Home జాతీయ national telgu ‘చీమలను తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని తెలియదు’, రాణి చీమల స్మగ్లింగ్ అభియోగాలపై వాదనలు

‘చీమలను తీసుకెళ్లడం చట్టవిరుద్ధమని తెలియదు’, రాణి చీమల స్మగ్లింగ్ అభియోగాలపై వాదనలు

3
0

SOURCE :- BBC NEWS

కెన్యా, చీమలు, స్మగ్లింగ్, నేరాలు, రాణిచీమలు, పెంపుడు జంతువులు

ఫొటో సోర్స్, Kenya Wildlife Service

2 వేలకు పైగా రాణి చీమలను స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన చైనాకు చెందిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన కెన్యాకు చెందిన మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై వన్యప్రాణుల అక్రమ రవాణా అభియోగాలు మోపారు.

కెన్యా రాజధాని నైరోబిలోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఝాంగ్ కెక్వన్‌ అనే వ్యక్తిని భద్రతా తనిఖీల సమయంలో గతవారం పోలీసులు అరెస్టు చేశారు.

పెద్దసంఖ్యలో రాణి చీమలను తన లగేజీలో పెట్టుకుని చైనాకు తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఝాంగ్ కొన్ని చీమలను టెస్ట్‌ట్యూబ్‌లలో పెట్టారు. మరికొన్నింటిని టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచి తన బ్యాగులో పెట్టుకున్నారని అధికారులు తెలిపారు.

కెన్యాలోని ఓ కోర్టులో మంగళవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ చీమలను చార్లెస్ వాంగి అనే వ్యక్తి వద్ద నుంచి 100 చీమలకు 10,000 కెన్యన్ షిల్లింగ్స్‌‌, అంటే దాదాపు 7,200 రూపాయల చొప్పున ఝాంగ్ కొనుగోలు చేసినట్లు కోర్టుకు తెలిపారు.

శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్‌గా పిలిచే ఈ రాణి చీమలకు యూరప్, ఆసియాలో డిమాండ్ పెరుగుతోందని గత ఏడాది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్(కేడబ్ల్యుఎస్) హెచ్చరించింది.

యూరప్, ఆసియాలో వాటిని పెంపుడు జంతువుల తరహాలో చూస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

దేశం నుంచి కీటకాలను ఝాంగ్ అక్రమంగా రవాణా చేస్తున్నారా అన్న విషయాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. కానీ, ఆ లగేజ్ మాత్రం చైనాకు తీసుకెళుతున్నారని చెప్పారు.

అక్రమ రవాణా అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నారు.

మరో సందర్భంలో కూడా చీమలతో పట్టుబడినందుకు, వాంగిపై అక్రమ వ్యాపారానికి సంబంధించి రెండో కేసు కూడా నమోదైంది.

నైరోబి మీడియా కథనాల ప్రకారం, ఈ ఇద్దరు నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు.

ఇది చట్ట విరుద్ధమని వారికి తెలియదని, చీమలను అమ్మి, దానితో జీవనోపాధి పొందాలని మాత్రమే అనుకున్నారని వారి తరుఫు న్యాయవాది డేవిడ్ ల్యూస్‌వెటి అసోసియేటెడ్ ప్రెస్‌తో చెప్పారు.

జాంగ్, వాంగి మార్చి 27న మళ్లీ కోర్టులో హాజరుకానున్నారు.

‘వేరే పట్టణాల్లో కూడా చీమలు సేకరిస్తున్నారన్న అనుమానం ఉంది. అందుకే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది’ అని కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్‌కి చెందిన ఒక సీనియర్ అధికారి బీబీసీకి తెలిపారు.

గత సంవత్సరం మేలో, వేలాది రాణి చీమలను దేశం బయటకు తరలించడానికి ప్రయత్నించిన నలుగురు వ్యక్తులకు కెన్యా కోర్టు ఏడాది జైలు శిక్ష లేదా 7,700 డాలర్లు జరిమానా విధించింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)