Home LATEST NEWS telugu తాజా వార్తలు జీడిపిక్కలు అమ్మి కోటిరూపాయల సంబరం చేసుకుంటున్న ఈ గిరిజనుల కథేంటి?

జీడిపిక్కలు అమ్మి కోటిరూపాయల సంబరం చేసుకుంటున్న ఈ గిరిజనుల కథేంటి?

2
0

SOURCE :- BBC NEWS

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

  • రచయిత, లక్కోజు శ్రీనివాస్
  • హోదా, బీబీసీ కోసం
  • 17 మే 2025

అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రొచ్చుపనుకులలో సంబరం జరుగుతోంది. ఈ సంబరం విలువ కోటి రూపాయలు.

ఈ సంబరంతో గ్రామమంతా సందడిగా మారింది. గిరిజనులందరి ముఖాల్లో నవ్వులు కనిపిస్తున్నాయి. ఇళ్లకు రంగులు వేస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, గిరిజన సంప్రదాయ పాటలు పాడుకుంటున్నారు. కొందరు కొత్తగా ఇల్లు కట్టుకుని ఆహ్వానాలు పంపుకుంటున్నారు.

ఈ గిరిజన గ్రామంలో ఇప్పుడు కనిపిస్తున్న నవ్వులు, సంతోషాలు.. రెండేళ్ల క్రితం వరకు లేవు. ఏడాదంతా కష్టపడి పండించిన పంట మొత్తాన్ని షావుకారుకి అప్పగించినా, ఇంకా అప్పులే మిగిలే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు కోటి రూపాయల సంబరాలు చేసుకునేలా మార్పులు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

రైతులు ఆదాయం ఎలా పొందుతున్నారు?

ఈ కోటి రూపాయల సంబరాల వెనుక ఏం జరిగిందో తెలుసుకోడానికి 2023 మే 10వ తేదీకి ఒకసారి వెళ్దాం.

2023, మే 10వ తేదీన రొచ్చుపనుకుల, తాటిపర్తి, పెద్ద గరువు, రాయిపాడు, గంగంపేట, అజయ్‌పురం గ్రామాల్లోని గిరిజన జీడి రైతులను అధిక వడ్డీల పేరుతో షావుకార్లు ఎలా వేధింపులకు గురిచేశారో ‘బీబీసీ తెలుగు’ వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాలపై స్పందించిన అధికారులు, షావుకార్ల వద్ద ఉన్న గిరిజనుల జీడితోటల పట్టాలను వెనక్కి ఇప్పించారు.

ఏడాది తర్వాత అంటే 2024 మేలో తన తోటని సొంతగా సాగు చేసుకుంటే తనకి రూ. 50 వేలు వచ్చాయని జీడితోటల రైతు గంగమ్మ ఆనందంతో చెప్పారు.

గంగమ్మలాగే రాయపాడు గ్రామంలోని శాంతి చిన్నారి, ఎర్రయ్య, పోలమ్మ, రవి ఇలా అనేక కుటుంబాలది ఇదే పరిస్థితి. రొచ్చుపనుకులతో పాటు మిగిలిన ఐదు గ్రామాల్లోని 110 గిరిజన కుటుంబాలకు చెందినవారందరూ కలిసి ఈ ఏడాది జీడిపిక్కల వ్యాపారంలో కోటి రూపాయలు సంపాదించారు.

“నేను నాలుగేళ్ల క్రితం తోటలోని తుప్పలు కొట్టేందుకు 50 వేల రూపాయలు వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేశాను. నా తోటలో నేనే కూలి పని చేసి షావుకార్లకు జీడిపిక్కలను పండించేదాన్ని. ఆ పంటని అప్పగించినా నా అప్పు తీరేది కాదు. ఆ తర్వాత, నా పత్రాలు నాకు రావడంతో రెండేళ్లుగా సొంతంగా సాగు చేసుకున్నా. ఈ ఏడాది ఏకంగా రూ. 2 లక్షల 50 వేల విలువైన పంట డబ్బు కళ్ల చూశా” అని రాజులమ్మ అనే గిరిజన మహిళ బీబీసీకి చెప్పారు.

రాములమ్మ, రాజులమ్మ, గంగమ్మ, రవి, ఇలా గిరిజన రైతులు అనేకమంది లాభాలను పొందారు.

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

షావుకార్ల నుంచి పట్టాలు పొందిన తర్వాత…

గిరిజనుల అప్పుల భారం విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో… రెండు కోట్ల రూపాయల గిరిజనుల అప్పులు రద్దు కావడంతో పాటు 110 ఎకరాల జీడి మామిడి తోటలు తిరిగి గిరిజనుల స్వాధీనంలోకి వచ్చాయి.

ఆ తోటల్లో ఒకరి తోటలో మరొకరు కేవలం భోజనమే కూలీగా తీసుకుని.. ‘సహాయాలు’ అనే సంప్రదాయ పద్ధతిలో తోటలను సాగు చేసుకున్నారు.

రసాయన ఎరువులు వాడలేదు. అలాగే, సొంత కాటాలను ఏర్పాటు చేసుకుని, జీడి పిక్కల ప్రాసెసింగ్ కంపెనీలకే తమ పంటను నేరుగా అమ్ముకున్నారు.

2024లో 76,46,960 రూపాయల అమ్మకాలు జరగ్గా, 2025లో దాదాపు కోటి రూపాయల విలువైన (రూ. 96,29,800) జీడిపిక్కల్ని అమ్మారు. గత రెండేళ్లుగా సరుకును అమ్మిన వెంటనే నగదు గిరిజనులకు గ్రామంలోనే అందుతోంది.

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

‘గంగమ్మ ఇల్లు పూర్తయింది’

రొచ్చుపనుకుల గ్రామంలోని గంగమ్మ ఇంటికి బీబీసీ వెళ్లింది.

2023 మే బీబీసీ ఆ గ్రామానికి వెళ్లినప్పుడు.. ప్లాస్టింగు, గచ్చులు, తలుపులు లేకుండా గంగమ్మ ఇల్లు ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం పూర్తయ్యి, రంగులు అద్ది, అందంగా మారిపోయింది.

గంగమ్మకు తోట తిరిగి దక్కడంతో గత రెండేళ్లుగా తోటపై వచ్చిన డబ్బులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం (మే 14, బుధవారం) కూడా చేశారు.

రిపోర్టర్: ఇల్లు కట్టుకోవాలనే నీ కల తీరిందా అమ్మా?

గంగమ్మ: తీరిందండి. ఇల్లు పూర్తయింది.

రిపోర్టర్: సంతోషంగా ఉందా ఇప్పుడు?

గంగమ్మ: చాలా. త్వరలోనే ఇంట్లో దిగుతున్నాను. మీరంతా రావాలి.

రిపోర్టర్: తప్పకుండా.

గంగమ్మ: అప్పుల వల్ల…పిల్లలు పదో, పన్నెండో చదవకుండా మానేశారు. ఇప్పుడు మళ్లీ పంపిస్తాను.

రిపోర్టర్: ఇది చాలా మంచి పని.

గంగమ్మ ఇల్లు కట్టుకుంటే.. ఆ గ్రామంలోని గంగరాజు తనకు ఇష్టమైన బుల్లెట్ బండి కొనుక్కున్నారు. ఒకప్పుడు షావుకార్లకు వడ్డీలు కట్టడానికే ఏడాదంతా కష్టపడిన గిరిజనులు ఇప్పుడు తమకు కావాల్సినవి సమకూర్చుకోగలుగుతున్నారు.

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

ఇప్పుడు డబ్బులు కనిపిస్తున్నాయి: గిరిజనులు

ఈ ఏడాది రాములమ్మ అనే జీడిపిక్కల రైతు రూ. 2 లక్షల 15 వేలకు తన పంట అమ్ముకున్నారు. “కొంత పెట్టుబడిగా పోయినా, మిగిలింది దాచుకున్నాను” అని ఆమె బీబీసీతో చెప్పారు.

“అదే ఇంతకు ముందు షావుకార్లకు పిక్కలు అమ్మితే డబ్బులు వచ్చేవి కావు. అప్పే మిగిలేది. ఇప్పుడు డబ్బులు మా చేతికొస్తున్నాయి” అని రాములమ్మ చెప్పారు.

“తోటల్లో కష్టమంతా మేం పడి… ఆ పంటను షావుకారుకి ఇస్తే ఏ రోజూ మీ అప్పు తీరిందని చెప్పేవాడు కాదు. ఇప్పుడు సొంతంగా చేసుకుంటుంటే రెండు సంవత్సరాలుగా చేతికే నేరుగా డబ్బులు వస్తున్నాయి” అని రాజులమ్మ చెప్పారు. ఆమె ఈ ఏడాది రూ. 2 లక్షల 50 వేల విలువైన జీడిపిక్కలు అమ్మారు.

“త్వరలో ‘కళ్యాణపులోవ జీడిపప్పు’ పేరుతో కొత్త బ్రాండ్‌ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం. ఇది మా గిరిజనుల సొంత బ్రాండ్. పనులన్నీ పూర్తవుతున్నాయి” అని మరో రైతు రవి బీబీసీతో చెప్పారు.

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

‘అన్ని మోసాలను నియంత్రించాం’

రొచ్చుపనుకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని గిరిజనులకు అప్పులు ఇవ్వడం నుంచి వారి వద్ద కొనే జీడిపిక్కల తూకం వరకు అన్నింటిలోనూ షావుకార్లే మోసాలు చేసేవారని అయా గ్రామాల ప్రజలు చెప్పారు.

“30 వేల రూపాయల అప్పు ఇచ్చి, ఏడాదిలో ఏ లెక్కనో మరి… లక్ష రూపాయలు, రెండు లక్షలైంది అనేవారు. జీడిపిక్కల్ని తూకం వేసే కాటాల విషయంలో కూడా మోసం చేసేవారు. బస్తాకి (80 కేజీలు) కనీసం 10 కేజీలు మోసం చేసేవారు. పైగా జీడిపిక్కల్ని తీసుకెళ్లేందుకు ఉపయోగించే సంచులు, గోనులకు కూడా ఖర్చు రాసి అది కూడా మా ఖాతాలోనే జమ చేసుకునే వారు.

మళ్లీ మేమే వారికి బకాయి పడేవాళ్లం. ఒకరికో, ఇద్దరికో కొద్దిగా డబ్బులు ఇచ్చినా అది కూడా పంట తీసుకున్న తర్వాత ఎప్పుడో ఇచ్చేవారు” అని రొచ్చుపనుకుల గ్రామానికి చెందిన రవి చెప్పారు.

ఈ మోసాలన్నింటి నుంచి ఇప్పుడు గిరిజనులు బయటపడ్డారు. ముఖ్యంగా కాటాలో జరిగే మోసాన్ని గ్రహించి 110 గిరిజన కుటుంబాలు కలిసి సొంతగా కాటాలను ఏర్పాటు చేసుకున్నాయి.

ప్రాసెసింగ్ యూనిట్లతో నేరుగా మాట్లాడుకుని గ్రామంలోని జీడిపిక్కల్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కాటాలో తూకం అయి.. జీడిపిక్కలు వ్యాన్ ఎక్కేలోపే.. డబ్బులు పూర్తిగా చెల్లించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీబీసీ వెళ్లినప్పడు ఈ విషయాలను గమనించింది.

జీడిపిక్కలు, గిరిజన గ్రామాలు,  భూముల పట్టాలు

కేజీ రూ.150

గత ఏడాది కేజీ జీడిపిక్కలు 110 రూపాయల వరకు ధర పలకగా, ఈ ఏడాది పంట తగ్గడంతో డిమాండ్ పెరిగి కేజీకి 150 రూపాయలు లభించాయి. దీంతో రొచ్చుపనుకులతో పాటు ఆరు గ్రామాల గిరిజనులు కోటి రూపాయల వ్యాపారం చేయగలిగారని గిరిజన సంఘం నాయకులు పీఎస్ అజయ్ కుమార్ తెలిపారు.

“ఈ ప్రాంతంలోని గిరిజనులు జీవితంలో మొట్టమొదటిసారి అంత నగదుని చూస్తున్నారు. దాంతో కోటి రూపాయల సంబంరం పేరుతో వీళ్లంతా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మంచి కేస్ స్టడీ. దీనిని ఐటీడీఏ, నాబార్డ్ అధ్యయనం చేయాలి” అని అజయ్ కుమార్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS