Home జాతీయ national telgu జామిని సేన్: ‘అమ్మాయిలకు చదువు’ అనే ఆలోచనే ఒక విప్లవంగా భావించే రోజుల్లో యూరప్‌‌‌దాక వెళ్లిన...

జామిని సేన్: ‘అమ్మాయిలకు చదువు’ అనే ఆలోచనే ఒక విప్లవంగా భావించే రోజుల్లో యూరప్‌‌‌దాక వెళ్లిన ఒక భారతీయ వైద్యురాలి కథ..

6
0

SOURCE :- BBC NEWS

జామిని సేన్, బెంగాల్, వైద్యురాలు, బ్రిటన్, ఆధునిక వైద్యం

ఫొటో సోర్స్, Courtesy of The Royal College of Physicians and Surgeons of Glasgow

వైద్యరంగంలో పురుషుల ఆధిపత్యం నడుస్తున్న 19వ శతాబ్దపు ప్రారంభంలో, యూరప్‌లోని సంస్థలు కూడా మహిళలకు అరుదుగా అవకాశాలు ఇస్తున్న కాలంలో.. బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్‌ నుంచి వచ్చిన ఒక యువ వైద్యురాలు ఈ అడ్డంకులన్నింటినీ అధిగమించి నిలబడ్డారు.

గ్లాస్గోలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్‌లో 1912లో ఫెలోగా చేరిన మొదటి మహిళగా నిలిచారు జామిని సేన్.

ఈ సంస్థ 1599లో ఏర్పాటైనా చాలాకాలం పాటు మహిళలకు అవకాశం కల్పించలేదు.

అయితే, ఆధునిక వైద్యం రంగంలో ముందుడుగు వేసిన ఎంతోమందికి దక్కినట్లుగా సేన్‌కు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

తాజాగా, దాదాపు శతాబ్దం తర్వాత సేన్ జీవితంలోని ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు ఆమె మునిమనవరాలు దీప్తారాయ్ చక్రవర్తి. ఆమె రాసిన డాక్టరిన్ జామిని సేన్ అనే పుస్తకంలో.. నేపాల్ ప్యాలెస్ వార్డులు, బ్రిటన్‌ పరీక్షా కేంద్రాలు, వలస భారతంలోని పట్టణాల్లో అంటువ్యాధుల విజృంభణ వంటి ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న సేన్ జీవిత విశేషాలను వివరించారు. (ఉత్తర భారతదేశంలో మహిళా డాక్టర్లను డాక్టరిన్ అని అంటుంటారు)

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

సేన్ రాసిన లేఖలు, ఆమె డైరీలు, ఆమె రాసుకున్న చిన్న నోట్స్, మహిళా పరిషత్‌‌ జర్నల్‌లో వచ్చిన ఆమె వ్యాసం, ఆమె అక్క కామిని రాసిన సారాంశం ఆధారంగా ఈ బయోగ్రఫీ రూపొందింది.

బెంగాల్ ప్రెసిడెన్సీలోని బరిసాల్‌లో, 1871లో ఒక ప్రగతిశీల కుటుంబంలో సేన్ జన్మించారు. ఏడుగురి సంతానంలో ఆమె ఒకరు. సుదూరంలో ఉన్న యూరప్ వైద్యసంస్థల వరకు ఆమె ప్రయాణం సాగింది.

కలకత్తాలోని (ఇప్పుడు కోల్‌కతా) బెథూన్ కాలేజీలో చదివిన ఆమె, 1897లో కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి పట్టాపొందారు. అప్పటికి వైద్య రంగంలో పురుషుల ఆధిపత్యం ఉండేది, అలాగే జాతి ఆధారిత విభజన కూడా ఉండేది.

జామిని సేన్, బెంగాల్, వైద్యురాలు, బ్రిటన్, ఆధునిక వైద్యం

ఫొటో సోర్స్, Courtesy of The Royal College of Physicians and Surgeons of Glasgow

నేపాల్ రాజకుటుంబ వైద్యురాలిగా..

చదువు పూర్తయిన తర్వాత, ఆమె తనకు వచ్చిన ఒక అవకాశాన్ని అంగీకరించారు. నేపాల్ రాజకుటుంబానికి హౌస్ ఫిజిషియన్‌గా, కాఠ్‌మాండూలోని జెనానా ఆస్పత్రి అధినేత్రిగా తన ప్రస్థానం ప్రారంభించారు.

