రద్దు చేసింది.

కెతంజీ బ్రౌన్ జాక్సన్, ఎలెనా కాగన్, సోనియా సోటోమేయర్ అనే ముగ్గురు ఉదారవాద న్యాయమూర్తులతో పాటు ఎమీ కోనీ బారెట్, నీల్ గోర్సష్, జాన్ రాబర్ట్స్ అనే ముగ్గురు కన్జర్వేటివ్ న్యాయమూర్తులు ట్రంప్ సుంకాల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపారు.

ఈ తీర్పుతో బ్రెట్ కావనా, శామ్యూల్ అలీటో, క్లారెన్స్ థామస్ అనే ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు.

అమెరికా, సుంకాలు, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షుడికి వాణిజ్యాన్ని “నియంత్రించే” అధికారాన్ని ఇస్తుంది.

ట్రంప్ దీనిని మొదటిసారి ఫిబ్రవరి 2025లో ఉపయోగించారు.

చైనా, మెక్సికో, కెనడా దిగుమతులపై ఆయన సుంకాలు విధించారు.

ఈ చట్టాన్ని ఉపయోగించి, ఏప్రిల్‌లో దాదాపుగా ప్రతి దేశం నుంచి వచ్చే దిగుమతులపై ట్రంప్ 10 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలకు ఆదేశించారు.

అయితే, ట్రంప్ విధించిన అన్ని సుంకాలనూ ఎత్తివేయలేదు.

జాతీయ భద్రతా కారణాలను చూపుతూ, 1962 నాటి ట్రేడ్ ఎక్స్‌పాన్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 232 కింద స్టీల్, అల్యూమినియం, కలప, ఆటోమోటివ్ రంగాలకు సంబంధించిన దిగుమతులపై విధించిన సుంకాలు సుప్రీం కోర్టు రద్దు చేసిన పన్నుల పరిధిలోకి రావు.

సానుకూలంగా స్పందించిన ‘వాల్‌స్ట్రీట్’

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్ ‘వాల్ స్ట్రీట్’ నుంచి సానుకూల స్పందన కనిపించింది. ఈ పరిణామం పెట్టుబడిదారులలో ఉత్సాహాన్ని నింపింది.

ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 0.45% పెరిగింది.

డో జోన్స్ 0.07% పెరిగింది

నాస్‌డాక్ 0.42% వృద్ధి కనిపించింది.

న్యూయార్క్‌లో ట్రేడింగ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.

(ఈ కథనం అప్డేట్ అవుతోంది.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)