Home జాతీయ national telgu జేమ్స్ వాన్ డెర్ బీక్: యువతలో పేగు క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. దీనిని గుర్తించడమెలా?

జేమ్స్ వాన్ డెర్ బీక్: యువతలో పేగు క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి.. దీనిని గుర్తించడమెలా?

5
0

SOURCE :- BBC NEWS

నటుడు జేమ్స్ వాన్ డెర్ బీక్, బోవెల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

6 గంటలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

అమెరికా టీన్ డ్రామా డాసన్స్ క్రీక్‌లో తన క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు జేమ్స్ వాన్ డెర్ బీక్ 48 ఏళ్ల వయసులో బోవెల్ క్యాన్సర్‌తో (పేగు క్యాన్సర్‌) మృతి చెందారు.

”జేమ్స్ డేవిడ్ వాన్ డెర్ బీక్ ఈరోజు ఉదయం కన్నుమూశారు” అని ఆయన కుటుంబం గురువారం (ఫిబ్రవరి 12న) సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేసింది.

2023 ఏడాది చివర్లో ఆయనకు బోవెల్ క్యాన్సర్‌గా నిర్ధరణ అయింది. అయితే, 2024 నవంబర్‌లో ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు.

జేమ్స్ వాన్ డెర్ బీక్ గతంలో బిజినెస్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… మొదట మల విసర్జనలో మార్పులను గుర్తించినట్లు తెలిపారు. బోవెల్ క్యాన్సర్‌‌లో కనిపించే ప్రధాన లక్షణం ఇదే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పేగు కదలికలు, మల విసర్జనలో తేడాలను గమనించిన వెంటనే ఆయన కాఫీ తాగడం మానేశారు.

ఆ తర్వాత చేయించుకున్న స్క్రీనింగ్ పరీక్షల్లో క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు తెలిసింది. అంటే, లింఫ్ నాడ్స్‌(శోషరస గ్రంథుల) వరకూ వ్యాపించినట్లు తేలింది.

ఇది కేవలం వాన్ డెర్ బీక్‌ కేసు మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో యువతలో ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బోవెల్ క్యాన్సర్‌ను కొలొరెక్టల్ క్యాన్సర్ (కొలన్ క్యాన్సర్) అని కూడా పిలుస్తారు.

ఏంటీ పేగు క్యాన్సర్?

పెద్ద పేగులో రెండు భాగాలుంటాయి. మొదటి భాగాన్ని కొలన్, రెండో భాగాన్ని రెక్టమ్ అంటారు.

కొలన్ లేదా రెక్టమ్‌కు చెందిన లోపలి భాగంలో అసాధారణమైన పెరుగుదల (గడ్డల) నుంచి బోవెల్ క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ దీనికి చికిత్స చేయకపోతే, బోవెల్ క్యాన్సర్ శరీరమంతా వ్యాపిస్తుంది.

పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు, మరణాలను తగ్గించవచ్చు. అయితే, 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో ఈ కేసులు పెరుగుతున్నాయి.

బోవెల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

బోవెల్ క్యాన్సర్ లక్షణాలు:

  • మలంలో రక్తం పడడం.
  • మల విసర్జన అలవాట్లు మారడం. అంటే, తరచూ టాయిలెట్‌కు వెళ్లడం, విరేచనాలు అవ్వడం లేదా మలం గట్టిగా మారడం.
  • కడుపులో నొప్పి లేదా ఉబ్బరం.
  • అనూహ్యంగా బరువు తగ్గిపోవడం, అలసట, కళ్లు తిరగడం, మల విసర్జన తర్వాత కూడా కడుపు పూర్తిగా ఖాళీ అయినట్లు అనిపించకపోవడం వంటివి ఇతర లక్షణాలు.

అయితే, ఈ లక్షణాలన్నీ ఉంటే కచ్చితంగా క్యాన్సర్ ఉన్నట్లు కాదు. ఒకవేళ మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఈ లక్షణాలు కనిపించినా లేదా ఏదైనా సరిగ్గా అనిపించకపోయినా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొన్ని తీవ్రమైన సందర్భాల్లో.. పేగులు మూసుకుపోయి తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. మలబద్ధకం ఏర్పడుతుంది. వాంతులు అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణ వైద్య సాయం అవసరం.

బోవెల్ క్యాన్సర్‌‌‌ను ప్రాథమిక దశలోనే గుర్తించగలిగినట్లయితే నయమయ్యే అవకాశాలున్నాయి.

ఈ క్యాన్సర్‌కు వేర్వేరు చికిత్సా విధానాలున్నాయి. తీవ్రతను బట్టి సర్జరీ లేదా కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు.

క్యాన్సర్ రీసర్చ్ యూకే ప్రకారం.. ప్రాథమిక దశలో రోగ నిర్ధరణ జరిగినప్పుడు 90 శాతం కంటే ఎక్కువ మంది ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుంది. చివరి దశలో నిర్ధరణ అయితే, కేవలం 44 శాతం మందికే మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

బోవెల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

యువతలో పెరుగుతోన్న కేసులు

” బ్రిటన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో బోవెల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది” అని ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూకేకు చెందిన సెయింట్ మార్క్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ కెవిన్ మొనాహన్ చెప్పారు.

” ఈ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోగలిగే మార్గాలను కనుగొనాల్సిన అవసరముంది” అని అన్నారు.

2017 వరకు అందుబాటులో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటాను విశ్లేషిస్తూ.. అమెరికా క్యాన్సర్ సొసైటీ నేతృత్వంలో చేపట్టిన అధ్యయనం ది లాన్సెంట్‌లో ప్రచురితమైంది. 50 దేశాల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో 27 దేశాల్లోని యువతలో బోవెల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వెల్లడైంది. లాటిన్ అమెరికా, కరేబియన్, ఈస్ట్రన్ యూరప్, ఆసియాల్లో ఈ కేసులు పెరగడాన్ని తొలిసారి గుర్తించారు.

బోవెల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఆరోగ్యం, వైద్యం

ఫొటో సోర్స్, Getty Images

కేసులు పెరుగుతున్నప్పటికీ, యువతలో ఈ వ్యాధి చాలా అరుదు.

అయితే, ఈ కేసులు ఎందుకు పెరుగుతున్నాయనేందుకు సరైన వివరణలు లేవు. ఊబకాయం, ఆల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, యాంటీబయోటిక్స్, గట్ మైక్రోబయోమ్‌లో మార్పులు, గాలి కాలుష్యం, మైక్రో ప్లాస్టిక్స్ వంటివాటిని కారణాలుగా చెబుతున్నారు.

స్పష్టమైన కారణమేంటో తెలియనప్పటికీ, కొన్ని అంశాలు ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే…

  • వయసు (ఇప్పటికీ చాలా కేసులు 50 ఏళ్లు పైబడిన తర్వాత నమోదవుతున్నాయి)
  • రెడ్, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా తినడం
  • పొగతాగడం
  • ఎక్కువగా మద్యం సేవించడం
  • ఊబకాయం
  • పేగులో క్యాన్సర్‌ పాలిప్స్ ఉండడం

చాలా వరకు బోవెల్ క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చేవి కావు. అయితే, లించ్ సిండ్రోమ్ లాంటి నిర్దిష్ట జన్యుపరమైన పరిస్థితులు ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

ఆరోగ్యకరమైన జీవన విధానాలతో సగానికి పైగా ఈ కేసులను అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్, తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం, ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడం ద్వారా దీన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.

ఈ కేసుల పెరుగుదలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, సెయింట్ మార్క్స్‌కు చెందిన పరిశోధకులు శతాబ్ద కాలం నాడు భద్రపరిచిన బోవెల్ క్యాన్సర్ నమూనాలను పరిశీలిస్తున్నారు.

భద్రపరిచిన కణజాలాన్ని ప్రస్తుత అధునాతన మాలిక్యులర్ టెక్నిక్‌లను వాడుతూ అధ్యయనం చేస్తున్నారు. యువత ఎక్కువగా ఎందుకు ఈ వ్యాధి బారిన పడుతున్నారో తెలుసుకునేందుకు ఇది సాయపడొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)