Home జాతీయ national telgu చెన్నై సూపర్ కింగ్స్‌ వరుస పరాజయాలకు కారణమేంటి? జట్టులోని యువ ఆటగాళ్లకు అవకాశం దొరకడం లేదా?

చెన్నై సూపర్ కింగ్స్‌ వరుస పరాజయాలకు కారణమేంటి? జట్టులోని యువ ఆటగాళ్లకు అవకాశం దొరకడం లేదా?

3
0

SOURCE :- BBC NEWS

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, కె. పోతిరాజ్
  • హోదా, బీబీసీ తమిళ్
  • 6 ఏప్రిల్ 2025, 16:05 IST

    అప్‌డేట్ అయ్యింది ఒక గంట క్రితం

”మేం టీ20 మ్యాచ్ చూడటానికి వచ్చామా లేక టెస్ట్ మ్యాచ్ చూడటానికి వచ్చామా అని నాకు సందేహం మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చాలా దారుణంగా బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు గెలవడానికి ప్రయత్నించలేదు. ధోనీ రిటైర్ అయి యువ ఆటగాడికి అవకాశం ఇవ్వవచ్చు”

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన సీఎస్కే-దిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత ఒక అభిమాని మాట్లాడిన ఈ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన తీరు ఆ జట్టు అభిమానులను నిరాశపరిచింది.

మ్యాచ్ తర్వాత చెపాక్ నుంచి ఇళ్లకు బయలుదేరిన అభిమానులంతా ఇలాంటి ఆట చూసేందుకు టిక్కెట్లు కొనడానికి అన్ని డబ్బు చెల్లించామా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

సొంతగడ్డపై సీఎస్కే ఓటమి

చెపాక్ చెన్నై సూపర్ కింగ్స్‌కు హోం గ్రౌండ్. సీఎస్కేకు గట్టి పట్టున్న స్టేడియంగా చెపాక్‌ను భావిస్తారు.

ఇక్కడ సీఎస్కే ఓడిపోవడం చాలా తక్కువ. కానీ ఆర్సీబీ 17 సంవత్సరాల తర్వాత ఈ సీజన్ ప్రారంభంలో సీఎస్కేను ఓడించింది.

దిల్లీ క్యాపిటల్స్ 15 ఏళ్ల తర్వాత సీఎస్కేపై ఇక్కడ గెలిచింది.

ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన సీఎస్కే, ఆ తర్వాత మూడు వరుస పరాజయాలతో సతమతమవుతోంది.

ఐపీఎల్ తొలి సీజన్లలో సీఎస్కేను చేజింగ్ కింగ్‌గా పిలిచేవారు.

కానీ 2019 తర్వాత సీఎస్కే 180 పరుగుల విజయలక్ష్యాన్ని ఎప్పుడూ ఛేదించలేకపోయింది.

అంటే పరోక్షంగా దీనర్థం లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఒత్తిడిని తట్టుకోగల, మైదానంలో సమర్థంగా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్‌మెన్లు, బిగ్ హిట్టర్లు జట్టులో లేరని.

180 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగితే సీఎస్కేను ఓడించగలమనే ధైర్యాన్ని ఆ జట్టు ప్రత్యర్థి జట్లకు కల్పించింది.

ఒత్తిడి, సంక్షోభంలో ప్రశాంతంగా ఉండగల సామర్థ్యం, త్వరగా పుంజుకోవడం, ప్రణాళికలను చక్కగా అమలు చేయడం, ఛేజింగ్‌లో నిష్ణాతులుగా ఉండటం వంటివి ఒకప్పుడు సీఎస్కే ఘనతలుగా ఉండేవి.

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ చూసిన తర్వాత, గెలవడానికి తగినంతగా సీఎస్కే ప్రయత్నించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు.

సీఎస్కే బ్యాట్స్‌మెన్లలో గెలవాలనే బలమైన కోరిక ఎవరికీ లేదనడానికి ఆ మ్యాచ్ ఉదాహరణ అని విమర్శిస్తున్నారు.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

కాలంచెల్లిన ఫార్ములా

ఈ ఐపీఎల్ కోసం సీఎస్కే ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానం కొత్త సీసాలో పాత సారాలాంటిది. 2011లో అనుసరించిన ఫార్ములాను కొనసాగించడం ప్రస్తుత పరిస్థితులకు తగినది కాదు.

స్కోరు ఎంతన్నది పట్టించుకోకుండా చివరి వరకు మ్యాచ్ లాగడం, ఛేజింగ్‌లో నెమ్మదిగా కదలడం అనేవి కాలం చెల్లిన సూత్రాలు.

గత రెండు సీజన్లుగా వివిధ జట్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ, కొత్త జట్టును తయారుచేసుకుంటున్నాయి. కానీ సీఎస్కే అలా కాదు. కొందరు ఆటగాళ్లు ఆ జట్టులో ఉంటారని కళ్లు మూసుకుని చెప్పగలం.

ఆ జట్టు ఆట ఇప్పటికీ పాత శైలిలోనే సాగుతోంది – ఒక పరుగు, రెండు పరుగులు, సాధారణంగా అవుట్ చేయడం వంటివి.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

బిగ్ హిట్టర్లు ఏరీ?

సీఎస్కే జట్టు మిడిల్ ఆర్డర్‌ను పరిశీలిస్తే, 9వ నంబరు వరకు బ్యాటర్లు ఉన్నారనిపిస్తుంది. కానీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఓ మంచి బ్యాటర్ లేదా బిగ్ హిట్టర్ కనిపించరు.

దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ యాంకర్ పాత్ర పోషించడానికి ప్రయత్నించి మొత్తం ఓడను ముంచేశాడు.

54 బంతుల్లో 69 పరుగులు చేసిన విజయ్ శంకర్ ఆట కాగితంపై అద్భుతంగా అనిపించవచ్చు, కానీ అతను టీ20 మ్యాచ్‌ను టెస్ట్ మ్యాచ్‌గా మార్చాడన్న విమర్శలు వచ్చాయి.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

కష్టాల్లో ఉన్నప్పుడు భారీ షాట్లు కొట్టి జట్టును విజయపథంలో నడిపించగల పెద్ద హిట్టర్లు సీఎస్కే జట్టులో ఎవరైనా ఉన్నారా అంటే అభిమానులు శివం దుబే పేరును మాత్రమే ప్రస్తావిస్తారు.

సీఎస్కేలో ప్రభావంతమైన ఆటగాడిగా ఎదిగిన తర్వాతే శివం దుబే బిగ్ హిట్టర్‌గా పేరు పొందాడు.

శివం దుబే పెద్ద హిట్టర్‌గా పేరుగాంచాడు, కానీ అతని ఆటతీరు పూర్తిగా ఆ స్థాయిలో లేదు. భారీ స్కోర్లతో ఆటను మార్చివేసే, ఏ క్షణంలోనయినా ఆటను మలుపు తిప్పేవారే బిగ్ హిట్టర్లు.

క్రమం తప్పకుండా సిక్స్‌లు, ఫోర్లు కొట్టగల ఆటగాళ్లను సీఎస్కే ఇంకా గుర్తించలేదు. ఈ సీజన్‌లో జడేజా, శివం దుబే, దీపక్ హుడా మిడిలార్డర్‌లో రాణించడంలో విఫలమయ్యారు.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

యువ ఆటగాళ్లకు లభించని అవకాశం

భారత జట్టు కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చిన ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌లో అలా చేయడంలో విఫలవుతున్నాడన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి.

ప్రతి ఐపీఎల్ సీజన్ వేలంలో చాలా మంది యువ, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను కొనుగోలు చేసే సీఎస్కే… వారిలో చాలా మందికి అవకాశం ఇవ్వకుండానే వదిలిపెడుతోంది.

సీఎస్కేలో తమిళనాడు ఆటగాడు ఆండ్రీ సిద్దార్థ్, వికెట్ కీపర్ వానిశ్ బేదీ, ఆల్ రౌండర్‌లు అన్షుల్ కంబోజ్, రామకృష్ణ, ఫాస్ట్ బౌలర్లు గుర్జబ్‌నీత్ సింగ్ , షేక్ రషీద్ వంటి యువ ఆటగాళ్ళు ఉన్నారు.. కానీ ఇప్పటివరకూ తుది 11మంది జట్టులో వారెవరికీ చోటు లభించలేదు.

