Home LATEST NEWS telugu తాజా వార్తలు జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరు, ఆయన ఇచ్చిన 5 ముఖ్యమైన తీర్పులు ఏమిటి?

జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరు, ఆయన ఇచ్చిన 5 ముఖ్యమైన తీర్పులు ఏమిటి?

8
0

SOURCE :- BBC NEWS

జస్టిస్ వర్మ

ఫొటో సోర్స్, ALLAHABADHIGHCOURT.IN/GETTY IMAGES

జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈ పేరు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. న్యూదిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

మార్చి 14న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని స్టోర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడే ఆయన ఇంట్లో నుంచి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

స్టోర్ రూమ్‌లో తాను గానీ, తన కుటుంబీకులు గానీ ఎప్పుడూ నగదు ఉంచలేదని, తనపై ఏదో కుట్ర జరుగుతోందని జస్టిస్ యశ్వంత్ వర్మ అన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మకు కొంతకాలం పాటు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను అప్పగించకూడదని కూడా నిర్ణయించారు.

అలాగే జస్టిస్ వర్మను దిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది.

ఈ నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నుంచి ప్రస్తుతం వ్యతిరేకత ఎదుర్కొంటున్న జస్టిస్ వర్మ ఒకప్పుడు ఈ సంఘంలో భాగం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

న్యాయవాది నుంచి న్యాయమూర్తి వరకు

జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్)లో జన్మించారు.

ముప్పై ఏళ్లకుపైగా న్యాయవాద వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు.

దిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల నుంచి బీకామ్ డిగ్రీ (ఆనర్స్) పొందారు. తర్వాత, మధ్యప్రదేశ్‌లోని రేవా విశ్వవిద్యాలయంలో లా (ఎల్‌ఎల్‌బీ) చదివారు.

1992 ఆగస్టు 8న న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.

అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా ఆయన రాజ్యాంగ, కార్మిక, పారిశ్రామిక , కార్పొరేట్ చట్టాలు, పన్నులు, తదితర అంశాలపై కేసులు వాదించారు.

జస్టిస్ యశ్వంత్ వర్మ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు.

దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే 2016 ఫిబ్రవరి 1న ఆయన శాశ్వత జడ్జీగా ప్రమాణ స్వీకారం చేశారు.

జస్టిస్ వర్మ అదనపు న్యాయమూర్తి కావడానికి ముందు 2006 నుంచి 2014 అక్టోబర్ వరకు అలహాబాద్ హైకోర్టులో ప్రత్యేక న్యాయవాదిగా పనిచేశారు.

అంతకుముందు 2012 నుంచి 2013 ఆగస్టు వరకు ఆయన హైకోర్టులో ఉత్తరప్రదేశ్ చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్ పదవిని నిర్వహించారు.

అలహాబాద్ హైకోర్టులో జడ్జీగా ఏడేళ్లు పనిచేసిన తర్వాత, 2021 అక్టోబర్ 11న దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

దిల్లీ హైకోర్టులో సీనియారిటీ క్రమంలో చీఫ్ జస్టిస్ తర్వాత, జస్టిస్ వర్మ రెండో సీనియర్ న్యాయమూర్తి.

ఒకవేళ ఆయన మళ్లీ అలహాబాద్ హైకోర్టుకు జడ్జీగా వెళితే, సీనియారిటీ క్రమంలో తొమ్మిదో స్థానంలో ఉంటారు.

కఫీల్ ఖాన్

ఫొటో సోర్స్, Getty Images

జస్టిస్ వర్మ ముఖ్యమైన తీర్పులు

జస్టిస్ యశ్వంత్ వర్మ గత 11 సంవత్సరాలుగా అలహాబాద్, దిల్లీ హైకోర్టులలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.

ఈ కాలంలో ఆయన అనేక ముఖ్యమైన కేసులను విచారించి తీర్పులు ఇచ్చారు.

డాక్టర్ కఫీల్ ఖాన్‌కు బెయిల్:

ఉత్తరప్రదేశ్‌లోని గొరఖ్‌పుర్‌లో 2107 ఆగస్టులో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా 60 మంది పిల్లలు చనిపోయిన కేసులో డాక్టర్ కఫీల్ ఖాన్ వైద్య నిర్లక్ష్యం ప్రదర్శించారనే అభియోగంపై ఆయన 7నెలలు కస్టడీలో ఉన్నారు.

ఈ కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మ 2018లో డాక్టర్ కఫీల్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు చేశారు.

ఈ సందర్భంగా “పిటిషనర్ (కఫీల్ ఖాన్) నిర్లక్ష్యం చూపినట్టు నిరూపించగల ఎటువంటి ఆధారాలు రికార్డులో కనుగొనలేదు” అని జస్టిస్ వర్మ అన్నారు.