దాదాపు పదేళ్లపాటు వైద్యసేవలు అందించారు. నేపాల్ రాజు పృథ్వి బీర్ బిక్రమ్ షా నమ్మకాన్ని చూరగొన్నారు. సంప్రదాయ పరిస్థితుల మధ్య ఆధునిక వైద్య పద్ధతులను ప్రవేశపెట్టారు.

నేపాల్‌లో ఉన్నప్పుడు ఎన్నో సమస్యల నడుమ పనిచేశారు.

రాజభవనంలో అసమ్మతి, కుట్రల వదంతుల నేపథ్యంలో సేన్ చివరకు నేపాల్‌ నుంచి వచ్చేశారు. ఆమె గౌరవార్థం రాజముద్ర కలిగిన బంగారు గడియారాన్ని రాజు బహుకరించారు. ఆమె బెంగాల్ తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్లకే , నేపాల్ రాజు మరణించారు. ఆయనపై విషప్రయోగం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత ఆమె తన ఆశయాలను వదులుకోలేదు.

లేడీ డఫ్రిన్ ఫండ్ సాయంతో 1911లో ఆమె బ్రిటన్ వెళ్లారు. డబ్లిన్‌లో మెడికల్ లైసెన్స్ పొందారు.

లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో చదువుకున్నారు. అనంతరం, గ్లాస్గోలో ఫెలోషిప్ పరీక్షలకు హాజరయ్యారు.

ఆ సమయంలోనే, మహిళలు పరీక్షలు రాసేందుకు రాయల్ కాలేజ్ కొత్తగా అవకాశం కల్పించింది. 1912లో ఆమె పాసయ్యారు. 1599లో స్థాపితమైన ఆ సంస్థలో తొలి మహిళా ఫెలోగా నిలిచారు.

అయితే, ఆమె విజయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

కాలేజీ నిబంధనల ప్రకారం, సేన్ అధికారిక పదవులు చేపట్టలేకపోయారు. అంటే, పురుషులతో పోలిస్తే సేన్‌కు వర్తించే హక్కులు పరిమితం.

ఆమె తర్వాత 11 ఏళ్లకు మరో మహిళ ఈ ఫండ్ ద్వారా చదువుకునే అవకాశాన్ని సంపాదించారు. 1923లో మార్గరెట్ హాగ్ గ్రాంట్ అనే మహిళ ఈ ఫెలోషిప్ సాధించారు.

జామిని సేన్, బెంగాల్, వైద్యురాలు, బ్రిటన్, ఆధునిక వైద్యం

ఫొటో సోర్స్, Deepta Roy Chakraverti

“శారీ వాలీ డాక్టరిన్ సాబ్”

ఉష్ణమండల ప్రాంతాల్లో సంక్రమించే అంటువ్యాధుల గురించి మరింత వైద్యపరిజ్ఞానం కోసం ఆమె 1912లో బెర్లిన్‌కు వెళ్లారు. అప్పటికే యూరప్‌లో ట్రోపికల్ వ్యాధులపై పరిశోధనలో బెర్లిన్ ముందంజలో ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే జిజ్ఞాస ఆమెను ముందుకు నడిపించింది.

“నా దేశంలోని నా అక్కాచెల్లెళ్ల పట్ల నాకు చాలా బాధ్యత ఉంది” అని సేన్ చెప్పినట్లు రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో ఆర్కైవ్స్‌లో నమోదై ఉంది.

ఆ తర్వాత, ఆమె భారత్‌కు తిరిగొచ్చారు. విమెన్స్ మెడికల్ సర్వీస్‌లో చేరారు. ఆగ్రా, సిమ్లా, పూరి వంటి నగరాల్లో పనిచేశారు.

ఆగ్రాలో బ్రిటిష్ వైద్యులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు పరిస్థితిని చక్కబెట్టేందుకు సేన్‌ను నియమించారు.

భారతీయ మహిళా వైద్యురాలిగా ఆమె అక్కడ ఉండడం కీలకంగా మారింది.

మహిళలు ప్రత్యేకంగా ఆమె దగ్గరికి వచ్చేవారు. ఆమెను నమ్మేవారు. రోగులు ఆమెను “శారీ వాలీ డాక్టరిన్ సాబ్” (చీర కట్టుకున్న డాక్టర్ సాబ్) అని ప్రేమగా పిలుచుకునేవారు.

సిమ్లా, పూరి ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలిన క్లిష్టసమయాల్లో ఆమె విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో విదేశీ వైద్యులు దూరంగా ఉన్నప్పటికీ వైద్య సేవలు అందించేందుకు ఆమె ముందుకొచ్చారు.

జామిని సేన్, బెంగాల్, వైద్యురాలు, బ్రిటన్, ఆధునిక వైద్యం

ఫొటో సోర్స్, Deepta Roy Chakraverti

చాలామంది యువ మహిళలు ప్రసవం తర్వాత ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారు. ఆమె ఆ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. “ప్రసూతి కేసుల్లో చాలా మెరుగుదల కనిపిస్తోంది” అని ఆమె తన డైరీలో సంతోషంగా రాసుకున్నారు.

సేన్ తన వస్త్రధారణలోనూ కాస్త ఆధునికతను ప్రదర్శించారు.

తన పనికి అనుకూలంగా చీరకు పిన్నులు పెట్టుకుని, లేస్ కాలర్‌తో, చేతులు మొత్తం కప్పివేసేలా జాకెట్ (ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్) ధరించేవారు. ఇది పాతకాలపు భారతీయ వస్త్రధారణతో పోలిస్తే భిన్నంగా ఉండడంతో పాటు ఆస్పత్రిలో పనిచేసుకునేందుకు సౌకర్యంగా అనిపించేది.

జామిని సేన్, బెంగాల్, వైద్యురాలు, బ్రిటన్, ఆధునిక వైద్యం

ఫొటో సోర్స్, Courtesy of The Royal College of Physicians and Surgeons of Glasgow

గ్లాస్గోలో సేన్ చిత్రపటం ఆవిష్కరణ

సేన్ వ్యక్తిగత జీవితంలోనూ కష్టాలున్నాయి.

నేపాల్‌లో ఉన్న సమయంలో, ప్రసవ సమయంలో తల్లిని పోగొట్టుకున్న పాపను ఆమె దత్తత తీసుకున్నారు. ఆ చిన్నారి పేరు భుటు. మహిళలకు స్వతంత్రంగా జీవించడమే కష్టమైన ఆ కాలంలో.. ఒంటరి తల్లిగా తన బాధ్యతలను, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత తీవ్ర అనారోగ్యంతో ఆ చిన్నారి కలకత్తాలో మరణించింది. వ్యక్తిగతంగా ఆమెకు అది కోలుకోలేని దెబ్బ.

సేన్ జీవితానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఆమె జీవిత చరిత్ర రచయిత సంరక్షణలో నేటికీ ఉన్నాయి.

వాటిలో నేపాల్ రాజు ఇచ్చిన గడియారం (ఆమె చీరకు ధరించేవారు), ఆమె వైద్య సేవలకు గుర్తుగా బహూకరించిన టిబెటన్ త్సోగ్ స్పూన్, లండన్‌లో కొనుగోలు చేసిన నీలిరంగు రెక్కల బ్రోచ్ కూడా ఉన్నాయి. ఆమెకు సంబంధించిన రెండు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అవి ఇప్పుడు గ్లాస్గో కాలేజ్ ఆర్కైవ్స్‌లో ఉన్నాయి.

స్వాతంత్య్రానికి పూర్వపు భారతదేశంలో జాతి వివక్షను, బ్రిటన్‌లో లింగ వివక్షను ఎదుర్కొన్నప్పటికీ.. ధైర్యంగా నిలబడిన ఒక వైద్యురాలి కథను చక్రవర్తి ఆవిష్కరించారు.

“ఈరోజు జామిని సేన్‌ను గౌరవించడం అంటే, ఒక వైద్యురాలిని గౌరవించడం మాత్రమే కాదు. భారత్, బ్రిటన్‌, ఇతర దేశాల్లోనూ తరతరాలుగా మహిళలు వైద్యరంగంలోకి రావడానికి తన ధైర్యంతో పునాది వేసిన ఒక మార్గదర్శకురాలిని గౌరవించడం” అని చక్రవర్తి రాశారు.

సేన్ 1932లో మరణించారు. దశాబ్దాల పాటు ఆమె పేరు మరుగునపడిపోయింది. కానీ చివరకు, ఆమె చారిత్రాత్మక ఫెలోషిప్ సాధించి శతాబ్దానికిపైగా గడచిన తర్వాత, 2024లో గ్లాస్గోలో ఆమె చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఇది చరిత్ర గమనాన్ని మలుపుతిప్పిన ఒక జీవితానికి ప్రతీకగా నిలిచింది.

ఆధునిక వైద్య చరిత్ర కేవలం యూరప్‌కు లేదా పురుషులకే పరిమితం కాదని ఆమె జీవితం రుజువు చేస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)