యువ ఆటగాళ్లు భయం లేకుండా స్వేచ్ఛగా ఆడతారన్న గెలుపు సూత్రాన్ని సీఎస్కే పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, ముంబై, కోల్‌కతా, పంజాబ్, దిల్లీ, గుజరాత్ వంటి జట్లు చాలా మంది అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వారి ప్రతిభను ఉపయోగించుకున్నాయి.

సీఎస్కే ఓటమికి అతిపెద్ద కారణాల్లో ఒకటి అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఆటగాళ్లను ఎంపిక చేయడం, కొంతమంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం అనే సాధారణ ఫార్ములా.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

తప్పుల నుంచి నేర్చుకోకపోవడం

గత సీజన్‌లో రుతురాజ్, కాన్వే గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు. 849 పరుగులు చేసి ఉత్తమ ఓపెనింగ్ జోడీగా నిలిచారు. వారిద్దరూ పవర్‌ప్లేలోనే 619 పరుగులు రాబట్టారు.

కానీ ఈ సీజన్‌లో పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే పవర్‌ప్లే రన్ రేట్ ఓవర్‌కు 7 పరుగులతో 10 జట్ల జాబితాలో అడుగునఉంది.

రవీంద్ర, త్రిపాఠిని ఓపెనర్లుగా రంగంలోకి దింపడం అనుకున్న ఫలితాన్నివ్వలేదు.

గత సీజన్‌లో గొప్ప ఆరంభాన్ని ఇచ్చిన కాన్వే-రుతురాజ్ జోడీని ఈ సీజన్‌లో ఓపెనర్లగా ఇప్పటిదాకా బరిలోకి దించకుండా దిల్లీతో మ్యాచ్‌లో రచిన్ – కాన్వే జోడిని ఆడించారు. కానీ ఇది ఫలితాన్నివ్వలేదు.

ఫామ్‌లో లేని ఆటగాళ్లు..

ఈ ఐపీఎల్ వేలంలో సీఎస్కే ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుని 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో 10 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్ళు గత కొన్ని సీజన్లుగా ఫామ్‌లో లేరు. దేశవాళీ మ్యాచ్‌లలో పెద్దగా స్కోర్ చేయలేదు.

గత సీజన్లలో సామ్‌కరన్, నాథన్ ఎల్లిస్, ఓవర్టన్, త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, ముఖేష్ చౌధురి వంటివారి ఫామ్‌ను పరిశీలిస్తే…ఇలాంటి ఆటగాళ్లను సీఎస్కే ఎందుకు ఎంచుకుందనే ప్రశ్న తలెత్తుతుంది.

ఇంగ్లాండ్ జట్టులో సామ్‌కరన్‌కు అవకాశం లేదు. ఆస్ట్రేలియా జట్టుకు నాథన్ ఎల్లిస్ బ్యాకప్ బౌలర్. ఓవర్టన్ ఇటీవలే ఇంగ్లాండ్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు.

దేశవాళీ మ్యాచ్‌లలో త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, ముఖేష్ చౌదరి ఫామ్, ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

చెపాక్‌లో ఓడిపోవడంపై విమర్శలు

చెపాక్ స్టేడియం చెన్నై సూపర్ కింగ్స్‌కు అచ్చొచ్చిన మైదానం. బయటి జట్టు ఈ స్టేడియంలో సీఎస్‌కేని ఓడించడం అంత తేలిక కాదు. కానీ 2008 తర్వాత ఆర్సీబీ, 2010 తర్వాత దిల్లీ క్యాపిటల్స్ తొలిసారి చెపాక్ స్టేడియంలో సీఎస్కేని ఓడించాయి.

సీఎస్కే జట్టులో ఏదో తీవ్రమైన లోపం ఉందని, జట్టులో పూర్తిగా మార్పులు చేయాల్సిన అవసరముందని ఈ ఓటములన్నీ సూచిస్తున్నాయి.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

పనిచేయని పాత ఫార్ములా

చెపాక్ స్టేడియంలో ఆరు లేదా ఏడు మ్యాచ్‌లు గెలవడం గతంలో సీఎస్కే ఫార్ములా. బయటి స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లను కొన్నిటిని గెలిచి ప్లేఆఫ్స్‌కు వెళ్లేవారు. ఆ తర్వాత సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లోకి ప్రవేశించడమనే ఫార్ములాను చెన్నై సూపర్ కింగ్స్ అనుసరించేది.

ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే..చెపాక్ స్టేడియంలో పాత ఫార్ములా పనిచేయడం లేదు. ప్రత్యర్థి జట్లు అలాంటి అవకాశాన్ని చెన్నైకి ఇవ్వడం లేదు. చెపాక్ స్టేడియం పిచ్‌లు మారిపోయాయి. ఏ సమయంలో పిచ్ ఎలా స్పందిస్తుందో అంచనావేయడం కష్టం. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అదే పాత ఫార్ములాను అనుసరిస్తుండడంతో మ్యాచ్‌లు గెలవలేకపోతోంది.

అంతే కాదు, సీఎస్కే జట్టులో సాధారణంగా ఏ ఆటగాళ్ళు బ్యాటింగ్‌కు దిగుతారో ప్రత్యర్థి జట్లకు తెలుసు. దానికనుగుణంగా ఆ జట్లు ప్రత్యేక ప్రణాళికతో వికెట్లు తీస్తున్నాయి. అందుకే చెపాక్ స్టేడియంలో గెలవగలమని గతంలో ఉండే ధీమాను సీఎస్కే విడిచిపెట్టాలి.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ధోనీపై అభిమానుల అభిప్రాయం

ధోనీ ఓ లెజెండ్. సీఎస్కేకు ఐదు ట్రోఫీలు అందించాడు. అయినప్పటికీ వయసు ప్రభావం అతనికి తెలియకుండానే బ్యాటింగ్‌పై పడుతోంది. గతంలో ధోనీ అద్భుత ప్రదర్శన చూసిన వారికి దిల్లీతో మ్యాచ్‌లో అతని పేలవమైన ఆట చూడడం కష్టమనిపించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత “ధోని రిటైర్మెంట్” అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అయింది. దిల్లీతో మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న తర్వాత ధోని తొలి బౌండరీని బాదాడు. ఆట పరిస్థితి తెలిసినప్పటికీ, దూకుడుగా ఆడటానికి ప్రయత్నించకుండా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఓటమి దాదాపుగా ఖాయం అయిన తర్వాతే చివరి ఓవర్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టిన ధోనీపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

ధోనీ రిటైర్మెంట్ గురించి ఫ్లెమింగ్ ఏమన్నాడు?

ధోనీ రిటైర్మెంట్‌పై సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించారు. “ధోనితో రిటైర్మెంట్ గురించి మాట్లాడటం నా పని కాదు. దాని గురించి నాకు ఏమీ తెలియదు. అతను జట్టులో ఉన్నంత కాలం అతనితో కలిసి పనిచేయడం నాకు ఇష్టం. ధోనీ ఇంకా ప్రభావవంతమైన ఆటగాడు. రిటైర్మెంట్ గురించి నేనేమీ అడగలేదు..కానీ మీరు (మీడియా) అడుగుతున్నారు” అని ఫ్లెమింగ్ అన్నాడు.

ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్

ఫొటో సోర్స్, Getty Images

సీఎస్కే హెచ్చరికగా తీసుకోవాలి – వసీం జాఫర్

“దుబే టాపార్డర్ ఆటగాడిగా లేకుండా వెంటనే ఔటైతే సీఎస్కే పని అయిపోయినట్లే. జట్టులోని బ్యాట్స్‌మెన్లు కనీసం గెలవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఈ వైఖరి నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో సీఎస్కే రెండు సార్లు పేలవమైన ఆటతీరుతో త్వరగా వికెట్లు కోల్పోవడం మంచి సంకేతం కాదు. ఇప్పటివరకు సీఎస్కే 17 మంది ఆటగాళ్లను మార్చింది, కానీ ప్రయోజనం లేకపోయింది. దీనికి ముందు ఆ జట్టు 2015లో 14 మంది ఆటగాళ్లను, 2021లో 16 మంది ఆటగాళ్లను మార్చింది” అని క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)