Home జాతీయ national telgu ‘టీమిండియాతో కాదు కోహ్లీపై ఆడుతున్నట్లు ఉండేది’

‘టీమిండియాతో కాదు కోహ్లీపై ఆడుతున్నట్లు ఉండేది’

2
0

SOURCE :- BBC NEWS

గతేడాది ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మూడోరోజు ఆటలో సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ సంబరాలు

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ కోహ్లీ లేకుండా భారత టెస్ట్ జట్టును చూడటం అనే ఆలోచనకు అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది.

నేను మొదట అంతర్జాతీయ స్థాయిలో కోహ్లీతో 2011లో లార్డ్స్ మైదానంలో జరిగిన వన్డేలో ఆడాను. ఆ తర్వాత మరుసటి ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడాను. అప్పుడు ఇంగ్లండ్ 2-1తో భారత్‌పై గెలిచింది.

కానీ, నేను దీనికంటే ముందే కోహ్లీని కలిశాను. 2006 యూకేలో జరిగిన అండర్-19 సిరీస్‌లో మేం ఆడాం. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు మూడింట్లో మేం తలపడ్డాం. అప్పుడు ఇరు జట్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఆడమ్ లిత్, ఇషాంత్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్నారు. అప్పుడు నాకు, కోహ్లీకి 17 ఏళ్లు.

అయినప్పటికీ అప్పుడే కోహ్లీలో పోటీతత్వం, ఉత్సాహం బయటకు ప్రస్ఫుటంగా కనిపించాయి.

కాంటర్‌బరీలో జరిగిన తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 123 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ అంతా మిడ్ వికెట్, కవర్ డ్రైవర్ వంటి ట్రేడ్ మార్క్ షాట్లతో కోహ్లీ అలరించాడు.

ఇప్పటికీ నాకు బాగా గుర్తున్న విషయం ఏంటంటే, అప్పుడు మాతో మ్యాచ్ పోరాటంలో అతను కనబరిచిన ఉత్సాహం, తీక్షణత.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
2008లో అండర్-19 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా భారత జట్టును విజేతగా నిలిపి భారత్‌కు తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘విరాట్ వికెట్ తీస్తే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి చెప్పేవాళ్లం’

మామూలుగా ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో కొందరు ప్లేయర్లు ఈ ఆటలో మరో దశకు వెళ్లేందుకు పరుగులు చేస్తుంటారు. కానీ, కోహ్లీ అలా కాదు. అతను అక్కడికి గెలవడం కోసమే వచ్చాడు.

కోహ్లీకి ఉన్న ఈ లక్షణమే అతన్ని తన సమకాలీనుల్లో అందరికంటే ముందు నిలబెట్టింది. టెస్ట్ కెరీర్ ఆసాంతం 140 కోట్ల ప్రజల ఆశలను మోసేలా చేసింది.

అప్పటినుంచి మేం తరచుగా కలుస్తూనే ఉన్నాం. మలేసియాలో 2008 అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా ఒక నైట్‌క్లబ్ డ్యాన్స్‌ఫ్లోర్‌పై కూడా కలిశాం.

కోహ్లీ కెప్టెన్సీలో భారత్ టోర్నీలో విజేతగా నిలిచింది. ట్రోఫీని ఎత్తుతూ అతని ఎక్స్‌ప్రెషన్లు, ఆనందంతో వేసిన కేకలు, టెస్ట్ మ్యాచ్‌లో భారత్ వికెట్ తీసినప్పుడు అతని సంబరాలు అందరికి సుపరిచితం అయ్యాయి.

ఆ వయస్సులోనూ టీమిండియాలో అతని వికెట్ తీయడం చాలా కీలకంగా భావించేవాళ్లం. అతని వికెట్ తీస్తే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి విరాట్ వికెట్ తీసినట్లు చెప్పుకునేవాళ్లం. ఆ మరుసటి ఏడాదే అతను అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేయడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు.

ఒక గోల్డెన్ బాయ్‌గా, తదుపరి సూపర్ స్టార్‌గా, కొత్త తరం భారత క్రికెట్‌కు ముఖచిత్రంగా కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. తర్వాత పరుగుల యంత్రంగా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆటగాడిగా కోహ్లీ తనను తాను మార్చుకున్నాడు.

విరాట్ కోహ్లీ, స్టీవెన్ ఫిన్

ఫొటో సోర్స్, Getty Images

‘అత్యుత్తమ ఆటగాడు బయటకొస్తాడు’

కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టం. కోహ్లీని ఉడికిస్తే (ఎంగేజ్ చేస్తే) అతనిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుందనే సంగతి తెలుసు కాబట్టి అతన్ని ఎక్కువగా ఎంగేజ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అదే సమయంలో అతని ముందు ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదు.

ఒకవేళ ఫుల్ బంతులు వేస్తే వికెట్‌కు రెండు వైపులా బాదగలడు. షార్ట్ బంతులు సంధిస్తే అలవోకగా బ్యాక్‌ఫుట్‌పై ఆడతాడు. అతను ఏదీ వదలడనే సంగతి మనకు తెలుసు.

కోహ్లీ క్రీజులోకి ఆత్మవిశ్వాసంతో వస్తాడు. సొంతగడ్డపై కాకుండా కోహ్లీ బయట ఆడుతున్నప్పుడు కూడా స్టాండ్స్‌లో ఒక రకమైన ఉత్కంఠను మీరు చూడొచ్చు. ఆ వాతావరణం కాస్త భయానకంగానే ఉంటుంది. అయినప్పటికీ, మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి.

అతను చేసే ప్రతీ పనిలోను తీవ్రత ఉంటుంది. మైదానం బయట కూడా అలాగే ఉంటాడు.

2016లో మేం భారత్‌లో అయిదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాం. అది చాలా సుదీర్ఘమైన, కఠినమైన పర్యటన. ఇంగ్లండ్ కెప్టెన్‌గా అలెస్టర్ కుక్‌ చివరి టోర్నీ అది.

దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో టోర్నీ జరుగుతుంటుంది. కాబట్టి పర్యటక జట్టుకు కూడా భారత జట్టు బస చేసే హోటల్లోనే వసతి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మైదానంలోనే కాకుండా బయట కూడా తరచుగా వారిని మేం చూడొచ్చు.

2023 ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌ సందర్భంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘పూర్తిగా మారిన భారత జట్టు’

నేను గమనించిన వాటిలో రెండు విషయాలు చాలా ప్రత్యేకంగా కనిపించాయి. ఒకటి, కోహ్లీ హోటల్ లాబీలో అడుగుపెట్టినా, హోటల్ నుంచి గ్రౌండ్‌కు వెళ్లడానికి టీమ్ బస్సు దగ్గరికి వచ్చినా అభిమానుల కోలాహలం ఉండేది. తమ అభిమాన క్రికెట్ హీరోను చూడటానికి అభిమానులు వేచి చూసేవారు. అంతటి స్టార్‌డమ్‌తో, ఒత్తిడితో సాధారణంగా జీవించడం ఏ ఇంగ్లిష్ క్రికెటర్‌ కూడా ఊహించలేనిది.

రెండోది, ట్రైనింగ్ పట్ల భారత జట్టు వైఖరిలో వచ్చిన మార్పు. అంతకుముందు, అంటే నాలుగేళ్ల క్రితం మేం టెస్ట్ సిరీస్ ఆడటానికి భారత్‌కు వచ్చినప్పుడు హోటల్‌లోని జిమ్‌ను వాడుకునే ఏకైక జట్టు మాది మాత్రమే. అప్పుడు మాకు నచ్చిన జిమ్ సామగ్రిని మేం స్వేచ్ఛగా ఉపయోగించేవాళ్లం.

2016 నాటికి ఈ హోటళ్లలోని జిమ్‌లు కోహ్లీ ఫిట్‌నెస్ కేంద్రాలుగా మారిపోయాయి. జట్టులోని మిగతా సభ్యులు కూడా అతని దారిలోకి వచ్చారు. ఆ జిమ్‌లలో ఒలింపిక్స్ లిఫ్టింగ్ బార్స్, బరువులు, ఫిట్‌నెస్ ట్రైనర్లను ఏర్పాటు చేశారు. మేం పూర్తిగా భిన్నమైన భారత జట్టుతో వ్యవహరిస్తున్నామన్న సంగతి మాకు అర్థమైంది.

ఫ్యాబ్ ఫోర్ పరంగా చూస్తే, టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తొలి ప్లేయర్ విరాట్ కోహ్లీ. అతని గణాంకాలు కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌లతో సరిపోలవు.

అయినా, కోహ్లీ అంటే కేవలం గణాంకాలు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. టెస్ట్ క్రికెట్ కోసం కోహ్లీ చేసినట్లుగా, దాన్ని నిలబెట్టేలా చేయడం తర్వాత జనరేషన్ భారత క్రికెటర్లకు చాలా కష్టం. కోహ్లీ వేసిన పునాదులు వారికి మార్గాన్ని సుగమం చేశాయి.

2018లో బర్మింగ్‌హామ్‌లో సెంచరీ అనంతరం కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

‘కోహ్లీ నా సంతకం అడగలేదు’

క్రికెట్‌కు సంబంధించి నాకున్న ఒక వింత అలవాటుకు కూడా కోహ్లీనే కారణం.

నాకు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్ల షర్టులు సేకరించడం ఇష్టం. కోహ్లీ నుంచి ఒక చొక్కా తీసుకోవాలనుకున్నా.

2013 జనవరిలో ధర్మశాలలో వన్డే మ్యాచ్ అయ్యాక మేం ఇద్దరం చొక్కాలు మార్చుకున్నాం. కానీ, వాటిపై ఇద్దరం సంతకాలు చేయలేదు. అతని చొక్కాను నా దగ్గరే ఉంచుకున్నా.

మళ్లీ 2014 ఆగస్టులో ఎడ్జ్‌బాస్టన్‌లో మేం మ్యాచ్ ఆడాం. అప్పుడు నేను నా దగ్గర ఉన్న చొక్కాను తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ సిబ్బందికి ఇచ్చి కోహ్లీ సంతకం కావాలని అడిగాను. అప్పుడు నన్ను కోహ్లీ, స్టీవ్ అని సంబోధిస్తూ దానిపై సంతకం చేశాడు. కేవలం మా అమ్మ మాత్రమే నన్ను ఆ పేరుతో పిలుస్తుంది. కానీ, కోహ్లీ మాత్రం తన దగ్గర ఉన్న ఫిన్ షర్టుపై నా సంతకం అడగలేదు.

ఆధునిక యుగంలో టెస్టు క్రికెట్ ప్రాధాన్యతను నిలబెట్టడానికి కోహ్లీ చేసినంతగా మరే ఇతర క్రికెటర్ చేయలేదని చెప్పడాన్ని నేను అతిశయోక్తిగా భావించట్లేదు.

కావాలనుకుంటే ఈ బరువు బాధ్యతల నుంచి కోహ్లీ ఇంతకంటే ముందే బయటకు వెళ్లిపోయి ఉండొచ్చు. ఇలా చేయడం అతనికి పెద్ద కష్టమేం కాదు. ఐపీఎల్ ఆడుతూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ, 27.1 కోట్లమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లను ప్రభావితం చేస్తూ (డేవిడ్ బెక్‌హమ్ కంటే మూడు రెట్లు ఎక్కువ), తన కుటుంబ భవిష్యత్ కోసం ఆలోచించి ఉండొచ్చు.

కానీ, టెస్టు ఫార్మాట్‌లో చేసే పనుల ద్వారానే ఒక క్రికెటర్ లెగసీ రూపుదిద్దుతుందని కోహ్లీ అర్థం చేసుకున్నాడు. భవిష్యత్ భారత సూపర్‌స్టార్లు కూడా ఇదే వైఖరితో ఉంటారని ఆశిస్తున్నా.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)