ఆయన తీర్పు వైద్య వృత్తి జవాబుదారీతనం, ప్రభుత్వ నిర్లక్ష్యం, మానవ హక్కుల వంటి అంశాలపై ప్రజల దృష్టిని ఆకర్షించింది.

కాంగ్రెస్ పిటిషన్ తిరస్కరణ: గత ఏడాది మార్చిలో, కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్నుకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేసింది.

నిజానికి, ఫిబ్రవరి 13, 2024న, ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి రూ. 100 కోట్లకు పైగా బకాయి ఉన్న పన్నును రికవరీ చేయాలని నోటీసు పంపింది.

కాంగ్రెస్ పార్టీపై ఆదాయపు పన్ను శాఖ రూ.210 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ చర్యను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది వివేక్ తంఖా ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు కానీ అది తిరస్కరణకు గురైంది.

దీని తరువాత, కాంగ్రెస్ దిల్లీ హైకోర్టు తలుపులు తట్టింది. ఈ కేసును జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశాలను హైకోర్టు సమర్థిస్తూ కాంగ్రెస్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

ఇతర కథనాలు
సుప్రీంకోర్టు రిపోర్టులో కాలిపోయిన నోట్ల ఫోటోలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Supreme Court

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలు: అక్రమ నగదు చెలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అక్రమ నగదు చెలామణీ తప్ప మరే ఇతర నేరాన్ని ఈడీ దర్యాప్తు చేయలేదని జనవరి 2023లో, జస్టిస్ వర్మ ఏకసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. నేరం జరిగిందని దర్యాప్తు సంస్థ తనకు తానుగా ఊహించుకోకూడదని వ్యాఖ్యానించింది.

జనవరి 24, 2023న ఇచ్చిన తీర్పులో, జస్టిస్ వర్మ ఇలా అన్నారు, ‘‘పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన నేరం దర్యాప్తు, విచారణ తప్పనిసరిగా, చట్టం ద్వారా అధికారం పొందిన అధికారులే నిర్వహించాలి.”

ఈ నిర్ణయం ఈడీ అధికారాల పరిమితులపై స్పష్టతను ఇచ్చింది. అంతేకాదు, దర్యాప్తు అధికారాల దుర్వినియోగాన్ని నిరోధించే ప్రయత్నంగా దీన్ని నిపుణులు వివరించారు.

దిల్లీ మద్యం పాలసీ కేసు మీడియా రిపోర్టింగ్:

నవంబర్ 2022లో, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మద్యం పాలసీ కేసులో నిందితుడు విజయ్ నాయర్‌పై దిల్లీ మద్యం స్కామ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వర్మ విచారిస్తున్నారు.

ఆ సమయంలో, తప్పుడు వార్తలు ఇచ్చారనే ఆరోపణలపై ఆయన కొన్ని వార్తా ఛానెళ్ల నుంచి సమాధానాలు కోరారు.

దర్యాప్తు సంస్థల సున్నితమైన సమాచారాన్ని వార్తా ఛానళ్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయని నాయర్ తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు.

‌దీని తరువాత, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్‌బీడీఏ) తన సభ్య మీడియా కంపెనీలను పిలిచి, లీక్ అయిన సమాచారం మూలాలు, ఇతర సమాచారం గురించి విచారించమని కోర్టు కోరింది.

రెస్టారెంట్ బిల్లులపై సర్వీస్ ఛార్జీ:

జులై 2022లో, జస్టిస్ వర్మ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలపై స్టే విధించారు. ఈ మార్గదర్శకాల్లో, రెస్టారెంట్లు, హోటళ్ళు బిల్లులపై తమదైన రీతిలో సర్వీస్ ఛార్జీని జోడించకూడదని, మరే ఇతర పేరుతో సర్వీస్ ఛార్జీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.

ఈ ఆదేశాలను సవాలు చేస్తూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌హెచ్ఆర్) దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ వర్మ విచారించారు.

అటువంటి సేవా ఛార్జీలను మెనూలో ప్రముఖంగా ప్రదర్శించాలని జస్టిస్ వర్మ అన్నారు.

“పిటిషనర్ అసోసియేషన్ సభ్యులు ధర, పన్నులతో పాటు ప్రతిపాదిత సేవా రుసుము విధిస్తారని నిర్థరించుకోవాలి. అదే సమయంలో వినియోగదారులు ఈ రుసుములను చెల్లించాల్సిన బాధ్యత మెనూలో లేదా మరెక్కడైనా తగిన విధంగా ప్రముఖంగా ప్రదర్శించాలి” అని ఆయన ఆదేశించారు.

అయితే, సెప్టెంబర్ 2023లో, జస్టిస్ ప్రతిభా సింగ్ ఈ ఉత్తర్వును రద్దు చేసి, “సర్వీస్ ఛార్జీ” అనే పదాన్ని “సిబ్బంది సహకారం”తో భర్తీ చేశారు, అటువంటి సహకారం మొత్తం బిల్లులో 10 శాతానికి మించరాదని స్పష్టంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS