SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు 63 సంవత్సరాల కిందట కనిపించకుండా పోయిన ఒక మహిళ ఆచూకీ తెలిసిందని, ఆమె క్షేమంగానే ఉన్నారని అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్ర పోలీసులు తెలిపారు.
ఆమె పేరు ఆడ్రీ బాకెబర్గ్. రీడ్స్‌బర్గ్ అనే చిన్న పట్టణంలో తన ఇంటి నుంచి జూలై 7, 1962లో అదృశ్యమయ్యారు. కనిపించకుండాపోయే సమయానికి ఆమె వయసు 20 ఏళ్లు.
బాకెబర్గ్ తనకు తానుగా ఎటో వెళ్లిపోయారని, ఇందులో ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ జరగలేదని సాక్ కౌంటీ పోలీస్ షెరీఫ్ చిప్ మీస్టర్ తెలిపారు.
ఆమె విస్కాన్సిన్‌కి దూరంగా నివసిస్తున్నట్లు మీస్టర్ చెప్పారు. కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు.
విస్కాన్సిన్ మిస్సింగ్ పర్సన్స్ అడ్వోకసీ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చెప్పినదాని ప్రకారం, బాకెబర్గ్ వివాహం చేసుకుని, ఇద్దరు పిల్లలు పుట్టాక కనిపించకుండా పోయారు.
ప్రస్తుతం బాకెబర్గ్ వయసు 82 ఏళ్లు.
అయితే, 15 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న ఆమె.. కనిపించకుండా పోవడానికి కొన్ని రోజుల ముందు తన భర్త కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు.
ఆమె పనిచేసే ఉన్ని మిల్లు నుంచి తన జీతం తీసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె, ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
బాకెబర్గ్ కనిపించిన వాహనమల్లా ఎక్కుతూ విస్కాన్సిన్ రాష్ట్ర రాజధాని మాడిసన్‌కు వెళ్లారని, అక్కడి నుంచి దాదాపు 480 కి.మీ దూరంలో ఉన్న ఇండియానాపోలిస్ వెళ్లే బస్సు ఎక్కారని, ఆమె ఇంట్లో ఆయాగా పనిచేసిన మహిళ పోలీసులకు చెప్పారు.
ఇంటికి తిరిగి రావాల్సిందిగా తాను కోరినా, బాకెబర్గ్ అందుకు నిరాకరించారనీ, బస్ స్టాప్ నుంచి దూరంగా వెళుతుండగా ఆమెను చివరిసారిగా చూశానని ఆయా తెలిపారు.


ఫొటో సోర్స్, Wisconsin Missing Persons Advocacy
ఈ కేసులో దర్యాప్తు అధికారులు అనేక ఆధారాలను సేకరించారు. కానీ ఆ తర్వాత దర్యాప్తు మందగించిందని, ఈ సంవత్సరం ప్రారంభంలో పాత కేసు ఫైళ్ల సమగ్ర సమీక్ష జరిగాక కేసును ఛేదించామని పోలీస్ కార్యాలయం పేర్కొంది.
ఈ కేసును ఛేదించిన డిటెక్టివ్ ఐజాక్ హాన్సన్, స్థానిక వార్తా సంస్థ డబ్ల్యూఐఎస్ఎన్‌తో మాట్లాడుతూ, బాకెబర్గ్ సోదరికి చెందిన పెద్దల ఆన్‌లైన్ అకౌంట్ ద్వారా ఈ మిస్సింగ్ మహిళను గుర్తించగలిగామని అన్నారు.
బ్యాకెబర్గ్ ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి చెందిన పోలీసులను సంప్రదించి, ఆమెతో 45 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడానని డిటెక్టివ్ హాన్సన్ చెప్పారు.
‘‘ఆమె గతం మరిచిపోయి, తనకు నచ్చినట్టు బతుకుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. తాను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని నమ్మి, ఎలాంటి చింతా లేకుండా హాయిగా జీవిస్తున్నారు’’ అని హాన్సన్ డబ్ల్యూఐఎస్ఎన్‌కి తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)